పశ్చాత్తాపం సరే.. ప్రజల మాటేమిటి?

ABN , First Publish Date - 2020-04-08T05:50:41+05:30 IST

కరోనా నేపథ్యంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మొదటిసారిగా క్షమాపణలు చెప్పారు. ఆయన తీసుకున్న ‘లాక్‌డౌన్’ నిర్ణయం పేదవారికి అశనిపాతంగా మారిందని ఆయన ఆలస్యంగానైనా గుర్తించారు...

పశ్చాత్తాపం సరే.. ప్రజల మాటేమిటి?

విదేశాలనుంచి కోటానుకోట్లు ఖర్చుచేసి వేలాది మందిని, అందునా కొందరు వ్యాధిగ్రస్తులను దేశంలోకి దించిన ప్రభుత్వం ఇక్కడి కూలీలను ఎర్రబస్సులు ఎక్కించలేక పోయిందనే విమర్శలు వస్తున్నాయి. ఇప్పుడు శిబిరాల్లో చితికి పోతున్న వాళ్ళు రేపు ఏమౌతారోనన్న ఆందోళన ప్రపంచవ్యాప్తంగా వ్యక్తమవుతోంది. మోదీ లక్ష్మణ రేఖ పేరుతో దేశంలో పౌరుల మధ్య ఒక విభజన రేఖ గీసినట్టు అంతర్జాతీయ మీడియా, మేధో వర్గం ఆందోళన చెందుతోంది. ఎందుకో గానీ మన పాలకులు అన్నీ రాజకీయంగానే ఆలోచిస్తారు తప్ప ప్రజల మనోభావాలు, భావోద్వేగాలను గమనించరు. ముఖ్యంగా చావు బతుకుల సమస్య వచ్చినప్పుడు ప్రజలు ఎట్లా ఆలోచిస్తారు, వారికి ఏది ముఖ్యం? అనేది చూడరు.


కరోనా నేపథ్యంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మొదటిసారిగా క్షమాపణలు చెప్పారు. ఆయన తీసుకున్న ‘లాక్‌డౌన్’ నిర్ణయం పేదవారికి అశనిపాతంగా మారిందని ఆయన ఆలస్యంగానైనా గుర్తించారు. కేంద్రప్రభుత్వం, ప్రధాని మోదీ కరోనా విషయంలో మొదటి నుంచీ ఏమాత్రం అవసరం లేని గోప్యత ప్రదర్శిస్తూ వస్తున్నారు. మోదీ వ్యవహార శైలి ఎప్పుడైనా ఇలాగే ఉంటుంది. 2016 నవంబర్‌లో నోట్ల రద్దు, 2019 ఆగస్టులో 


ఆర్టికల్ 370 రద్దు సమయంలో కూడా ఇలాగే వ్యవహరించారు. ఉన్నట్టుండి ఆయన టెలివిజన్ తెరమీద ప్రత్యక్షమవుతారు. తన నిర్ణయాన్ని ప్రకటిస్తారు. అందుకే, మార్చి 24న మోదీ జాతినుద్దేశించి ప్రసంగిస్తారని తెలియగానే విదేశాల్లో ఉన్న భారతీయులతో సహా దేశం యావత్తూ టెలివిజన్‌లకు అతుక్కుపోయింది. అంతకంటే ముందు వారంలో ఆయన రెండు పర్యాయాలు జాతినుద్దేశించి ‘జనతా కర్ఫ్యూ’ విషయమై ప్రసంగించారు. ఈ ప్రసంగం విషయంలోనే ఆయన క్షమాపణలు చెప్పాల్సి వచ్చింది. అప్పటికే కరోనా వైరస్ దేశంలో ప్రవేశించి ఏడువారాలైంది. కేరళ, మహారాష్ట్రతో సహా అనేక రాష్ట్రాలు అతలాకుతలం అవుతున్న దశ అది. అరగంట పాటు సాగిన ఈ ప్రసంగంలో కరోనా విశ్వవ్యాప్తంగా ఎంతటి విలయ తాండవం చేస్తోందో వివరించి చెబుతూ మరో మూడున్నర గంటల్లో దేశమంతా మూతపడబోతున్నట్టు మోదీ ప్రకటించారు. రైళ్లు, విమానాలు, బస్సులతో సహా వాహనాలన్నీ ఎక్కడికక్కడే నిలిచిపోతాయని, ఎక్కడివాళ్ళు అక్కడే ఉండాలని ఆదేశించారు.


