తెలుగువారి వెలుగుదివ్వెలు కొప్పరపు కవులు
ABN , First Publish Date - 2020-11-12T06:06:09+05:30 IST
తెలుగు భాషకే చెందిన విశిష్ట సాహిత్య ప్రక్రియ ‘అవధానం’. పద్యం తెలుగువాడి సొంతం. ఆద్యంతం పద్యమయంగా సాగే అవధాన కళాకేళిలో...
కొప్పరపు సోదర కవులు కవితాలోకంలో ఎన్నోమార్లు వీర విజృంభణ చేశారు. పల్లె నుంచి మహానగరాల వరకు సాగిన వీరి కవితాయాత్రలో తెలుగు పద్యానికి పట్టాభిషేకం జరిగింది. అవధాన విద్యకు అఖండ ఖ్యాతి లభించింది. ఎన్నో బిరుదులు, మరెన్నో ఘనసత్కారాలు వీరిని వరించాయి. ఇప్పటికీ అవధాన విద్య ఇంత జేగీయమానంగా వెలుగుతోందంటే, కొప్పరపు కవులు, తిరుపతి వేంకటకవులు వేసిన బలమైన పునాదులే.
తెలుగు భాషకే చెందిన విశిష్ట సాహిత్య ప్రక్రియ ‘అవధానం’. పద్యం తెలుగువాడి సొంతం. ఆద్యంతం పద్యమయంగా సాగే అవధాన కళాకేళిలో కొప్పరపు సోదర కవులు అగ్రేసరులు. వారి అవధాన విధానం, ఆశుకవితా విన్యాసం అనన్యసామాన్యం. వారు రోజుకొక మహా శతావధానం అవలీలగా చేసేవారు. గంటకొక ప్రబంధం ఆశువుగా హేలగా చెప్పేవారు. తెలుగు సాహిత్య చరిత్రలో ఇంతటి ప్రతిభ వీరికే చెల్లింది. వారి కవితా జీవిత విశేషాలను పరిశీలిస్తే ఈ సత్యం అవగతమవుతుంది. ఒక్క రోజులోనే ఒక ఊరులో శతావధానం సంపూర్ణం చేసి, ఆ మరునాడే ఇంకొక ఊరులో మరో శతావధానం చేసేవారు. ఉదాహరణకు, -1911 సెప్టెంబర్ 15న బాపట్లలో శతావధానం చేశారు. వెనువెంటనే గుంటూరు పక్కనే ఉండే విశదల అనే గ్రామంలో 17వ తేదీన మరో శతావధానం నిర్వహించారు. మధ్యలో 16వ తేదీన బాపట్లలోనే ఆశుకవితా ప్రదర్శన చేశారు. బాపట్లలో జరిగిన అవధానానికి దేశిరాజు కృష్ణయ్య పంతులు సభాధ్యక్షుడిగా వ్యవహరించారు. కొప్పరపు కవులు 15వ తేదీన మధ్యాహ్నం 2.20కు శతావధానం ప్రారంభించి, తెల్లవారుఝాము 2.10 కల్లా సంపూర్ణం చేశారు. మరునాడు 16వ తేదీన గంటకు 480 పద్యాల శరవేగంతో ఆశుకవితా విన్యాసం చేసి కవిపండిత మండలిని ఆశ్చర్యసాగరంలో ముంచేశారు. ఈ విశేషాలన్నింటినీ దర్శింపజేస్తూ, 20వ తేదీన చంద్రమౌళి చిదంబరరావు సమీక్షా వ్యాసం రాశారు. ఈ వ్యాసం నేడు మనకు అందుబాటులో ఉంది. కొప్పరపు కవుల అనుపమాన అవధాన, ఆశుకవితా మహాప్రతిభకు ఇది అక్షర సాక్షి. చంద్రమౌళి చిదంబరరావు సామాన్యులు కారు. ఆ కాలంలో సుప్రసిధ్ధ న్యాయవాది, స్వయంగా అవధానాలు చేసిన కవి పండితుడు. జిల్లెళ్ళమూడి అమ్మకు తాతగారు కూడా. ఈ వ్యాసంలో కొప్పరపు వారి ధార, ధారణా శక్తి, స్వాగత సత్కార వైభవాన్ని కూడా చిదంబరరావు అక్షరబద్ధం చేశారు.
