జల వివాదాలు తీరేదెలా?

ABN , First Publish Date - 2020-09-18T06:59:42+05:30 IST

కృష్ణా,గోదావరి నదులపై నిర్మిస్తున్న ప్రాజెక్టులకు సంబంధించి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాలు పరస్పరం ఆయా బోర్డులకు ఫిర్యాదులు చేశాయి. విభజన చట్టానికి...

జల వివాదాలు తీరేదెలా?

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లు తమ నదీజలాల సమస్యలను ట్రిబ్యునళ్లు, కోర్టుల వెలుపల చర్చల ద్వారా పరిష్కరించుకోవాలి. అపెక్స్ కౌన్సిల్‌లో నదీజలాల సమస్యలను పరిష్కరించుకోవాలని రాష్ట్ర విభజన చట్టం సెక్షన్ 84 సూచించింది. ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని కరువు ప్రాంతాలను సస్యశ్యామలం చేయటానికి ఉభయ తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కృషి చేయాలి. 


కృష్ణా,గోదావరి నదులపై నిర్మిస్తున్న ప్రాజెక్టులకు సంబంధించి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాలు పరస్పరం ఆయా బోర్డులకు ఫిర్యాదులు చేశాయి. విభజన చట్టానికి విరుద్ధంగా రాయలసీమ పంపింగ్‌ స్కీం, పోతిరెడ్డిపాడు కాలువ వెడల్పు పథకాలను ఆంధ్రప్రదేశ్ చేపట్టిందని కృష్ణా బోర్డుకు తెలంగాణ ఫిర్యాదు చేసింది. ఈ విషయమై సుప్రీం కోర్టులోనూ, తెలంగాణ హైకోర్టులోను, హరిత ట్రిబ్యునల్‌లోనూ కేసు వేసింది. తెలంగాణ ప్రభుత్వం కృష్ణా బోర్డు అపెక్స్‌ కౌన్సిల్‌ ఆమోదం లేకుండా విభజన చట్టానికి వ్యతిరేకంగా కృష్ణానదిపై పాలమూరు–రంగారెడ్డి, డిండి, భక్త రామదాసు, మిషన్‌ భగీరథ, తుమ్మిళ్ల ఎత్తిపోతల ప్రాజెక్టులు నిర్మిస్తోందని; గోదావరి నదిపై కాళేశ్వరం, సీతారామ ఎత్తిపోతల పథకం, పెన్‌గంగపై నాలుగు ప్రాజెక్టులు మొదలైన వాటిని నిర్మిస్తున్నదని కృష్ణా, గోదావరి బోర్డులకు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఫిర్యాదు చేసింది. అపెక్స్‌ కౌన్సిల్‌ సమావేశంలో చర్చలు జరిపి నిర్ణయించే వరకూ కృష్ణా, గోదావరి నదులపై ప్రాజెక్టులు నిర్మించవద్దని, కొత్త ప్రాజెక్టులన్నింటికి డిపిఆర్‌లు సమర్పించాలని తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వాలకు కృష్ణ గోదావరి బోర్డులు లేఖలు రాశాయి. కృష్ణా, గోదావరి బోర్డుల, కేంద్ర జలసంఘం అనుమతి తీసుకోకుండా అపెక్స్‌ కౌన్సిల్‌ మంజూరు చేయకుండా, కృష్ణా, గోదావరి నదులపై కొత్తగా చేపట్టిన ప్రాజెక్టులు నిలిపివేయాలని ఉభయ తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్రసింగ్‌ షెకావత్‌ లేఖలు రాశారు. తెలంగాణ నిర్మిస్తున్న పాలమూరు- రంగారెడ్డి, డిండి ఎత్తిపోతల పథకాలపై సుప్రీంకోర్టు విచారణ జరిపింది. ఈ సమస్యను అపెక్స్‌ కౌన్సిల్‌లో పరిష్కరించాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. తత్ఫలితంగా 2016 సెప్టెంబర్‌ 21న ఢిల్లీలో కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో అపెక్స్‌ కౌన్సిల్‌ సమావేశం జరిగింది. సమస్య పరిష్కారం కాలేదు. మరి త్వరలో జరగనున్న అపెక్స్‌ కౌన్సిల్‌ సమావేశంలో ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాల మధ్య ఉన్న నదీ జల వివాదాలు పరిష్కారమవుతాయా?


