ఒక మెలకువలోకి

ABN , First Publish Date - 2020-03-23T09:01:24+05:30 IST

వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ లెర్న్‌ ఫ్రమ్‌ హోమ్‌ ఇంతింతైన భయానికి, ఇల్లిల్లూ ఓ బందిఖానా. మూసివేతలు, మళ్ళింపులూ మలుపు కొత్తదైనప్పుడు- నెమ్మది అవసరం, అనివార్యం....

ఒక మెలకువలోకి

వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌    

లెర్న్‌ ఫ్రమ్‌ హోమ్‌  

ఇంతింతైన భయానికి,

ఇల్లిల్లూ ఓ బందిఖానా.

మూసివేతలు, మళ్ళింపులూ

మలుపు కొత్తదైనప్పుడు- నెమ్మది

అవసరం, అనివార్యం.


ఇకపై ఉండేవారెవరో,

ఉన్నవాళ్ళని ఊరడించేదెవరో

ఊపిరాడని నిమిషాల కల్లోలం మరపురాక

బ్రతుకంతా తల్లడిల్లేదెవరో

ఇప్పుడైతే ఏం తెలీదు కానీ,  

ఇదీ సమసిపోతుంది

అన్ని విపత్తుల్లాగే,

అన్ని యుద్ధాల్లాగే,

ఇదీ ముగిసిపోతుంది.


మూతబడిన స్వేచ్ఛాప్రపంచపు

తలుపులు, మళ్ళీ తెరుస్తాం.

వెలుతురుతో, లోకంతో,

కరచాలనాలు చేస్తాం.


కానీ ఈ ఆపత్సమయాల్లో

దయగా తాకిన పదాలు నేర్పినదేదో

బ్రతుకంతా గుర్తుంచుకోగలమా

అపరిచితుల స్వస్థత కోసం మోకరిల్లి

ఇలా ఇంకెప్పుడైనా ప్రార్థించగలమా

చూసిన ప్రతి ఉదయానికీ,

చెరగా మారని ప్రతి రాతిరికీ

ఇలాగే కృతజ్ఞులమై ఉండగలమా,


దేహాన్ని హృదయం చేసి

సాటి మనిషి పిలుపునిలా వినగలమా

జాగురూకతతో శుభ్రతతో,

దేశాన్ని మనస్సుని మననివ్వగలమా

సమస్త మానవాళీ ఒకే కాంక్షతో

క్షణాలను దొర్లించడం ఊహించగలమా


నీ నుండి నాకింకా చాలా చాలా కావాలని

జీవితాన్నిలా జాలిగా ప్రాథేయపడగలమా

ముద్దాడకుండా, మాట్లాడకుండా

ప్రేమిస్తున్నామని ఎవరికైనా చెప్పగలమా


మిథ్యాప్రపంచపు రెక్కలు మూసి,

సొంత గూటిలోకి వాలిపొమ్మంటే

అనవసరపు ప్రయాణాలు మాని

ఉన్నచోటే ఉండిపొమ్మంటే,

ఉండగలమా

అన్ని తలుపులూ మూసి

నిండునిజంతోటి

రెపరెపలాడే హృదయం తోటి. 

ఇలా, ఇంకెప్పుడైనా..?  

మానస చామర్తి

manasa.chamarthi@gmail.com


Updated Date - 2020-03-23T09:01:24+05:30 IST