పాలకుడు, పరిశోధకుడు, ప్రజాహితుడు
ABN , First Publish Date - 2020-06-25T06:27:57+05:30 IST
ఉమ్మడి రాష్ట్రంలో ఫైనాన్స్, ప్లానింగ్ సెక్రటరీగా విఠల్ గారు తనదైన ముద్ర వేసారు. ఆయన అత్యంత సమర్థుడైన ఐ.ఏ.ఎస్. ఆ విధంగా ఆయన అరుదైన అధికారి. నేను డిగ్రీ చదువుతున్నప్పుడు అప్పట్లో విఠల్‌గారు సిటీ సెంట్రల్ లైబ్రరీలో...

ఐ.ఏ.ఎస్. అధికారులకు బి.పి.ఆర్. విఠల్ ఒక రోల్ మాడల్. చాలామందికి స్ఫూర్తిదాయకుడు. విఠల్‌గారు తనకి గురువుతో సమానమని, ఆయనతో కలసి పని చేయడం వల్లే తాను ఎన్నో పాఠాలు నేర్చుకున్నానని రిజర్వ్ బ్యాంక్ మాజీ గవర్నర్ వై.వి. రెడ్డి సగర్వంగా చెప్పుకుంటారు. పాలనా సంస్కృతికి, విద్యా రంగానికి విఠల్ చేసిన సేవలు చిరకాలం గుర్తుండిపోతాయి.
బి.పి.ఆర్. విఠల్: 1927–2020
ఉమ్మడి రాష్ట్రంలో ఫైనాన్స్, ప్లానింగ్ సెక్రటరీగా విఠల్ గారు తనదైన ముద్ర వేసారు. ఆయన అత్యంత సమర్థుడైన ఐ.ఏ.ఎస్. ఆ విధంగా ఆయన అరుదైన అధికారి. నేను డిగ్రీ చదువుతున్నప్పుడు అప్పట్లో విఠల్‌గారు సిటీ సెంట్రల్ లైబ్రరీలో ‘మాట్లాడే కళ’ మీద ప్రసంగించనున్నారని తెలిసి నా మిత్రుడు నరహరి, నేను ఇద్దరం కలిసి వెళ్లాం. అలా విఠల్గారంటే అప్పుడే నాకు ఒక గౌరవ భావం ఏర్పడింది. నేను ఉస్మానియా విశ్వవిద్యాలయంలో చదివే రోజుల్లో ఆయన రిజిస్ట్రార్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. అప్పటి వి.సి. డి.ఎస్.రెడ్డి, విఠల్ గారి కాంబినేషన్ ఉస్మానియాని దేశంలో అత్యంత ప్రతిష్ఠ గల ఐదు విశ్వవిద్యాలయాలలో ఒకటిగా తీర్చిదిద్దింది. విశ్వవిద్యాలయానికి కొందరు నిపుణులని ఆహ్వానించడానికి డి.ఎస్.రెడ్డి గారు విఠల్‌గారిని ఇంగ్లాండు–అమెరికాకు పంపించారు. ఎకనామిక్స్ డిపార్ట్మెంట్కు కేంబ్రిడ్జి యూనివర్సిటీ నుండి గౌతమ్ మాథూర్‌ని తీసుకొచ్చారు. అప్పట్లో ఓ.యూ. స్వయం ప్రతిపత్తిని గమనిస్తే, ఇవ్వాళ దాని దీనస్థితి చూస్తే కాలక్రమంలో ఆ విశ్వవిద్యాలయంలో ఏ స్థాయికి దిగజార్చబడిందో ఆలోచిస్తే ఆవేదన కలుగుతుంది. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా అవతరించిన తరువాత పరిస్థితి మరింత దిగజారింది. నేను పని చేసిన ఉస్మానియా, కాకతీయ విశ్వవిద్యాలయాల పరిస్థితి దారుణంగా ఉంది. ఇవ్వాళ ఒక డి.ఎస్.రెడ్డి గారు, ఒక విఠల్‌గారు ఎక్కడా కనిపించడం లేదు.
