నేటి చీకటికి పునాది వేసిన పి.వి

ABN , First Publish Date - 2020-07-10T05:58:34+05:30 IST

పీవీ హయాంలోనే హిందూ మతతత్వ రాజకీయాల ఉత్థానం ప్రారంభమయింది. స్వల్పకాలంలోనే అది వేగవంతమయింది. మత పరంగా హిందువులను సంఘటితం చేసేందుకు విద్వేషాన్ని....

నేటి చీకటికి పునాది వేసిన పి.వి

పీవీ హయాంలోనే హిందూ మతతత్వ రాజకీయాల ఉత్థానం ప్రారంభమయింది. స్వల్పకాలంలోనే అది వేగవంతమయింది. మత పరంగా హిందువులను సంఘటితం చేసేందుకు విద్వేషాన్ని రెచ్చగొట్టడం, హింసను ఉపయోగించడం సాధారణమైపోయింది. ఇదే, నేటి నరేంద్ర మోదీ, యోగి ఆదిత్యనాథ్‌ల యుగానికి దారితీసింది. రాజకీయ ప్రయోజనాలకు తన సొంత అనైతిక  ఎత్తుగడలను అనుసరిస్తున్న అమిత్ షాను ఇప్పుడు చాణక్యుడని పిలుస్తున్నారు. ఇవన్నీ పీవీ వైఫల్య ఫలితాలే.


దోపిడీ, వలసవాదం, వివక్షలు వారసత్వాలుగా వదిలివెళ్ళిన వ్యక్తులను ఇంకా గౌరవించడమేమిటి? ఆ అన్యాయాలకు బాధితులైన వారే కాదు, మానవతా దృక్పథంతో ఆలోచించే ఆధిపత్య వర్గాల వారు కూడా ఆ ప్రశ్న వేసుకుంటున్నారు. నల్లజాతి ప్రజలకు జరిగిన, జరుగుతున్న అన్యాయాల విషయమై నిష్పాక్షికంగా ఆలోచించేలా బ్లాక్ లైవ్స్ మ్యాటర్ ఉద్యమం శ్వేతజాతి వ్యక్తులను ప్రభావితం చేస్తోంది. తత్ఫలితమే అమెరికా, బ్రిటన్, ఇంకా ఇతర యూరోపియన్ దేశాలలో బానిస వ్యాపారుల, వలసల స్థాపకుల విగ్రహాల కూల్చివేత. ఈ కొత్త చైతన్యం, మహాత్మా గాంధీ సైతం తన దక్షిణాఫ్రికా జీవితంలో జాత్యహంకార ధోరణులను ప్రదర్శించారని నిశితంగా ఎత్తిచూపుతోంది! 


కొంతమంది నాయకులు వదిలివెళ్ళిన వారసత్వం హరించుకుపోయిందన్న వాస్తవాన్ని ఉపేక్షించి వారికి వైభవోపేతమైన స్మారక చిహ్నాలు నిర్మించడం వర్తమాన భారతంలో ఒక ప్రబల ధోరణిగా ఉన్నది. కులపరమైన ఆధిక్యతలే వారికి ఆ ప్రాధాన్యాన్ని సంతరిస్తున్నాయి. కులతత్వ దోపిడీ భయానకంగా ఉన్నదనే వాస్తవాన్ని అగ్రకుల హిందువులు ససేమిరా అంగీకరించరు. తమకు కుటుంబపరంగా, సామాజికంగా లభించిన ఉన్నత హోదాలు, ప్రత్యేక ప్రయోజనాలు ఇతరుల శ్రేయస్సుకు అవరోధంగా ఉన్నాయన్న వాస్తవం పట్ల వారిలో కించిత్ అపరాధ భావం కూడా పొడచూపదు. ఈ నైతిక శూన్యత, సహానుభూతి లేకపోవడమనేది కుల తర్కంలో భాగమే. కనుకనే సామాజిక దౌష్ట్యాలను, ఆర్థిక అసమానతలను మరింతగా పెచ్చరిల్లేలా చేస్తున్న చారిత్రక వారసత్వాలకు ఉజ్వల స్మారక చిహ్నాలను నిర్మిస్తున్నారు. 


