ఇంటికొక ఉద్యోగమన్నారు, ఏదీ?

ABN , First Publish Date - 2020-06-04T06:10:20+05:30 IST

తెలంగాణ ఉద్యమ నినాదమే ‘‘నీళ్లు, నిధులు, నియామకాలు’’. మరి ఈ ఆరు సంవత్సరాల పాలనలో ఎన్ని ఉద్యోగాలు భర్తీ చేస్తామన్నారు, ఎన్ని భర్తీ చేశారు? తెలంగాణ ఉద్యమంలో యువత, విద్యార్థి లోకం ఉవ్వెత్తున ఎగిసిపడడానికి ప్రధాన కారణం ఉద్యోగాలే...

ఇంటికొక ఉద్యోగమన్నారు, ఏదీ?

ప్రజాస్వామ్య వ్యవస్థలో ఉద్యోగాల భర్తీని ఉపాధి కోణంలో చూడరాదు. పటిష్టమైన, సమర్థవంతమైన ప్రభుత్వ యంత్రాంగం ఉన్నప్పుడే అభివృద్ధి, సంక్షేమ పథకాలు అట్టడుగు ప్రజలకు చేరుతాయి. ప్రభుత్వ యంత్రాంగం సరిగ్గా లేనప్పుడు నిధుల దుర్వినియోగం జరుగుతుంది. ప్రజా పనులలో తీవ్ర జాప్యం జరుగుతుంది. ప్రత్యక్షంగా పరోక్షంగా దీని ప్రభావం సమాజ ప్రగతి, పురోగతిపై ఉంటుంది.


తెలంగాణ ఉద్యమ నినాదమే ‘‘నీళ్లు, నిధులు, నియామకాలు’’. మరి ఈ ఆరు సంవత్సరాల పాలనలో ఎన్ని ఉద్యోగాలు భర్తీ చేస్తామన్నారు, ఎన్ని భర్తీ చేశారు? తెలంగాణ ఉద్యమంలో యువత, విద్యార్థి లోకం ఉవ్వెత్తున ఎగిసిపడడానికి ప్రధాన కారణం ఉద్యోగాలే. తెలంగాణ వస్తే నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు కల్పిస్తారని ఆశించారు. అందుకే తెగించి 1200మంది ఆత్మబలిదానాలు చేసుకున్నారు. కానీ ఆరు సంవత్సరాల తెలంగాణ పాలనలో కొత్త ఉద్యోగాల సృష్టి జరగలేదు. కనీసం రిటైర్మెంటు వల్ల ఏర్పడ్డ ఖాళీని కూడా భర్తీ చేయడం లేదు.


 తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ఉద్యోగాల భర్తీపట్ల వ్యతిరేకత ఉండటం వాంఛనీయం కాదు. తెలంగాణ ఉద్యమ సందర్భంగా కేసీఆర్ ప్రతి బహిరంగ సభలో తెలంగాణ వచ్చిన తరువాత ఇంటికొక ఉద్యోగం ఇస్తామని ప్రచారం చేశారు. కానీ తెలంగాణ వచ్చిన తర్వాత ఊరికొక ఉద్యోగం కూడా ఇవ్వలేదు. ఊరికొక ఉద్యోగం ఏ ప్రభుత్వానికైనా సాధ్యం కాకపోవచ్చు కానీ కనీసం రిటైర్మెంట్ వల్ల ఏర్పడ్డ ఖాళీని భర్తీ చేయడానికి అవరోధాలు ఏమిటి? అభ్యంతరాలు ఏమిటనే ప్రశ్నకు జవాబు చెప్పవలసిన అవసరం ఉంది.