కొప్పరపు కవులు పృచ్ఛకుల పేర్లను, అంశాలను పృచ్ఛకులకే గుర్తు చేస్తూ అసాధారణ రీతిలో 1నుంచి 100వరకు, మళ్ళీ 100నుంచి 1వరకు వరుసగా పద్యాలన్నీ అప్పజెప్పి, సభాప్రాంగణాన్ని ఊపేశారు. ఈ కవిద్వయానికి పండిత పామర జనసందోహం మధ్య ఘనంగా సత్కారం జరిగింది. ముందుగా బాపట్లలోని ఆనాటి పుర ప్రముఖులు, కవులు, పండితులు సోదరకవులను పుష్పాలతో అలంకరించిన గుర్రపుబండిపై కూర్చోబెట్టి, సభాప్రాంగణం వరకు, జయజయధ్వానాలతో, పద్య ప్రశంసలతో ఊరేగింపుగా స్వాగతం పలికారు. ఆ సంబరంలో ఎన్నో వాహనాలు వీరిని (కాన్వాయి) అనుసరించాయి. ఇది కొప్పరపు వారి కవితా జీవిత వైభవానికి ఒక తార్కాణం. మరునాడు 17వ తేదీన విశదలలో మరో శతావధానం చేశారు. ఈ అవధానాన్ని చెరుకూరి తిరుపతిరాయుడు ఏర్పాటు చేశారు. ఆ గ్రామంలోని శ్రీ మల్లేశ్వరస్వామి దేవాలయం ముందు ఆ సభ జరిగింది. ఆ శతావధానానికి ‘దేశభక్త’ కొండా వెంకటప్పయ్య పంతులు అధ్యక్షత వహించారు. ఆ శతావధానాన్ని కూడా ఒక్కరోజులోనే విజయవంతంగా పూర్తి చేశారు. మధ్యాహ్నం 1.30కు అవధానం ప్రారంభించి, అర్ధరాత్రి 12గంటలకు సంపూర్ణం చేశారు. ఇంతటి ప్రతిభ, పట్టుదల కలిగిన కవులు వీరు తప్ప ఇంకొకరు లేరంటూ అందరూ ప్రశంసల వర్షం కురిపించారు. ఈ అవధాన విశేషాలన్నీ పాటిబండ సూర్యనారాయణ ఒక పీఠికా వ్యాసంలో పొందుపరిచారు. సూర్యనారాయణ ఆ కాలంలో ఆంధ్రప్రదేశ్‌లో ప్రఖ్యాత న్యాయవాది. బాపట్ల, విశదలలో ఈ అవధానాలు చేసినప్పుడు కొప్పరపు కవుల వయస్సు కేవలం 25, -23 సంవత్సరాలే. వారి అవధాన పద్యాలు ప్రబంధతుల్యంగా ఉంటాయంటూ, వేదం వేంకటరాయశాస్త్రి, వావిలికొలను సుబ్బారావు(వాసు దాసు) మొదలగు ఎందరో మహాకవి పండితులు బహుధా ప్రశంసించారు. కొప్పరపు కవులు చెప్పిన పద్యాల సంఖ్య కొన్ని లక్షలు ఉంటాయని లక్కవరం జమిందారు రాజా మంత్రిప్రగడ భుజంగరావు బహద్దూర్ ‘ఆధునిక కవి జీవితములు’ అనే పుస్తకంలో రాశారు. ఆ కాలంలో రికార్డింగ్ సదుపాయాలు లేకపోవడం వల్ల, ఆన్నీ అందుబాటులో లేవు. కొన్ని నేటికీ మిగిలి ఉన్నాయి.
కొప్పరపు కవుల పద్య ప్రవాహ ప్రజ్ఞకు ఎన్నో ఘట్టాలను ఉదహరించవచ్చు. అది స్వాతంత్ర్య సమరం జరుగుతున్న కాలం. సుప్రసిధ్ధ కవి చిలకమర్తి లక్ష్మీనరసింహం కొప్పరపు కవులను వీరవాసరం ఆహ్వానించి, ఆశుకవితా సభ ఏర్పాటుచేశారు. ఆయనే అధ్యక్షత వహించారు. వారి కోరిక మేరకు కొప్పరపు కవులు సుమారు రెండు గంటల కాలవ్యవధిలో 400 పద్యాలతో ‘శకుంతలోపాఖ్యానం’ కావ్యం పరమాద్భుతంగా ఆశువుగా చెప్పారు. ఈ విశేషాలన్నీ చిలకమర్తి లక్ష్మీనరసింహం తన ‘ఆత్మకథ’లో వివరించారు. విజయవాడలో ఒక సందర్భంలో, పండిట్ జవహర్‌లాల్ నెహ్రూ సమక్షంలో, అయ్యదేవర కాళేశ్వరరావు ఇంట్లో కొప్పరపు కవులు తమ ఆశుకవితా ప్రదర్శన చేశారు. ఆ కవిత్వ ప్రతిభకు నెహ్రూ ఎంతో పులకించి, కొప్పరపువారిని ఎంతగానో ప్రస్తుతించారు. అయ్యదేవర కాళేశ్వరరావు తన ‘ఆత్మకథ’లో ఈ సంఘటన గుర్తుచేసుకున్నారు. ఇలా, కొప్పరపు సోదర కవులు కవితాలోకంలో ఎన్నోమార్లు వీర విజృంభణ చేశారు. పల్లె నుంచి మహానగరాల వరకు సాగిన వీరి కవితాయాత్రలో తెలుగు పద్యానికి పట్టాభిషేకం జరిగింది. అవధాన విద్యకు అఖండ ఖ్యాతి లభించింది. ఎన్నో బిరుదులు, మరెన్నో ఘనసత్కారాలు వీరిని వరించాయి. ఇప్పటికీ అవధాన విద్య ఇంత జేగీయమానంగా వెలుగుతోందంటే కొప్పరపు కవులు, తిరుపతి వేంకటకవులు వేసిన బలమైన పునాదులే. కొప్పరపు సోదరకవులుగా జగత్ ప్రసిద్ధులైన వీరి పూర్తి పేర్లు కొప్పరపు వేంకట సుబ్బరాయకవి (1885–1932), వేంకట రమణ కవి (1887–1942). గుంటూరు జిల్లా నరసరావుపేట దగ్గర కొప్పరం వీరి స్వగ్రామం. నేడు కొప్పరపు సోదరకవులలోని అగ్రజులు వేంకట సుబ్బరాయ కవి 135వ జయంతి. వీరి స్మృతిగా వీరి మనుమడు మాశర్మ శ్రీ కొప్పరపు కవుల కళాపీఠం స్థాపించి దొరికినంత వరకూ సాహిత్యాన్ని గ్రంథస్థం చేసి ప్రచారం చేస్తున్నారు. తెలుగు భాష, పద్యం ఉన్నంతకాలం ఇటువంటి మహాకవులు చిరంజీవిగా ఉంటారు. తెలుగువారి వెలుగుదివ్వెలైన కొప్పరపు కవులకు నీరాజనాలు.
మండలి బుద్ధప్రసాద్, మాజీ మంత్రి
(నేడు కొప్పరపు కవుల 135వ జయంతి)