ఓ మనిషి...

ABN , First Publish Date - 2020-04-18T06:30:28+05:30 IST

అడవులల్ల బట్టలు లేకుండా తిరిగిన నీవుఅమెజాన్ల బట్టలు కొనవడ్తివి

ఓ మనిషి...

అడవులల్ల బట్టలు 

లేకుండా తిరిగిన నీవు

అమెజాన్ల బట్టలు కొనవడ్తివి


రాళ్లను కొట్టి 

నిప్పును పుట్టించిన నీవు

రాకెట్లను నింగిలోకి పంపవడ్తివి


చెట్టుకు కాసిన 

కాయను తిని బతికిన నీవు

స్విగ్గిలో చికెన్ 

తెప్పించుకుని తినవడ్తివి..


వాగులో సెలిమ 

తొవ్వి నీళ్లు తాగిన నీవు

బటన్ నొక్కి 

ఫిల్టర్ నీళ్లు తాగవడ్తివి..


ఎగిరే పక్షులను

చూసి మురిసిన నీవు

విమానాల్లో 

ఎగురుకుంటూ తిరగవడ్తివి..


జాగా లేక

జంగల్‌లో పండుకునే నీవు

జాబిల్లిని తాకేంత 

బిల్డింగులో పడుకోవడ్తివి..


ముఖం 

ఎట్లుంటదో చూసుకోలేని నీవు

మూన్ మీదకు పోవడ్తివి


మాటలు కూడా 

సరిగ్గా మాట్లాడలేని నీవు

మంత్రాలంటూ 

మాయ చేయవడ్తివి


బంధాలను 

పెంచుకోవాలని చూసిన నీవు

బేమాన్ పనులు చేయవడ్తివి


మనిషి కోసం

వెతుకుతూ తిరిగిన నీవు

మనీ వెంట పరిగెత్తవడ్తివి


ప్రకృతిని

నమ్మి బతికిన నీవు

పంచభూతాలను 

నాశనం చేయవడ్తివి


బతకనీకే

ఎన్నో ఉపాయాలు చేసిన నీవు

భూమికే భారం కావడ్తివి


నీ ఉర్కులాటనే

ప్రపంచ ఉర్కులటగా చూపిస్తున్న నీవు

ప్రకృతిని సత్తెనాష్ చేయవడ్తివి


పైసా టెక్నాలజీ

వెంట పరిగెడుతున్న నీవు

మనిషిని మరిచిపోవడ్తివి 


ఓ మనిషి..

మరిచిపోయినవా నీవు

మనిషివని


అరే ఓ మనిషి

బతకనియ్యు నీ తోటి మనిషిని.


– ఖాజా అఫ్రిదీ

Updated Date - 2020-04-18T06:30:28+05:30 IST