తెలంగాణ వచ్చిన తర్వాత మొదటి అసెంబ్లీ సమావేశంలో ఎన్ని ఉద్యోగ ఖాళీలు ఉన్నాయని నేను అడిగిన ప్రశ్నకు ఆనాటి ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ అసెంబ్లీలో ప్రసంగిస్తూ రాష్ట్రంలోని వివిధ ప్రభుత్వ శాఖలలో 1,07,456 ఉద్యోగాలు, 25వేల టీచర్ ఉద్యోగాలు ఉన్నాయని అసెంబ్లీ సాక్షిగా జవాబు చెప్పారు. ఉద్యోగ సంఘాలు, ప్రజా సంఘాలు రెండు లక్షలకు పైగా రిటైర్మెంట్ ఖాళీలు ఉన్నాయిని వీటిని భర్తీ చేయాలని డిమాండ్ చేశాయి. వాస్తవంగా రెండు లక్షల ఖాళీలతోపాటు ఈ ఆరు సంవత్సరాల కాలంలో రిటైర్మెంట్ వలన మరో 40వేల ఖాళీలు ఏర్పడ్డాయి. అలాగే 23 కొత్త జిల్లాల్లో, 128 మండలాలు, 26 రెవెన్యూ డివిజన్లు ఏర్పడడంతో 44 శాఖలలో కలిపి మరో 40 వేల కొత్త ఉద్యోగాలు అదనంగా సృష్టించబడ్డాయి. ఇంత పెద్దమొత్తంలో 2లక్షల 80 వేల ఖాళీలు భర్తీ చేయవలసినవి ఉన్నాయి. కానీ ఈ ఆరు సంవత్సరాల్లో పోలీస్ కానిస్టేబుల్, సబ్ ఇనస్పెక్టర్, టీచర్, పంచాయతీ సెక్రటరీ, అసిస్టెంట్ ఇంజనీర్, హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్, సింగరేణి ఉద్యోగాలు, గ్రూప్-2 సర్వీసు ఉద్యోగాలు... ఇలా అన్ని కలిపి 35వేల ఉద్యోగాలను మాత్రమే భర్తీ చేశారు.


ఇంకా చాలా కేటగిరీ ఉద్యోగాలు భర్తీ చేసే ప్రతిపాదన కూడా తీసుకు రావడం లేదు. ఉద్యోగాలను సకాలంలో భర్తీ చేయకపోవడంతో భవిష్యత్తులో అన్ని ప్రభుత్వ శాఖలు, ప్రభుత్వ రంగ సంస్థలు పాఠశాలలు, యూనివర్సిటీలతో సహా దిగజారి నిర్వీర్యం అయ్యే ప్రమాదం ఉంది. ప్రతి ఏటా భర్తీ చేయాల్సిన గ్రూప్1 సర్వీసెస్ క్రింద 18 శాఖల్లో గెజిటెడ్ ఆఫీసర్స్ స్థాయి పోస్టులు గత పదేళ్లుగా భర్తీ చేయడం లేదు. దీని మూలంగా ఐఏఎస్, ఐపీఎస్ తదితర పోస్టుల్లో అభ్యర్థులు లేక రిటైర్ అయినవారిని కొనసాగిస్తున్నారు. గ్రూప్1, గ్రూప్2 సర్వీస్ పోస్టులు, గ్రూప్4 సర్వీస్ పోస్టులు, జూనియర్ అసిస్టెంట్ పోస్టులు, భర్తీ చేయకపోవడంతో ప్రభుత్వ ఎగ్జిక్యూటివ్ వ్యవస్థ రోజురోజుకీ బలహీనపడుతుంది. అలాగే యూనివర్సిటీలలో పెద్ద ఎత్తున ఖాళీలు ఉన్న అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులను భర్తీ చేయకపోవడంతో కొన్ని సంవత్సరాల తర్వాత ఏ డిపార్టుమెంటులోనూ ప్రమోషన్ ద్వారా సీనియారిటీ ద్వారా భర్తీ చేసే ప్రొఫెసర్ పోస్టులలో ఎవరూ లభించరు. ఒకనాడు ప్రపంచ ప్రసిద్ధిగాంచిన ఉస్మానియా యూనివర్సిటీలో ప్రొఫెసర్ల కొరత తీవ్ర స్థాయిలో ఉంది. ఉదాహరణకు కెమిస్ట్రీ డిపార్టుమెంట్లో 22మంది ప్రొఫెసర్లు ఉండాలి. కానీ ఆరుగురు కూడా లేరు. ఇలాగే ప్రతి డిపార్టుమెంట్లో పెద్దఎత్తున ప్రొఫెసర్ల కొరత ఉంది. కోవిడ్19 నేపథ్యంలో వ్యాక్సిన్ కనిపెట్టే ప్రపంచ పరిశోధన యూనివర్సిటీలలో ఒకనాడు వెలుగు వెలిగిన ఉస్మానియా యూనివర్సిటీ జాడ లేకపోవడానికి ప్రొఫెసర్ల కొరతే ప్రధాన కారణం. 


రాష్ట్రంలో రిటైర్మెంట్ వలన ఏర్పడ్డ ఖాళీల భర్తీకి అదనపు బడ్జెట్ అవసరం లేదు. ఇవి శాంక్షన్డ్ పోస్టులు. వీటికి కేటాయించబడిన బడ్జెట్ ఉంటుంది. ఈ పోస్టులు భర్తీ కాకపోతే వీటికి కేటాయించిన బడ్జెట్ మిగిలిపోతుంది. ప్రభుత్వం ఇతర స్కీములకు, కాంట్రాక్టర్లకు మళ్లిస్తుంది. ఉదాహరణకు 2లక్షల పోస్టుల భర్తీ చేయకపోతే ఏటా పదివేల కోట్ల బడ్జెట్టు మిగిలిపోతుంది.


