ఆహార సమృద్ధిలో ఆకలి రాజ్యం!

ABN , First Publish Date - 2020-04-25T06:00:20+05:30 IST

లాక్‌డౌన్ అమల్లో ఉన్నంత వరకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలకు తప్పనిసరిగా రెండు ఉపకారాలు చేసితీరాలి. అవి: ప్రభుత్వ, ప్రైవేట్ దుకాణాల నుంచి బియ్యం/ గోధుమలు, పప్పు ధాన్యాలు, వంట నూనె, ఉప్పు, చక్కెర మొదలైనవి కొనుగోలు...

ఆహార సమృద్ధిలో ఆకలి రాజ్యం!

లాక్‌డౌన్ అమల్లో ఉన్నంత వరకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలకు తప్పనిసరిగా రెండు ఉపకారాలు చేసితీరాలి. అవి: ప్రభుత్వ, ప్రైవేట్ దుకాణాల నుంచి బియ్యం/ గోధుమలు, పప్పు ధాన్యాలు, వంట నూనె, ఉప్పు, చక్కెర మొదలైనవి కొనుగోలు చేసుకునేందుకుపేద కుటుంబాలకు నగదు సమకూర్చాలి. రెండోది, 13 కోట్ల కుటుంబాలకు తిండిగింజలు, పప్పులు, నూనె మొదలైనవి సముచితరీతిలో ఉచితంగా ఇవ్వాలి. నిజానికి ఈ రెండు ఉపకారాలలో ఏదో ఒకటి గాక రెండూ చేయడం అన్ని విధాల శ్రేయస్కరం. చేయాలికూడా. ఎందుకంటే పేద భారతీయులకు ఈ దేశం చాలా రుణపడివున్నది.


వినియోగదారుల వ్యవహరాలు, ఆహార, ప్రజా పంపిణీ శాఖ మంత్రి రామ్ విలాస్ పాశ్వాన్ వెల్లడించిన వాస్తవాలు: ‘2020 ఏప్రిల్ 20 నాటికి భారత ఆహార సంస్థ గిడ్డంగుల్లో 524.5 లక్షల మెట్రిక్ టన్నుల ఆహార ధాన్యాల నిల్వలున్నాయి. ఈ నిల్వల్లో బియ్యం 289.5 లక్షల మెట్రిక్ టన్నులు కాగా గోధుమలు 235 లక్షల మెట్రిక్ టన్నులు. వీటితో పాటు 287 లక్షల మెట్రిక్ టన్నుల వడ్ల నిల్వలు కూడా వున్నాయి’.


స్వతంత్ర భారతదేశం ఇంచుమించు నాలుగో సార్వత్రక ఎన్నికల వరకు (1967) ఆహారరంగంలో పరాధీనగా వుండేది. పిఎల్ 480 కార్యక్రమం క్రింద అమెరికా నుంచి దిగుమతి చేసుకునే తిండిగింజల పైనే మనం ఆధారపడివుండేవాళ్లం. 1960 దశకం ద్వితీయార్ధంలో ఆహారోత్పత్తిలో స్వావలంబన సాధించడం ప్రారంభమయింది. అచిరకాలంలోనే ఇతరదేశాలకు ఆహారధాన్యాలను ఎగుమతి చేయగల సామర్థ్యాన్ని సంతరించుకున్నాం. స్వతంత్ర భారతదేశ విజయ గాథలలో ఇది ఒకటి. భారతీయులకు గర్వ కారణమైన సేద్య చరిత్ర ఇది. ఐదు దశాబ్దాల క్రితం ఆహారధాన్యాలకు మనం ఎంతగా నకనకలాడిపోయే వాళ్ళమో ఈ తరం వారికి తెలియకపోవచ్చు. అమెరికా నుంచి ఆహారధాన్యాలతో వచ్చిన నౌకలు మన ఓడరేవుల్లో లంగరు వేయగానే అందులోని ధాన్యాన్ని దేశంలోని వివిధ ప్రాంతాలకు వెన్వెంటనే రవాణా చేయడం జరిగేది. మరింత స్పష్టంగా చెప్పాలంటే మనం ఒకనాడు ‘నౌక నుంచి నోటికి’ అన్న చందంగా బతికాం! హరిత విప్లవం ఈ దుస్థితిని శాశ్వతంగా నిర్మూలించింది.

