బిహార్‌లో ఎరుపుల మెరుపులు!

ABN , First Publish Date - 2020-11-19T06:09:15+05:30 IST

కమ్యూనిస్టులను చూస్తే జాలివేస్తుంది. దేశంలో జరగరానిది ఏమి జరిగినా, కమ్యూనిస్టులేం జేస్తున్నారు- అని అడిగేవాళ్లు పెరిగిపోయారు...

బిహార్‌లో ఎరుపుల మెరుపులు!

కమ్యూనిస్టు ఉద్యమాల మీద ఆసక్తి ఉన్న వారికి, లిబరేషన్ విజయాలు పార్లమెంటరీ వామపక్షాల ప్రస్థానంలో ఒక కొత్తమలుపును సూచిస్తాయి. మిలిటెంట్ పోరాట మార్గాన్ని ఆచరణాత్మకతను మేళవించి, లిబరేషన్ విజయం సాధించిందని గుజరాత్ దళిత నాయకుడు జిగ్నేష్ మేవానీ వ్యాఖ్యానించారు. ఈ మేళవింపు, వామపక్ష రాజకీయాలకు కొత్త జవసత్వాలను అందించే అవకాశం ఉన్నదా?


పందొమ్మిది స్థానాల్లో పోటీచేసి, పన్నెండుచోట్ల గెలిచిన లిబరేషన్, ఏ ఒక్క చోటా అగ్రవర్ణ అభ్యర్థిని నిలపలేదు. ఉద్యమాల్లో కానీ, ఎన్నికల పోరాటంలో కానీ, సామాజిక వాస్తవికతను విస్మరించడం ఉండదని, తమ అవగాహనలో సామాజిక-, ఆర్థిక వాస్తవికతలు కలగలసే ఉంటా యని లిబరేషన్ నేతలు చెబుతారు. మరి, కులాల ఉక్కు గోడలను ఇతర కమ్యూనిస్టులు ఎప్పుడు అధిగమిస్తారు? కనీసం, అధిగమించవలసిన అవసరాన్ని ఎప్పుడు గుర్తిస్తారు? దేశవ్యాప్త రాడికల్ ప్రజాస్వామిక శక్తులు ఒక ప్రజా ఉద్యమాన్ని లేదా ఒక ఎన్నికల కూటమిని నిర్మించవలసిన రోజు వస్తే, అందులో బిహార్ లో అనుసరించిన వ్యూహంతో పనిచేసే వామపక్షాలు కూడా భాగంగా ఉండితీరతాయి. 


కమ్యూనిస్టులను చూస్తే జాలివేస్తుంది. దేశంలో జరగరానిది ఏమి జరిగినా, కమ్యూనిస్టులేం జేస్తున్నారు- అని అడిగేవాళ్లు పెరిగిపోయారు. మూడు దశాబ్దాల కిందట బొంబాయిలో దారుణమయిన మతహింస జరిగినప్పుడు అప్పుడు వస్తుండిన విశాలమయిన పత్రిక ‘ఇలస్ట్రేటెడ్ వీక్లీ ఆఫ్ ఇండియా’లో ఇదంతా కమ్యూనిస్టుల వైఫల్యం అంటూ ప్రీతీశ్ నంది సంపాదకీయం రాశాడు. కార్మిక వర్గ పార్టీలమని అంటారు, భారతదేశపు పారిశ్రామిక రాజధానిలో, కార్మికోద్యమం బలశాలిగా ఉండగలిగిన బొంబాయిలో ప్రజలు మతప్రాతిపదికన చీలిపోవడానికి చారిత్రక బాధ్యతను కమ్యూనిస్టులే తీసుకోవాలి- అని చాలా బాధతో రాశాడు. కమ్యూనిస్టులను బోనులో నిలబెట్టడంలో ఒక ప్రేమ, విశ్వాసం, అంచనా కూడా ఉంటాయి. దేవుణ్ణి నిలదీసినంత హక్కుగా ప్రశ్నించవచ్చునని అనుకోవడమూ ఉంటుంది. ఈ ప్రపంచాన్ని పూర్తిగా మరమ్మత్తు చేసి, మానవీయం చేస్తామని కమ్యూనిస్టులు బహుశా మానవాళికి రుణపత్రం రాసి ఉన్నారేమో, ఇప్పుడయితే, కమ్యూనిస్టులను బోనెక్కించడం మరీ పెరిగిపోయింది.


