రాజ్యాంగానికి కళంకం

ABN , First Publish Date - 2020-04-18T06:16:24+05:30 IST

భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేడ్కర్ 129వ జయంతి రోజున ప్రొఫెసర్ ఆనంద్ తెల్తుంబ్డె, గౌతమ్ నవలఖాల అరెస్ట్ ఆ రాజ్యాంగానికే కళంకం. ఆ ఇరువురిని అరెస్ట్ చేయడం, ఈ దేశ పౌరులకు ఆ రాజ్యాంగం ప్రసాదించిన ప్రాథమిక...

రాజ్యాంగానికి కళంకం

భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేడ్కర్ 129వ జయంతి రోజున ప్రొఫెసర్ ఆనంద్ తెల్తుంబ్డె, గౌతమ్ నవలఖాల అరెస్ట్ ఆ రాజ్యాంగానికే కళంకం. ఆ ఇరువురిని అరెస్ట్ చేయడం, ఈ దేశ పౌరులకు ఆ రాజ్యాంగం ప్రసాదించిన ప్రాథమిక హక్కులను ఉల్లంఘించడమేననడంలో సందేహం లేదు. నిరాధార ఆరోపణలతో ఉపా చట్టం కింద ఆనంద్ తెల్తుంబ్డె, గౌతమ్ నవలఖాలను అరెస్ట్ చేశారు.


ఆనంద్ తెల్తుంబ్డె ఈ దేశ ప్రజా మేధావులలో అగ్రగణ్యులు. దళితులకు సమానహక్కుల సాధనకు సాగుతున్న పోరాటంలో అగ్రగామిగా వున్నారు. ‘ఎనిహిలేషన్‌ ఆఫ్ కేస్ట్’తో సహా ఆయన పలు పుస్తకాలను రాశారు. ఆనంద్ ప్రస్తుతం గోవా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్‌లో ప్రొఫెసర్‌గా వున్నారు. ఖర్గపూర్ ఐఐటి మొదలైన ఉన్నత విద్యా సంస్థలలో ఆయన ప్రతిష్ఠాత్మక బాధ్యతలు నిర్వహించారు. పెట్రోనెట్ ఇండియాకు మేనేజింగ్ డైరెక్టర్‌గా కూడా ఆయన వున్నారు. బాబాసాహెబ్ అంబేడ్కర్ మనవరాలు రమ ఆయన సతీమణి.


గౌతమ్ నవలఖా ప్రముఖ పాత్రికేయుడు. పీపుల్స్ యూనియన్ ఆఫ్ డెమోక్రాటిక్ రైట్స్‌లో క్రియాశీల సభ్యుడు. కశ్మీర్, ఛత్తీస్‌గఢ్‌లలో మానవహక్కుల పరిరక్షణ ఉద్యమాలలో చురుగ్గా పాల్గొన్న మేధావి. సమకాలీన భారత దేశపు ప్రతిష్ఠాత్మక జర్నల్ ‘ఎకనామిక్ అండ్ పొలిటికల్ వీక్లీ’లో ఆయన వ్యాసాలు తరచు వెలువడుతుంటాయి.

ఈ మేధావులను అరెస్ట్ చేయడమంటే భారతదేశపు అణగారిన వర్గాల వారి వాణిని అణచివేయడమే. ఈ అరెస్ట్‌లు అంతకకంతకూ పెరుగుతున్న ప్రభుత్వ అణచివేత విధానాలకు, దేశ పౌరుల ప్రాథమిక హక్కులను కాపాడడంలో సుప్రీం కోర్టు వైఫల్యానికి తార్కాణాలు. ఈ ప్రజా మేధావుల అరెస్ట్‌లను 1980 దశకపు ఉస్మానియా విశ్వవిద్యాలయపు విద్యార్థుల సంస్థ అయిన ‘ది ఫోరమ్ ఫర్ సోషల్ ఛేంజ్’ తీవ్రంగా ఖండిస్తోంది. వారిరువురిపై మోపిన తప్పుడు కేసులను ఉపసంహరించుకోవాలని, ఇరువురినీ తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేస్తోంది. కరోనా కల్లోలం కారణంగా దేశవ్యాప్త లాక్‌డౌన్ అమలులో ఉన్న సమయంలో ఈ మేధావులను అరెస్ట్ చేయడం చాలా క్రూరమైన, హేయమైన చర్య. ప్రజాస్వామ్య, లౌకిక, ఉదారవాద ఆలోచనాపరులు, జన హితులు ముక్తకంఠంతో ఆనంద్, గౌతమ్‌ల అరెస్ట్‌లను ఖండించి, వారి తక్షణ విడుదలకు డిమాండ్ చేయాలి. కరోనా వైరస్ ప్రబలుతున్నందున ఆరోగ్య కారణాల రీత్యా జైళ్ళలోని రాజకీయ ఖైదీలనందరినీ విడుదల చేయాలని కూడా మేము డిమాండ్ చేస్తున్నాము.


-అల్లం నారాయణ, రమణి, భూమన్, సాంబమూర్తి ఎమ్, డాక్టర్ గోపీనాథ్, ఆర్. వెంకటరెడ్డి, ప్రభాకర్ కుందుర్తి, ఎస్.ఆశాలత, నల్లపు ప్రహ్లాద్, ఎస్.వెంకటేశ్వర రెడ్డి, రమణ మారంరాజు, అజయ్ కుమార్ వేములపాటి, ఎమ్ ఏ శ్రీనివాసన్, ప్రతిమ సుధ, వెంకటేశ్వరరావు పి.వి, 

సుధ గోపరాజు, కొండారెడ్డి బన్నూరి, సామ మల్లారెడ్డి, నరసన్న కొప్పుల, కె ఎస్ రామకృష్ణ, కె.విజయరాజు, వి.సుబ్రహ్మణ్యం, డాక్టర్ జి.గంగాధర్, జిఎన్ బిఎమ్ పట్నాయక్, భాస్కర్ గొట్టుముక్కల, గోలి ఏడుకొండలు, కృష్ణ గోరెంక, దేవెళ్ళ సమ్మయ్య, ప్రభాకర్ కాసం, ప్రొఫెసర్ మహ్మూద్, జిట్టా బాల్ రెడ్డి, కవ్వా లక్ష్మారెడ్డి, రాఘవేందర్ రెడ్డి, బి.సాయిరెడ్డి, ఎమ్.సంజీవరావు మదన్ మోహన్ రెడ్డి, జయ వింద్యాల.

Updated Date - 2020-04-18T06:16:24+05:30 IST