ఆ చీకటి రోజులు గుర్తున్నాయా?
ABN , First Publish Date - 2020-06-25T06:25:22+05:30 IST
స్వతంత్ర భారతదేశ చరిత్రలో అత్యంత వివాదాస్పదమైన కాలమది. ప్రజల కనీస హక్కులను కాలరాస్తూ 1975 జూన్ 25న అప్పటి భారత ప్రధాని ఇందిరాగాంధీ దేశంలో ఎమర్జెన్సీ విధించారు...

‘అత్యవసర పరిస్థితిలో ప్రాథమిక హక్కులు రద్దు అవుతాయని వాదిస్తున్నారు కదా, జీవించే హక్కు కూడా రద్దు అవుతుందా’? అని దేశ సర్వోన్నత న్యాయస్థానం ప్రశ్నించినప్పుడు అటార్నీ జనరల్ నిరేన్డే ఔనని సమాధానమిచ్చారు! దీన్నిబట్టి ఇందిరాగాంధీ పాలన ఎంతటి నిరంకుశమైనదో అర్థం చేసుకోవచ్చు. అత్యధిక కాలం అధికారంలో ఉన్న కాంగ్రెస్ ఆ చీకటి రోజుల చరిత్రను మరుగున పడేసింది.
స్వతంత్ర భారతదేశ చరిత్రలో అత్యంత వివాదాస్పదమైన కాలమది. ప్రజల కనీస హక్కులను కాలరాస్తూ 1975 జూన్ 25న అప్పటి భారత ప్రధాని ఇందిరాగాంధీ దేశంలో ఎమర్జెన్సీ విధించారు. 21 నెలల పాటు అప్రకటిత నియంతృత్వం రాజ్యమేలి, 1977 మార్చి ఎన్నికలలో ఇందిర ఘోరపరాజయంతో, జనతా పార్టీ రాకతో ప్రజాస్వామ్య పునరుద్ధరణ జరిగింది. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం మనది. అంబేడ్కర్ రాసిన రాజ్యాంగాన్ని మార్చి ప్రజాస్వామ్యాన్ని కాలరాశారు ఇందిరాగాంధీ. ఈ సుదీర్ఘ కాలంలో దేశ పౌరులు చీకటి రోజులు చవిచూశారు.
గుజరాత్లో నవనిర్మాణ్ ఆందోళన్‌గా పేరుగాంచిన అవినీతి వ్యతిరేక ఉద్యమంతో ఆనాటి గుజరాత్ ముఖ్యమంత్రి చిమన్ భాయ్ పటేల్ రాజీనామా చేశారు. అసెంబ్లీని రద్దు చేసి రాష్ట్రపతి పాలన విధించారు. ఇదే సమయంలో బిహార్‌లో కూడా అవినీతి పాలనకు వ్యతిరేకంగా ఏబీవీపీ ఆధ్వర్యంలో విద్యార్థి ఉద్యమం తీవ్రమైంది. అధిక ధరలు, అవినీతికి వ్యతిరేకంగా లోక్‌నాయక్ జయప్రకాశ్ నారాయణ్ ఈ విద్యార్థి ఉద్యమానికి మద్దతు ఇచ్చారు. జేపీ ఇచ్చిన సంపూర్ణ క్రాంతి పిలుపునకు స్పందిస్తూ దేశవ్యాప్తంగా ప్రజలు శాంతియుత నిరసనలు కొనసాగించారు. ఎమర్జెన్సీ విధించడానికి ముందు జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో ఇందిరాగాంధీ అక్రమాలకు పాల్పడి రాయ్‌బరేలీ స్థానం నుంచి గెలిచారని, ఆ ఎన్నికను రద్దు చేయాలంటూ ఆమె ప్రధాన ప్రత్యర్థి రాజ్ నారాయణ్ అలహాబాద్ హైకోర్టులో పిటిషన్ వేశారు. ఇందిర ఎన్నిక చెల్లదంటూ 1975 జూన్ 12న అలహాబాద్ హైకోర్టు తీర్పు చెప్పింది. అయితే ఆమె రాజీనామా చేయకుండా హైకోర్టు తీర్పుపై సుప్రీం కోర్టును ఆశ్రయించారు. జూన్ 25న జస్టిస్ కృష్ణ అయ్యర్ అలహాబాద్ హైకోర్టు తీర్పుపై స్టే ఇస్తూ ఇందిర ప్రధాని పదవిలో ఉండొచ్చని, కాకపోతే తుది తీర్పు వెలువడే వరకు ఎంపీగా కొనసాగకూడదని స్పష్టం చేశారు. పార్లమెంట్లో మాట్లాడవచ్చు కానీ ఓటు వేసే అధికారం ఆమెకు ఉండదని పేర్కొన్నారు. దీంతో ఇందిరాగాంధీ రాజీనామా చేయాలంటూ జన్‌సంఘ్, ఓల్డ్ కాంగ్రెస్, భారతీయ లోక్‌దళ్, సోషలిస్టు పార్టీ, అకాలీదళ్‌లతో కూడిన అయిదు పార్టీలు తీర్మానించాయి. అదే రోజు సాయంత్రం లోక్‌నాయక్ జయప్రకాశ్ నారాయణ్ ఢిల్లీ రామ్‌లీలా మైదానం సభలో ప్రసంగిస్తూ ఇందిర వెంటనే గద్దె దిగకపోతే అయిదు విపక్షాల కో ఆర్డినేషన్ కమిటీ సభ్యులంతా సత్యాగ్రహానికి దిగుతారని ప్రకటించారు.
అరుణ్ జైట్లీ ఢిల్లీ యూనివర్సిటీ విద్యార్థి నాయకుడిగా, చాత్రసంఘ సమితి జాతీయ అధ్యక్షుడిగా జయప్రకాష్ నారాయణ్ మార్గదర్శనంలో విద్యార్థి లోకంతో ఇందిరాగాంధీ అవినీతి వ్యతిరేక పోరాటాన్ని తీవ్రతరం చేశారు. ఆంధ్రప్రదేశ్‌లో వెంకయ్యనాయుడుగారు చాత్రసంఘ సమితి కన్వీనర్. ఇందిరాగాంధీ అకృత్యాలపై, అవినీతిపై విద్యార్థి పరిషత్, విద్యార్థి సంఘాలు క్రియాశీలకంగా పోరాడడంతో ఆమె ఎమర్జెన్సీకి ఉపక్రమించారు. శాంతి భద్రతలు అదుపులోనే ఉన్నప్పటికీ, అంతర్గత కల్లోలం ద్వారా దేశ భద్రతకు ముప్పు ఏర్పడిందనే సాకుతో 1975 జూన్ 25 అర్ధరాత్రి నుంచి ఈ చీకటి అధ్యాయం మొదలైంది. కేబినెట్‌ను కూడా సంప్రదించకుండా లేఖ ద్వారా ఎమర్జెన్సీ విధించాల్సిందిగా రాష్ట్రపతికి ఇందిరాగాంధీ సిఫారసు చేశారు. రాజ్యాంగ నియమాలకు విరుద్ధంగా తర్వాతి రోజు ఆ నిర్ణయాన్ని కేబినెట్ ఆమోదించింది.