యువకులు కొత్తగా ఎవరూ రావడం లేదు, వచ్చినవారూ ఎక్కువ కాలం ఉండడం లేదు- అని ఒక పెద్ద కమ్యూనిస్టు నేత, కొన్ని రకాల కార్యక్రమాలు తీసుకోలేకపోవడానికి కారణాలను చెబుతూ అన్నాడు. సహస్రాబ్ది శిశువులు- లేదా మిలియనల్స్- అని మధ్య, ఎగువ, ఆ పై మరింత ఎగువ ఉండే యువకులనే అనాలో, బడుగు అలగా జనాలను కూడా అనవచ్చునేమో తెలియదు కానీ, ఆ కుర్రవాళ్లందరూ అవకాశాల, వ్యక్తిత్వ వికాసాల మాయలో పడ్డారని అనుకోలేము. తరతరాల నుంచి జరుగుతున్నట్టే, యువకుల్లో కొందరు ఇప్పుడు కూడా ధర్మాగ్రహాలను, సత్యావేశాలను వ్యక్తపరుస్తూనే ఉన్నారు. వారిని నడిపించడమో, వారి వెనుక నడవడమో తెలియని స్థితి కమ్యూనిస్టు పార్టీలకు ఏర్పడితే అది వారి సమస్యే తప్ప, యువకుల సమస్య కాదు. తెగింపును, త్యాగాన్ని, సాహసాన్ని చివరి అంచు వరకు తీసుకువెళ్లగలిగేవారిని సాయుధ కమ్యూనిస్టులు ఆకర్షించగలుగుతారని, తక్కిన వారిని వ్యవస్థ మైమరిపింపజేస్తుందని అనుకోవడం కూడా పూర్తి వాస్తవం కాదు. బహిరంగ ప్రజాజీవనంలో క్రియాశీలంగా ఉంటూ, ధైర్యసాహసాలను చూపగలిగిన నిబద్ధులకు అనేక ఉదాహరణలు చెప్పవచ్చు. వ్యవస్థతో అమీతుమీ పోరాడేవారికీ, వ్యవస్థలో లాభదాయకంగా సంలీనమయ్యేవారికి నడుమ ఉన్న క్షేత్రం కూడా చిన్నది కాదు. చిత్తశుద్ధి, అవగాహన, లక్ష్యశుద్ధి, ఆత్మవిమర్శ ఉంటే కమ్యూనిస్టుల పరిస్థితి మారుతుంది. ప్రపంచాన్ని తీర్చిదిద్దాలంటే, తమను తాము మెరుగుపరుచుకోవాలి కదా? 


బిహార్ ఎన్నికల్లో 16 స్థానాలు లభించేసరికి, వామపక్షాల గురించి ప్రస్తావనకు గిరాకీ పెరిగిపోయింది. రాజకీయ పరిశీలకుల నుదుళ్లు ఎగిరిపడ్డాయి. ఈ పదహారింటిలో పన్నెండు సాధించిన సిపిఐ (ఎంఎల్- లిబరేషన్) గురించిన పూర్వాపరాలు ఏమిటో తెలుసుకోవడానికి ఆసక్తి పెరిగింది. ఎన్నికల్లో ఓడిపోయిన మహాగఠ్ బంధన్లో భాగస్వాములయిన వామపక్షాలు, తక్కిన పక్షాల కన్నా మెరుగైన విజయాలు సాధించాయి. ఎన్నికల విజయాలను గుణించడానికి తాజాగా వచ్చిన ‘‘స్ట్రైకింగ్ రేటు’’ తక్కిన అన్ని పార్టీలకంటె లిబరేషన్ దే ఎక్కువ (80శాతం) అట. ఓడిపోయిన కూటమిలోని గెలుపు విశేషాలు, అనేక వ్యాఖ్యానాలకు, అన్వయాలకు, ఉపదేశాలకు దారితీస్తున్నాయి. లిబరేషన్ ను చూసి సిపిఐ(ఎం) ఏమినేర్చుకోవాలి, వచ్చే బెంగాల్ ఎన్నికల్లో ఎట్లా వ్యవహరించాలి అన్న చర్చలు జరుగుతున్నాయి. బలహీనపడి ఉండవచ్చును కానీ, ఉభయ కమ్యూనిస్టు పార్టీల ఉనికి దేశంలో విస్తృతంగానే ఉన్నది. ఒక రాష్ట్రంలో వారు అధికారంలో ఉన్నారు కూడా. బెంగాల్ ను కోల్పోయినట్టు, వారు కేరళను కోల్పోయే పరిస్థితి రాకపోవచ్చు. బెంగాల్లో లాగా కేరళలో వారికి వరుస గెలుపులు ఉండవనుకోండి. 


