కుల ఎజెండా త్యజిస్తే మేలు

ABN , First Publish Date - 2020-10-31T06:00:05+05:30 IST

ప్రజలకు తమ కులాన్ని నిరంతరం గుర్తుచేయడం, దాన్ని తమ రాజకీయ లబ్ధి కోసం ఉపయోగించుకోవడం అనేది బ్రిటిష్‌ వారి...

కుల ఎజెండా త్యజిస్తే మేలు

ఆంధ్ర రాష్ట్రంలో కులవ్యవస్థను కూకటివేళ్లతో పెకలించడానికి పూనుకున్నదెవరు? డాక్టర్‌ అంబేడ్కర్‌ కన్నా ముందుగానే కులనిర్మూలన జరగాలంటే కులాంతర వివాహాలు జరగాలని ప్రతిపాదించిందెవరు? ప్రతిపాదనే కాదు, ఆ మేరకు పెళ్లిళ్లు చేసుకున్నదెవరు? ఈ ప్రశ్నలన్నింటికీ ఒక్కటే సమాధానం-– కమ్యూనిస్టులు. పలువురు కమ్యూనిస్టు నేతలు కులాంతర మతాంతర వివాహాలు చేసుకున్నారు. తమ పిల్లలకూ చేశారు.  కులరహితంగా జీవించే అలాంటి కమ్యూనిస్టులపై కులముద్ర వేయడమేమిటి?


ప్రజలకు తమ కులాన్ని నిరంతరం గుర్తుచేయడం, దాన్ని తమ రాజకీయ లబ్ధి కోసం ఉపయోగించుకోవడం అనేది బ్రిటిష్‌ వారి నుంచి నేటి మన పాలకవర్గాల వరకూ కొనసాగుతూనే ఉంది. ఈ క్రమంలోనే కమ్యూనిస్టు నేతలపై దుష్ప్రచారం జరుగుతోంది. ముఖ్యంగా ‘నారాయణ, రామకృష్ణ(ఈయన కులాన్ని కూడా మార్చేసి చౌదరి తగిలిస్తున్నారు)- చంద్రబాబును మోస్తున్నారు, నారాయణ కులోన్మాది’ అనే దుర్మార్గమైన విష ప్రచారాన్ని మీడియాలోనూ, సోషల్‌ మీడియాలోనూ చేస్తున్నారు. ఇదంతా రాజకీయంగా ఎదుర్కొనలేని పిరికిపందల చర్య. రాజకీయాల్లో తలెత్తిన దుష్పరిణామం. దీనిపై విస్తృత చర్చ జరగాలి. ఎందుకంటే, ఎవరు పాలకులను విమర్శించినా, వారికి కులాన్ని అంటగట్టి తప్పుడు ప్రచారం సాగించే ప్రమాదకరమైన ధోరణి ప్రబలుతోంది. ఇది ప్రజాస్వామ్య రాజకీయాలకు చేటు చేస్తుంది. కులాన్నీ, మతాన్నీ ప్రేరేపించడం ద్వారా మనిషి వివేకాన్ని కోల్పోయేలా చేయడం చాలా తేలిక. ఇది ఎంతటి ప్రమాదకారో డాక్టర్‌ లోహియా ఆనాడే గ్రహించారు. అందుకే ‘భారతదేశంలో బ్రిటిష్‌ పాలన మతం అంశాన్ని ఉపయోగించుకున్న మాదిరిగానే కుల అంశాన్ని కూడా ఉపయోగించుకున్నది. కులానికి వ్యతిరేకంగా తిరుగుబాటు భారతదేశ పునరుత్థానం అవుతుందని’ లోహియా చెప్పారు.


ఈ దేశంలో ముఖ్యంగా ఆంధ్ర రాష్ట్రంలో కులవ్యవస్థను కూకటివేళ్లతో పెకలించడానికి పూనుకున్నదెవరు? డాక్టర్‌ అంబేడ్కర్‌ కన్నా ముందుగానే కులనిర్మూలన జరగాలంటే కులాంతర వివాహాలు జరగాలని ప్రతిపాదించిందెవరు? ప్రతిపాదనే కాదు, ఆ మేరకు పెళ్లిళ్లు చేసుకున్నదెవరు? ఈ ప్రశ్నలన్నింటికీ ఒక్కటే సమాధానం- కమ్యూనిస్టులు. అనేకమంది కమ్యూనిస్టు నేతలు కులాంతర మతాంతర వివాహాలు చేసుకున్నారు. తమ పిల్లలకూ చేశారు. ఆ క్రమంలోనే మా అబ్బాయి, అమ్మాయి- ఇద్దరికీ కులాంతర వివాహాలను నేనే దగ్గరుండి చేశాను. కులరహితంగా జీవించే కమ్యూనిస్టులపై కులముద్రవేయడం సూర్యునిపై ఉమ్మివేయడమే కాదా!