ప్రజాస్వామ్య వ్యవస్థలో ఉద్యోగాల భర్తీని ఉపాధి కోణంలో చూడరాదు. పటిష్టమైన, సమర్థవంతమైన ప్రభుత్వ యంత్రాం గం ఉన్నప్పుడే అభివృద్ధి, సంక్షేమ పథకాలు అట్టడుగు ప్రజలకు చేరుతాయి. ప్రభుత్వ యంత్రాంగం సరిగ్గా లేనప్పుడు నిధుల దుర్వినియోగం జరుగుతుంది. ప్రజా పనులలో తీవ్ర జాప్యం జరుగుతోంది. ప్రత్యక్షంగా పరోక్షంగా దీని ప్రభావం సమాజ ప్రగతి, పురోగతిపై ఉంటుంది.


రాష్ట్ర విభజన తరువాత అన్ని ప్రభుత్వ ఆఫీసులలో ఖాళీ కుర్చీలు కనిపిస్తున్నాయి. సచివాలయం, డైరెక్టరేట్లు, జిల్లా కార్యాలయాలు, తాలుకా మండల కార్యాలయాలలో వేల సంఖ్యలో ఖాళీలు ఉన్నాయి. ఈ ఆఫీసులలో ఏ శాఖకు వెళ్ళినా సిబ్బంది లేక ఫైళ్ళు కదలక ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ఉదాహరణకు బి.సి/ఎస్సీ/ఎస్టీ సంక్షేమ శాఖలలో ఒక వార్డెన్ మూడు లేదా నాలుగు హాస్టళ్ళకు ఇంచార్జిలుగా ఉన్నారు. ఒక వార్డెన్ ఒక హాస్టలు నిర్వహించడమే కష్టం, అలాంటిది నాలుగు హాస్టళ్లను ఎలా నిర్వహిస్తారు? అలాగే ప్రభుత్వ ఆఫీసులలో జూనియర్ అసిస్టెంట్స్, సీనియర్ అసిస్టెంట్స్ పోస్టులు పెద్ద ఎత్తున ఖాళీగా ఉన్నవి. సిబ్బంది లేకుండా ప్రభుత్వ ఆఫీసులు ఎలా నడుస్తాయి?


ప్రభుత్వ పాఠశాలల్లో 40వేల టీచర్ పోస్టులు ఖాళీగా ఉంటే ప్రభుత్వం కేవలం 8600 పోస్టులను భర్తీ చేశారు. ఇవిగాక ఎయిడెడ్ పాఠశాలల్లో 4,900 ఆదర్శ పాఠశాలల్లో 2 వేలు, కస్తూర్బా పాఠశాలలో 1500 టీచర్ పోస్టులు భర్తీ చేయవలిసి ఉంది. టీచర్ పోస్టుల భర్తీలో ఖాళీలు లెక్కించినపుడు రిటైర్మెంట్ పోస్టులను ప్రాతిపదికగా తీసుకోవడం లేదు. టీచర్ పోస్టులు భర్తీ చేస్తే ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య గణనీయంగా పెరుగుతుంది. అలాగే జూనియర్ కాలేజీలలో 4900, జూనియర్ లెక్చరర్, డిగ్రీ కాలేజీలో 1800 లెక్చరర్, యూనివర్సిటీలలో 2200 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు వెంటనే భర్తీ చేయవలసి ఉంది. అలాగే గ్రూపు1లో 1200 పోస్టులు, గ్రూపు2లో 4 వేలు, గ్రూపు3 లో 8 వేలు, గ్రూ-4లో 40 వేలు క్లరికల్ పోస్టులను భర్తీ చేయవలిసిన అవసరం ఉంది.


పాలనా సౌలభ్యం కోసం, ప్రజల సౌకర్యార్థం 10 జిల్లాలను 33 జిల్లాలుగా విభజించారు. దాదాపు 128 కొత్త మండలాలు, 26 రెవెన్యూ డివిజన్లు, అలాగే 40 పోలీస్ డివిజన్లు, పెద్దయెత్తున పోలీస్ స్టేషన్లు ఏర్పాటు చేశారు. కాని కొత్త ఉద్యోగస్తుల రిక్రూట్మెంట్ లేదు. పాత 10 జిల్లాలోనే సరిపోను ఉద్యోగస్తులు లేరు. ఇక కొత్త జిల్లాలను ఎలా పరిపాలిస్తారు? ఉద్యోగస్తులు లేకుండా జిల్లాలు విభజించి ప్రజలకు ఉపయోగమేమిటి? ప్రజల వద్దకు పాలన ఎలా చేరుతుంది. ఆశించిన లక్ష్యం ఎలా నెరవేరుతుంది. కొత్త జిల్లాల వల్ల భౌగోళికంగా ప్రజలకు సౌకర్యంగా ఉండడమే గాక పాలన వికేంద్రీకరణ జరిగి ఆయా శాఖలపరంగా అభివృద్ధి వేగవంతంగా జరుగుతుంది. అలాంటప్పుడు ఉద్యోగస్తులు లేకుండా ప్రభుత్వ శాఖలు ఎలా నడుపుతారు?