మన దేశంలో ప్రజాపంపిణీ వ్యవస్థ (పిడిఎస్)ను 1942లో ప్రవేశపెట్టారు. అందుబాటులో వున్న ఆహార ధాన్యాలను నిర్దిష్ట పరిమాణంలో అందరికీ సమకూర్చే విధానమిది. ఏడవ పంచవర్ష ప్రణాళిక కాలం (1985----–-90)లో పిడిఎస్‌కు శాశ్వత ప్రతిపత్తిని సమకూర్చారు. దేశ ప్రజలనందరినీ దీని పరిధిలోకి తీసుకొచ్చారు. పిడిఎస్‌తో రెండు ప్రయోజనాలు సమకూరుతున్నాయి. ఆహార ధాన్యాల ఉత్పత్తి అంతకంతకూ పెరిగిపోతుండడంతో రైతుల వద్ద విక్రయింపదగిన ధాన్యం అపారంగా మిగిలిపోసాగింది. ఉత్పత్తిదారుల నుంచి ధాన్యాన్ని సరసమైన, ధరలకు సేకరించేందుకు ఒక వ్యవస్థ అవసరమయింది. ఈ అవసరాన్ని తీర్చేందుకు భారత ఆహార సంస్థ (ఎఫ్‌సిఐ) నేర్పాటు చేశారు. ఈ సంస్థ, కనీస మద్దతు ధర (ఎమ్‌ఎస్‌పి) నివ్వడం ద్వారా రైతుల నుంచి ఆహారధాన్యాలను సేకరిస్తుంది. మరో లక్ష్యం ఖరీఫ్, రబీ పంటల నూర్పిళ్ళ అనంతరం ధాన్యాన్ని నిల్వ చేసి ఏడాది పొడుగునా అందుబాటులో ఉండేలా ఆ తిండి గింజలను నెలనెలా రాష్ట్రాలకు అవసరమైన పరిమాణంలో పంపిణీ చేయాలి. దీనితో పాటు ఆహారధాన్యాల ధరలు నిలకడగా ఉండేలా చేయడం. ఆహార ధాన్యాల పంపిణీ ఒక సంక్లిష్ట వర్గీకరణ వ్యవస్థ, దేశ జనాభాలోని వివిధ వర్గాల వారికి చేసే సరఫరాల పైన ఆధారపడివున్నది. దారిద్ర్య రేఖకు ఎగువ (ఎపిఎల్), దారిద్రరేఖకు దిగువ (బిపిఎల్‌) వర్గాల వారికి, అంత్యోదయ అన్నా యోజన లబ్ధిదారులతో పాటు బహిరంగ విపణిలో విక్రయాలకు పంపిణీ చేయవలసివుంటుంది.
ఇంతకూ భారత ఆహార సంస్థ గిడ్డంగులలోని ఆహార ధాన్యాల నిల్వలు ఎవరివి? వాటి ‘సొంతదారు’ ఎవరు? ఇదొక మౌలిక ప్రశ్న. ఎవరూ ఎన్నడూ అడగని ప్రశ్న.

