జానపదంలో క్వారంటైన్

ABN , First Publish Date - 2020-04-12T05:36:49+05:30 IST

సాంక్రామిక వ్యాధులు భారతదేశ నగర సీమలకు గానీ, పల్లెసీమలకు గానీ ఏ మాత్రం కొత్త కాదు. మనకు ప్రతి సాంక్రామిక వ్యాధి కూడా ఒక అమ్మతల్లి రూపంలో ఉంటుంది. అమ్మతల్లులను కొలిచే సంప్రదాయం మనకు కొన్ని శతాబ్దాలుగా ఉంది...

జానపదంలో క్వారంటైన్

ఒక ఊరిలో అమ్మవారు వచ్చింది అని తెలిసినప్పుడు వేరే ఊరు వారు చుట్టరికం మీదగానీ లేదా ఏదైనా ముఖ్యమైన పనివున్నా గానీ ఆ గ్రామానికి వెళ్ళరు. అలా వస్తే అమ్మవారు వారి వెంట ఇంకొక ఊరికి పోతుందని జానపదులు నమ్ముతారు. ఇది ఒక రకంగా మనం ఇప్పుడు చెప్పుకుంటున్న క్వారంటైన్ పద్ధతి. ఊరకట్టడి సంప్రదాయంలో ఒక సారి పొలిమేర కట్టు అయిన తర్వాత బయటనుండి లోనికికాని లోపలి నుండి బయటికి కానీ రావడానికి వీలు లేదు. ఇది పూర్తిగా శాస్త్రీయమైన క్వారంటైన్ పద్ధతే. ఒక గ్రామంలోని వ్యాధి బయటి గ్రామాలకు సోకకుండా తీసుకునే చర్య ఇది.


సాంక్రామిక వ్యాధులు భారతదేశ నగర సీమలకు గానీ, పల్లెసీమలకు గానీ ఏ మాత్రం కొత్త కాదు. మనకు ప్రతి సాంక్రామిక వ్యాధి కూడా ఒక అమ్మతల్లి రూపంలో ఉంటుంది. అమ్మతల్లులను కొలిచే సంప్రదాయం మనకు కొన్ని శతాబ్దాలుగా ఉంది. అంటు వ్యాధులకు అమ్మతల్లుల ఆరాధనా సంప్రదాయానికి విడదీయరాని సంబంధం ఉంది. ఈ సంబంధాన్ని చూచి అలనాటి వలస


పాలనాధికారులలో ఉన్న పరిశోధక జిజ్ఞాసువులు ఆశ్చర్యపోయారు. అంతే కాదు, తమ పాలితులను అర్థంచేసుకోవాలంటే ఈ ఆచారాలన్నింటిని అవగతం చేసుకోవాలని, ఇందుకు వాటిని అధ్యయనం చేయాలని, ఇలా అధ్యయనం చేయడం ద్వారానే భారత ప్రజలను సమర్థంగా పరిపాలించవచ్చుననే ఆంతరికమైన సూత్రాన్ని వలస పాలకులు గ్రహించారు. ఈ క్రమంలోనే ‘విలేజ్ గాడ్స్ ఆఫ్ సౌత్ ఇండియా’ గ్రంథాన్ని హెన్రీ వైట్ హెడ్ రచించాడు. ‘ద్రవిడియన్ గాడ్స్ ఇన్ మోడరన్ హిందూఇజమ్’ అనే ఉద్గ్రంథం ఎల్మోర్ పరిశోధన ఫలితంగా వచ్చింది. ఈ ఇరువురూ ఈ దేశ జానపద ఆచారాలలోని మూఢవిశ్వాసాలను గుర్తించారే కానీ వాటిలో ఉన్న ఒక తర్కాన్ని గ్రహించలేదు. మనుషులకు కాని పశువులకు కాని వచ్చే వ్యాధులకు జానపదులు ఎలా సమాధానాలు కనుక్కుంటారో విశ్లేషించి చెప్పడంలో కూడా వారు విఫలమయ్యారనే చెప్పాలి. సాంక్రామిక వ్యాధులకు సంబంధించిన జానపద దేవతల ఆరాధనా సంప్రదాయాల విషయమై ప్రశస్త పరిశోధన చేసిన విలియం క్రూక్ అనే పరిశోధకుడి అవగాహనలో కూడా పైన చెప్పిన పరిమితులు ఉన్నాయి. 


