కొత్త కోణం

ABN , First Publish Date - 2020-12-10T09:45:02+05:30 IST

దృష్టికోణం మారాలి కొత్త పంక్తులు రాయాలి రైతు చూపుల్లో దైన్యాన్ని కాదు..

కొత్త కోణం

దృష్టికోణం మారాలి

కొత్త పంక్తులు రాయాలి

రైతు చూపుల్లో దైన్యాన్ని కాదు..

నిప్పులు చెరిగే నినాదాలను వినాలి


కవితాగానం చేయాలి

సరికొత్త కావ్యమొకటి రాయాలి

ఆత్మహత్యల వేదన కాదు..

ఆత్మస్థైర్య భారతాన్ని రచించాలి

పిడికిలి బిగించి పోరుబాట పరిచిన 

అన్నదాత కథానాయకుడు      

కావాలి


కన్నీటి చారికలను తుడవాలి

నిస్సహాయతను తరమాలి

లాఠీలు ఎత్తినవాడికి

రోటీ రుచి చూపించే

కరుణార్ద్ర హృదయాల కథలు

మన పిల్లలకు చెప్పాలి


నాగేటిచాళ్లలో 

కుహనా మేధావులను నడిపించాలి

మాయమాటలు ఎల్లకాలం చెల్లబోవని

పాలకులకు ఎలుగెత్తి చాటాలి


నెత్తురు మండే శక్తులు 

దేశాన్ని నడపాలి

పౌరుషాన్ని దేశమంతా నాటాలి

ప్రతి గింజమీదా పండించినవాడి పేరే ఉండాలి

రైతే రాజ్యమేలే రోజు రావాలి

పద్మావతి వడ్లమూడి

Updated Date - 2020-12-10T09:45:02+05:30 IST