సమతుల్య అభివృద్ధి సాధ్యమయ్యేనా?

ABN , First Publish Date - 2020-08-20T06:19:13+05:30 IST

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల ‘అభివృద్ధి -రక్షణల’ పై ఒక్కొక్కటిగా వేటువేసుకుంటూ వస్తోంది. ‘వై.ఎస్‌.ఆర్‌ ఎ.పి వన్‌’ పేరుతో ఇటీవల ఆమోదించిన ‘2020–23 పారిశ్రామికాభివృద్ధి...

సమతుల్య అభివృద్ధి సాధ్యమయ్యేనా?

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇటీవల ఆమోదించిన ‘2020--–-23 పారిశ్రామికాభివృద్ధి విధానం’ చారిత్రక అన్యాయానికీ, వివక్షకీ గురైన ఎస్సీ, ఎస్టీ, బీసీలకు ప్రత్యేకదృష్టితో ఆర్థిక రంగంలోనైనా న్యాయం చేయాలనే రాజ్యాంగ లక్ష్యానికి తిలోదకాలు ఇచ్చింది. అనేకానేక కారణాలతో వైకాపాకు ప్రారంభం నుండీ అధికారంలోకి వచ్చేవరకూ వెన్నుదన్నుగా నిలిచిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల ‘అభివృద్ధి -రక్షణల’ పై రాష్ట్ర ప్రభుత్వం ఎన్నడూ లేని విధంగా వేటువేసింది.


ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల ‘అభివృద్ధి -రక్షణల’ పై ఒక్కొక్కటిగా వేటువేసుకుంటూ వస్తోంది. ‘వై.ఎస్‌.ఆర్‌ ఎ.పి వన్‌’ పేరుతో ఇటీవల ఆమోదించిన ‘2020–23 పారిశ్రామికాభివృద్ధి విధానం’లో ఈ వర్గాలకు సంబంధించి సూక్ష్మ, చిన్న, మధ్యతరగతి వ్యాపార పరిశ్రమల ఏర్పాటు అవకాశాల, అభివృద్ధి తల తీసినట్టయింది. గత ప్రభుత్వాలు రూపొందించిన ప్రోత్సాహకాలను వైకాపా ప్రభుత్వం మరింత పెంచుతుందని నమ్మిన బలహీనవర్గాలు గతంలోవున్న అవకాశాలనుకూడా ఎత్తివేయడం, తగ్గించివేయడంతో ఒక్కసారిగా హతాశులయ్యాయి. వైకాపా పాలన వున్నంత కాలం తాము సూక్ష్మ, చిన్న, మధ్యతరగతి వ్యాపార, సర్వీసు, పారిశ్రామిక రంగాల్లోకి అడుగుపెట్టే అవకాశం ఉండదని నిర్వేదం వ్యక్తంచేస్తున్నాయి. 2020–-23 విధానపత్రం ముందుమాటలో ముఖ్యమంత్రి పేర్కొన్న ‘ప్రాంతాల, సామాజిక వర్గాల సమతుల్య వృద్ధి’ అనేది వాస్తవంలో నీటిమూటేనని వాపోతున్నాయి. ‘అనేక భాగస్వామ్య పక్షాలతో విస్తృతంగా చర్చించి ఈ పాలసీని రూపొందించామని’ పేర్కొన్న పరిశ్రమలశాఖ మంత్రి మాటలు వట్టిబూటకమని, బలహీనవర్గాల ప్రతిపాదనలను పూర్తిగా నిర్లక్ష్యం చేశారని పేర్కొంటున్నాయి. ఈ విధానంలో వైకాపా ప్రభుత్వం తమను నమ్మించి వెన్నుపోటు పొడిచిందనే వేదనను బలహీనవర్గాలు వ్యక్తం చేస్తున్నాయి. కాంగ్రెస్‌ ప్రభుత్వాల హయాం నుంచీ మానవీయకోణంలో పేదలందరికీ అమలుచేస్తున్న సంక్షేమపథకాలకు స్వీయపేర్లు, రత్నాలపేర్లు పెట్టి తామే కొత్తగా అమలుచేస్తున్నట్లు, బలహీనవర్గాలకు చెందిన కోట్లాది మంది లబ్ధిపొందినట్లు సొంత మీడియాద్వారా వైకాపా ప్రభుత్వం డబ్బాకొట్టుకుంటోందని బలహీనవర్గాలు గ్రహిస్తున్నాయి.