విఠల్‌గారికి విశ్వవిద్యాలయాలంటే అపురూపమైన గౌరవం ఉండేది. వాటి స్వతంత్ర ప్రతిపత్తి మీద, అలాగే అక్కడ పని చేసే అధ్యాపకుల పట్ల వాళ్ల జ్ఞానం పట్ల ఆయనకు గౌరవం ఉండేది. 1970లలో జలగం వెంగళరావు ముఖ్యమంత్రిగా ఉన్నపుడు, విఠల్‌గారిని ఉస్మానియా వి.సి.గా వెళ్ళమని అడిగితే, ఆ బాధ్యతలు ఒక విద్యావేత్త నిర్వహించాలని ఒక ఐ.ఏఎస్.కు అక్కడ ఏం పని, దానికి మేము అర్హులం కాదని స్పష్టం చేసి, అసలు నా పని విధానం మీకు నచ్చకపోతే నన్ను మీరు ఎక్కడికైనా పంపండి అని అన్నారట. మీరే ఒక సమర్థుడైన విద్యావేత్తను సూచించండి అని అడిగితే ప్రొ.జి. రాంరెడ్డి పేరు సూచించి, ముఖ్యమంత్రి దగ్గరకు రాంరెడ్డిగారిని తీసుకెళ్లి ఆయనకు ఆ బాధ్యతను అప్పగించారు.
విఠల్‌గారు బోధన పరిశోధన కలిసి ఉండాలని, నిరంతరం పరిశోధన చేసే అధ్యాపకులే తమ వృత్తికి న్యాయం చేయగలరని భావించి, హైదరాబాదులో ‘సెంటర్ ఫర్ ఎకనామిక్స్ అండ్ సోషల్ స్టడీస్’ సంస్థ (సెస్)ను నెలకొల్పారు. విశ్వవిద్యాలయాలలో పనిచేసే అధ్యాపకులకు బోధనా భారం ఎక్కువ ఉండడం వలన పరిశోధనకు తగిన సమయం కేటాయించలేకపోతున్నారని, కొంత కాలం బోధన నుండి విరామం తీసుకొని పూర్తి సమయాన్ని పరిశోధనకు కేటాయించాలని, సెస్ ఆ లోటును పూర్తి చేస్తుందని ఆయన భావించారు. ఈ విషయాన్ని ప్రొ.రాంరెడ్డి గారితో కలిసి అప్పటి ముఖ్యమంత్రి చెన్నారెడ్డిని ఒప్పించారు. విఠల్‌గారు సెస్‌కు కావలసిన నిధులు సమకూరిస్తే రాంరెడ్డిగారు నిజామియా అబ్జర్వేటరీ దగ్గర ఐదు ఎకరాల భూమి కేటాయించారు. ఈ సెంటర్ ఇవ్వాళ దేశంలో గల ప్రతిష్ఠాత్మకమైన సంస్థలలో ఒకటి. దీనికి అంతర్జాతీయ పలుకుబడి కూడా ఉంది. సెంటర్ నిర్మాణంలో ప్రఖ్యాత ఎకనామిస్ట్ ప్రొ.చెన్నమనేని హన్మంతరావుగారి సూచనలు సలహాలు తీసుకున్నారు. దక్షిణ భారతదేశంలో అప్పటికే కె.ఎన్.రాజ్ చొరవతో కేరళలో ‘సెంటర్ ఫర్ డెవలప్మెంట్ స్టడీస్’, అలాగే మాల్కం ఆదిశేషయ్య చొరవతో ‘మద్రాస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డెవలప్మెంట్ స్టడీస్’, వి.కె.ఆర్.వి. రావు చొరవతో బెంగళూరులో ‘సెంటర్ ఫర్ సోషల్ అండ్ ఎకానమిక్ ఛేంజ్’ పరిశోధనా సంస్థలు పని చేస్తున్నాయి. కె.ఎన్.రాజ్, వి.కె.అర్.వి. రావు, మాల్కం ఆదిశేషయ్య వరసలో విఠల్‌గారి పేరు నిలిచి పోతుంది.
