ప్రేమోద్వేగాలకు శాసనసంకెళ్ళా?

ABN , First Publish Date - 2020-12-05T06:31:50+05:30 IST

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ 2021 జనవరి 20వ తేదీన శ్వేత సౌధం నుంచి నిష్క్రమించనున్నారు...

ప్రేమోద్వేగాలకు శాసనసంకెళ్ళా?

ఎవరైనా తమ జీవిత భాగస్వామిని ఎంపిక చేసుకోవడమనేది పూర్తిగా వారి వ్యక్తిగత వ్యవహారం. మరి వ్యక్తిగత విషయాలపై శాసనాలు చేయడమేమిటి? ‘లవ్ జిహాద్’కు వ్యతిరేకంగా ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం తీసుకువచ్చిన చట్టం జీవిత భాగస్వామి ఎంపిక, వ్యక్తి స్వేచ్ఛ, గోప్యత, జీవిత హుందా, స్త్రీ పురుష సమానత్వంపై దాడి వంటిదే. ప్రేమించే హక్కు, సహజీవనం చేసే హక్కు, వివాహం చేసుకునే హక్కులను అది తోసిపుచ్చుతోంది. వ్యక్తిస్వేచ్ఛను సంరక్షించడం రాజ్యాంగ విహిత విద్యుక్త ధర్మం కనుక ఉన్నత న్యాయస్థానాలు ఆ చట్టాన్ని కొట్టివేస్తాయనడంలో సందేహం లేదు.


అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ 2021 జనవరి 20వ తేదీన శ్వేత సౌధం నుంచి నిష్క్రమించనున్నారు. ఈ విషయాన్ని ఆయన స్వయంగా వెల్లడించిన వెనువెంటనే అమెరికా ప్రజలు హాయిగా ఊపిరి పీల్చుకున్నారు. అయితే ఒక వాస్తవాన్ని వారు ఉపేక్షించలేరు. ట్రంప్‌కు మద్దతుగా 7,38,90,295 మంది అమెరికా పౌరులు ఓటు వేశారు. కొత్త అధ్యక్షుడిగా ఎన్నికైన జో బైడెన్‌కు వచ్చిన ఓట్ల కంటే ట్రంప్ అనుకూల ఓట్లు 61,36,426 మాత్రమే తక్కువ. 1860 దరిమిలా అమెరికా ఎప్పుడూ ఇలా చీలిపోలేదు. 


‘సమానత్వ హక్కు’ అంశంపై 1860లో అమెరికాలో అంతర్యుద్ధం సంభవించింది. ఆఫ్రికన్ అమెరికన్లను చట్టం ముందు శ్వేతజాతీయులతో సమానంగా పరిగణించాలా? అనే విషయమై ఆనాడు అమెరికా సమాజం చీలి పోయింది. అంతర్యుద్ధం ప్రజ్వరిల్లింది. ఎనిమిది లక్షల మంది అమెరికన్లు ప్రాణాలు కోల్పోయారు. అంతిమంగా అధ్యక్షుడు అబ్రహం లింకన్ విజయం సాధించారు. ఆఫ్రికన్ అమెరికన్లకు బానిసత్వం నుంచి విముక్తి లభించింది. అమెరికా సమైక్యత, సమగ్రతలు సురక్షితమయ్యాయి. అమెరికా రాజ్యాంగానికి 13వ సవరణ జరిగింది. దీనికి కాంగ్రెస్ ఆమోదం పొందడంలో లింకన్ సఫలమయ్యారు.


భారత స్వాతంత్ర్యోద్యమంలో భారతీయులు అందరూ తొలి నుంచీ సంఘటితంగా ఉన్నారు. ఏనాడూ జాతి, మతం, కులం, భాష లేదా జెండర్ పరంగా విడిపోలేదు. ఆ మహోజ్వల పోరాటచరిత్ర ప్రతి అధ్యాయంలోనూ వేర్వేరు ప్రాంతాలకు చెందినవారు, వివిధ భాషలు మాట్లాడేవారు, విభిన్న కులాలకు చెందినవారు, భిన్న మతాలను ఆచరించినవారు ఇబ్బడిముబ్బడిగా కనిపిస్తారు.


