మోదీ బాటలో కేసీఆర్

ABN , First Publish Date - 2020-12-29T09:08:20+05:30 IST

కొంతమందికి జ్ఞానోదయం త్వరగా కలుగుతుంది. మరికొంతమందికి ఆలస్యంగా కలుగుతుంది. తెలంగాణ ముఖ్యమంత్రి...

మోదీ బాటలో కేసీఆర్

పీవీ నరసింహారావు, వాజపేయి మార్గంలోనే ప్రధాని మోదీ ప్రజలకు మేలు చేయాలని భావించారు. వ్యవసాయ సంస్కరణలను అమలు చేయడం ద్వారానే రైతులకు మంచి ప్రయోజనాలు చేకూరుతాయని ఆయన విశ్వసిస్తున్నారు. మోదీ చేపట్టిన సంస్కరణలు 1991లో పీవీ ప్రవేశ పెట్టిన ఆర్థిక సంస్కరణలతో సమానమని వ్యవసాయ వ్యయాలు, ధరల కమిషన్ మాజీ చైర్మన్ అశోక్ గులాటీ అభివర్ణించడంలో అతిశయోక్తి లేదు.


కొంతమందికి జ్ఞానోదయం త్వరగా కలుగుతుంది. మరికొంతమందికి ఆలస్యంగా కలుగుతుంది. తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావుకు ఢిల్లీ వెళ్లి వచ్చిన తర్వాత జ్ఞానోదయం కలిగినట్లుంది. కేంద్రం ప్రవేశపెట్టిన వ్యవసాయ చట్టాలు రైతులకు ఎంతో నష్టం చేకూరుస్తాయని, వ్యవసాయం కార్పొరేట్ల చేతుల్లోకి పోతుందని తీవ్రంగా విమర్శించడమేగాక కేసీఆర్ ‘ఇవి బిల్లులు కావు, చక్కెర పూసిన టాబ్లెట్లు (సుగర్ కోటెడ్ పిల్స్)’ అని వ్యాఖ్యానించారు. పార్లమెంటులో ఈ బిల్లులను బలంగా వ్యతిరేకించాలని ఆయన టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత కె. కేశవరావును ఆదేశించారు. ఆ తర్వాత వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా తెలంగాణ అంతటా బంద్‌కు పిలుపునిచ్చి తన కుమారుడు కేటిఆర్, కుమార్తె కవితలతో పాటు మంత్రులు, నేతలతో బంద్ అమలు చేయించేందుకు ప్రయత్నించారు. ఈ బంద్‌ను ప్రజలు తీవ్రంగా ప్రతిఘటించడంతో కేసిఆర్ ఖంగు తిన్నట్లు కనిపించింది. ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షాలతో సమావేశమయిన తర్వాత కేసీఆర్ కళ్లు మరింత తెరిచినట్లు స్పష్టమవుతోంది. నిన్న మొన్నటి వరకూ నియంత్రణ సాగు పేరుతో కేసీఆర్ ఫలానా పంట మాత్రమే వేయాలంటూ రైతుల పట్ల నియంతలాగా వ్యవహరించారు. కేసీఆర్ వైఖరి వల్ల అకాల వర్షాలు పడి ప్రత్తి రైతులు తీవ్రంగా నష్టపోయారు. అదే విధంగా తెలంగాణ సన్నాల పేరుతో 50 లక్షల ఎకరాల్లో వరిని పండించాలని ఆదేశించారు. మక్కలు వేయవద్దని హుకుం జారీ చేశారు. తన మాట వినని వారికి రైతు బంధు క్రింద సహాయం చేయబోమని ప్రకటించారు. ఇప్పుడు మద్దతు కొనుగోళ్ల ద్వారా తమకు రూ.7,700 కోట్ల నష్టం వచ్చిందని, ఇకనుంచి తాము పంటలు కొనుగోలు చేయబోమని, మీ ఇష్టం వచ్చిన చోట పంట అమ్ముకొమ్మని చెబుతున్నారు. సరే, ఇప్పటికైనా కేసీఆర్కు జ్ఞానోదయం నిజంగా కలిగి కేంద్ర చట్టాల ప్రాధాన్యతను గుర్తించి వాటిని అమలు చేయాలని నిర్ణయించడం స్వాగతించాల్సిన విషయమే. అయితే కేసీఆర్ పాత చరిత్ర నేపథ్యంలో ఎన్ని సార్లు మడమ తిప్పారో, ఎన్ని సార్లు మాట మార్చారో ప్రజలకు తెలియనిది కాదు కనుక ఆయన ప్రతి అడుగునూ ప్రజలు నిశితంగా గమనిస్తూనే ఉంటారు. కేసీఆర్ లాగా ప్రధాని మోదీ రైతులను శాసించడమో, లేక వారిని గాలికి వదిలివేసి చేతులు దులుపుకోవాలనుకోవడమో చేయడం లేదు. మద్దతు ధర ఉంటుందని, ఆహార ధాన్యాల సేకరణ ఆగదని స్పష్టం చేస్తూనే రైతుకు స్వేచ్ఛగా అమ్ముకునేందుకు విస్తృత అవకాశాలు, అద్భుతమైన మౌలిక సదుపాయాలను కల్పించాలని మోదీ బలంగా నిర్ణయించుకున్నారు. 