సెస్ ప్రారంభించిన తర్వాత రాంరెడ్డిగారు, విఠల్‌గారు ఆ సెంటర్‌కు రావలసిందిగా నన్ను ఆహ్వానించారు. నాకు టీచింగ్‌లోనే ఆనందం, సంతృప్తి ఉండేది కాని రాంరెడ్డి గారు ఒత్తిడి చేసి రప్పించారు. నాకు ఆయన గురువు. నేను ఐదు సంవత్సరాలు సెస్‌లో పని చేసాను. అప్పుడు విఠల్‌గారి పరిపాలనా దక్షతను గమనించాను. అప్పట్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక పరిపాలనా సంస్కరణల కమిటీని నియమించారు. రాంరెడ్డిగారు, నేను సెక్రటేరియట్ పని విధానాన్ని అధ్యయనం చేస్తున్నప్పుడు, పద్మనాభం అనే ఐ.ఏ.ఎస్. అధికారి నన్ను పిలిచి ప్రజా సమస్యల మీద అధ్యయనం చేసే కమిటీలో నన్ను సభ్యుడుగా వేసుకున్నానని అంటే నన్ను కనీసం సంప్రదించకుండా వేయడం నాకు నచ్చలేదు. అదే మాట ఆయనతో అంటే నీవు ప్రభుత్వ ఉద్యోగివి, నీ జీతం మేం ఇస్తున్నాం, కనుక మా నిర్ణయాన్ని తిరస్కరించడానికి లేదు అని అంటే నేను ప్రభుత్వ ఉద్యోగిని కాదని, ఒక విశ్వవిద్యాలయ అధ్యాపకుడనని విశ్వవిద్యాలయ అధ్యాపకులు ప్రభుత్వ ఉద్యోగులు కారని నేను ఆ కమిటీలో ఉండను అని చెప్పి బయటకు వచ్చాను. పద్మనాభం చాలా అహంభావి. నా నిర్ణయం విషయం విఠల్‌గారికి చెప్పుతూ మా కమిటీలో ఆయన ఉండవల్సిందే అని అంటే, విఠల్‌గారు నన్ను నిజాం క్లబ్‌కు డిన్నర్‌కు పిలిచి ఈ అంశాన్ని ప్రస్తావించారు. ప్రస్తావిస్తూ ఇది కొత్త సంస్థ దీనిని మనం అభివృద్ధి చేయాలి, పద్మనాభం లాంటి అధికారులు ప్రభుత్వంలో సంస్థకు చాలా సమస్యలు సృష్టిస్తారు అని అంటే, ఒక అహంకారి అయిన అధికారితో నాకు పని చేయడం ఇష్టం లేదని చెప్పాను. విఠల్‌గారు సందిగ్ధంలో పడ్డారు. ఒకసారి ఆలోచించండి అంటే, నా వలన సంస్థకు ఏమైనా నష్టం జరుగుతుందని మీరనుకుంటే నేను కాకతీయ విశ్వవిద్యాలయానికి వెళ్ళిపోతాను అని అంటే తుది నిర్ణయం నాకు వదిలేయమని అన్నారు. తర్వాత పద్మనాభంకు ఏం వివరణ ఇచ్చారో తెలియదు. ఆ కమిటీలో పని చేసే ఇబ్బంది నాకు తప్పింది. విఠల్‌గారు అపుడు సెస్ చైర్మన్‌గా ఉన్నారు. కాని నన్ను నిజాం క్లబ్‌కు తీసుకెళ్లి వ్యక్తిగతంగా మాట్లాడడం అంతిమంగా నా నిర్ణయాన్ని గౌరవించడం అన్న సున్నితత్వం ఇప్పటి అధికారంలో ఉండే వాళ్ళలో ఎంత మందికి ఉంటుంది?
విఠల్‌గారు తెలంగాణ పక్షపాతి. ప్రత్యేక రాష్ట్రం డిమాండ్ పట్ల సానుభూతితో ఉండేవాడు. విఠల్‌గారితో నేను వరంగల్ వెళ్లి తిరిగి వస్తున్నప్పుడు భోనగిరిలో బహుశా 1996లో తెలంగాణ రాష్ట్ర డిమాండ్ మీటింగ్ జరుగుతుంది. ఈ మీటింగ్ కొంత సేపు చూద్దాం అని ఆయనే అంటే కొంత సేపు ఆగాం. గద్దర్ చాలా ఆవేశంగా పాటలు పాడుతున్నాడు. సభకు పెద్ద సంఖ్యలో జనం వచ్చారు. మీటింగ్‌లు ఇలాగే ఉత్సాహంతో జరిగితే తెలంగాణ సాధ్యమే అన్నారు. తెలంగాణ పట్ల వివక్ష ఉందని చెన్నారెడ్డితో జరిగిన ఒక సంభాషణను ఉదహరిస్తూ కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే వెనకబడిన ప్రాంతాల నిధులను కొంత కాలం మొత్తం తెలంగాణకి కేటాయించాలంటే, చెన్నారెడ్డి నేను ముఖ్యమంత్రిగా కొనసాగడం మీకు ఇష్టం లేదా అని అన్నాడట. మొదటి దఫా తెలంగాణ ఉద్యమానికి నాయకత్వం వహించిన వ్యక్తి ముఖ్యమంత్రి అవుతూనే, తెలంగాణ పట్ల ఏ అభిమానం చూపినా పదవికే గండం అని భావిస్తున్నారంటే తెలంగాణకు న్యాయం జరగడం కష్టం అని విఠల్ గారు అన్నారు.
