కార్మిక సంఘాలపై అనుచిత వ్యాఖ్య
ABN , First Publish Date - 2020-12-05T06:22:52+05:30 IST
ప్రొఫెసర్ హరగోపాల్ తమ ‘సంస్కరణల వంచనతోనే ‘సాగు’ సమరం’ (డిసెంబర్ 3, ఆంధ్రజ్యోతి) వ్యాసంలో, ‘ప్రపంచ వాణిజ్య సంస్థల...

ప్రొఫెసర్ హరగోపాల్ తమ ‘సంస్కరణల వంచనతోనే ‘సాగు’ సమరం’ (డిసెంబర్ 3, ఆంధ్రజ్యోతి) వ్యాసంలో, ‘ప్రపంచ వాణిజ్య సంస్థల షరతుల ప్రకారమే విద్యా, వైద్యం, ఇన్సూరెన్స్, బ్యాంకింగ్, టెలికమ్యూనికేషన్ లాంటి అన్ని రంగాలలోకి కార్పొరేట్ పెట్టుబడులు ప్రవేశించిన పర్యావసానాన్ని ఇప్పుడు చూస్తున్నాము. అప్పుడే వీటిని వ్యతిరేకించవల్సిన కార్మిక సంఘాలు ఇప్పుడు మేల్కొని మొన్న సమ్మె చేశాయి. యాదృచ్ఛికంగా రైతులు, కార్మిక సంఘాలు ఒకే సమయంలో ప్రతిఘటించటం ఆహ్వానించదగిన మార్పే’ అని పేర్కొన్నారు. ఇది వాస్తవానికి దూరమైన అభిప్రాయం.
1991లో నూతన ఆర్థిక సంస్కరణలను ప్రవేశపెట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు ఎఐటియుసితో సహా 10 కార్మిక సంఘాలు; బ్యాంకింగ్, ఇన్సూరెన్స్, కేంద్ర కార్మిక ఉద్యోగుల ఫెడరేషన్లు, ప్రభుత్వరంగ సంస్థల ఉద్యోగసంఘాలు ప్రపంచీకరణ విధానాలకు వ్యతిరేకంగా 20 సార్లు దేశవ్యాప్త సమ్మెలు నిర్వహించాయి. ఈ ఏడాదిలోనే జనవరి 8న, నవంబర్ 26న దేశవ్యాప్త సమ్మెలు జరిగాయి. గత 29 సంవత్సరాల్లో నూతన ఆర్థిక విధానాలకు వ్యతిరేకంగా సమ్మెలే కాకుండా అనేక మార్లు దేశవ్యాప్తంగా ధర్నాలు, నిరసన ప్రదర్శనలు, ఛలో పార్లమెంట్ లాంటి ఉద్యమాలను భారత కార్మికవర్గం నిర్వహించింది. 2020 జనవరి 8న సమ్మెలో 25కోట్ల మంది కార్మికులు, ఉద్యోగులు పాల్గొంటే, నవంబర్ 26న సమ్మెలో 27కోట్ల మంది పాల్గొన్నారు.
ఇప్పటివరకు జరిగిన అన్ని సమ్మెల్లోను 90శాతం మంది అసంఘటితరంగ కార్మికులు పాల్గొన్నారు. కేంద్రప్రభుత్వ కార్పొరేట్ అనుకూల, కార్మిక వ్యతిరేక ధోరణులను, కార్మిక చట్టాల్లో మార్పులను వ్యతిరేకిస్తూ విధానపరమైన పోరాటాన్ని కార్మికసంఘాలు కొనసాగిస్తున్నాయి. పోరాటాలు పదునెక్కేకొద్దీ కార్మికులు, ఉద్యోగులు తమ జెండాలను పక్కనపెట్టి నరేంద్ర మోదీ ప్రభుత్వ ఆర్థిక విధానాలను వ్యతిరేకించే ఏకైక ఎజెండాతో ఉద్యమాల్లో పాల్గొంటున్నారు. కోల్ ఇండియా, రక్షణ రంగాల్లో జరిగే ఉద్యమాల్లో అధికార పార్టీ బీజేపీ అనుబంధ కార్మిక సంఘం బిఎంఎస్ సైతం పాల్గొనటం ఇందుకొక ఉదాహరణ.
ఇరవై తొమ్మిది సంవత్సరాలుగా దేశానికి, కార్మికులకు, ఇతర సామాజిక వర్గాల వారికి నష్టం కలిగిస్తున్న ఆర్థిక సంస్కరణలపై నిబద్ధతతో కార్మికవర్గం నిర్వహించిన నిర్వహించిన అనేక ధర్నాలు, సదస్సుల్లో ప్రొఫెసర్ హరగోపాల్ పాల్గొని కార్మికుల్ని చైతన్యపరిచే విధంగా సందేశాలు కూడా ఇచ్చారు. మరి కార్మికులు ‘మొన్ననే మేల్కొని సమ్మె జరిపారనటం’ సబబేనా? ఆయన అలా అనటం సమాచారలోపంగా భావిస్తున్నాము. ప్రస్తుతం రైతులు నరేంద్ర మోదీ ప్రభుత్వం తీసుకువచ్చిన కొత్త వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా నవంబర్ 26 నుంచి దేశ రాజధానిని దిగ్బంధం చేస్తున్నారు. దేశవ్యాప్తంగా నవంబర్ 26న జరిగిన సమ్మెలో కార్మికసంఘాలన్నీ పాల్గొని మద్దతు ఇవ్వటం హర్షించదగినది. దేశ కార్మికవర్గం రైతుల ఉద్యమానికి తమ సంపూర్ణ మద్దతు తెలుపుతోంది. మున్ముందు దేశంలోని కార్మికసంఘాలు మరింత రాజకీయ చైతన్యంతో మోదీ ప్రభుత్వ కార్పొరేట్ అనుకూల సంస్కరణలకు వ్యతిరేకంగా తమ ఉద్యమాన్ని తీవ్రతరం చేయనున్నాయి. ప్రొఫెసర్ హరగోపాల్ లాంటి వామపక్ష మేధావులు, ఇతర బుద్ధిజీవులు, లాయర్లు, కవులు, కళాకారులు సంఘటిత శక్తిగా ఏర్పడి దేశ సంపదను కార్పొరేట్ శక్తులకు దోచిపెట్టే విధానాలకు వ్యతిరేకంగా పోరాడుతున్న కార్మికులు, కార్మిక సంఘాలకు తోడుగానిలవాలని మా విజ్ఞప్తి.
టి.నరసింహన్,
జాతీయ ఉపాధ్యక్షులు, ఎఐటియుసి