రాష్ట్రాభివృద్ధికి, ఆదాయాల పెంపుకు, ఉపాధి అవకాశాల కల్పనకు పారిశ్రామికాభివృద్ధి ఎంతో కీలకమని భావిస్తున్న ప్రభుత్వాలు బడాపారిశ్రామిక వేత్తలకు సైతం పెద్దఎత్తున ప్రోత్సాహకాలు, రాయితీలు కల్పిస్తున్న విషయం అందరికీ తెలుసు. స్వయంగా బడా పారిశ్రామికవేత్త అయిన వై.ఎస్‌. జగన్మోహన్‌రెడ్డి తన నేతృత్వంలోని ప్రభుత్వం తెచ్చిన పారిశ్రామిక విధానం మాత్రం ముఖ్యంగా బలహీనవర్గాలపట్ల నిర్దయగా, కుటిలంగా వుందని చెప్పకతప్పదు.


2004 నుండి 2014 వరకూ అధికారంలో వున్న కాంగ్రెస్‌ ప్రభుత్వం అమలు చేసిన పారిశ్రామిక విధానంద్వారా ఎస్సీ, ఎస్టీలకు ప్రత్యేక ప్రోత్సాహకాలు, రాయితీలు అందించింది. రాష్ట్ర విభజన తర్వాత అధికారం చేపట్టిన టిడిపి ప్రభుత్వం కూడా ఈ ప్రోత్సాహకాలను మరింత పెంచడంతోపాటు బీసీలకు కూడా అమలుచేసింది. ఎస్సీ, ఎస్టీ, బీసీలకు సంక్షేమం, అభివృద్ధి రెండు కళ్ళుగా భావించి గత ప్రభుత్వాలు విధాన రూపకల్పనలు చేసాయి. సూక్ష్మ, చిన్న, మధ్యతరగతి వ్యాపారాల్లో బలహీనవర్గాల నుంచి కనీస ప్రాతినిధ్యం, భాగస్వామ్యం వుండేలా ప్రభుత్వ సాయం అందించాయి. కానీ నేటి వైకాపా ప్రభుత్వం మాత్రం బలహీనవర్గాల అభివృద్ధి కన్ను పొడిచింది. కేవలం సంక్షేమం,పెన్షన్లపై ఆధారపడి బతికే ఒంటికన్ను దుస్థితిని యథాతథంగా కొనసాగిస్తోంది. చారిత్రక అన్యాయానికీ, వివక్షకీ గురైన ఎస్సీ, ఎస్టీ, బీసీలకు ప్రత్యేకదృష్టితో ఆర్థిక రంగంలోనైనా న్యాయం చేయాలనే రాజ్యాంగ లక్ష్యానికి తిలోదకాలు ఇస్తోంది.


2015 నుండి 2020 వరకు ఎస్సీ, ఎస్టీ, బీసీలకు దక్కిన ప్రోత్సాహకాలను ప్రస్తుత వైకాపా ప్రభుత్వం 2020–-23 విధానంలోని ప్రోత్సాహకాలతో పోలిస్తే వైకాపా ప్రభుత్వం ఏవిధంగా బలహీనవర్గాల అభివృద్ధి, అవకాశాల వెన్నువిరిచే పనికి పూనుకుందో అర్థమవుతుంది.