ప్రతి భారతీయుడూ ‘చట్టం ముందు సమానుడే’ అన్న భావనకు స్వతంత్ర భారతదేశం పట్టం కట్టింది. ఈ సమున్నత భావన భారత రాజ్యాంగంలో పౌరుల ప్రాథమిక హక్కులుగా సుప్రతిష్ఠితమయింది. ‘చట్టం ముందు అందరూ సమానులే’ అని అధికరణ 14; ‘కుల, మత, లింగ వివక్షలకు తావు లేదు’ అని అధికరణ 15 చాటాయి. ‘ప్రభుత్వోద్యోగాలలో అందరికీ సమానావకాశాలు’ లభిస్తాయని అధికరణ 16 హామీ ఇచ్చింది. ‘వ్యక్తిస్వేచ్ఛకు, జీవించే హక్కు’కు అధికరణ 21 భరోసా పడింది. దేశ ప్రజలు అందరికీ ‘మత విశ్వాసాలను కలిగి ఉండే హక్కును, మత ప్రచారం చేసుకునే హక్కు’ను అధికరణ 25 కల్పించింది. 


దేశ విభజనతో సంభవించిన భయానక మారణకాండ, ఇతర ఉపద్రవాలను దృష్టిలో ఉంచుకుని అల్పసంఖ్యాకవర్గాల వారికి భారత రాజ్యాంగం సాంస్కృతిక, విద్యాహక్కులు కల్పించింది. అధికరణ 29 ‘అల్పసంఖ్యాక వర్గాల ప్రయోజనాల పరిరక్షణ’కు హామీపడగా అధికరణ 30 ‘విద్యాలయాలను స్థాపించి, నిర్వహించుకునే హక్కులను’ వారికి కల్పించింది. ఒక విలక్షణమైన భాషను గానీ, లిపిని గానీ, సంస్కృతిని గానీ, మతాన్ని గానీ కలిగి ఉన్న ఏ పౌరుడైనా సరే ఒక ‘మైనారిటీ’ వర్గానికి చెందినవాడే అవుతాడని మన సంవిధానం ఉద్ఘాటించింది.


అమెరికాలో కాలక్రమంలో సమానత్వానికి కొత్త నిర్వచనాలు వికసించాయి. సమతా భావన కొత్త లక్షణాలను విజ్ఞులు ఆవిష్కరించారు. న్యాయస్థానాలు ఈ సరికొత్త నిర్వచనాలను, వినూత్న లక్షణాలను సమర్థించాయి. ఓటు హక్కు, పాఠశాలలు, బహిరంగ ప్రదేశాలలో జాతివివక్షను వ్యతిరేకించే హక్కు, గర్భస్రావ హక్కు మొదలైనవి అమెరికా ప్రజాస్వామ్య ప్రగతిశీల ప్రస్థానాలు. వీటన్నిటికీ మూలాధారం 13వ రాజ్యాంగ సవరణే. 


వర్తమాన భారతీయులు చాలామంది చరిత్రను మరచిపోయినట్లుగా కనిపిస్తోంది. అనేకమంది మన రాజ్యాంగ మౌలికసూత్రాలను నిరాకరిస్తున్నారు. తమ తమ విలక్షణతలను, ఆధిక్యతను పలువురు సగర్వంగా ప్రకటించుకుంటున్నారు! స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వ ఆదర్శాలను విశ్వసించిన; మనసా, వాచా, కర్మణా ఆచరించిన ఉదాత్తులు దేశ రాజకీయాలలో ప్రాబల్య, ప్రభావశీల వ్యక్తులుగా ఉన్నంతవరకు కులమతాలు మొదలైన ఆదిమ సహజాతాలు అదుపులో ఉన్నాయి. అయితే భారతీయ జనతా పార్టీ, దాని మాతృసంస్థ రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ తమ ఉనికిని సుస్థిరం చేసుకుని, రాజకీయాలలో ప్రాబల్యం పొందిన తరువాత ఆ ఆదిమ సహజాతాలు రాజకీయ సమ్మతి, గౌరవాన్ని పొందాయి.