ప్రాకృతిక ఋతువులతో సంబంధం ఉండి వచ్చే సాంక్రామిక వ్యాధులు మన జానపదులకు కొన్ని శతాబ్దాలుగా సుపరిచిత మిత్రులు. ఒక అంటు వ్యాధి మనుషులకు లేదా వారింట్లో ఉండే పశువులకు కానీ వచ్చినప్పుడు అమ్మవారు తమను గుర్తు చేసుకుంటుందని, తనకు సేవచేయమని గుర్తుచేస్తుందని మన జానపదులు భావించడం కద్దు. అందుకే అంటు వ్యాధులు ప్రబలే వర్షాకాలంలోనే అమ్మవార్ల జాతరలు, కొలుపులు జరుగుతాయి. ఈ ఆరాధనా సంప్రదాయాలలో గ్రామం మొత్తం ఒక యూనిట్ గా మారుతుంది. గ్రామ ప్రజలు విడివిడిగా ఇంట్లో అమ్మవార్లను కొలుచుకున్నా గ్రామ స్థాయిలో మూడు లేదా వారం రోజులపాటు కొలుపులు జరుగుతాయి. స్ఫోటకం, దద్దు, కలరా ... వీటన్నింటిని మన జానపద సంప్రదాయంలో అమ్మవారు అనే అంటారు. అటు ఉత్తర భారతావనిలో కూడా స్మాల్ పాక్స్‌ ని శీతాళ దేవి అనే గ్రామదేవత పేరుతో కొలుస్తారు. ఈమెకు ఫుల్మాతి అని ఒక చెల్లెలు ఉంది. ఫుల్మాతి కాస్త తక్కువ ప్రమాదకారి అయిన దద్దుగా భావిస్తారు.


మనకు స్ఫోటకం ప్రమాదకరమైన జబ్బు, దానికన్నా తక్కువ ప్రమాదకారి దద్దు అని అంటారు. ఇది కొద్దిరోజులలోనే పోతుంది. స్ఫోటకాన్నే మశూచి అని అంటారు. ఇది ప్రాణాంతకం కూడా అవుతుంది. ఈ రెండింటిని అమ్మవార్లుగా భావిస్తారు. ఈ అమ్మవార్లు వేపచెట్టుమీద నివసిస్తారు అనే జానపద నమ్మకం ఒకటి ఉన్నది. అందుకే అమ్మవారు సోకిన వ్యక్తి చాపమీద పడుకోగా అతను లేదా ఆమెకు ఇరువైపులా వేపమండలు ఉంచడం పరిపాటి. ఇలా చాలా ఇండ్లలలో అమ్మవారు సోకినప్పుడు దద్దు అయితే కొద్ది స్థాయిలో జాతర ఉంటుంది. ఇది సాధారణంగా ఒక రోజు లేదా మూడు రోజులు ఉంటుంది. ఊరివారందరూ వచ్చి ముత్యాలమ్మ (దద్దు దేవత)కు నీళ్ళు పోస్తారు. తర్వాత చాకలి వచ్చి కోళ్ళను కోస్తాడు. బంధుమిత్రులు, ఇతర వ్యక్తులు అమ్మవారికి తమ ఇంటి నుంచి కోళ్ళను తెచ్చి ఇస్తారు. ఇలా ఒక ఊరిలో అమ్మవారు వచ్చింది అని తెలిసినప్పుడు వేరే ఊరు వారు చుట్టరికం మీదగానీ లేదా ఏదైనా ముఖ్యమైన పనివున్నా గానీ అక్కడికి రారు. అలా వస్తే అమ్మవారు వారి వెంట ఇంకొక ఊరికి పోతుందని జానపదులు నమ్ముతారు. ఇది ఒక రకంగా మనం ఇప్పుడు చెప్పుకుంటున్న క్వారంటైన్ పద్ధతి. లేదా సామాజిక దూరం పెద్ద స్థాయిలో ఉంది అని చెప్పవచ్చు. 


