తెలుగునేలపై కొత్త చరిత్ర

ABN , First Publish Date - 2020-12-17T05:53:31+05:30 IST

ముఖ్యమంత్రి వైఎస్ ‌జగన్మోహనరెడ్డి 2019 డిసెంబర్‌ 17న అసెంబ్లీ సాక్షిగా మూడు రాజధానుల ప్రక్రియకు తెర తీశారు...

తెలుగునేలపై కొత్త చరిత్ర

మహాత్మా గాంధీ మార్గంలోనే అమరావతి ఉద్యమం కొనసాగడం ప్రజాస్వామ్య విలువలకే ఆదర్శం. రాజధానిపై ప్రభుత్వం ప్రయోగించిన ప్రధానాస్త్రం ‘అమరావతి కేవలం ఒక సామాజిక వర్గానికి చెందిన వారిదే’ అని. బడుగు బలహీన కులాలకు చెందిన జెఏసీలు ఆ అసత్యాయుధాన్ని తుత్తునియలు చేశాయి.


ముఖ్యమంత్రి వైఎస్ ‌జగన్మోహనరెడ్డి 2019 డిసెంబర్‌ 17న అసెంబ్లీ సాక్షిగా మూడు రాజధానుల ప్రక్రియకు తెర తీశారు. ఆయన ప్రకటనతో రాష్ట్ర ప్రజలతోపాటు పాలకపక్ష ఎమ్మెల్యేలు సైతం నివ్వెరపోయారు. భూములు ఇచ్చిన రైతులు కుంగిపోయారు. అప్పటినుంచి రాజధాని గ్రామాలలో పండుగలు లేవు, పబ్బాలు లేవు, బంధువులు ఇళ్ళకు వచ్చేది లేదు, బంధువుల ఇళ్ళకు వెళ్ళేది లేదు. పోలీసుల పదఘట్టనలు, హాహాకారాలు. కేసులు, అరెస్ట్‌ల పరంపరే సాగుతుంది. దీక్షా శిబిరాలే రైతుల ఆవాసాలు, ‘జై అమరావతి’ నినాదాలే వారి అన్న పానీయాలు. అవమానాలను భరించారు. లాఠీ దెబ్బలను, పోలీసు కేసులను చవిచూశారు. చంద్రబాబు ప్రభుత్వ హయాంలో మూడున్నరేళ్లు రాజధానిగా వర్ధిల్లిన అమరావతిని ఎందుకు మూడు ముక్కలుగా చేయాలనుకుంటున్నారో, భూములు ఇచ్చిన రైతులకు తెలియదు. రాజధాని కోసం మాత్రమే ఇచ్చిన తమ భూములను ఏం చేయదలచారో అర్థం కాని పరిస్థితి. రెండేళ్ళుగా నిర్మాణాలన్నీ ఆగిపోయాయి. విశాలమైన రహదారులతో, భవన సముదాయాలతో, నిత్యం వచ్చేపోయే మంత్రులు, ఎమ్మెల్యేలు, వీఐపీలు, అధికారులతో కళకళలాడిన రాజధానిని ఎందుకు కళావిహీనం చేస్తున్నారో తెలియదు. ఒకరిపై కక్షను మరొకరిపై తీర్చుకున్నట్లు అమరావతి రైతులపై ఎందుకు పగపట్టారో తెలియదు. వరదలొస్తాయంటారు. ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌ జరిగింది అంటారు. ఆఖరికి ఏడాదికి మూడు పంటలు పండించుకుని పిల్లాపాపలతో హాయిగా బతికే గ్రామీణ రైతులను మోసకారులుగా, దగా కోరులుగా, లాభార్జనపరులుగా, పెయిడ్‌ ఆర్టిస్టులుగా చిత్రీకరించారు. అయినా ధర్మం కోసం వారు నడుం కట్టారు. దేని కోసం భూములు ఇచ్చారో, అదే రాజధాని కోసం ఏడాది కాలంగా దీక్షలు చేస్తున్నారు. దీక్షాశిబిరాలు 29 గ్రామాలలోను రెట్టింపు స్ఫూర్తితో కొనసాగటం చెప్పుకోదగ్గ గొప్ప విషయం. అమరావతిలోని దీక్షా శిబిరాలకు వెళుతుంటే రహదారి పొడవునా ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డి ఫ్లెక్సీలు చిరునవ్వులు చిందిస్తూ కనిపిస్తాయి. ఆ ప్రాంత ఎమ్మెల్యేల బొమ్మలు పెద్దఎత్తున దర్శనమిస్తుంటాయి. దీక్షా శిబిరంలోని ఏ ఒక్క ఉద్యమకారుడు వాటిని అవమానపర్చే చర్యలు కానీ, అగౌరవపరిచే చర్యలు కానీ చెయ్యలేదు. శిబిరాలలో ఉన్న మహిళలను, ఉద్యమిస్తున్న రైతు ఉద్యమకారులను నోటికి వచ్చినట్లు తిడుతున్నా, రాళ్ళేస్తున్నా తగ్గితగ్గి సమాధానం చెబుతున్నారే కానీ ఎవరూ కొందరు మంత్రుల్లా అనుచితంగా మాట్లాడటం లేదు. మహాత్మాగాంధీ మార్గంలోనే అమరావతి ఉద్యమం కొనసాగటం ప్రజాస్వామ్య విలువలకే ఆదర్శంగా చెప్పొచ్చు.