రాజకీయ విధానపరంగా చూసినప్పుడు 2014లో కాంగ్రెస్‌, టీడీపీలకు వ్యతిరేకంగా చిరంజీవి పీఆర్‌పీతో కలిసి మూడో ఫ్రంట్‌ కోసం ప్రయత్నించినది సీపీఐ కాదా! కానీ, కేంద్ర పార్టీ ఆదేశాలతో వెనక్కి వచ్చాం. అలాగే 2019లో పవన్‌కళ్యాణ్‌తో సీపీఐ, సీపీఐ(ఎం)లు కలిసి పనిచేశాయి. ఏ కులప్రాతిపదిన వారితో కమ్యూనిస్టులు జతకట్టారు? అప్పుడు ఎవరూ ఈ కుల ప్రస్తావన చేయలేదే? 2014, 2019లో కమ్యూనిస్టులు చంద్రబాబుతో పొత్తు పెట్టుకోలేదే! అంటే తమకు అనుకూలంగా ఉంటే కమ్యూనిస్టులు కులరహితులూ, వ్యతిరేకంగా ఉంటే కులోన్మాదులా? చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు ఈ వైఎస్సార్‌ పార్టీ ఏం చేసింది? అసెంబ్లీని అధికార పార్టీకి గుత్తకు అప్పగించి పాదయాత్ర పేరిట ఊళ్లవెంట పడింది. ఓ ప్రతిపక్షం చేయాల్సిన పని ఇదేనా!? చంద్రబాబును ఆనాడు నిలదీసింది కమ్యూనిస్టులే. రామకృష్ణను అనంతపురం జైల్లో పెట్టించిందెవరు? చంద్రబాబు కాదూ? అంతేకాదు, చంద్రబాబు సర్కారు చేపట్టిన విద్యుత్‌ సంస్కరణలకు వ్యతిరేకంగా పోరాడింది సీపీఐ, సీపీఐ(ఎం)లే కదా. ఆ పోరాటంలో కాంగ్రెస్‌ నేతగా వైఎస్‌ రాజశేఖరరెడ్డి కూడా కలిసివచ్చారు కదా! అప్పుడు నా కులం గుర్తుకు రాలేదా? రామోజీ ఫిలింసిటీలో వంద మడకలు కట్టి దున్నిస్తామని, గుడిసెలు వేయిస్తామని ప్రకటిస్తే, అది సరికాదు, అసైన్డ్‌ భూమి ఎంత ఉంటే అంతకు రెట్టింపు వసూలు చేయాలని నేను ప్రకటించగానే, కొందరు నాయకులకు పార్టీలకు నా కులం గుర్తువచ్చి దాన్ని ముందుకు తెచ్చి మాట్లాడారు. 


కమ్యూనిస్టులు తమ రాజకీయ విధానాలకు అనుగుణంగా ప్రకటనలు చేస్తారు, ఉద్యమిస్తారు తప్ప కులప్రాతిపదికపై కాదు అని స్పష్టం చేస్తున్నాను. జగన్మోహనరెడ్డి అధికారంలోకి రాగానే తన కుత్సిత మస్తిష్కం నుంచి ఈ కులాల ఎజెండాను బయటకు తీసి ప్రచారం చేయడం పరాకాష్ఠకు చేరింది. ఇందుకు వారి కబోధిసైన్యం ఉండనే ఉందిగదా! ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా వారు చేసే తప్పిదాలను, పొరపాట్లను ఎత్తిచూపడం కమ్యూనిస్టుల సహజ పంథా. దాన్ని జగన్మోహన్‌రెడ్డి భరించలేకపోతున్నారు.