2015-–20 విధానంలో సూక్ష్మ, చిన్నతరహా వ్యాపార    రంగాల్లో ఉత్పత్తి సంస్థలు ప్రారంభించేందుకు పెట్టుబడిగా ఎస్సీ, ఎస్టీ, బీసీలకు చెందిన స్త్రీ, పురుషులకు సమానంగా 75 లక్షల వరకు రుణంతోపాటు పురుషులకు 35శాతం, స్త్రీలకు 45శాతంగా సబ్సిడీ ప్రోత్సాహం వుంది. కానీ నేడు వైకాపా తెచ్చిన 2020-–23 విధానంలో ఉత్పత్తి సంస్థలకు రుణం పురుషులకు 20 లక్షలు మాత్రమే చేసి స్త్రీలకు 50లక్షలుగా నిర్ణయించి గతంకన్నా పురుషులకు 50లక్షలు, స్త్రీలకు 25 లక్షలు రుణం తగ్గించడంతోపాటు రాయితీలు కూడా పురుషులకు 15శాతం (20శాతం కోత), స్త్రీలకు 35శాతంగా (10శాతం కోత) తగ్గించివేసింది!


2015–-20 వరకు సేవారంగంలో (హొటల్స్‌, రెస్టారెంట్లు, ఆసుపత్రులు, మెడికల్‌ లాబ్స్‌, క్రేన్స్‌ తదితరాలు) కూడా రుణ అవకాశం 75లక్షల వరకు ఉండటంతోపాటు పురుషులకు 35, స్త్రీలకు 45శాతం సబ్సిడీ ప్రోత్సాహం అమలయింది. వైకాపా తెచ్చిన నేటి విధానంలో పూర్తిగా రుణ అవకాశాలను తొలగించేసింది. రుణమే లేనప్పుడు ఇక రాయితీల మాట వుండదు. ఇక బలహీనవర్గాలకు చెందిన వారెవరూ ప్రభుత్వసాయంతో సర్వీసు రంగంలో స్వయం ఉపాధి అవకాశాలు పొందే పరిస్థితి లేకుండా చేసింది.


2015-–20 వరకు ట్రాన్స్‌పోర్టు రంగంలో (క్యాబ్‌లు, టిప్పర్‌లు, లారీలు, బస్‌లు, నిర్మాణ పరికరాలు తదితరాలు) కూడా రుణంతోపాటు పురుషులకు 35శాతం, స్త్రీలకు 45శాతం రాయితీ అమలయింది. కానీ ప్రస్తుత వైకాపా తెచ్చిన విధానంలో రుణ అవకాశమే లేకుండా చేసింది. 2015-–20 వరకు విద్యుత్‌ వినియోగంపై ఒక యూనిట్‌కు రాయితీ 1రూ.50పై.లు చొప్పున 5 సంవత్సరాలవరకు రాయితీ కల్పిస్తే 2020-–23 నేటి విధానంలో యూనిట్‌కు రాయితీ 1రూ.25పైసలు చేసి ప్రతి యూనిట్‌పైన 25పైసల కోత విధించింది. 2015–-20 వరకు టర్మ్‌లోన్‌పై (పావలావడ్డీ) ఉత్పత్తిరంగంలో 9శాతం వరకూ వడ్డీరాయితీ అమలయితే ప్రస్తుత వైకాపా విధానంలో 3 శాతానికి (6శాతం కోత) తగ్గించివేసింది. 


అన్నిటికంటే ముఖ్యంగా 2015-–20 విధానంలో వ్యాపారం లేదా పరిశ్రమ ప్రారంభించిన ఆరు నెలలకు సబ్సిడీ రాయితీలు విడుదలచేసేవి. కానీ ప్రస్తుత 2020–-23 విధానంలో పరిశ్రమ లేదా వ్యాపారం ప్రారంభించి మూడు సంవత్సరాలు గడిచాక అదీ 80శాతం మెరిట్‌తో (ఉత్పత్తి, ఉపాధికల్పనలో) నడిపితేనే సబ్సిడీ రాయితీలు పొందటానికి అర్హత కల్పించారు. మధ్యలో ఏదైనా ఇబ్బంది వస్తే మూలపెట్టుబడి, ప్రభుత్వం నుంచి రావాల్సిన సబ్సిడీ మొత్తం కోల్పోవాల్సివస్తుంది. 2020-–23 విధానం వలన బలహీనవర్గాలకు ఏ బ్యాంకు కూడా రుణాలు ఇచ్చేందుకు ముందుకు వచ్చే ప్రశ్నే తలెత్తదు. 