రెండు రాష్ట్రాలు తమ ప్రాజెక్టులు కొత్తవి కాదని, ఎదురి రాష్ట్రం అపెక్స్‌ కౌన్సిల్‌ అనుమతి లేకుండా కొత్త ప్రాజెక్టులను నిర్మిస్తోందని, పాత వాటిని రీడిజైన్‌ చేస్తోందని ఒకేరకమైన వాదనలతో అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నాయి. ఇరు రాష్ట్రాల వాదనల్లో ‘కృష్ణా, గోదావరి బోర్డులు, కేంద్ర జలసంఘం అపెక్స్‌ కౌన్సిల్‌ ఆమోదం లేకుండా ప్రాజెక్టులు నిర్మిస్తున్నారని’ సాంకేతిక పరమైన అభ్యంతరాలను సాకుగా చూపుతున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో శ్రీశైలం డ్యాం ఆధారంగా కృష్ణా మిగులు జలాల ఆధారంగా నిర్మించిన ప్రాజెక్టులే తెలంగాణలోని కల్వకుర్తి, నెట్టెంపాడు, ఎస్‌.యల్‌.బి.సి ప్రాజెక్టులు; నేడు కొత్తగా నిర్మిస్తున్న పాలమూరు- రంగారెడ్డి, డిండి ప్రాజెక్టులు. వీటిలో ఏ ఒక్కదానికీ నికరజలాలు లేవు. ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుగంగ, హంద్రీ-నీవా, గాలేరు-నగరి, యస్‌ఆర్‌బిసి, వెలుగొండ ప్రాజెక్టులు ఉన్నాయి. ఇందులో ఎస్‌ఆర్‌బిసి ప్రాజెక్టుకు, చెన్నై తాగునీటికి కృష్ణాజలాల్లో నికరజలాలు ఉన్నాయి. బ్రిజేష్‌ ట్రిబ్యునల్‌ తీర్పు అమలులోకి వస్తే తెలుగుగంగ ప్రాజెక్టుకు కూడా 25 టిఎంసిల నికర జలాలు అందుబాటులోకి వస్తాయి. ఇక మిగిలిన ఆంధ్ర ప్రాజెక్టులు హంద్రీ-నీవాకు 40 టిఎంసీలు, గాలేరు- నగరికి 38 టిఎంసీలు, వెలుగొండ ప్రాజెక్టుకు 43 టిఎంసీలు వెరసి 121 టిఎంసీల నీరు అవసరమవుతుంది.


తెలంగాణలోని కల్వకుర్తికి 25 టిఎంసీలు, నెట్టెంపాడుకు 25 టిఎంసీలు, ఎస్‌ఎల్‌బిసి ప్రాజెక్టుకు 30 టిఎంసీలు, కొత్తగా నిర్మించే పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు 90 టీఎంసీలు, డిండి ప్రాజెక్టుకు 30 టిఎంసిలు ఈ అయిదు ప్రాజెక్టులకు మొత్తం 200 టిఎంసీల నీరు అవసరమవుతుంది. ఉభయ తెలుగు రాష్ట్రాలలోని 8 ప్రాజెక్టులకు 321 టిఎంసీల నీరు అందుబాటులో లేని పరిస్థితి ఉంది. మిగులు జలాలు వాడుకునే స్వేచ్ఛను ఉపయోగించుకొని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఈ ప్రాజెక్టులను నిర్మించింది. 2013లో బ్రిజేష్‌ ట్రిబ్యునల్‌, ఆంధ్రప్రదేశ్‌ మాత్రమే కృష్ణా మిగులు జలాలను వాడుకునే హక్కును త్రోసిపుచ్చి ఎగువ రాష్ట్రాలైన కర్ణాటక, మహారాష్ట్ర్టలకు సైతం మిగులు జలాల పంపకం చేసింది. ఈ తీర్పు అమల్లోకి వస్తే కర్ణాటక, మహారాష్ట్ర తమ వాటాగా వచ్చిన అదనపు మిగులు నికరజలాలు 258 టిఎంసీల నీటిని ఆ రాష్ట్రాలు ఆపుకుంటాయి. అప్పుడు ఉభయ తెలుగు రాష్ట్రాలలో నిర్మాణమైన ప్రాజెక్టుల పరిస్థితి ఏమిటి? శ్రీశైలం డ్యాం ద్వారా కృష్ణాజలాల్లో ఏ మాత్రం నికర జలాలు లేని ఈ పరిస్థితుల్లో రెండు రాష్ట్రాలు ఒకరి ప్రాజెక్టులకు ఒకరు అడ్డు తగిలితే వచ్చే ప్రయోజనం ఏమిటి? దీని మూలంగా ఉభయ తెలుగు రాష్ట్రాలూ నష్టపోయే ప్రమాదం ఉంది. కనుక ఈ క్లిష్ట పరిస్థితుల నుంచి బయటపడే మార్గాలను అన్వేషించాలి. కృష్ణా జలాల్లో ఉన్న అవకాశాలను పరిగణనలోకి తీసుకొని ఉభయ రాష్ట్రాలు పంచుకునేందుకు ఉన్న మార్గాలు ఏమిటి? 1.ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి బ్రిజేష్‌ ట్రిబ్యునల్‌ క్యారీ ఓవర్‌గా కేటాయించిన 150 టిఎంసీల ఇరు రాష్ట్రాలు పంచుకోవటం; 2. తమ తమ రాష్ట్రాలలో కృష్ణానది ఆయకట్టు భూములకు ఆంధ్రలోని నాగార్జునసాగర్‌ కుడికాలువకు, తెలంగాణలోని ఎడమకాలువకు గోదావరి నీటిని తరలించి, తద్వారా ఆదా అయ్యే నీటిని శ్రీశైలం ప్రాజెక్టు ద్వారా కృష్ణా జలాలను తమతమ ప్రాజెక్టులకు వినియోగించుకోవటం; 3. అంతిమంగా ఆంధ్రప్రదేశ్‌–-తెలంగాణాలు తమతమ వాటాగా వచ్చే కృష్ణానదీ జలాలను పునః పంపిణీ చేసుకుని తమ రాష్ట్రంలోని ప్రాజెక్టులకు వినియోగించుకోవడం.


