లాక్‌డౌన్‌.. నీకో వందనం

ABN , First Publish Date - 2020-05-09T06:15:56+05:30 IST

గడప దాటని కుటుంబం గల్లీదాటని సంచారం కనిపించని శత్రువు పేరుతో....

లాక్‌డౌన్‌.. నీకో వందనం

గడప దాటని కుటుంబం

గల్లీదాటని సంచారం

కనిపించని శత్రువు పేరుతో

సమస్తాన్ని కట్టిపడేసిన 

లాక్‌డౌన్‌.. నీకో వందనం


అనుక్షణం హడావుడి

టార్గెట్లు, ఒత్తిడులు

ఆగం తప్ప ఆనందం లేని

జీవితానికి విరామమిచ్చిన

లాక్‌డౌన్‌.. నీకో వందనం


నెలాఖరు గుండెదడకు

నెలవారీ కిస్తీలకు

ఎదురయ్యే అవమానాలకు

పాజ్‌ బటన్‌ నొక్కిన

లాక్‌డౌన్‌.. నీకో వందనం


మిడిసిపడిన ఐశ్వర్యం

పైపై మెరుగుల సౌందర్యం

కరిగిపోతున్న కూలీ జీవితం

ఎవరైనా అత్యవసరాన్ని దాటొద్దన్న 

లాక్‌డౌన్‌.. నీకో వందనం


పొట్టకూటి కోసం 

సముద్రాలు దాటినా,

ఖండాలు మారినా

పురిటిగడ్డే దిక్కని రమ్మన్న

లాక్‌డౌన్‌.. నీకో వందనం


సంపాదన వేటలో

విరామం లేని స్నేహితుల

కార్యం ఉంటే తప్ప 

కనిపించని బంధువుల

పలకరింపులకు చిగుళ్లు తొడిగించిన

లాక్‌డౌన్‌.. నీకో వందనం


శ్రావ్యంగానే హెచ్చరించిన గేయాలు

సంతర్పణలు, దాతృత్వాలు

భరోసానిచ్చిన ఆపన్నహస్తాలు

మనుషుల్లోనూ దేవుళ్లను చూపిన

లాక్‌డౌన్‌.. నీకో వందనం



– చందనం శ్రీకాంత్‌

Updated Date - 2020-05-09T06:15:56+05:30 IST