ఇక స్ఫోటకం వచ్చినప్పుడు లేదా గ్రామం లోని మొత్తం పశువులకు దొమ్మ, గాలికుంటు వ్యాధులు వచ్చినప్పుడు వాటికి జానపద సంప్రదాయాల పద్ధతిలో వైద్యం చేస్తారు. ఆకుపసరులతో పాటు చెంద్రికం పెడతారు. చెంద్రికం అంటే సున్నంలో పసుపు కలుపుతారు. దీనితో అది ఎర్రటి ద్రవంగా మారుతుంది దాన్ని పశువులకు తాపిస్తారు. ఇక్కడితో ఆగకుండా ఊరిజాతర చేస్తారు. దీన్నే కొలుపు అని కూడా అంటారు. ఈ కొలుపు, ఊళ్ళో ఉన్న ముత్యాలమ్మ, పెద్దమ్మ, ఎల్లమ్మ, లేదా పోచమ్మ విగ్రహాల దగ్గర జరుపుతారు. సాధారణంగా ఈ అమ్మవార్ల గుడులు లేని ఊర్లు ఉండవు. ఒకవేళ ఎక్కడైనా లేనప్పుడు ఊరి బొడ్డురాయి గ్రామ దేవత అవుతుంది అక్కడ కొలుపు చేస్తారు. బైండ్ల వారు ఈ కొలుపులు చేస్తారు. కాని ఖమ్మం జిల్లాలో కొన్ని ప్రాంతాలలో కొమ్ము మాదిగలు కొలుపులు కొలుస్తారు, వీరినే కొమ్మవారు అనిఅంటారు. సాధారణంగా మూడు నుంచి ఏడు రోజుల దాకా ఈ కొలుపులు సాగుతాయి. వ్యాధి బాగా ఉధృతంగా ఉంటే అరుదుగా పదకొండురోజులు కూడా ఈ కొలుపు కాలం ఉంటుంది. 


ఈ కొలుపులో మొదటిగా చేసేది ఊరి గవన్ల దగ్గర పొలిమేర కట్టుకడతారు. ఊరి గవను అంటే గ్రామానికి ఎల్ల (బోర్డర్) అని అర్థం. దీన్నే పొలిమేర అని అంటారు. ప్రతి ఊరికి అన్ని వైపులా నాలుగు వైపులా ఊరినుండి బయటి ఊరికి పోయే దారిలో పొలిమేర ఉంటుంది. అక్కడ గుర్తుగా ఒక రాయి పాతి ఉంటుంది. ఈ పొలిమేర దగ్గరికి బైండ్ల వారు కాని కొలుపులు కొలిచే కొమ్ముల వారు కాని వచ్చి అమ్మవారి గుర్తుగా మూడు చిన్నచిన్న రాళ్ళకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి అక్కడ పెడతారు. ఈ రాళ్ళు అమ్మవార్లు అని అర్థం. ఆ రాళ్ళ పక్కనే మంత్రాలు చదివి వేపమండలు కాని తంగేడు మండలు కాని వేస్తారు. సాధారణంగా పొలిమేర కట్టుదగ్గర తంగేడు మండలు వేస్తారు. కొన్ని గ్రామాల్లో తంగేడు దొరకకపోతే వేపమండలు వేస్తారు. ఇలా అన్ని పొలిమేరలు కట్టు కట్టడం పూర్తయినప్పుడు ‘ఊరకట్టు’ అయింది అంటారు. ఇలా చేయడాన్ని ‘ఊరకట్టడి’ అని అంటారు. అలా కట్టడి చేసే ముందు ఆ గ్రామస్తులు ఎవరైనా తమ బంధువులను వేరే గ్రామాలనుండి పిలుచుకోవాలనుకుంటే తమ గ్రామంలో కొలుపు జరుగుతుంది రండి అని పిలుచుకుంటారు. లేదా మెట్టినింట వున్న తమ ఆడ బిడ్డలను పిలుచుకోవాలనుకున్నా ఈ ఊరకట్టడికి మూడు నాలుగు రోజుల ముందే పిలుచుకుంటారు. ఒకసారి పొలిమేర కట్టు కట్టడం అయిపోతే బయటి ఊరి వారు ఎవరూ ఊరిలోనికి రారు. అలాగే ఆ గ్రామం వారు కూడా బయటికి పోవడానికి వీలు లేదు. వేరే గ్రామాల వారు పొలిమేర దగ్గరికి రాగానే అక్కడ పొలిమేర కట్టు కనబడితే దాన్ని దాటి ఊరిలోకి రారు. అలా వస్తే వారికి అమ్మవారి వల్ల కీడు జరుగుతుందని నమ్ముతారు. వెనక్కు వెళ్ళిపోతారు. ఈ నమ్మకం నేటికీ మన గ్రామీణులలో చాలా గట్టిగా ఉంది. 