తెలంగాణలోని మహబూబ్‌నగర్‌, నల్లగొండ జిల్లాల్లో 12 లక్షల ఎకరాలకు సాగునీరు అందించి, ఫ్లోరైడ్‌ ప్రాంతాలకు తాగునీరు అందించే ప్రాజెక్టులకు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం అడ్డు తగలకుండా ఆ ప్రాంతాలకు నీటి సౌకర్యం కల్పించేందుకు సహకరించాలి. ఆంధ్రప్రదేశ్‌లోని తీవ్ర కరువుప్రాంతమైన రాయలసీమ, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో 22 లక్షల ఎకరాలకు సాగునీరు అందించే పథకాలకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అడ్డు తగలకుండా ఈ ప్రాంతాలు కరువు నుంచి బయటపడడానికి తోడ్పాటును అందించాలి. తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టులో వేసిన కేసును ఉపసంహరించుకోవాలి.


2013 బ్రిజేష్‌ కుమార్‌ ట్రిబునల్‌ తీర్పు ప్రకారం కృష్ణానదీ జలాలలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు మిగులు నికరజలాలుగా వచ్చిన 150 టిఎంసీలను శ్రీశైలం, నాగార్జునసాగర్‌ ప్రాజెక్టులలో క్యారీ ఓవర్‌గా పెట్టాలని పేర్కొన్నారు. ప్రస్తుతం విభజన చట్టంలోని పదకొండవ షెడ్యూల్‌ ప్రాజెక్టులపై బ్రిజేష్‌ ట్రిబ్యునల్‌లో విచారణ సాగుతోంది. విభజన చట్టంలో పేర్కొన్న విధంగా హంద్రీ-నీవా, గాలేరు-నగరి, వెలుగొండ, కల్వకుర్తి, నెట్టెంపాడు ప్రాజెక్టులకు నికరజలాలను కేటాయించాలని ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం బ్రిజేష్‌ ట్రిబ్యునల్‌ ముందు వాదిస్తుండగా అందుకు తెలంగాణ అభ్యంతరం వ్యక్తం చేస్తున్నది. తెలంగాణకు చెందిన ఎస్‌ఎల్‌బిసి ప్రాజెక్టును విభజన చట్టంలో చేర్చలేదు. ఎస్‌ఎల్‌బిసి ప్రాజెక్టును కూడా ఇందులో చేర్చి ఆ ప్రాజెక్టుకు నీటి కేటాయింపులు జరిపేందుకు ఆంధ్రప్రదేశ్‌ అంగీకరించాలి.