2021 సంవత్సరం, పీవీగా సుప్రసిద్ధుడైన పాములపర్తి వెంకట నరసింహారావు శత జయంత్యుత్సవ సంవత్సరం. తెలుగు బిడ్డ, తమ గడ్డపై జన్మించిన ఈ దివంగత ప్రధానమంత్రి శత జయంత్యుత్సవాలను ఏడాది పొడుగునా ఘనంగా నిర్వహించేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పూనుకున్నది. ఆర్థిక సరళీకృత విధానాలకు పితామహుడైన పీవీని, సోనియా గాంధీ నేతృత్వంలోని కాంగ్రెస్ పార్టీ ఘోరంగా అవమానించిందని, ఆయన చారిత్రక ప్రాధాన్యాన్ని తగ్గించి వేసేందుకు ప్రయత్నించిందని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు, దివంగత ప్రధాని మద్దతుదారులు అనేకమంది ఆరోపిస్తున్నారు. తెలంగాణకు గర్వకారకుడైన మహోన్నత నాయకుడుగా పీవీ యశోగానానికి తెలంగాణ రాష్ట్ర సమితి ప్రభుత్వం ఉపక్రమించడం ఆశ్చర్యకరమేమీ కాదు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు మనుగడ పోరులో ఉన్నది. ఆ పార్టీని మరింతగా దుస్థితి పాలు జేయడానికి పీవీ శతజయంత్యుత్సవాలను కేసీఆర్ తప్పక ఉపయోగించుకుంటారు. జాతీయ రాజకీయాలలో నిర్ణయాత్మక పాత్ర వహించాలని కేసీఆర్ ఆశించారు. అయితే ఆయన కోరిక నెరవేరలేదు. తెలంగాణలో ప్రగతిశీల రాజకీయ ధోరణులకు తావు లేకుండా చేసి భూస్వామిక బ్రాహ్మణీయ సంస్కృతిని పునః స్థాపించేందుకు కేసీఆర్ ప్రయత్నిస్తున్నారు. ఆలయాల పునరుద్ధరణ, మహా యజ్ఞాల నిర్వహణ బ్రాహ్మణ సామాజికులను సంతృప్తిపరుస్తున్నాయి. తన సామాజిక వర్గానికి చెందిన మధ్యయుగాల రాజుగా కేసీఆర్ తనను తాను భావించుకుంటున్నారు. ప్రసిద్ధ కోవెలలలోని వేల్పులకు బంగారు ఆభరణాలు సమర్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వ ఖజానా నుంచి కోట్లాది రూపాయలు వ్యయపరుస్తున్నారు. ముఖ్యమంత్రిగా న్యూఢిల్లీ కంటే చిన్న జీయర్ స్వామి ఆశ్రమానికే ఆయన ఎక్కువ సార్లు వెళ్ళారు మరి. పీవీ పట్ల ఆయన చూపుతున్న విశేష గౌరవాదరాలు బ్రాహ్మణుల మద్దతు పొందేందుకు, తమ ప్రభుత్వ వైఫల్యాలనుంచి ప్రజల దృష్టిని మరల్చేందుకే. 