ఇక ఊర కట్టడి అయిన మరుసటి రోజున అమ్మవార్లకు కొలుపు మొదలౌతుంది. అమ్మవార్లకు కోళ్ళను మేకలను బలి ఇస్తారు. పెద్దజాతరలో ఊరి పెద్దమాదిగ దున్నపోతును బలి ఇస్తాడు. తలను తెచ్చి అమ్మవారి ముందు పెడతారు. దున్న ఎడమకాలు సగం విరిచిన దాన్ని దాని నోటిలో పెట్టి దాని కొవ్వునే దీపంగా చేసి నెత్తిన పెడతారు. కొమ్ములు వారుంటే వారు లేదా బైండ్ల వారు రాత్రి పూట అమ్మవారి కథలను చెబుతారు. ఈ కొలుపు మూడు రోజులు లేదా ఏడు రోజులు సాగవచ్చు. ఇక చివరి రోజున ఊరి మధ్యలో ఒక పందిని తల పైకి ఉండేలాగా పాతిపెడతారు. ఊళ్ళో ఉన్న ప్రతి ఇంటి వారి పశువులను ఆ పందిని తొక్కుకుంటూ పోయేలాగా తీసుకుపోతారు. అలా తొక్కడం వల్ల పట్టిన కింకలు అన్నీ పోయి పశువులకు వ్యాధులు తగ్గుతాయని గట్టిగా నమ్ముతారు. కాని ఈ నమ్మకంతోనే ఆగక సాంప్రదాయకమైన వైద్యం కూడా చేస్తారు. 


ఇలా జాతరలు చేయడంతో పాటు జానపద వైద్యం కూడా చేస్తారు. మనుషులకు వ్యాధి తీవ్రత తగ్గడానికి చలువ చేసే పద్ధతులు కూడా పాటిస్తారు. వేపమండలతో విసరడం అందులో ఒకటి. ఇదికాక ఖమ్మం జిల్లాలో రాయలోరి టీకాలు అని టీకా వేయడం ఉంటుంది. ఖమ్మం పట్టణానికి దగ్గరలో ఉన్న ముదిగొండ గ్రామంలో రాయల వారు అనే కుటుంబాలు వారు ఉంటారు. వారిని ఆ వ్యాధి సోకిన గ్రామ ప్రజలు పిలిపిస్తారు. వారు వచ్చి టీకాలు తయారు చేసి గ్రామంలోని ప్రజలందరికీ టీకా వేస్తారు. స్ఫోటకం వచ్చిన వ్యక్తి దగ్గరికి పోయి స్ఫోటకపు కుండలు (ముత్యాలలాగా కందిగింజ పరిమాణంలో కనిపించే దద్దు) నుండి దానిలోని రసం తీసి చిన్న సీసాలో వేసుకొని వస్తారు. అలా వారు వెళ్ళే ముందు అమ్మవారికి పూజ చేసి వెళతారు. అలా వెళ్ళడం కూడా చాలా ప్రమాదమని అందరూ అంటారు. కాని వారు వెళ్ళి అలా తెచ్చిన ఆ ద్రవాన్నే అమ్మవారుగా భావించి వ్యాధి సోకని వారికి టీకాగా వేస్తారు. ఎడమచేతి మణికట్టువద్ద సూదులతో గుచ్చుతారు. పది పదిహేను సూదులను ఒక కట్టగా కట్టి వాటిని ఈ తెచ్చిన ద్రవంలో ముంచి ఆ సూదులతో మణికట్టు వద్ద ఐదారుసార్లు గుచ్చుతారు. దీనితో 


ఆ ద్రవం మనిషి రక్తంలోనికి పోతుంది. ఇది నేటి వ్యాక్సిన్ లాగా పనిచేసి మనిషి శరీరంలోని రక్షక శక్తులు ఏంటీబాడీస్‌ తయారై బయటినుండి వ్యాధిరాకుండా చేస్తాయి. ఇవాళ కరోనా చికిత్సలో వ్యాధి తగ్గి కోలుకున్న వ్యక్తి రక్తంలోనుండి ప్లాస్మాను వేరు చేసి వ్యాధి తగ్గించడానికి మందుగా చికిత్సకు ఇవ్వవచ్చు అని పరిశోధనలో తేల్చారు. ఇక్కడ చెప్పిన టీకా పద్ధతి ఇలాంటిదే. నేడు ఈ మశూచి లేదా స్ఫోటకం వ్యాధి అంతరించింది. 