గ్రూపు1,2 డైరెక్టర్ రిక్రూట్మెంట్ కోటాను దశలవారీగా తగ్గించుకుంటూ వస్తున్నారు. 1976లో 50శాతం ఉన్న డైరెక్టు రిక్రూట్మెంట్ కోటాను దశలవారీగా 30శాతానికి తగ్గించారు. కొన్ని పోస్టులను డైరెక్టు రిక్రూట్మెంటు కోటా నుంచి తొలగించారు. ఉదాహరణకు గ్రూపు-2 నుంచి ఎక్సైజ్ సర్కిల్ ఇనస్పెక్టర్, ప్రావిడెంట్ ఫండ్ ఇనస్పెక్టర్, ప్రొబేషనరీ రెవెన్యూ ఇనస్పెక్టర్ పోస్టులను తొలగించారు. డైరెక్ట్ రిక్రూట్మెంట్ కోటా పోస్టులను 50శాతం కోటా పునరుద్ధరించి భర్తీ చేయాలి.


ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా రిటైర్ అయినవారిని ఓ.ఎస్.డి.లుగా, ప్రభుత్వ సలహాదారు ఉద్యోగులుగా ఇలా 4 వేల మందిని నియమించారు. రాష్ట్రంలో 15లక్షల మంది యువకులు ఉద్యోగాలు లేక రోడ్లమీద తిరుగుతుంటే, రిటైర్మెంటు అయినవారిని కొనసాగించడం న్యాయం కాదు. ఈ తరహాలో ఉద్యోగాలు ఇకముందు కూడా కొన్ని వేలమందికి ఇవ్వడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. రిటైర్ అయినవారిని కొనసాగిస్తే బ్యూరోక్రసీ, ఎగ్జిక్యూటివ్ వ్యవస్థ బలహీనపడుతుంది. ఇది రాజ్యాంగ విరుద్ధం. దీనివలన ప్రభుత్వ వ్యవస్థలో అవినీతి పెరుగుతుంది. రాజకీయ నాయకుల ప్రాబల్యం పెరిగి వేల కోట్ల రూపాయల అవినీతి, స్కాములు జరిగే ప్రమాదం యుంది. మంత్రులు, రాజకీయ నాయకుల ప్రాబల్యంతో చట్టవిరుద్ధంగా ఫైళ్లపై సంతకాలు తీసుకొని కుంభకోణాలు చేసే ప్రమాదం యుంది. ఇప్పుడు జరుగుతున్న భూ కుంభకోణాలలోను, కాంట్రాక్టు కుంభకోణాలలోను రిటైర్ అయిన ఉన్నతాధికారుల హస్తముంది. అందుకే వీరిని తొలగించాలి. యువకులను రిక్రూట్ చేస్తే అవినీతి తగ్గుతుంది.


ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ ఉద్యమ నినాదంలో భాగమైన ‘నియామకాల’ను తక్షణం చేపట్టాలి. వివిధ ప్రభుత్వ శాఖలలో, ప్రభుత్వరంగ సంస్థలలో, పాఠశాలలు, కాలేజీలు, యూనివర్సిటీలలో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయాలి. ప్రజాస్వామ్యంలో శాసన సభలో ఖాళీలు ఏర్పడితే ఆరు నెలల్లో శాసనసభ సభ్యులు ఎన్నుకుంటారు. ఉద్యోగాల్లో ఖాళీలు ఏర్పడితే పది సంవత్సరాలకు కూడా భర్తీ చేయడం లేదు. అందుకే నియామకాలను ప్రభుత్వ అధినేతల ఇష్టాయిష్టాలకు వదిలిపెట్టకుండా ఖాళీలు ఏర్పడ్డ నెలరోజులలోణే భర్తీచేసే విధంగా రాజ్యాంగబద్ధంగా చేయాలి.

ఆర్. కృష్ణయ్య

అధ్యక్షులు, జాతీయ బి.సి సంక్షేమ సంఘం

Updated Date - 2020-06-04T06:10:20+05:30 IST