దీనికి నిదర్శనాలు కావాలా? అనేకం. వాటిలో కొన్ని: హిందీయేతర భాషలు మాట్లాడేవారిపై హిందీని రుద్దడం; వివక్షాపూరిత జాతీయ పౌర పట్టిక, పౌరసత్వ సవరణ చట్టం; జమ్మూ-కశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తి రద్దు, కేంద్రపాలిత ప్రాంతాలుగా పునర్వ్యవస్థీకరణ; పోలీసు కస్టడీలో, విచారణలో ఉన్న ఖైదీలకు మానవహక్కుల నిరాకరణ; అభియోగాలు మోపకుండా, విచారణ లేకుండా రాజకీయ నాయకుల నిర్బంధం; ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ రిజర్వేషన్లకు విఘాతం కల్పించే చర్యలు; సమాఖ్య విధానంపై దాడి; రేషన్ కార్డుల నుంచి ప్రవేశపరీక్షలు, ఎన్నికల దాకా ప్రతి దానిపై ఒక ‘ఏకీకరణ’ విధించడం.


సందేహం లేదు, ఇది మెజారిటీయుల అనుకూల ఎజెండా. 2019 సార్వత్రక ఎన్నికల్లో 37.38 శాతం ఓట్లు, 303 సీట్లను భారతీయ జనతాపార్టీ దక్కించుకుంది. అంతమాత్రాన బీజేపీ ఎజెండాకు దేశ పౌరులలో 50 శాతం మంది పైగా మద్దతు ఇస్తున్నట్టు భావించడం సమంజసమా? కాదు, కానే కాదు. దేశాన్ని పాలించే హక్కును బీజేపీ సంపాదించుకున్నది. అయితే రాజ్యాంగాన్ని ధ్వంసం చేసే, తలకిందులు చేసే హక్కును ఆ పార్టీకి ప్రజలు ఇవ్వలేదు. ఇది స్పష్టం.


ఆవును సంరక్షించే హక్కు బీజేపీ ప్రభుత్వానికి ఉంది. అయితే, క్రైస్తవులు, ఈశాన్య రాష్ట్రాల ప్రజలతో సహా ఏ ఒక్కరికీ గో మాంసాన్ని తినకూడదని నిర్దేశించే హక్కు ఆ ప్రభుత్వానికి లేదు గాక లేదు. పాలనా కార్యకలాపాలలో హిందీ వాడకాన్ని ప్రోత్సహించే హక్కు బీజేపీ ప్రభుత్వానికి ఉంది. అయితే హిందీయేతర భాషల వారిపై దానిని రుద్దే హక్కు వారికి ఎలా ఉంటుంది? అలా చేయడమంటే అధికసంఖ్యాక ప్రజలు పాలనలో భాగస్వాములు కాకుండా నిరోధించడమే కాదూ? బహిరంగ ప్రదేశాలలో అశ్లీలతను నిరోధించే హక్కు పాలకులకు ఉంటుంది. అయితే పార్కులలో యువప్రేమికులపై పోలీసులను ఉసిగొల్పే హక్కు ఈ పాలకులకు ఎవరు ఇచ్చారు?


