నీకన్నా బలవంతుడేం కాదు!

ABN , First Publish Date - 2020-05-09T06:28:42+05:30 IST

పొగమంచు కప్పిన ఉదయపుటంచుల మీద నిటారుగా నిలబడే సూరీడు ఈ రోజెందుకో.. అసహనంగా దులుతున్నాడు.

నీకన్నా బలవంతుడేం కాదు!

పొగమంచు కప్పిన

ఉదయపుటంచుల మీద

నిటారుగా నిలబడే సూరీడు

ఈ రోజెందుకో..

అసహనంగా కదులుతున్నాడు.


పరాయిదేశం నుంచి వచ్చిన రోదనేదో...

నాదేశపు మధురవనాలపై వచ్చివాలింది.

నా ఏకాంతపురంలోకి ప్రవేశించి

మృత్యుగీతికలు పాడింది!


సముద్రాల కొద్దీ

సుగంధాలను వెదజల్లాను

టన్నుల కొద్దీ పుప్పొడి రసాయనాలను

నా నగరం నుదుటన అద్దాను


శత్రువు వెనకడుగు వేయటం

నేను విన్నాను!

కనిపించని ఆ శత్రువుతో..

అప్రకటిత యుద్ధం,

కళ్ళు మూసుకొని

ఖడ్గచాలనం చేయటమొక్కటే

తప్పనిసరి మంత్రం!


నిద్రకి, మెలకువకి మధ్య

పరుచుకున్న ఏకాంతంలో..

కన్రెప్పల చాటున..

ఘనీభవించిన స్వప్న చలనాలు

ఎక్కడో చోట నీకు ఎదురయినవే...


గుర్తు పట్టాలంటే...!

శబ్దంలోకి హఠాత్తుగా

ప్రవేశించిన శత్రువే..

ఈనాటి ఈ నిశ్శబ్దం...

నడిరోడ్డులో.. నాల్గు రోడ్లకూడలిలో

నీ కౌగిలి కోసం

నగ్నంగా ఎదురు చూస్తోంది...


ఆదాటున.. అడుగుమందుకేసావా..

శత్రువు ఎత్తుగడ పారినట్టే...!

నువ్వు నిలబడ్డ చోటే

భూమిలోకి పాతుకుపో...

కళ్ళు మూసుకొని ఖడ్గ చాలనం చెయ్‌!


నువ్వు కిరీటం దించి కదిలావా..

యుద్ధం చేసే సైనికులెవ్వరూ లేరిక్కడ...

నీ చేకత్తి కొసల నుంచి

ఆ శత్రువుని నిమజ్జనం చేసేయ్‌

ఓ రోజు అటూ.. ఇటూ..

వేళ్ళతో సహ.. పెకలించుకుని 

నువ్వు బయటకొచ్చేస్తావ్‌..


శత్రువు నీ కన్నా..

బలవంతుడేం కాదు!

స్వప్నసన్నిధిలో..

శాంతి సాధం.. నిర్మిదాం!



– పి.వి. రామశేషు 

Updated Date - 2020-05-09T06:28:42+05:30 IST