వైకాపా ప్రభుత్వం తమకు కనీసం కోటి రూపాయల మేరకు రుణసదుపాయం పెంచుతుందని, మరిన్ని మెరుగైన ప్రోత్సాహకాలు అందిస్తుందని ఆశించిన ఎస్సీ, ఎస్టీ, బీసీలకు తీవ్ర ఆశాభంగం కలిగింది. అయితే ఈ విధానం మార్పుచేసి తమకు ప్రయోజనాలు కల్పించాలని బలహీనవర్గాల సంఘాలు ముఖ్యమంత్రికి విజ్ణప్తులు చేస్తున్నాయి. ఆయన కనికరించి మార్పులుచేస్తారో లేదో తెలీదు. ఇదిలావుంటే ఎస్సీ, ఎస్టీలకు మాత్రమే ఖర్చుచేయాల్సిన ఎస్సీ, ఎస్టీ ఉపప్రణాళిక నిధులను బడ్జెట్‌లో కేటాయింపులు చూపిస్తూ ఆచరణలో మాత్రం జనరల్‌ పథకాలకు మళ్ళిస్తోంది వైకాపా ప్రభుత్వం. ఎస్సీ కార్పొరేషన్‌లను మూడుగా విభజించి వాటికి నిధుల్లేకుండా చేసింది. గడచిన 14 నెలల్లో కార్పొరేషన్‌ల ద్వారా ఒక్క రుణసదుపాయమూ లేకుండా చేసిన చరిత్ర వైకాపా ప్రభుత్వానికే దక్కుతుంది. చివరకు ‘బెస్ట్‌ అవైలబుల్‌ స్కూల్స్‌’ పేరుతో చదువుకున్న ఎస్సీ, ఎస్టీ, పిల్లల రెసిడెన్షియల్‌ స్కూలు ఫీజులను కూడా గత 14 నెలలుగా ప్రభుత్వం చెల్లించలేదు. ఇలా ఇంకా అనేక ఉదాహరణలున్నాయి.


ప్రభుత్వ రంగంలో మాత్రమే రిజర్వేషన్ల ద్వారా అమలయ్యే బలహీనవర్గాల ఉద్యోగ అవకాశాలు ప్రైవేటీకరణ పరిణామాలతో పూర్తిగా తగ్గిపోయాయి. ఈ నేపథ్యంలో ఈ వర్గాల నిరుద్యోగ యువత ప్రభుత్వాలు ఇచ్చే ప్రోత్సాహాకాలతో ప్రత్యామ్నాయ బతుకు దెరువుగా సూక్ష్మ, చిన్న, మధ్యతరగతి వ్యాపార రంగాలవైపు ఆశగా అవకాశాలను వెతుక్కుంటున్నాయి. కానీ ఎపి ప్రభుత్వం తెచ్చిన నూతన పారిశ్రామిక అభివృద్ధి విధానం బలహీనవర్గాల నిరుద్యోగ యువత ఆశలను బుగ్గిపాలు చేసింది. అటు ప్రభుత్వ ఉద్యోగాలులేక, ఇటు స్వయం ఉపాధి పొందే చిన్న వ్యాపారమైనా చేసుకునేందుకు సహాయం అందక వీరి జీవితాలు మరింత అగమ్యగోచరం కానున్నాయి. డిగ్రీలు, పీజీలు, ఎంటెక్‌లు, డాక్టరేట్‌లు చేసికూడా వ్యవసాయ పొలాల్లో, ఇటుక బట్టీల్లో, హొటళ్ళలో, నిర్మాణరంగంలో రోజువారీ కూలిపనులకు పోయే దుస్థితి మరింత పెరగనుంది.


