ద్వేషాన్ని వదిలి ఏకమవుదాం!

ABN , First Publish Date - 2020-04-15T06:16:30+05:30 IST

కరోనా వ్యాధి ప్రబలుతుండడంతోపాటు, ముందస్తు ప్రణాళికలేని లాక్‌డౌన్ ఫలితంగా తీవ్ర స్థాయిలో ముందుకు వచ్చిన వలస కూలీల జీవన్మరణ సమస్యకు పరిష్కారం చూపలేకపోవడం, మాస్కులు, పీపీఈ, రక్షణ పరికరాల కొరత తీర్చలేకపోవడం లాంటి ...

ద్వేషాన్ని వదిలి ఏకమవుదాం!

డియర్‌ ప్రైమ్‌ మినిస్టర్‌,

కరోనా వ్యాధి ప్రబలుతుండడంతోపాటు, ముందస్తు ప్రణాళికలేని లాక్‌డౌన్ ఫలితంగా తీవ్ర స్థాయిలో ముందుకు వచ్చిన వలస కూలీల జీవన్మరణ సమస్యకు పరిష్కారం చూపలేకపోవడం, మాస్కులు, పీపీఈ, రక్షణ పరికరాల కొరత తీర్చలేకపోవడం లాంటి అనేక వైఫల్యాలను ఎదుర్కొంటున్నాం. మనుషుల మధ్య పరస్పరం అపనమ్మకం, ద్వేషం పెంచే పని జరిగిపోతున్నది. ఈ కాలమంతా వ్యాధి నిరోధించడానికి బోలెడు చిట్కా వైద్యాలు, మూఢ నమ్మకాలూ విపరీతంగా ప్రచారమయ్యాయి. చిట్టచివరికి అవన్నీ ఒక మతం దగ్గరికొచ్చి ఘనీభవించాయి. దేశం మాన సికంగా విడిపోయింది. ముస్లింలను వైరస్ అంటున్నారు. దాడులు చేస్తున్నారు. ద్రోహాన్ని ఆపాదిస్తున్నారు. ఈ సంక్షోభ కాలంలో విద్వేష రాజకీయాలు వీడి దేశప్రజలంతా ఐక్యంగా కరోనా దాడిని ఎదుర్కొనే దిశలో చర్యలు తీసుకుంటారని, పరస్పర సహకారం, హేతుబద్ధ ఆలోచనలతో పారదర్శకంగా అడుగులు వేస్తారని ఆశిస్తూ, ప్రభుత్వం కింద తెలిపిన నిర్దిష్ట చర్యలు తీసుకోవాలని కోరుతున్నాం.

ఈకాలంలో పెరుగుతున్న కుల, మత, ప్రాంత, జెండర్, జాత్యహంకార, ప్రాంతీయ విద్వేషాలను కట్టడిచేసి సెక్యులర్ వాతావరణాన్ని నెలకొల్పేలా చర్యలు తీసుకోవాలి. ఈ విషయమై ప్రభుత్వం అధికారిక ప్రకటన చేయాలి. సోషల్ మీడియాలో తప్పుడు వీడియోలతో మతవిద్వేష ప్రచారం చేస్తూ, సమాజంలో అనారోగ్యకర వాతావరణాన్ని సృష్టించినవారిపై తగిన చర్యలు తీసుకోవాలి. కరోనా రోగులకు వైద్య సేవలందిస్తున్న సిబ్బందికి అవసరమైన రక్షణ పరికరాలను అందించాలి. కరోనా టెస్ట్ కిట్లను అన్ని ప్రభుత్వ వైద్యశాలల్లో అందుబాటులో ఉంచాలి. ప్రైవేట్ ఆసుపత్రులను ప్రభుత్వ నియంత్రణలోకి తీసుకొని అన్ని రకాల వైద్య సౌకర్యాలు కల్పించాలి. ఈ గుణపాఠం నుండి ఇప్పటికైనా వైద్య రంగాన్ని పూర్తిగా ప్రభుత్వ అధీనంలోకి తీసుకోవాలి. పరిశోధన కేంద్రాలకు తగిన నిధులను కేటాయించాలి.


ప్రతి కుటుంబానికి 10వేల రూపాయలతో పాటు, 3 నెలలకు సరిపడా నిత్యావసర సరుకులను అందించాలి. వలస కూలీలు, నిరాశ్రయులు, అనాథలకు ఆవాసంతో పాటు, ఆహారాన్ని అందించాలి. రైతులు పండించిన పంటలు కొనుగోలు చేసే చర్యలు వెంటనే చేపట్టాలి. ప్రైవేటు ఉద్యోగులకు ఉద్యోగ భద్రత కల్పించాలి. ఆయా సంస్థలకు ప్రభుత్వం నిర్దిష్టమైన ఆదేశాలు జారీచేయాలి. కూరగాయలు, పండ్లు రైతుల నుంచి కొనుగోలు చేసి గ్రామాల్లో ప్రజలకు అందించాలి. పనికి ఆహారం పథకం నిధులు పెంచాలి. దేశమంతా 6గంటల పనివిధానం అమలు చేయాలి. రవాణా వసతి కల్పించి వలస కార్మికులను సొంత ప్రాంతాలకు చేర్చాలి. వైద్యరంగ నిపుణులతో కమిషన్ ఏర్పాటు చేసి ప్రజా వైద్యం అభివృద్ధి కోసం తగిన చర్యలు తీసుకోవాలి. లాక్‌డౌన్ అనంతరం దేశవ్యాప్తంగా మద్య నిషేధం అమలు చేయాలి.


అల్లం రాజయ్య, జి హరగోపాల్, కాత్యాయని విద్మహే, ఎ.కె. ప్రభాకర్, విమల మోర్తల, కవి యాకూబ్, నారాయణస్వామి వెంకటయోగి, అరసవిల్లి కృష్ణ, గీతాంజలి, కాసుల లింగారెడ్డి, చైతన్య చెక్కిళ్ల, కొండవీటి సత్యవతి, హేమలత నెల్లుట్ల, హెచ్చార్కె, కాత్యాయని ఎస్, రమాసుందరి, కళ్యాణి ఎస్.జె, చైతన్య పింగళి, అనిల్ డ్యానీ, సంధ్య, సజయ, కాకరాల, అరుణ నెల్లుట్ల, కెవి కూర్మనాథ్, బమ్మిడి జగదీశ్వర రావు, అరణ్య క్రిష్ణ, జుగాష్ విలి, అరుణాంక్ లత, ఎంవి రమణ, రాఘవాచారి, వనజ సి, జిట్ట బాల్ రెడ్డి, అరవింద్, హరిబాబు కొర్లగుంట, సుజాత నల్లూరి, దేవరకొండ సుబ్రహ్మణ్యం, అబ్దల్ రజక్ నూర్ భాషా, రాఘవ రాంరెడ్డి, పోకల సాయికుమార్, జ్యోతి చిలుకూరి, పర్‌స్పెక్టివ్‌్స‍ రామకృష్ణారావు, సుమతి మొక్కపాటి తదితరులు.

(Concerned Citizens of India)

Updated Date - 2020-04-15T06:16:30+05:30 IST