కర్ణాటకలో జనతాదళ్ (ఎస్) నేత కుమార స్వామి కూడా సాగు చట్టాలపై మాట మార్చి రైతులు ఈ చట్టాల విషయంలో స్వేచ్ఛా దృక్పథంతో ఆలోచించాలని అన్నారు. రైతులను విష వలయం నుంచి తప్పించి వారికి సంక్షేమాన్ని కలిగించే విషయంలో ఈ చట్టాలతో చేసే ఏ ప్రయోగాలకైనా మనం సిద్ధ పడాలని కుమార స్వామి అనడం దేశ వ్యాప్తంగా మోదీ వ్యతిరేకుల్లో ఏర్పడుతున్న పునరాలోచనకు సంకేతంగా మనం భావించవచ్చు. బిజేపీయేతర పార్టీల్లో బిజెడి, అన్నాడిఎంకెతో పాటు ఇప్పుడు టీఆర్ఎస్, జనతాదళ్ (ఎస్) కూడా సాగు చట్టాలకు అనుకూలంగా మారాయి. వ్యవసాయమంత్రి నరేంద్రసింగ్ తోమర్‌తో చర్చలు జరిపిన తర్వాత ఉత్తరప్రదేశ్, బీహార్, హర్యానా, కేరళ, తమిళనాడు, తెలంగాణ రాష్ట్రాలకు చెందిన పది రైతు సంఘాలు ‘అఖిల భారత కిసాన్ సమన్వయ కమిటీ’ పేరుతో సాగు బిల్లులకు తమ మద్దతును ప్రకటించడం సంతోషకరమైన పరిణామమే. 


సంస్కరణలు అమలు చేసేవారు దూర దృష్టితో ఆలోచించి, అనేకమంది ఆర్థిక వేత్తలను సంప్రదించి ముందడుగు వేస్తారు. పీవీ నరసింహారావు అత్యంత కీలకమైన నిర్ణయాలు తీసుకున్నప్పుడు కాంగ్రెస్ పార్టీ నేతలే అనేక మంది వాటిని వ్యతిరేకించారు. వామపక్షాల ప్రేరణతో అర్జున్ సింగ్ ఉత్తరాల మీద ఉత్తరాలు రాశారు. పీవీ గద్దె దిగిన వెంటనే అర్జున్ సింగ్ సోనియా శిబిరంలో చేరిపోయారు. ఇవాళ దేశం అంతా సంస్కరణల ఫలితాలను అనుభవిస్తున్న తర్వాత తామే ఆ సంస్కరణలను ప్రవేశపెట్టామని కాంగ్రెస్ నేతలు గొప్పలు చెప్పుకుంటున్నారు. అదే పీవీ వ్యవసాయ సంస్కరణలను కూడా ప్రవేశపెట్టారన్న విషయం వారికి తెలియనిది కాదు. అంతర్జాతీయ వర్తక నిబంధనలకు అనుగుణంగా ‘గాట్’ (జనరల్ అగ్రిమెంట్స్ ఆన్ ట్రేడ్ అండ్ టారిఫ్) ఒడంబడికపై పీవీ ప్రభుత్వం సంతకాలు చేయాలని నిర్ణయించినప్పుడు కూడా వేలాది రైతులు ఢిల్లీ సరిహద్దుల్లో ధర్నా చేసి ఒప్పంద ముసాయిదా పత్రాలను చింపి దగ్ధం చేశారు. రైతుల ప్రయోజనాలకు ఎటువంటి నష్టం చేకూరనిచ్చే ప్రసక్తి లేదని పీవీ నరసింహారావు నాడు పార్లమెంట్‌లో హామీ ఇచ్చారు. అంతర్ రాష్ట్ర వర్తక ఆంక్షలను కూడా ఆయన సడలించారు. ఇదే విషయాన్ని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు హైదరాబాద్‌లో జరిగిన ఒక పుస్తకావిష్కరణ సభలో వెల్లడిస్తూ వ్యవసాయ సంస్కరణలకు నాంది పలికింది కూడా పీవీయేనని స్పష్టం చేశారు. 