మోదీ ప్రసంగంలోని గంభీరత, విషయ తీవ్రత అంతకు మించి ప్రాణ భయం వల్ల మీడియాతో సహా అందరూ అది అవసరమైన చర్యే అని భావించారు. కానీ, అదే సమయంలో దేశవ్యాపితంగా నగరాల్లో కోట్లాదిమంది వలసజీవులు, లక్షా నలభై రెండు వేలకు మించిన కిలోమీటర్ల పొడవున్న జాతీయ రహదారుల మీద లారీలు, ట్రక్కుల్లో సరుకు రవాణా చేస్తున్న కార్మికుల గురించి ఆలోచించలేదు. దశాబ్దం కిందటి జనాభా లెక్కల ప్రకారం దేశంలో దాదాపు ఐదు కోట్లమంది నగరాల్లో, పట్టణాల్లో వలస కూలీలుగా బతుకుతున్నారు. ఏటేటా ఈ వలసలు పెరుగుతూనే ఉన్నాయి. భవన నిర్మాణ కూలీలు, డ్రైవర్లు, అడ్డమీది కూలీలు, డెలివరీ బోయ్స్, సెక్యూరిటీ గార్డులు, ఇళ్లల్లో పాచిపని చేసేవాళ్ళున్నారు. నగరాలు ఇవాళ వలస కూలీల శ్రమతోనే బతుకుతున్నాయి. చెమటతోనే ఎదుగుతున్నాయి. తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పినట్టు వాళ్ళు మన అభివృద్ధి భాగస్వాములు. 


నగరాలను నిర్మిస్తూ, దేశాన్ని నడిపిస్తున్న వలస కూలీల సంఖ్య 12 కోట్లకు పైమాటేనని బెంగళూరుకు చెందిన బెటర్ ప్లేస్ అనే అంకుర సంస్థ తేల్చింది. మనవాళ్ళు కూడా దాదాపు 10 లక్షల మంది ముంబయిలో ఉన్నారు. ఒక్క ఢిల్లీలోనే దాదాపు కోటిమంది వలస కూలీలున్నట్టు అంచనా. వీరికోసం ఒక్క ఢిల్లీ పరిసరాల్లోనే 21 వేల శిబిరాలు ఏర్పాటు చేశారు. ఇప్పుడు ఒంటరిగా మిగిలిపోయిన కూలీలకు పూటకు 21లక్షల ఆహార పొట్లాలు పంపిణీ చేయాల్సివస్తుంది అని కేంద్ర హోమ్ శాఖ ప్రకటించడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. ఆ తిండి కూడా దొరక్క ఇవాళ లక్షలాదిమంది స్వదేశంలోనే కాందిశీకులై స్వగ్రామాలకు నడిచి వెళ్తున్నారు. గ్రామాలు కరువు కాటకాలతో, కుల వివక్షలతో తరిమేస్తే వచ్చినవాళ్లంతా ఇప్పుడు మళ్ళీ అదే గ్రామాలను వెతుక్కుంటూ ప్రాణ భయంతో పరుగులు పెడుతున్నారు. బహుశా స్వతంత్ర భారతావని ఇంతటి పౌర సంక్షోభాన్ని, అంతర్గత వలసల్ని చూసి ఉండదు. 


ఈ పరిస్థితులను ఎండగడుతూ అంతర్జాతీయ మీడియా వరుస కథనాలు ప్రచురించడంతో ప్రపంచంలోనే అతిపెద్ద ‘లాక్‌డౌన్’ దేశ గౌరవానికి, ప్రధాని ప్రతిష్ఠను మసకబార్చేదిగా మారిపోయింది. అందుకే, పశ్చాత్తాపం ఎరుగని మోదీ కూలీలు తనను క్షమించాలని కోరాడు. ‘పేదలకు అత్యంత కష్టం కలిగించిన ఈ నిర్ణయం తీసుకున్నందుకు క్షమాపణలు కోరుతున్నాను’ అని ఆయన తన మన్‌కీ బాత్‌లో అన్నారు. 


కరోనా జన్మస్థానం అయిన చైనా కూడా లాక్‌డౌన్ చేసి విమర్శల పాలయ్యింది. అయితే, అది దేశమంతటినీ మూసేయలేదు. వుహాన్ నగరంతో పాటు వ్యాధి తీవ్రత ఉన్న ముఖ్యమైన ప్రాంతాల్లో మాత్రమే ఈ కట్టడిని దశల వారీగా, ప్రాంతాల వారీగా అమలు చేసింది. వివిధ ప్రాంతాలలో ఉన్న ప్రజలు స్వస్థలాలకు వెళ్లేందుకు తగిన సమయాన్ని ఇచ్చింది. దాదాపు 76 కోట్ల మంది నెలరోజులు కట్టడిలో ఉన్నా ఏ ఒక్కరు కూడా రోడ్డున పడలేదు. ఆకలితో అలమటించలేదు. చైనా కమ్యూనిస్టు నియంతల దేశం అనే నింద ఉన్నా అక్కడ కర్ఫ్యూ వాతావరణం సృష్టించలేదు, ప్రజలపై భద్రతా దళాలతో బలప్రయోగం చేయలేదు. పరిస్థితులను ఎప్పటికప్పుడు ప్రజలకు వివరిస్తూ వచ్చింది. ఎన్నడూ లేని పారదర్శకతను ప్రదర్శించింది. ప్రజలను, పౌరసమాజాన్ని భాగస్వాములు చేస్తూ పరిస్థితిని తన అదుపులోకి తెచ్చుకుంది. నెల రోజుల్లో ప్రజలను రోగ విముక్తుల్ని చేసింది. మన అవగాహన రాహిత్యం, అనాలోచిత నిర్ణయాలు ప్రజలను రోగగ్రస్తుల్ని చేస్తున్నాయి. 