ఎమర్జెన్సీ విధించిన వెంటనే సోషలిస్టులు, ఆరెస్సెస్ ప్రముఖులు, జన్‌సంఘ్ నేతలు, కవులు, రచయితలు, విద్యార్థులను అరెస్ట్ చేసి జైళ్లలో పెట్టి దేశాన్ని పోలీసు రాజ్యంగా మార్చారు. ప్రాథమిక హక్కులు రద్దు చేశారు. న్యాయ వ్యవస్థలను నిర్వీర్యం చేశారు. పలు స్వచ్ఛంద సంస్థలను, సామాజిక సంస్థలను నిషేధించారు. కోర్టులు, పత్రికలు అచేతనావస్థలోకి జారిపోయాయి. బలవంతంగా కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేపట్టారు. ఇండియన్ ఎక్స్‌ప్రెస్ అధినేత రామ్‌నాథ్ గోయెంకా, సీఆర్ ఇరానీ, నిఖిల్ చక్రవర్తి లాంటి వారు ఎమర్జెన్సీని తీవ్రంగా వ్యతిరేకించారు. ఇందిర అవినీతిపై కథనాలు రాసినందుకు ఇండియన్ ఎక్స్‌ప్రెస్‌పై దాడి చేయించడంతో పాటు దానిని నిషేధించారు. అరుణ్‌శౌరి, కేఆర్ మల్కానీ, కులదీప్ నయ్యర్ లాంటి వాళ్ళందరూ ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా పోరాడారు. సిటిజన్ ఫర్ డెమోక్రసి పేరుతో వివి జాన్, తార్కుండే, పీఎన్ లేఖీ లాంటి వారు ప్రజాస్వామ్యం కోసం గళమెత్తారు. బాలీవుడ్ గాయకుడు కిశోర్ కుమార్ ప్రభుత్వ ప్రచార గీతం పాడటానికి నిరాకరించడంతో ఆలిండియా రేడియోలో ఆయన పాటలు ప్రసారం కాకుండా చేశారు. భారతీయ జన్‌సంఘ్, ఆర్ఎస్ఎస్ నేతలు ముందుండి ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా పోరాడారు. వాజపేయి, అద్వాణీ, చంద్రశేఖర్, మొరార్జీ దేశాయి, దేవెగౌడ, నితీశ్‌కుమార్‌లతో పాటు పలువురు ఆర్ఎస్ఎస్ నేతలను ప్రభుత్వం అరెస్టు చేసింది. వేలాది మందిని అంతర్గత భద్రత నిర్వహణ చట్టం(మీసా) కింద జైళ్ళలో కుక్కారు. ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు వేలాది మంది ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా సత్యాగ్రహాలు చేశారు, రహస్యంగా కరపత్రాలు పం చారు. ఎమర్జెన్సీ వ్యతిరేక ఉద్యమాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి విశేష కృషిచేశారు. ‘అత్యవసర పరిస్థితిలో ప్రాథమిక హక్కులు రద్దు అవుతాయని వాదిస్తున్నారు కదా, జీవించే హక్కు కూడా రద్దు అవుతుందా’? అని దేశ సర్వోన్నత న్యాయస్థానం ప్రశ్నించినప్పుడు అటార్నీ జనరల్ నిరేన్డే ఔనని సమాధానమిచ్చా రు! దీన్నిబట్టి ఇందిరాగాంధీ పాలన ఎంతటి నిరంకుశమైనదో అర్థం చేసుకోవచ్చు.
ఇలా పెల్లుబికిన ప్రజా నిరసనలకు ఇందిరాగాంధీ దిగొచ్చి చివరకు ఎమర్జెన్సీని ఎత్తివేసి, 1977సాధారణ ఎన్నికల్లో ఘోరపరాజయం పాలయ్యారు. ఆమె నిరంకుశ, నియంతృత్వ పోకడలకు వ్యతిరేకంగా దేశ ప్రజలు 1977 మార్చి 22న మొరార్జీ దేశాయి నాయకత్వంలో జనతా పార్టీని అధికారంలోకి తీసుకొచ్చారు. దీనితో నియంతృత్వంపై ప్రజాస్వామ్యం విజయం సాధించింది. ఆత్యయికస్థితి కాలంలో చోటుచేసుకున్న దారుణాలపై షా కమిషన్ విచారణ చేపట్టి, ఇందిర ప్రభుత్వంలో మంత్రులైన బన్సీలాల్, వీసీ శుక్లా, ఆమె అదనపు వ్యక్తిగత కార్యదర్శి ఆర్కే ధావన్, ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ కిషన్‌చంద్ తదితరులపై తీవ్ర ఆరోపణలు గుప్పించింది. అంతేకాదు, ఎమర్జెన్సీ విధించడానికి ఎటువంటి సహేతుకమైన కారణాలూ లేవని తేల్చి చెప్పింది. కేంద్రంలో అత్యధిక కాలం అధికారంలో ఉన్న కాంగ్రెస్ ఆ చీకటి రోజుల చరిత్రను మరుగున పడేసింది. నిరంకుశ, నియంతృత్వ విధానాలకు నిదర్శనంగా నిలిచిన ఎమర్జెన్సీ గురించి ఈ తరం తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
బండి సంజయ్‌కుమార్
తెలంగాణ రాష్ట్ర బిజెపి అధ్యక్షులు
(‘అత్యయిక స్థితి’కి 45 ఏళ్లు)