ఇంకోవైపు పేదలకు ఇళ్ళపట్టాల పంపిణీ పేరిట ఎస్సీ,  ఎస్టీలవద్దనున్న అసైన్డ్‌ భూములను ప్రభుత్వం బలవంతంగా లేదా ప్రలోభాలతో తీసుకుంటున్నదనే వార్తలు వస్తున్నాయి. 1989 ఎస్సీ, ఎస్టీ అత్యాచారాల నిరోధక చట్టం (2015 సవరణ ప్రకారం) ప్రకారం ఎస్సీ, ఎస్టీలకు చెందిన భూములను బలవంతంగాకానీ ప్రలోభాలతోకానీ లాక్కుంటే అది చట్టరీత్యా నేరం, శిక్షార్హం. అది ప్రభుత్వమైనా సరే. వైకాపా ప్రభుత్వం ఈ నేరం చేయడానికి వెనుకాడటంలేదు. ఇక అధికార పార్టీ నేతల ప్రత్యక్ష, పరోక్ష ప్రమేయంతో రాష్ట్రం నలుమూలలా దళితులు, ఆదివాసులపై దాడులు, హత్యలు జరుగుతూనేవున్నాయి. అసలు నేరస్థులపై ఎస్సీ, ఎస్టీ అత్యాచారాల నిరోధకచట్టం ప్రకారం కేసులు పెట్టకుండా వారిని రక్షిస్తోంది. స్వయంగా ఒక కేబినెట్‌ మంత్రి దళిత డాక్టర్‌ను, న్యాయమూర్తిని వాడోపిచ్చోడు, వీడోపిచ్చోడు అంటూ మాట్లాడి అవమానంచేస్తే అతనిపై ఫిర్యాదుచేసినా ప్రభుత్వం కిమ్మనడంలేదు. ఒక దళిత న్యాయమూర్తికి చెందిన భూమిని కూడా కబ్జాచేసేందుకు ప్రభుత్వ అండతో దౌర్జన్యంచేస్తున్న సంఘటనలు జరుగుతున్నాయి. ఇక ముస్లిం మైనార్టీల విషయంలో కేంద్రప్రభుత్వం తెచ్చిన సి.ఎ.ఎ, ఎన్పీఆర్‌ బిల్లులను పార్లమెంటులో బలపర్చిన వైకాపా రాష్ట్రంలోమాత్రం తాము దాన్ని అమలుచేయబోమంటూ మభ్యపెడుతోంది. బలహీనవర్గాలనుంచి ఉపముఖ్య మంత్రులు, హోంమంత్రి, మంత్రులు ఉన్నప్పటికీ వారి పరిస్థితి నోరుమెదపలేని దయనీయంగా వుంది. ఒక ఉపముఖ్యమంత్రి నోరువిప్పారు.. అదెలాఅంటే ‘నా చర్మం వలిచి జగన్మోహన్‌రెడ్డికి చెప్పులు కుట్టిస్తానని’ వాగ్దానం చేసేందుకు. మరికొందరు నోరువిప్పుతున్నారు.. ఎలాఅంటే ప్రభుత్వాన్ని నిలదీస్తున్న దళిత నాయకులను విమర్శించి రాజభక్తిని చాటుకునేందుకు. ఒక్కమాటలో అనేకానేక కారణాలతో వైకాపాకు ప్రారంభం నుండీ అధికారంలోకి వచ్చేవరకూ వెన్నుదన్నుగా నిలిచిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు ఆంధ్రప్రదేశ్‌ చరిత్రలో ఎన్నడూ జరగని విధంగా వారి ‘అభివృద్ధి -రక్షణల’పై వైకాపా ప్రభుత్వం వేటువేస్తోంది.

జంగా గౌతమ్

సామాజిక, రాజకీయ విశ్లేషకులు

Updated Date - 2020-08-20T06:19:13+05:30 IST