2011లో బెంగాల్ ను కోల్పోయినప్పుడు, వెంటనే సర్దుకుని తగిన విరుగుడు వ్యూహాన్ని రచించవలసింది పోయి, వెళ్లిన ఓటర్లు తిరిగి తమ గూటికి చేరుకుంటారేమోనని ఆశగా ఎదురుచూడడం సిపిఐ(ఎం) చేసిన పొరపాటని సిపిఐ ఎంఎల్ లిబరేషన్ ప్రధాన కార్యదర్శి దీపాంకర్ భట్టాచార్య అంటారు. 2021 వేసవిలో జరిగే బెంగాల్ ఎన్నికలలో తృణమూల్ కాంగ్రెస్ మీద దృష్టి తగ్గించి, బిజెపి మీద గురిపెట్టమని ఆయన సిపిఐ(ఎం)కు హితవు చెప్పారు. బిహార్లో లిబరేషన్ నాయకత్వంలోని వామపక్ష కూటమి గెలవడానికి కారణం, బిజెపిని లక్ష్యంగా పెట్టుకుని చేసిన పోరాటమే అంటారాయన. ఎన్నికల ప్రచారం కూడా పోరాటస్థాయిలో నిర్వహించడం లిబరేషన్ విశిష్టత. 


కమ్యూనిస్టు ఉద్యమాల మీద ఆసక్తి ఉన్న వారికి, లిబరేషన్ విజయాలు పార్లమెంటరీ వామపక్షాల ప్రస్థానంలో ఒక కొత్తమలుపును సూచిస్తాయి. లిబరేషన్ చాలా కాలం నుంచి ఎన్నికల రాజకీయాలను విశ్వసిస్తూ, పాలుపంచుకుంటూ ఉన్నమాట నిజమే కానీ, దాని మూలాలు, సాయుధపోరాట మార్గాన్ని చేపట్టిన విప్లవ కమ్యూనిస్టు రాజకీయాలలో ఉన్నాయి. మిలిటెంట్ పోరాట మార్గాన్ని ఆచరణాత్మకతను మేళవించి, లిబరేషన్ విజయం సాధించిందని గుజరాత్ దళిత నాయకుడు జిగ్నేష్ మేవానీ వ్యాఖ్యానించారు. ఈ మేళవింపు, వామపక్ష రాజకీయాలకు కొత్త జవసత్వాలను అందించే అవకాశం ఉన్నదా? నక్సలైట్ కోవలోని లిబరేషన్ నాయకత్వంలో ఉభయ కమ్యూనిస్టులు హిందీ రాష్ట్రాలలో ఉనికిని పెంచుకుంటారా?


కమ్యూనిస్టుల అంతిమ ఆశయాలను, వాటి సాధనను పక్కన బెడితే, కమ్యూనిస్టులు అధికారంలో ఉన్న చోట, మెరుగైన సంక్షేమాన్ని అమలుచేసే అవకాశం ఉంటుందని, ప్రతిపక్షంగా ఉన్నచోట ప్రభుత్వాన్ని సమర్థంగా నిలదీస్తుందని ప్రజలు ఆశిస్తారు. బెంగాల్లో సుదీర్ఘకాలంలో అధికారంలో ఉండడం వల్ల పార్టీలోను, ప్రభుత్వంలోను ఏర్పడిన అవలక్షణాలను గుర్తించడంలో మార్క్సిస్టు పార్టీ విఫలమైంది. పార్టీలోపల అవలక్షణాల గుంపుదే ఆధిక్యం అయితే, దిద్దుబాటు కష్టం. ఆ క్షీణతకు ఎంతో మూల్యం చెల్లించుకోవలసి వచ్చింది. ఇప్పుడు కేరళలో, పాలనాపరంగా అనేక రంగాల్లో ప్రశంసలను అందుకుంటున్నప్పటికీ, ముఖ్యమంత్రి కార్యాలయంపైనే అవినీతి ఆరోపణలు రావడం, కమ్యూనిస్టుల మౌలిక విలువలకే భిన్నంగా బూటకపు ఎన్ కౌంటర్లను జరపడం పతనావస్థ ప్రారంభాన్ని తెలియజేస్తోంది. తెలుగు రాష్ట్రాలలో ఉభయ కమ్యూనిస్టుల బలం గణనీయంగా తగ్గిపోవడానికి కారణాలు-– అధికారపార్టీలతో మార్చిమార్చి పొత్తులు పెట్టుకోవడం, క్షేత్రస్థాయి ఉద్యమశీలత తగ్గిపోవడం. కమ్యూనిస్టు నేతలు, లేదా వారి కుటుంబసభ్యులు, ఆపార్టీలు పొత్తులు పెట్టుకునే బూర్జువా పార్టీలలోకే ఫిరాయించడంతో వామపక్షాల బలాలు కరిగిపోతూ వచ్చాయి. కొన్ని రాష్ట్రాలలో, ప్రాంతాలలో కమ్యూనిస్టు పార్టీలు సర్వ శక్తులూ ఉడిగిపోయి, పోరాటాలూ ఉద్యమాలూ జ్ఞాపకాలైపోయి, కొత్తతరానికి వెలియై గత పరిమళాలతో కాలం వెళ్లదీయవలసి వస్తున్నది.