అమరావతి రాజధానిగా ఉండాలని ఇతక పార్టీల కన్నా ముందుగా తీర్మానం చేసింది సీపీఐనే. టీడీపీ ప్రభుత్వం అమరావతిని రాజధానిగా ప్రకటించింది. అప్పుడు జగన్‌ సమర్ధించారు. అంటే జగన్‌ చంద్రబాబును మోస్తున్నారని అర్థమా? అప్పుడూ ఇప్పుడూ సీపీఐ, అమరావతే రాజధానిగా కొనసాగాలనే ఒకే వైఖరితో ఉంది. జగన్‌ మాట తప్పారు, బాబు బజారుకెక్కారు. ఈ విషయంలో ఎవరిది సూత్రబద్ధ వైఖరి? రాజధాని విషయంలో చంద్రబాబు ఏ వైఖరి తీసుకున్నా, ఎప్పటికీ ఒకే వైఖరితో ఉండేది సీపీఐనే. ఎన్నికల కమిషనర్‌ విషయం తీసుకుందాం. రమేష్‌కుమార్‌ను అర్ధంతరంగా తొలగించే అధికారం ఒక్క పార్లమెంటుకు తప్ప రాష్ట్రపతికి కూడా లేదు. అయినా జగన్మోహన్‌రెడ్డి ఎన్నికల కమిషనర్‌ పదవీకాలాన్ని రద్దు చేయడం ఏకపక్ష నిరంకుశ చర్య కాదా? దీన్ని సహజంగానే సీపీఐ వ్యతిరేకించింది. దానికి కూడా కులాన్నంటగడితే ఎలా? సుప్రీం కోర్టు జడ్జీలపై ఆరోపణలు చేసే హక్కు ముఖ్యమంత్రికి ఉంది. అయితే దాన్ని ప్రెస్‌మీట్‌ పెట్టి వెల్లడించే సంప్రదాయం ఉందా? మాజీ మంత్రి అచ్చెన్నాయుడుపై చర్యను సీపీఐ తప్పుపట్టలేదు. కానీ అర్ధరాత్రి టెర్రరిస్టుపై దాడి చేసినట్లు చేయాల్సిన అవసరం ఏమిటని ప్రశ్నించింది. ఆపరేషన్‌ చేయించుకున్న వ్యక్తిని శ్రీకాకుళం నుంచి విజయవాడకు కారులో తీసుకుని వచ్చే విధానం మానవత్వంతో కూడుకున్నదా? రేపు మీరు ప్రతిపక్షంలో ఉంటే అప్పుడు అధికారంలో ఉన్నవారు ఇదే సంప్రదాయాన్ని కొనసాగిస్తే మీరు సహిస్తారా? అప్పుడు కూడా మేం ఇదే వైఖరి తీసుకుంటాం. తాజాగా గీతం విద్యాసంస్థలను అర్ధరాత్రిపూట వందల మంది బలగాలతో కూలగొట్టాలా? ప్రభుత్వ భూమిని ఆక్రమించుకుంటే భవనాలు కూలగొట్టడం ఎవరికి లాభం? దానికి పరిష్కారం ప్రభుత్వం వద్ద లేదా? ఇడుపులపాయ చరిత్రేమిటి? ఇప్పుడది పవిత్రస్థలం ఎలా అయింది? 


రాజకీయ వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికీ, విపక్షాల విమర్శలకు సమాధానం చెప్పలేని అసమర్థతను సమర్థించుకోవడానికి పాలక పార్టీలు కుల,మతాలను అడ్డంపెట్టుకోవడానికి ప్రయత్నిస్తాయని డాక్టర్‌ అంబేడ్కర్‌ చెప్పిన మాటలను నేడు మన రాష్ట్ర రాజకీయాలు నిజం చేస్తున్నాయి. ఇది సరైన రాజకీయ పంథా కాదు. ఇది ఆ పార్టీకీ, రాష్ట్ర ప్రయోజనాలకు ఏ మాత్రం మేలు చేయదు. కాబట్టి తప్పుడు కుల ఎజెండా నుంచి వైఎస్సార్‌సీపీ ఎంత తొందరగా బయటపడితే, దానికీ, రాష్ట్రానికి అంత మేలు!

డాక్టర్‌ కె. నారాయణ

సీపీఐ జాతీయ కార్యదర్శి

Read more