విఠల్‌గారు పాలనా దక్షుడైన ప్రభుత్వాధికారే కాదు, ఒక పరిశోధకుడు కూడా. ఆయన మార్క్సిస్టు సాహిత్యాన్ని చాలా క్షుణ్ణంగా చదివిన వారు. బహుశ పర్సనల్ లైబ్రరీలో ఆయన దగ్గర ఉన్నన్ని పుస్తకాలు ముఖ్యంగా మార్క్సిస్టు సాహిత్యం మీద చాలా తక్కువ మంది దగ్గర ఉండి ఉంటాయి. ఆయనతో చర్చిస్తున్నప్పుడు కఠినమైన మార్క్స్ రచనలను కూడా ప్రస్తావించేవారు.
ఆయనతో మాట్లాడినప్పుడు ఒక విశ్వవిద్యాలయ తత్వవేత్తగా మాట్లాడేవారు. ఈ నేపథ్యం వల్లే బహుశా తన కుమారుడు సంజయ్ బారును అధ్యాపక వృత్తికి ప్రోత్సహించి ఉంటారు.
విఠల్‌గారికి దాదాపు ముఖ్యమంత్రులు అందరితో సాన్నిహిత్యముండేది. ఎన్.టి.రామారావుతో మాత్రం సఖ్యమైన సంబంధం ఏర్పడలేదు. రామారావు ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో విఠల్‌గారు చీఫ్ సెక్రటరీగా ప్రమోట్ కావలసి ఉంది. నటి జమునతో విఠల్ గారికి బంధుత్వమున్నది అన్న ఒక్క కారణంతో ఎన్.టి.ఆర్ ఆయనను పక్కకు పెట్టారు. ఎవరు చెప్పినా వినలేదు. జమున అప్పుడు కాంగ్రెస్ పార్టీ మద్దతుదారుగా ఉన్నారు. ఎన్.టి.ఆర్. మొండి మనిషి అని అందరికి తెలుసు. దీనికి విఠల్‌గారు చాలా బాధ పడ్డారు. మీకు చాలా గౌరవం ఉంది. మిమ్మల్ని అభిమానించే వాళ్ళు చాలా మంది ఉన్నారు. కేవలం చీఫ్ సెక్రటరీ పదవి రాకపోతే మీ గౌరవానికి భంగం కాదు అని అంటే నీకు వి.సి. పోస్టు రాకపోతే ఎలా ఉంటుంది అన్నారు. నాకు వి.సి. కావాలనే కోరిక లేదు అని అంటే ఆంధ్ర విశ్వవిద్యాలయ ప్రొ. సర్వేశ్వరరావు గారి గురించి చెపుతూ ఆయన వి.సి. పదవిని ఒప్పుకుంటారని తాను భావించలేదని, కాని దానిని ఆఫర్ చేసినప్పుడు రెండవసారి ఆలోచన లేకుండా తక్షణమే ఒప్పుకున్నారు అనే ఉదాహరణ ఇచ్చారు. రెండవది తాను ఎప్పుడూ కేంద్ర సర్వీసులకి వెళ్ళలేదని, రాష్ట్రాన్నే పట్టుకొని ఉన్నానని చెపుతూ, కేంద్రానికి వెళితే జాతీయ అంతర్జాతీయ అవకాశాలు ఉంటాయని అంటూ తాను పొరపాటు చేసానేమో అని అన్నారు. విఠల్‌గారికి ఈ అడ్డంకులు వచ్చినా, తన హుందాతనాన్ని కాని తన ఆత్మగౌరవాన్ని కాని కోల్పోలేదు. ఆయన ఐ.ఏ.ఎస్. అధికార్లకు ఒక రోల్ మోడల్. చాలా మందికి స్ఫూర్తిదాయకుడు. రిజర్వ్ బ్యాంక్ మాజీ గవర్నర్ వై.వి.రెడ్డి గారు విఠల్‌గారు తనకి గురువుతో సమానమని, ఆయనతో కలసి పని చేయడం వల్లే తాను ఎన్నో పాఠాలు నేర్చుకున్నానని సగర్వంగా చెప్పుకుంటారు. ఇలాగే మొత్తం పాలనా సంస్కృతికి, విద్యా రంగానికి ఆయన చేసిన సేవలు చిరకాలం గుర్తుండిపోతాయి.
ప్రొ. జి. హరగోపాల్