ఈ ప్రాజెక్టుతో సహా 11వ షెడ్యూల్‌లోని ప్రాజెక్టులకు క్యారీఓవర్‌గా పెట్టిన 150 టిఎంసీలను రెండు రాష్ట్రాలలోని ప్రాజెక్టులకు పంచుకోవడానికి అపెక్స్‌ కౌన్సిల్‌లో ఆమోదింపచేసుకోవాలి. అక్కడ కుదిరిన ఒప్పందం అమల్లోకి రావటానికి కేంద్ర ప్రభుత్వం బ్రిజేష్‌ ట్రిబ్యునల్‌కు రిఫర్‌ చేయాలి. ఇక్కడ, నీటి పంపకాలు ఎలా చేసుకోవాలన్న సమస్య ఉత్పన్నమవుతుంది. బచావత్‌ ట్రిబ్యునల్‌ తీర్పు ఆధారంగా క్యారీ ఓవర్‌ నీటిని రెండు రాష్ట్రాలు పంచుకోవాలి. ఆంధ్రప్రదేశ్‌కి చెందిన హంద్రీ-నీవా ప్రాజెక్టుకు 40 టిఎంసీలు, గాలేరు-నగరికి 38 టిఎంసీలు, వెలిగొండ ప్రాజెక్టు 38 టిఎంసీలు, ఈ మూడు ప్రాజెక్టులకు మొత్తం 121 టిఎంసీలు అవసరం ఉన్నది. తెలంగాణ రాష్ట్రంలోని కల్వకుర్తి 25 టిఎంసీలు, నెట్టెంపాడుకు 22 టిఎంసీలు, ఎస్‌ఎల్‌బిసికి 30 టిఎంసీలు కావాలి. రెండు రాష్ట్రాలలోని ఆరు ప్రాజెక్టులకు కలిపి మొత్తం 198 టిఎంసీల నీరు అవసరం ఉన్నది. కృష్ణా జలాల్లో క్యారీఓవర్‌ నీరు 150 టీఎంసీలు, పట్టిసీమ ద్వారా ఆదా అయ్యే 45 టీఎంసీలు కలిపి మొత్తం 195 టీఎంసీలను రెండు రాష్ట్రాల్లోని ప్రాజెక్టులకు పంచుకోవాలి.


గతంలో రాష్ట్రాల మధ్య ఏర్పడిన నదీజలాల సమస్యల పరిష్కారానికి ట్రిబ్యునళ్లు, కోర్టులలో మాత్రమే అవకాశం ఉండేది. అందులో వాస్తవ పరిస్థితులను బట్టి కాకుండా ఆయా రాష్ట్రాలు వాదనలను బట్టి, జడ్జిల ఆలోచనలను బట్టి తీర్పులు వస్తాయి. ఎక్కువ కాలయాపన కూడా జరుగుతుంది. అలాకాకుండా ట్రిబ్యునళ్లు, కోర్టులకు బయట ఆంధ్రప్రదేశ్‌-–తెలంగాణ రాష్ట్రాలు చర్చల ద్వారా పరిష్కరించుకోవాలి. ఆనాటి కేంద్రమంత్రి జైరాం రమేశ్ రూపొందించిన విభజన చట్టం సెక్షన్‌ 84 ద్వారా అపెక్స్‌ కౌన్సిల్‌లో నదీజలాల సమస్యలను పరిష్కరించుకోవటానికి ఒక మంచి అవకాశాన్ని కల్పించింది. ఈ చట్టాన్ని ఉపయోగించుకుని సమస్యలను అపెక్స్‌ కౌన్సిల్‌లో పరిష్కరించుకుని ఉభయ రాష్ట్రాలలోని కరువు ప్రాంతాలను సస్యశ్యామలం చేయటానికి, ఆ ప్రాంతాల అభివృద్ధికి ఇద్దరు ముఖ్యమంత్రులు కృషి సాగించాలి. 


విభజన చట్టం ప్రకారం 11వ షెడ్యూల్‌లోని హంద్రీనీవా, గాలేరు-నగరి, వెలుగొండ, తెలుగు గంగా, కల్వకుర్తి, నెట్టెంపాడు ప్రాజెక్టులను పూర్తి చేసి వాటికి నీటి కేటాయింపులు చేసే బాధ్యత కేంద్ర ప్రభుత్వానిదే. పాలమూరు రంగారెడ్డి, డిండి ప్రాజెక్టుల సమస్యను అపెక్స్‌ కౌన్సిల్‌లో పరిష్కరించాలని కేంద్ర ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది. కావున ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాల ముఖ్యమంత్రులతో చర్చలు జరిపి ఇరు రాష్ట్రాల మధ్య ఉన్న నదీ జలాల సమస్యలను అపెక్స్‌ కౌన్సిల్‌ సమావేశంలో పరిష్కరించే బాధ్యత కేంద్ర ప్రభుత్వామే తీసుకోవాలి.

మాయకుంట్ల శ్రీనివాసులు

అధ్యక్షుడు, ప్రజాస్వామ్య హక్కుల పరిరక్షణ సంస్థ

Updated Date - 2020-09-18T06:59:42+05:30 IST