కరోనా వైరస్ విషవాయువు కాదు. ఉప్పెన లాగో, సునామీ లాగో ఒక్కసారిగా మీదపడి కప్పేయదు. అది రోగి నుంచి అంటుకునే మహమ్మారి. ఇది కేరళలో మొదట సోకిన తరువాత నుంచి దాదాపు నెలరోజులు పైగా కేంద్రం పట్టించుకోలేదు, ప్రపంచ ఆరోగ్యసంస్థ హెచ్చరించే వరకు దాని తీవ్రతను గుర్తించలేదు. ఈ విషయంలో రాష్ట్రాలే ముందుగా మేల్కొన్నాయి. కేరళలో అక్కడి ప్రభుత్వమే ముందుగా రంగంలోకి దిగి తన ప్రజలను కాపాడుకునే ప్రయత్నం చేసింది. ఆ తరువాత తెలంగాణ పూర్తి స్థాయి జాగరూకతతో మెలిగింది. ఒక్క వ్యక్తికి కరోనా సోకినట్టు నిర్ధారణ కాగానే సర్కారు అప్రమత్తమయ్యింది. వ్యాధికి మూలమైన విదేశీ ప్రయాణికులను కట్టడి చేయాలని కేంద్రాన్ని కోరింది. రాష్ట్రంలో వ్యాధి విస్తరించకుండా చైనా తరహా క్రమబద్ధమైన కట్టడిని మొదలు పెట్టింది. పాఠశాలలు మూసివేసి, సభలు, సమావేశాలు, జన సమీకరణకు ఆస్కారం ఉండే అన్ని కార్యక్రమాలను రద్దు చేసింది. రాష్ట్రాల మధ్య సరిహద్దులను మూసివేసింది. వలస కూలీల విషయంలో కూడా బాధ్యతతో వ్యవహరించింది. అందుకే ఇవాళ ఇక్కడ ఢిల్లీ, ముంబయి, కొల్‌కతాల్లో ఉన్న ఆందోళనలు, అగచాట్లు లేవు.


మోదీ ప్రభుత్వం కూడా ఇదే రీతిలో వ్యవహరించాల్సింది. మార్చి 19న మొదలుపెట్టిన చర్యలను కనీసం వారం పది రోజుల ముందే చేపట్టాల్సింది. గడువిచ్చి ఎక్కడివాళ్లను అక్కడికి చేర్చాల్సింది. విదేశాలనుంచి కోటానుకోట్లు ఖర్చుచేసి వేలాది మందిని, అందునా కొందరు వ్యాధిగ్రస్తులను దేశం లోకి దించిన ప్రభుత్వం ఇక్కడి కూలీలను ఎర్రబస్సులు ఎక్కించలేక పోయిందనే విమర్శలు వస్తున్నాయి. ఇప్పుడు శిబిరాల్లో చితికి పోతున్న వాళ్ళు రేపు ఏమౌతారోనన్న ఆందోళన ప్రపంచవ్యాప్తంగా వ్యక్తమవుతోంది. మోదీ లక్ష్మణ రేఖ పేరుతో దేశంలో పౌరుల మధ్య ఒక విభజన రేఖ గీసినట్టు అంతర్జాతీయ మీడియా, మేధో వర్గం ఆందోళన చెందుతోంది. ఎందుకో గానీ మన పాలకులు అన్నీ రాజకీయంగానే ఆలోచిస్తారు తప్ప ప్రజల మనోభావాలు, భావోద్వేగాలను గమనించరు. ముఖ్యంగా చావు బతుకుల సమస్య వచ్చినప్పుడు ప్రజలు ఎట్లా ఆలోచిస్తారు, వారికి ఏది ముఖ్యం? అనేది చూడరు. భారతీయులు హృదయంతో ఆలోచిస్తారు. బతుకుదెరువుకోసం ఎంతదూరమైనా వెళతారు. ఎక్కడున్నా ప్రాణాలన్నీ సొంతూరిపైనే పెట్టుకుంటారు. జీవితం ముగిసి పోతుందనుకున్నప్పుడు ఎలాగైనా ఊరు చేరుకోవాలని కోరుకుంటారు. వాళ్ళ ఆత్మ అక్కడే ఉంటుంది. అక్కడి మానవసంబంధాలు వారిని పల్లెలవైపు లాగుతుంటాయి. ఊళ్ళతో భావోద్వేగభరితమైన జీవన సంబంధ జ్ఞాపకాలు, అనుబంధాలు పెనవేసుకుని ఉంటాయి. ఆ తపనే వాళ్ళను ఊరి వైపు నడిపిస్తోంది. అన్ని నిబంధనలు సడలించైనా సరే వాళ్ళను గూటికి చేర్చాల్సిందే. లేకపోతే దేశవిభజననాటికంటే దుర్భరమైన పరిస్థితులు ఎదురు కావొచ్చు. అది ప్రజలకు, దేశ ప్రతిష్ఠకు మంచిది కాదు. 

డా. రాహుల్ రాజారామ్ 

సామాజిక, రాజకీయ పరిశోధకుడు

Updated Date - 2020-04-08T05:50:41+05:30 IST