చరిత్ర రచన

ABN , First Publish Date - 2020-06-19T05:47:46+05:30 IST

మల్లంపల్లి సోమశేఖర శర్మ దృష్టిలో ప్రజావికాసానికి తోడ్పడలేనిది చరిత్రకానేకాదు. అందువల్లనే ఆయన రాజులను గురించి వ్రాసినా అది ప్రజల చరిత్రగా మారేది. రాజకీయ చరిత్ర వ్రాసినా అది సాంఘిక చరిత్రగా రూపొందేది!..

చరిత్ర రచన

మల్లంపల్లి సోమశేఖర శర్మ దృష్టిలో ప్రజావికాసానికి తోడ్పడలేనిది చరిత్రకానేకాదు. అందువల్లనే ఆయన రాజులను గురించి వ్రాసినా అది ప్రజల చరిత్రగా మారేది. రాజకీయ చరిత్ర వ్రాసినా అది సాంఘిక చరిత్రగా రూపొందేది!


చరిత్ర రచన

ప్రాచీన భారత చరిత్రకు భండార్కర్ వలె, మొగల్ చరిత్రకు జధునాథ్ సర్కార్ వలె, మహారాష్ట్ర చరిత్రకు సర్దేశాయ్ వలె, దక్కన్ చరిత్రకు నీలకంఠశాస్త్రి వలె, ఆంధ్ర చరిత్రకు మల్లంపల్లి సోమ శేఖర శర్మ పేరు చెప్పిన తరువాతనే మరొకరి ప్రసక్తి తీసుకురావాలి. శ్రీకొమర్రాజు లక్ష్మణరావు, శ్రీ చిలుకూరి వీరభద్రరావు వేసిన బాటలలో ఆయన ఎంతగానో ముందుకు పురోగమించారు. వారి ప్రాపకంలో చరిత్ర పరిశోధన రంగంలోకి వచ్చినా, వారుభయులను మించి కీర్తి ప్రతిష్ఠల నార్జించుకున్నారు. 


శ్రీ విశ్వనాథ సత్యనారాయణ తమ ‘ఆంధ్ర ప్రశస్తి’ కావ్యాన్ని అంకితమిస్తూచెప్పినట్టు శర్మగారిది ‘డిగ్రీలు లేని పాండిత్యంబు’, అట్టి పాండిత్యం ‘వన్నెకు రాని ఈ పాడు కాలాన బుట్టి’ కూడా ఆయన చరిత్రకారుడుగా అమరకీర్తిని ఆర్జించుకొన్నారు. ఆయన ‘హిస్టరీ ఆఫ్ రెడ్డి కింగ్ డమ్స్’ అపూర్వమైన రచన. ఆంధ్ర దేశ చరిత్రలోని ఆ ఘట్టంపై దానికి సాటి రాగల గ్రంథం మరొకటి లేదు. 

పూర్వ శిలా శాసనాలను చదవగలవారు పెక్కుమంది ఉండవచ్చు, మరుగుపడిన చరిత్ర వెలుగుకు తీసుకురాగలవారికి సయితం కొరత లేకపోవచ్చు. కాని ఆయనను పోలిన సాహితీవేత్తలెందరు? సంస్కృతి ప్రియులెందరు? కవి హృదయమున్న వారెందరు? రసజ్ఞులెందరు? ఆంగ్లేయంలో వ్రాసినా, ఆంధ్ర భాషలో రచించినా, ఆయన చరిత్రలు కేవలం ఉత్తమ చరిత్రలే కావు, అవి మహాకావ్యాలు కూడా.


గత చరిత్ర శర్మగారికి సమాధుల సంశోధన కాదు. శవాలంకరణ అసలే కాదు. వర్తమాన కాలానికి అది ఒక ఉత్తేజం; భవిష్యత్తుకు ఒక కరదీపిక. ఆయన ప్రజాస్వామ్య వాది, ప్రగతిశీలి. ప్రజా సత్తాకకు, ప్రజావికాసానికి తోడ్పడలేనిది ఆయన దృష్టిలో చరిత్రకానేకాదు. అందువల్లనే రాజులను గురించి వ్రాసినా అది ప్రజల చరిత్రగా మారేది. రాజకీయ చరిత్ర వ్రాసినా అది సాంఘిక చరిత్రగా రూపొందేది! 


ఆయనది ఎంతో శాంత స్వభావం! ఆయన ఎంతగానో సౌజన్యమూర్తి! కాని, రచయితగా ఆయనలో మహోద్వేగం కానవచ్చేది. తన కలాన్ని సిరాలో కాక, తన గుండె నెత్తురులో ముంచి వ్రాస్తున్నట్లుగా ఆయన రచన సాగేది! మాట వెంట మాట దొర్లేది, వాక్యాన్ని వాక్యం తరుముకు వచ్చేది, ప్రతి పుట ఒక సజీవ చిత్రం వలె పాఠకులను సమ్మోహితులను చేసేది. తన రాష్ట్రం, తన దేశం, తన సోదర ప్రజలు గతానికి మించిన భవిష్యత్తును నిర్మించుకోవాలనే తపన ఆయన రచనలలో సర్వత్రా కానవచ్చేది! 

1963 జనవరి 3 ‘ఆంధ్రజ్యోతి’ సంపాదకీయం

‘శ్రీ మల్లంపల్లి సోమశేఖర శర్మ’ నుంచి


Updated Date - 2020-06-19T05:47:46+05:30 IST