ఆ ఆహార నిల్వల యజమాని తానేనని కేంద్ర ప్రభుత్వం/ ఎఫ్‌సిఐ భావిస్తున్నది. ధాన్య సేకరణ, నిల్వ, పంపిణీ బాధ్యతలతో పాటు ఏదైనా నష్టం జరిగితే జవాబుదారీ కూడా తానే గనుక ఆ నిల్వలకు తానే సొంతదారునని కేంద్ర ప్రభుత్వం/ ఎఫ్‌సిఐ విశ్వసిస్తుంది. అయితే రాష్ట్ర ప్రభుత్వాల సొమ్ముతో తాము కొనుగోలు చేసిన ధాన్యానికి తామే యజమానులమని రాష్ట్ర ప్రభుత్వాలు భావిస్తున్నాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వాదనలు సమంజసమైనవి కావు. ఎందుకంటే ఆ ఆహార ధాన్యాల నిల్వలు భారత ప్రజలవి. ప్రజలే వాటి యజమానులు. రైతులూ, వ్యవసాయ కూలీలూ ఆరుగాలమూ శ్రమించి, పండించిన సిరులవి. పన్ను చెల్లింపుదారుల సొమ్ముతో ఆ ధాన్యాన్ని సేకరించి, నిల్వ చేయడం జరిగింది. ఎఫ్‌సిఐ కార్యకలాపాల వల్ల లేదా రాష్ట్ర పౌర సరఫరాల సంస్థల వల్ల సమకూరే లాభాలు లేదా వాటిల్లే నష్టాలు ప్రభుత్వ ఖజానాకు లాభాలు లేదా నష్టాలుగా పరిగణించవలసివున్నది. ఆహార ధాన్యాల నిల్వలు భారత ప్రజలవి అయితే వాటిపై మొదటి హక్కు నిస్సందేహంగా భారత ప్రజలదే. ఈ మౌలిక సత్యాన్ని మనస్సులో ఉంచుకుంటే ఈ క్రింది ప్రశ్నకు సులువుగా సమాధానమివ్వవచ్చు: మహమ్మారుల ప్రబలిన ఆపత్సమయంలో, దేశ వ్యాప్త లాక్‌డౌన్ అమలులో ఉన్న తరుణంలో, దేశ జనాభాలో ఆర్థికంగా వెనుకబడివున్న సగం మందికి అంటే 13 కోట్ల కుటుంబాల వారి ఆకలిదప్పులను నివారించడానికి ప్రభుత్వం ఏమి చేయాలి?

కరోనా వైరస్ సంక్షోభంలో దేశ ప్రజలు కొట్టు మిట్టాడుతున్నారు. లక్షలాది కుటుంబాలకు నగదు కొరవడింది. వారు ఆహారాన్ని సమకూర్చుకోలేకపోతున్నారు. ఆహారమూ, డబ్బూ లేకుండా ఒంటరిగానో లేదా కుటుంబంతో పాటు గృహ నిర్బంధంలో ఉండిపోవడం కంటే ఒక వ్యక్తి ఎదుర్కొనే దుస్థితి మరొకటి ఏమి వుంటుంది? పేదలు తమ ఆత్మాభిమానాన్ని చంపుకుని ప్రభుత్వం లేదా ప్రైవేట్ సంస్థలు సమకూరుస్తున్న ఉచిత ఆహారం కోసం బారులు తీరుతున్నారు. ముందుగా వండిన ఆహార ఉచిత పంపిణీ సవ్యంగా సాగదు. ఆ ఆహారం రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలకూ చేరదు. ఆహార నాణ్యత నాసిరకంగా ఉంటుంది. ఆహార పరిమాణం ఆకలి తీర్చగలిగేదికాదు. కుటుంబంలో వృద్ధులు, బాలలు వుంటే ఆహారం కోసం వారు పంపిణీ ప్రదేశం వద్ద క్యూలో నుంచోలేరు. వారి కోసం అదనపు ఆహారానికై, ఇతర సభ్యులు బిచ్చమెత్త వలసివుంటుంది. మన దేశ ప్రజలలో, ముఖ్యంగా బాలల్లో పోషకాహార లోపం తీవ్రస్థాయిలో వున్నది. ఈ లోపాన్ని నివారించకపోతే ఆకలి సమస్య మరింతగా పెరిగిపోయే అవకాశమున్నది. ఈ పరిస్థితి అంతిమంగా ఆకలి చావులకు దారితీసే అవకాశం ఎంతైనా వున్నది. ఎంత మంది ఆకలి మంటలతో చనిపోతున్నారో మనకు తెలియదు. ఎందుకంటే ఆకలి చావులు సంభవించినట్టు ఏ రాష్ట్ర ప్రభుత్వమూ అంగీకరించదు కదా.