పీవీ నరసింహరావు బ్రాహ్మణ నేపథ్యం నుంచి ప్రభవించారు. హైదరాబాద్ సంస్థానంలో అసఫ్ జాహి నవాబుల పాలనను సుస్థిరపరచడంలో ఈ సామాజిక వర్గం కీలక పాత్ర వహించింది. సంప్రదాయకంగా హిందూ సమాజంలో విద్యా వ్యాసంగాలకు అంకితమైన ఏకైక సామాజిక వర్గమైన బ్రాహ్మణులు తెలంగాణలో ఆలయ పూజారులుగాను, భూ రికార్డుల సంరక్షకులుగాను ద్వంద్వ బాధ్యతలు నిర్వహించారు. రెండో బాధ్యత నిర్వహణలో వారు భూస్వాములుగా కూడా విలసిల్లారు. ఈ నేపథ్యానికి తోడుగా, వివిధ భాషల్లో ప్రావీణ్యం, మేధో కౌశలాలు అపారంగా ఉన్న పీవీ జన్మతః ఒక రాజకీయ వేత్త. రాష్ట్ర రాజకీయాలలో రెడ్లు, వెలమల ప్రాబల్యాన్ని అంగీకరిస్తూనే ఆయన తనదైన రీతిలో రాజకీయాలలో నిలదొక్కుకున్నారు. కాంగ్రెస్ పార్టీ అధినేత్రి ఇందిరాగాంధీ సన్నిహితులలో ఒకరుగా వెలుగొందారు. సామాజిక నేపథ్యం పరపతిగా పీవీ ఈ ఉన్నతిని సాధించుకోగలిగారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యారు. కేంద్రంలో పలు మంత్రిత్వ శాఖలను సమర్థంగా నిర్వహించారు. పార్టీ అగ్రనేతలలో ఒకరయ్యారు. రాజీవ్ గాంధీ హత్యానంతరం పార్టీలోని అన్ని వర్గాల మద్దతుతో తొలుత కాంగ్రెస్ అధ్యక్షుడుగాను, ఆ తరువాత ప్రధానమంత్రిగాను ఆయన ఏకగ్రీవంగా ఎంపికయ్యారు.


భారత్ అత్యంత అనిశ్చిత పరిస్థితులను ఎదుర్కొంటున్న తరుణంలో ప్రధానమంత్రి పదవీ బాధ్యతలను పీవీ చేపట్టారు. ఒక పక్క ఆర్థిక సంక్షోభం, మరొక పక్క సామాజిక సంక్షోభం దేశ ప్రజలను వేధిస్తున్న సందర్భమది. విదేశీ చెల్లింపులు, మండల్ వ్యతిరేక ఆందోళనలు దేశాన్ని అతలాకుతలం చేస్తున్నాయి. పార్లమెంటులో కాంగ్రెస్ పార్టీకి మెజారిటీ లేదు. పార్టీలో పీవీ నాయకత్వానికి అనేకానేక సవాళ్లు. ఈ పరిస్థితుల్లో ఆయన ఐదేళ్ళూ ప్రధానమంత్రి పదవిలో కొనసాగగలరని భావించిన వారు ఎంతో మంది లేరు. ఈ సంక్లిష్ట పరిస్థితిని అధిగమించి తన పదవిని కాపాడుకునేందుకు పీవీ ఏమి చేశారన్నదే ఆయన అసలైన వారసత్వం. ఆయన అనుసరించిన అనైతిక వ్యూహాలు భారత రాజకీయాలను శాశ్వతంగా మార్చివేశాయి. ఆయనకు అపర చాణక్యుడనే ప్రసిద్ధిని సాధించాయి.


1990లో మండల్ వ్యతిరేక ఆందోళనతో అగ్రవర్ణాల భారతం భగ్గుమన్నది. నగరాలు, పట్టణాలలో అగ్రకులాల యువతీయువకులు వీధులకెక్కి విద్యా ఉద్యోగరంగాలలో రిజర్వేషన్లను నిరసించారు. క్రోధం, ద్వేషంతో రగిలిపోయారు. అణగారినవర్గాలు, వెనుకబడిన కులాల వారికి విద్యా ఉద్యోగ రంగాలలో ప్రత్యేక అవకాశాలు కల్పించే జాతీయ పథకానికి వ్యతిరేకంగా మండల్ వ్యతిరేక ఆందోళన ‘అగ్రకులాల వారి తొలి తిరుగుబాటు’ అని ప్రముఖ ఆర్థిక వేత్త జీన్ డ్రెజె అభివర్ణించారు. అంతేకాదు, పట్టణ, గ్రామీణ ప్రాంతాలలో హిందూత్వ మితవాదులు తమ పునాదిని విస్తరించుకునేందుకు ఆ ఆందోళన ఒక అవకాశాన్ని సమకూర్చింది. 


