నేను రాను బిడ్డో...

ABN , First Publish Date - 2020-08-16T05:51:44+05:30 IST

దగ్గుతోటి తుమ్ముల తోటి చలి చలి జరమొచ్చిందంటే కరోన సోకిందాని – కంగారుగ బెదిరిపోయి నేను రాను బిడ్డో ప్రయి-వేటు దవాఖానకు...

నేను రాను బిడ్డో...

దగ్గుతోటి తుమ్ముల తోటి

చలి చలి జరమొచ్చిందంటే

కరోన సోకిందాని – కంగారుగ బెదిరిపోయి

నేను రాను బిడ్డో ప్రయి-వేటు దవాఖానకు

కాలయముని వంటి 

కార్పొ-రేటు దవాఖానకు ।। ‍ నేను।।।।


జబ్బేమిటో తెలియకుండ 

పరీక్షలే జేయకుండ

అడ్మీషన్ కాడ రెండు -లక్షలు 

జమ జేయమని

తెల్ల కాగితం మీద నల్లని అంకెలు రాసి

చేతికైన ఇయ్యకుండ 

సైగలు జేస్తున్నరంట ।। ‍ నేను।।।।।।


జరంగోలి అయిదువేలు

దగ్గు మందు పది వేలు

సూది మందు పడ్డదంటే 

-సూటిగ అరవైవేలు

పీపీఈ కిట్లకంత - పెట్టే అన్నానికింత

రూము రెంటు రోజుకు – 

ఒక లక్ష గుంజుతున్నరంట ।। ‍ నేను।।।।।।


ఇన్సురెన్సు గిన్సురెన్సు అక్కరకే రాదంటూ

ప్రభుత్వ సూచనలేవీ పనికిక్కడ రావంటూ

తమదే ఒక సామ్రాజ్యం తమ మాటే శాసనం

బతకాలని కోరుకుంటే కట్టు లక్ష అంటరంట।। ।। ‍ నేను।।।।।।


ఇల్లు అమ్ముకుంటావో

బతుకు గిరివి పెడతావో

ఉన్నదంత ఊడ్చిపెట్టి అప్పుల పాలవుతావో

కాళ్ళుమెుక్కి వేళ్ళుమెుక్కి కన్నీరయి పోతావో

కనికరమే లేని కఠిన 

శిలల కేమి పట్టదంట ।। ‍ నేను।।।।।।


అదృష్టం బాగుంటే బతికి బట్ట కడతాము

ఖర్మగాలి సమయానికి -ఆక్సీజన్ అందకుంటె

ఊపిరాడకుండా కొన ఊపిరి పోయిందంటే

శవాన్ని సూడాలన్నా -కాటికి పంపాలన్నా

కట్టు మరో రెండు మూడు లక్షలు అంటున్నరంట।।  నేను।।।। 

ఎస్వీ సత్యనారాయణ

Updated Date - 2020-08-16T05:51:44+05:30 IST