తమ ఎజెండాను అమలుపరచడంలో బీజేపీ ప్రభుత్వాలు ఎంత అతిగా వ్యవహరిస్తున్నాయో ఉత్తరప్రదేశ్‌లో యోగి ఆదిత్యనాథ్ సర్కార్ తీసుకు వచ్చిన ఒక కొత్త చట్టం స్పష్టం చేస్తోంది. తాము మొరటుగా అభివర్ణించిన ‘లవ్ జిహాద్’కు పాల్పడిన వారిని శిక్షించేందుకు ఆ నూతన చట్టాన్ని ఉద్దేశించారు. హిందూ యువతులను ప్రేమించి, వివాహం చేసుకుంటున్న లేదా హిందూ మహిళలతో సహజీవనం చేస్తున్న ముస్లిం పురుషులను లక్ష్యంగా చేసుకునేందుకే ఈ చట్టాన్ని తీసుకువచ్చారన్నది స్పష్టం. మతాంతర వివాహాలు చేసుకున్నవారికి, సహజీవనం సాగిస్తున్నవారికి, ముఖ్యంగా హిందూ-, ముస్లిం జంటలకు వ్యతిరేకంగా ఉత్తరప్రదేశ్ పాలకులు తమ కొత్త చట్టాన్ని ఎక్కుపెట్టారు. ‘తప్పుడు ప్రాతినిధ్యాలతోను, నిర్బంధంగాను, అనుచితంగా ప్రభావితం చేయడం ద్వారా, ఒత్తిడితో, ప్రలోభాలతో, మోసపూరిత మార్గాలలో వివాహం చేసుకోవడం ద్వారా ఏ వ్యక్తీ, మరో వ్యక్తిని ఒక మతం నుంచి మరో మతానికి మార్చకూడదు, మార్చడానికి ప్రయత్నించకూడదు’ అని ఆ చట్టం పేర్కొంది. అది వివాహాన్ని బూటకపు వ్యవహారం, నిర్బంధం, అనుచిత ప్రభావం, ఒత్తిడి, ప్రలోభాలు, మోసపూరిత మార్గాలతో సమానం చేసింది!


ఎవరైనా తమ జీవిత భాగస్వామిని ఎంపిక చేసుకోవడమనేది పూర్తిగా వారి వ్యక్తిగత వ్యవహారం. వ్యక్తిగత విషయాలపై శాసనాలు చేయడమేమిటి? షాలిన్ జహాన్, పుట్టస్వామి కేసుల్లో సుప్రీంకోర్టు తీర్పులు, సలామత్ అన్సారి వర్సస్ స్టేట్ ఆఫ్ ఉత్తరప్రదేశ్ కేసులో అలహాబాద్ హైకోర్టు తీర్పును బీజేపీ పాలిత రాష్ట్రాల న్యాయ మంత్రిత్వశాఖలు చదవలేదని స్పష్టమవుతున్నది. ఒకవేళ చదివినా, తమ రాజకీయ యజమానుల ఆదిమ సహజాతాలను సంతృప్తిపరిచేందుకే ప్రాధాన్యమిచ్చి ఉంటారని భావించవలసివస్తోంది. ‘లవ్ జిహాద్’కు వ్యతిరేకంగా ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం తీసుకువచ్చిన చట్టం జీవిత భాగస్వామి ఎంపిక, వ్యక్తిస్వేచ్ఛ, గోప్యత, జీవిత హుందా, స్త్రీ పురుష సమానత్వంపై దాడి వంటిదే. ప్రేమించే హక్కు, సహజీవనం చేసే హక్కు, వివాహం చేసుకునే హక్కులను అది తోసిపుచ్చుతోంది. వ్యక్తిస్వేచ్ఛను సంరక్షించడం రాజ్యాంగ న్యాయస్థానాల విద్యుక్త ధర్మం. కనుక ఉత్తరప్రదేశ్ ప్రభుత్వ చట్టాన్ని అవి నిస్సందేహంగా కొట్టి వేస్తాయి. ఇది తథ్యం. అయితే ఇప్పటికే అది ప్రజాస్వామ్యాన్ని, వ్యక్తిస్వేచ్ఛను అపాయంలో పడేసింది. ఉత్తరప్రదేశ్ ప్రభుత్వ చట్టానికి మొదటి బాధితుడు ఉవాయిష్ అహ్మద్.


పి. చిదంబరం

(వ్యాసకర్త కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకులు)

Updated Date - 2020-12-05T06:31:50+05:30 IST