పార్లమెంటరీ కోవలోకి వస్తే, ఎప్పటికైనా దిగజారకతప్పదు అనే సాయుధవాదుల విమర్శలు ఎట్లాగూ ఉంటాయి. లిబరేషన్ కూడా త్వరలోనే అనేక వ్యవస్థాగత అవలక్షణాలకు కేంద్రం కావచ్చును. కానీ, ప్రస్తుతం ఆచరణల్లో కనిపించే సానుకూల భేదాలను గుర్తించకపోతే, పొరపాటు అవుతుంది. పందొమ్మిది స్థానాల్లో పోటీచేసి, పన్నెండుచోట్ల గెలిచిన లిబరేషన్, ఏ ఒక్క చోటా అగ్రవర్ణ అభ్యర్థిని నిలపలేదు. ఉద్యమాల్లో కానీ, ఎన్నికల పోరాటంలో కానీ, సామాజిక వాస్తవికతను విస్మరించడం ఉండదని, తమ అవగాహనలో సామాజిక-, ఆర్థిక వాస్తవికతలు కలగలసే ఉంటాయని లిబరేషన్ నేతలు చెబుతారు. మరి, కులాల ఉక్కుగోడలను ఇతర కమ్యూనిస్టులు ఎప్పుడు అధిగమిస్తారు? కనీసం, అధిగమించవలసిన అవసరాన్ని ఎప్పుడు గుర్తిస్తారు?


ఫాసిజం ముప్పే పెనుప్రమాదమన్న గుర్తింపుతో పనిచేస్తున్న లిబరేషన్, మిత్ర శత్రు పరిగణనను కూడా ఎంతో ఆచితూచి చేస్తుంది. మజ్లిస్ ఇత్తెహాదుల్ వల్ల మతపరమైన ఓట్ల విభజన జరిగిందని వచ్చిన విమర్శలను దీపాంకర్ భట్టాచార్య తోసిపుచ్చారు. ఆ పార్టీకి ఎక్కడైనా, ఎట్లాగైనా పోటీచేసే హక్కు ఉన్నదని అంటూ, అటువంటి పార్టీ వెనుక ఓటర్లు చేరకూడదని అనుకుంటే, ప్రధానస్రవంతి పార్టీలే మైనారిటీల యోగక్షేమాలను పట్టించుకోవడంలో ముందుండాలి– అన్నారాయన. 


దేశవ్యాప్త రాడికల్ ప్రజాస్వామిక శక్తులు ఒక ప్రజా ఉద్యమాన్ని లేదా ఒక ఎన్నికల కూటమిని నిర్మించవలసిన రోజు వస్తే, అందులో బిహార్ లో అనుసరించిన వ్యూహంతో పనిచేసే వామపక్షాలు కూడా భాగంగా ఉండితీరతాయి. ప్రత్యామ్నాయాల సాధనలో భాగంగా ఉంటే, సమస్త వైఫల్యాలకు పాపాల భైరవులుగా ఉండే భారం కూడా తప్పిపోతుంది.కె. శ్రీనివాస్

Updated Date - 2020-11-19T06:09:15+05:30 IST