పీవీ, హిందుత్వ భావజాల మద్దతుదారు కాదు. అయితే హిందుత్వ పట్ల ఆయనకు సానుభూతి వున్నది. భూస్వామ్య బ్రాహ్మణ నేపథ్యం, నిజాం వ్యతిరేక ఉద్యమాలలో స్వీయ రాజకీయ ప్రస్థానం నుంచి ఆయనలో ఆ సానుభూతి ఉద్భవించింది. కరసేవకు అనుమతించడం ద్వారా అధిక సంఖ్యాకుల మతతత్వం ఒక ఆమోదయోగ్యమైన రాజకీయ సమీకరణ పద్ధతిగా రూపొందే వీలు కల్పించారు. భారతీయ జనతా పార్టీ పురోగతికీ తోడ్పడ్డారు. పర్యవసానమే 1992లో బాబ్రీ మసీదు కూల్చివేత. బాబ్రీ మసీదును స్వాధీనం చేసుకునేందుకు, మతతత్వ మూకలను అదుపు చేసేందుకు సైనిక బలగాలను ఉపయోగించే అధికారాలు ఉన్నప్పటికీ పీవీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం అయోధ్య ఉద్రిక్త పరిణామాలలో ప్రేక్షక పాత్రకే పరిమితమయింది. దరిమిలా మతోన్మాద హింసాకాండ ప్రజ్వరిల్లింది. వేలాది అమాయకులు బలయ్యారు. 


పీవీ హయాంలోనే హిందూ మతతత్వ రాజకీయాల ఉత్థానం ప్రారంభమయింది. స్వల్పకాలంలోనే అది వేగవంతమయింది. మత పరంగా హిందువులను సంఘటితం చేసేందుకు విద్వేషాన్ని రెచ్చగొట్టడం, హింసను ఉపయోగించడం సాధారణమైపోయింది. ఇదే, నేటి నరేంద్ర మోదీ, యోగి ఆదిత్యనాథ్‌ల యుగానికి దారితీసింది. రాజకీయ ప్రయోజనాలకు తన సొంత అనైతిక ఎత్తుగడలను అనుసరిస్తున్న అమిత్ షాను ఇప్పుడు చాణక్యుడని పిలుస్తున్నారు. ఇవన్నీ పీవీ వైఫల్య ఫలితాలే. భారతదేశ ప్రజాస్వామ్యం ముప్పులో పడడమే పీవీ చారిత్రక వారసత్వం. 


1991 అనంతరం రాజకీయ, కార్పొరేట్ అవినీతి ఇతోథికంగా పెరిగిపోవడమే కాదు, రాజకీయ అధికారాన్ని, సిరిసంపదలను సమకూర్చుకునేందుకు అదొక ఆమోదయోగ్యమైన మార్గంగా రూపొందింది. 1992లో హర్షద్ మెహతా అప్రతిష్ఠాకర స్టాక్ మార్కెట్ కుంభకోణం భారత్‌లో ఆర్థిక అవినీతికి ఆరంభం. కేంద్ర మాజీ మంత్రి సుఖ్ రామ్ ప్రధాన దోషిగా ఉన్న టెలికాం కుంభకోణం అవినీతి భారతంలో మరొక మైలురాయి. పీవీ ఆధ్యాత్మిక సలహాదారు చంద్రస్వామికి పలు కుంభకోణాలలో సంబంధమున్నది. రాజీవ్ గాంధీ హత్యలో కూడా చంద్రస్వామి ప్రమేయమున్నదని జైన్ కమిషన్ నివేదిక ఆరోపించడం గమనార్హం. పార్లమెంటులో తన ప్రభుత్వ మెజారిటీని నిరూపించేందుకు పీవీ అక్రమ మార్గాలను అనుసరించారు. ఇతర పార్టీలకు చెందిన ఎంపీలను ఆర్థిక ప్రలోభాలతో కాంగ్రెస్‌కు సానుకూలం చేశారు. ఈ క్రమంలో ప్రజాస్వామ్య విలువలు, సంప్రదాయాలను బలహీపరిచారు. అయినప్పటికీ మీడియా చాణక్యుడులాంటి మహా వ్యూహకర్త అని పీవీని ప్రశంసించింది. 