విషాద వాస్తవాలు వింతగా ఉంటాయి సుమా! మన దగ్గర ఆహార ధాన్యరాశులు అపారంగా వున్నాయి. తిండిగింజలను ప్రజలకు చేరవేసే ప్రభుత్వ, ప్రైవేట్ దుకాణాల వ్యవస్థ ఉన్నది. అయినా లక్షలాది కుటుంబాలు ఆకలిదప్పులతో నకనకలాడుతున్నాయి! లాక్‌డౌన్ అమల్లో ఉన్నంత వరకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలకు తప్పనిసరిగా రెండు ఉపకారాలు చేసితీరాలి. అవి: ప్రభుత్వ, ప్రైవేట్ దుకాణాల నుంచి బియ్యం/ గోధుమలు, పప్పు ధాన్యాలు, వంట నూనె, ఉప్పు, చక్కెర మొదలైనవి కొనుగోలు చేసుకునేందుకు పేద కుటుంబాలకు నగదు సమకూర్చాలి. ఆ దుకాణాలకు కొనుగోలుదారుల అవసరాలకు సరిపడే విధంగా ఆ దుకాణాలకు నిత్యావసర సరుకుల సరఫరా జరగాలి. దీనితో పాటునో, మరో ప్రత్యామ్నాయంగానో 13 కోట్ల కుటుంబాలకు తిండిగింజలు, పప్పులు, నూనె మొదలైనవి సముచితరీతిలో ఉచితంగా ఇవ్వాలి. ప్రస్తుత సంక్షోభ వేళ మన ప్రజలకు ఈ ఉపకారాలు చేయడం అసాధ్యమేమీ కాదు. కుటుంబానికి రూ.5000 చొప్పున నగదు సమకూర్చడం జరిగితే అందుకయ్యే వ్యయం గరిష్ఠంగా రూ.65,000 కోట్ల మేరకు వుంటుంది. మే నెలాఖరు వరకు ఈ సహాయాన్ని అందించాలి. అలా కాకుండా 13కోట్ల కుటుంబాలకు నిత్యావసర సరుకులను ఉచితంగా సరఫరా చేయదలుచుకుంటే కుటుంబంలోని ప్రపతి వ్యక్తికీ 10 కిలోల చొప్పున ఇచ్చేందుకు మొత్తం 65 లక్షల మెట్రిక్ టన్నుల ఆహార ధాన్యాలు పంపిణీ చేయవలసివుంటుంది. వీటితో పాటు స్వల్ప పరిమాణంలో ఉప్పు, పప్పులు, చక్కెర మొదలైనవి సమకూర్చాలి. నిజానికి ఈ రెండు ఉపకారాలలో ఏదో ఒకటి గాక రెండూ చేయడం అన్ని విధాల శ్రేయస్కరం. చేయాలికూడా. ఎందుకంటే పేద భారతీయులకు ఈ దేశం చాలా రుణపడివున్నది. కోట్ల కుటుంబాలు ఆకలి మంటలతో హాహాకారాలు చేస్తుండగా ధనాన్ని ఆదా చేయడం, ఆహార ధాన్యాలను అక్రమంగా నిల్వ చేయడమంటే నిర్దయగా వ్యవహరించడమే అవుతుంది. ప్రజాస్వామ్య పాలకులకు ఇది భావ్యమేనా?

పి. చిదంబరం

(వ్యాసకర్త కేంద్ర మాజీ మంత్రి,
కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకులు)

Updated Date - 2020-04-25T06:00:20+05:30 IST