ఈ వ్యాసకర్త ఎనిమిది సంవత్సరాల వయస్సు ఉన్నప్పుడు (1966 కావచ్చు) ఖమ్మంజిల్లా మర్లపాడు గ్రామంలో మశూచి వచ్చి సుమారు పన్నెండు మంది చనిపోయారు. ఆసందర్భంలో రాయలవారు కుటుంబం వారు వచ్చి టీకాలు వేశారు. ఈ టీకా గుర్తు ఆ ఊరి వారి ఎడమచేయి మణికట్టుమీద నేటికీ కనిపిస్తాయి. అప్పటి జాతర కూడా ఏడు రోజులు సాగింది. ఈ రాయల వారి కుటుంబాలు నేటికీ ఖమ్మం దగ్గరి ముదిగొండలో ఉన్నారు. ఖమ్మం పట్టణంలోని ప్రముఖ కవి రావెల వెంకటరావుగారు ఆనాటి స్వాతంత్ర్య సమర యోధుడు ఈ రాయలోరి కుటుంబానికి చెందినవాడే. వీరు గత ఏడాది కాలంచేశారు. 


గత మూడున్నర దశాబ్దాలుగా పైన చెప్పిన జాతరల వంటి జాతరలు, కొలుపులను నా పరిశోధనలను పురస్కరించుకుని చాలా గ్రామాలలో చూశాను. ఈ జాతరలు లేదా కొలుపులలో చాలా శాస్త్రీయమైన పద్ధతులు కనిపిస్తున్నాయి. ఊరకట్టడిలో ఒకసారి పొలిమేర కట్టు అయిన తర్వాత బయటనుండి లోనికికాని లోపలి నుండి బయటికి కానీ రావడానికి వీలు లేదు. ఇది పూర్తిగా శాస్త్రీయమైన క్వారంటైన్ పద్ధతే. ఆ గ్రామంలోని వ్యాధి బయటి గ్రామాలకు సోకకుండా తీసుకునే చర్య ఇది. కొలుపులు జరిగిన ప్రతిసారీ ఈ పద్ధతి ఉంటుంది. మాములుగా వ్యాధులు లేని కాలంలో కూడా, ముఖ్యంగా ఆషాఢమాసంలో కొలుపులు చేస్తారు. కొలుపు ద్వారా వచ్చే పవిత్రతా గుణం బయటికి పోకుండా ఆపుతారు. అలాగే బయటి వారు అశుచిగా ఉంటారని ఆ అశుచి తమ గ్రామంలోనికి రాకూడదు అని దీనిలోని భావన. ఊరకట్టడి నేటికీ చాలా కచ్చితంగా పాటిస్తున్నారు కొలుపులు చేసే గ్రామాల వారు. ఊరకట్టడి, పొలిమేరకట్టడి సంప్రదాయాలలో నేడు మనం పాటిస్తున్న శాస్త్రీయమైన లాక్‌డౌన్ పద్ధతి, ఒక గ్రామం తనకు తానే క్వారంటైన్ చేసుకోవడం మనకు కనిపిస్తుంది. ఈ జానపద నమ్మకాల వ్యవస్థలో పూజలతోనే ఆగి పోవడం కాకుండా వ్యాధి నివారణకు ఫలితాలనిచ్చే చికిత్సావిధానం కూడా మనకు కనిపిస్తుంది. ఈ బలమైన సంప్రదాయాలు మన వద్ద ఉన్న కారణంగానే కరోనా వ్యాధి గురించి మాట్లాడే సందర్భంలో భారత దేశానికి ఇలాంటి వ్యాధులను ఎదుర్కొనే అనుభవం ఎంతోకాలంగా ఉందని బయటి దేశాల వారు వ్యాఖ్యానించారు. ఈ విషయంలో తెలుగు వారి సంప్రదాయాలు, దక్షిణ భారత జానపద సంప్రదాయాలు పైన చెప్పిన రీతిని గమనిస్తే ఈ కొలుపులు, అమ్మతల్లుల ఆరాధనలో నమ్మకాలతో పాటు శాస్త్రీయతను కూడా అర్థం చేసుకోవచ్చు.

ప్రొఫెసర్ పులికొండ సుబ్బాచారి

Updated Date - 2020-04-12T05:36:49+05:30 IST