రాజధాని అమరావతిపై ప్రభుత్వం ప్రయోగించిన ప్రధానాస్త్రం అమరావతి కేవలం ‘ఒక సామాజికవర్గానికి చెందిన వారిదే’ అని. కొంత ఆలస్యం జరిగినా బడుగు బలహీన కులాలకు చెందిన జెఏసీలు ఆ అసత్యాయుధాన్ని తుత్తునియలు చేశాయి. రాజధానిలో భూములు ఇచ్చిన బడుగు, బలహీన కులాలకు చెందిన వారి గణాంకాలను, భూములపై ఆధారపడి జీవించే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ కులాల వారి లెక్కలను బయట ప్రపంచానికి తెలియజేశాయి. హైకోర్టులో పిల్‌ దాఖలు చేశారు. 34,323 ఎకరాలు ఇచ్చిన 29,881 మంది రైతుల్లో రెండు ఎకరాల లోపు సన్న, చిన్నకారు రైతులు పాతికవేల మందికి పైగా ఉన్న నిజాన్ని తేల్చిచెప్పారు. భూములిచ్చిన వారిలోను కులాలవారీగా కమ్మవారు 18శాతం, రెడ్లు 23శాతం, ఎస్సీ ఎస్టీలు 32శాతంగా నిర్ధారించారు. దీంతో రాజధానిని తరలించటం వల్ల నష్టపోయేది, రాజధానిగా అమరావతినే కొనసాగించటం వల్ల బాగుపడేది ఎస్సీ, ఎస్టీ సామాజిక వర్గాలే అని తేల్చిచెప్పారు. తత్ఫలితంగానే కొన్ని రోజులుగా రాష్ట్రంలోని పెద్దలు అమరావతిని ‘కమ్మ’రావతి అనడానికి వెనుకడుగు వేస్తున్నారనే చెప్పాలి. రాజధాని అమరావతి ఉద్యమం తెలుగునేలపై కొత్తచరిత్రగానే చెప్పుకోవాలి. ఇటీవల కనకదుర్గమ్మకు బోనాలు పెట్టేందుకు వెళ్ళిన ఉద్దండరాయునిపాలెం ఉద్యమ మహిళ మాటలను ఉద్యమానికి ప్రేరణగా వర్ణించవచ్చు. ‘అమ్మ పాదాల చెంత ఉన్న రాజధానిని తరలించాలని చూసే వారి కుళ్ళును, కుతంత్రాలను అమ్మ పసిగడుతూనే ఉంది, అమ్మే తన పాదాల చెంత ఉన్న రాజధానిని కాపాడుకుంటుందని’ మహిళా ఉద్యమకారిణి చెప్పటం అమరావతి ఉద్యమానికి జయధ్వానం వంటిది.

పోతుల బాలకోటయ్య

అమరావతి బహుజన జెఎసి అధ్యక్షులు

Updated Date - 2020-12-17T05:53:31+05:30 IST