సరళీకృత ఆర్థిక విధానాలు ప్రైవేటీకరణకు బాటలు వేశాయి. ఇది రాజ్యవ్యవస్థ నైతిక ఆదర్శాన్ని కూడా మార్చివేసింది. చట్టబద్ధ పాలన, సామాజికన్యాయం, ప్రజా సంక్షేమానికి పూచీదారుగా ఉండాల్సిన రాజ్యవ్యవస్థ కార్పొరేట్ సంస్థల ప్రయోజనాలకు దోహదకారిగా పరిణమించింది! ఈ మౌలిక మార్పులు పైకి ప్రపంచ బ్యాంకు, ఐఎమ్ఎఫ్ విధించినవిగా కన్పించడం కద్దు. అయితే వాస్తవానికి అవి, రాజ్యవ్యవస్థ వనరులు, జాతీయ సంపదలో న్యాయబద్ధమైన వాటాను కోరుకొంటున్న పేదల హక్కులు, ఆరాటాలను బలహీనపరిచేందుకు పాలక వర్గాలు అనుసరించిన ఒక తెలివైన వ్యూహం. ప్రభుత్వరంగ సంస్థల నుంచి పెట్టుబడుల ఉపసంహరణ, పాలనా కార్యకలాపాలను అవుట్ సోర్సింగ్‌కు ఇవ్వడం, ప్రభుత్వ ఆస్తుల విక్రయమే పీవీ నేతృత్వంలోని రాజ్యవ్యవస్థ దార్శనికత అయింది. వాటి పైనే రాజ్యవ్యవస్థ తన దృష్టిని కేంద్రీకరించింది. ప్రపంచ బ్యాంకు రుణాల సాకుతో భారత రాజ్యవ్యవస్థ సొంత సామాజిక న్యాయ ఎజెండాను నిర్వీర్యం చేసింది. వివిధ ప్రభుత్వ సంస్థలకు చరమ గీతం పాడడం ద్వారా క్రింది కులాల వారి అభ్యున్నతికి అవరోధాలు కల్పించింది. ప్రభుత్వ వ్యవస్థను కుదించి, పెట్టుబడిదారుల పాత్రను ఇతోధికంగా పెంపొందించడమే లక్ష్యంగా ప్రైవేటీకరణను అమలుపరిచారు. పెట్టుబడిదారులకు ఎటువంటి సామాజిక బాధ్యతలు నిర్దేశించలేదు. అంతకంతకు విస్తరిస్తున్న కార్పొరేట్ రంగంలో అణగారిన కులాల వారికి ఎటువంటి అవకాశాలు, హక్కులు లేకుండా చేశారు. వామపక్షాలు తొలుత సరళీకృత ఆర్థిక విధానాలను తీవ్రంగా వ్యతిరేకించాయి. క్రమేణా అవి తమ వ్యతిరేకతను విడనాడాయి. ఇప్పుడు పాలనలో భాగంగా ప్రైవేటీకరణను ప్రధాన స్రవంతి పార్టీలన్నీ అంగీకరిస్తున్నాయి. ఎలాంటి ప్రత్యామ్నాయ దార్శినికతను అవి ప్రజలకు ప్రతిపాదించడం లేదు. 


స్వతంత్ర భారత దేశ రాజ్య వ్యవస్థ సంస్థాగత పునాదులను పీవీ సరికొత్తగా పునర్నిర్మించారు. దీని పర్యవసానాలు వెనుకబడిన వర్గాల వారికి ముఖ్యంగా దళితులు, ముస్లింలకు అత్యంత హానికరంగా పరిణమించాయి. ఇప్పుడు వారు ప్రతిరోజూ హిందూత్వ మితవాదుల దాడులకు గురవుతున్నారు. సుదీర్ఘకాలంలో, 2021 అనంతరం, భవిష్యత్తు పీవీని ఒక చాణక్యుడుగా కాక, దేశాన్ని సామాజికన్యాయానికి ఎడంగా, ఫాసిజానికి దగ్గరగా తీసుకువెళ్లిన నాయకుడిగా గుర్తుంచుకుంటుంది.


-చిన్నయ్య జంగం

కేర్ల్‌టన్ యూనివర్శిటీ, కెనడా వ్యాసకర్త ‘దళిత్స్ అండ్ ది మేకింగ్ ఆఫ్ మోడరన్ ఇండియా’ (2017) గ్రంథ రచయిత 

(ది వైర్)

Updated Date - 2020-07-10T05:58:34+05:30 IST