2005లో ‘వ్యవసాయ ఉత్పత్తుల మార్కెట్ కమిటీ’లను కాంగ్రెస్ ప్రభుత్వమే రద్దు చేసింది. దేశమంతటా ఈ కమిటీలను రద్దు చేస్తామని నాడు రాహుల్ గాంధీ స్వయంగా ప్రకటించారు. ఈ నిర్ణయాన్ని హర్యానాలో భూపేంద్ర సింగ్ హూడా ప్రభుత్వం అమలుపరచింది. ఇవాళ పంజాబ్‌లో కమిషన్ ఏజెంట్లు, వారిచ్చే కమీషన్లపై ఆధారపడుతున్న పంజాబ్ ప్రభుత్వం రైతుల నిరసనకు నిధులు, వసతులు కల్పిస్తున్న విషయాన్ని గుర్తుంచుకోవాలి. కేంద్రమే పంజాబ్‌లో వరిధాన్యాన్ని గత ఏడాది రూ.వేయి కోట్ల మేరకు మధ్య దళారులకు చెల్లించి కొనుగోలు చేసిందంటే ఆశ్చర్యకరంగా ఉంటుంది. ఎలాంటి మధ్య దళారుల ప్రమేయం లేకుండా రైతులకు నేరుగా అమ్ముకునే అవకాశం కల్పిస్తే వారికి అధికంగా గిట్టుబాటు అవుతుందని మోదీ విశ్వసించడంలో తప్పేమున్నది? ఒక లక్ష్యం, ఒక దృక్పథం ఉన్నందువల్లే అధికారంలోకి వచ్చినప్పటి నుంచీ మోదీ 2022 కల్లా రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తానంటూ ప్రకటిస్తున్నారు. తాజాగా ‘మన్ కీ బాత్’ పేరుతో ఆయన దేశ ప్రజలనుద్దేశించి చేసిన ప్రసంగంలో కశ్మీర్ లో కుంకుమ పువ్వుకు అంతర్జాతీయ మార్కెట్‌లో ఎంత డిమాండ్ ఉన్నదో వివరించారు.


పీవీ నరసింహారావు, వాజపేయి మార్గంలోనే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కూడా ప్రజలకు మేలు చేయాలని భావించారు. వ్యవసాయ సంస్కరణలను అమలు చేయడం ద్వారానే రైతులకు మంచి ప్రయోజనాలు చేకూరుతాయని ఆయన విశ్వసించినందువల్లనే దృఢ చిత్తంతో సంస్కరణలను అమలు చేయాలని నిర్ణయించారు. అందుకే మోదీ చేపట్టిన సంస్కరణలు 1991లో పీవీ ప్రభుత్వం చేపట్టిన ఆర్థిక సంస్కరణలతో సమానమని వ్యవసాయ వ్యయాలు, ధరల కమిషన్ మాజీ చైర్మన్ అశోక్ గులాటీ అభివర్ణించడంలో అతిశయోక్తి లేదు.రాజకీయాల్లో విధానాల పట్ల విభేదాలు ఉండడం సహజమే కాని ఒక సారి మెజారిటీ ప్రజలు ఓట్లు వేసి గెలిపించిన ఒక పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ పార్టీకి దేశ విధానాలకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకునే అధికారం ఉంటుందని ప్రతిపక్షాలు గ్రహించి తమ అభిప్రాయభేదాలను ఒక స్థాయి వరకే పరిమితం చేసుకోవాలి. కేసిఆర్, కుమారస్వామి తదితరులకు ఆలస్యంగా ఈ వివేకం ఏర్పడింది. మిగతా వారికి కూడా ఆ వివేకం ఏర్పడక తప్పదు.


వై. సత్యకుమార్

(బిజెపి జాతీయ కార్యదర్శి)

Updated Date - 2020-12-29T09:08:20+05:30 IST