చరిత్ర శిఖరాధిరోహణకై..

ABN , First Publish Date - 2020-03-23T09:05:49+05:30 IST

మన మూలాలను లోలోతుల్లోకి వెళ్లి తెలుసుకోకపోతే, ‘కాల యంత్రం’లో జారిగిలపడకపోతే, ఎప్పటికీ మన గురించి మనం తెలుసుకోలేం. ఇది మా జాతి అని, ఇది మా నేల అని భావించనూలేం. మనవైన...

చరిత్ర శిఖరాధిరోహణకై..

‘‘తెలుగువాళ్లు చాలా బద్దకస్తులు. వంట వండుకొనే తీరిక కూడా ఉండదు కాబట్టి ఆవకాయ పెట్టుకుంటారన్న మాట. వారికి నవల రాసేటంత శక్తి లేదు. ఈ తెలుగు వాళ్ళు మహాభారతాన్ని ఎలా అనువదించారో అస్సలు అర్థం కావడం లేదు. వందల పేజీల చారిత్రక నవలను తెలుగువాడు రాయడమనేది బహుశా ఓ వందేళ్ల తరువాత సాధ్యమేమో?’’ అంటూ వాడ్రేవు చినవీరభద్రుడు ఒకింత రెచ్చగొట్టేందుకు నవ్వుతూనే ప్రయత్నించినా... అది నిజంగా తెలుగుసాహితీలోకం అవలోకనం చేసుకోవాల్సిన విషయమేనేమో?


మన మూలాలను లోలోతుల్లోకి వెళ్లి తెలుసుకోకపోతే, ‘కాల యంత్రం’లో జారిగిలపడకపోతే, ఎప్పటికీ మన గురించి మనం తెలుసుకోలేం. ఇది మా జాతి అని, ఇది మా నేల అని భావించనూలేం. మనవైన వాటినెన్నింటినో అన్యులు మాది అంటూ సగర్వంగా చాటుకుంటూ, తొక్కుకుంటూ వెళ్లిపోతారు. ఈ స్థితికెదురుగా పదునైన ఆయుధాలు సమకూర్చుకోవడానికే ‘నర్తనశాల’లో మార్చి 14, 15 తేదీల్లో మస్తిష్క మధనం ఆరంభమైంది.


సూరాడ వరప్రసాద్‌... ప్రసాద్‌సూరి... విశాఖ జిల్లా రాంబిల్లికి చెందిన 20 ఏళ్ల బీఎఫ్‌ఏ విద్యార్థి. చిత్తర్వు మధు... కృష్ణా జిల్లా గుడ్లవల్లేరు మండలం మామిడికోళ్ళకు చెందిన 68ఏళ్ల హృద్రోగ నిపుణుడు. పోలికే లేని విభిన్న వ్యక్తుల సమూహం. అందరూ తమదైన శైలిలో ఆకట్టుకొనే కథనాలతో తెలుగు ప్రజలకు సుపరిచితులైన రచయితలే. అయితేనేం రెండురోజులపాటు... సుమారు 14గంటలపాటు... మాట్లాడే వారివైపు దీర్ఘంగా చూస్తూ చెవులు రిక్కించి విన్నారు. విషయ పరిజ్ఞానంతో పరిపుష్ఠమై ఏకధాటిగా సాగిన మాటలను పొల్లుపోకుండా తలల కెత్తుకున్నారు. తెలుగుభాష తలెత్తుకొనేలా చేసిన శప్తభూమి నవలా రచయిత బండి నారాయణస్వామిని ఆత్మీయంగా సత్కరించుకున్నారు. ‘‘కుల, ప్రాంతీయ అస్తిత్వాలే నన్ను నడిపించాయి. చరిత్రకారునికి స్వీయ దృక్కోణాలు ఉండకూడదు. కాని కాల్పనిక చారిత్రక సాహిత్యా నికి రచయిత, వ్యక్తి దృక్కోణాలు ఉంటాయి,’’ అంటూ ముఖాముఖి కార్యక్రమంలో నారాయణస్వామి పంచుకొన్న అభిప్రాయం.. కొన్ని  సందేహా లను తీర్చినా మరికొన్ని ఆలోచనలను, ప్రశ్నలను లేవనెత్తింది. 


తొలిరోజు సమావేశం అర్ధగంట ఆలస్యంగా ఆరంభమైంది. కొవిడ్‌ 19 భయాందోళనలు ప్రపం చాన్ని వణికిస్తున్నవేళ వస్తారో రారో అన్న నిర్వాహకుల సందేహాలను పటాపంచలు చేస్తూ మొత్తం 36మంది హాజర య్యారు. ఈమని శివనాగిరెడ్డి తొలి సమావేశానికి సమన్వయకర్త. ‘‘ఆది ఆంధ్రుని అడుగులు ఐదు లక్షల సంవత్సరాల క్రితమే ఉన్నాయి. కర్నూలు జిల్లాలోని జ్వాలాపురంలో 74 వేల సంవత్సరాలు క్రీస్తు పూర్వం ఇండోనేసియాలో బద్దలైన అగ్నిపర్వతపు లావా వచ్చిపడింది. దానికింద అవశేషాలు లభ్యమయ్యాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నో రాళ్లు, నాణాలు, శాసనాలు మన చరిత్రను మనకు పట్టిస్తాయి. మ్యూజియంలు ఎన్నో విశేషాంశాలను మనకు చెపుతాయి’’ అంటూ ఉత్తేజపూరితంగా ఆయన తొలి విభాగాన్ని ఆరంభించారు.


శ్రీకాకుళం వాసి, సాహిత్యంలో చరిత్రను, ప్రత్యేకించి కళింగాంధ్ర చరిత్రను తవ్వితీసే పనిలో నిరంతరాయంగా కృషి చేస్తున్న దీర్ఘాసి విజయభాస్కర్‌ పవర్‌ పాయింట్‌ ప్రజంటేషన్‌ ఇచ్చారు. గతం, వర్త మానం మధ్య సంభాషణే చరిత్ర అని, నదులు ప్రవహిస్తున్న పురాణా లనీ విడమరిచారు. కళింగ దేశ ప్రాచీనత, కళింగానికి జరిగిన అన్యా యాన్ని వివరించిన తీరు సిక్కోలు మాటకారితనాన్ని అందరికీ మరో మారు పరిచయం చేసింది. రామాయణ, మహాభారతాల్లోనే కళింగ దేశ ప్రస్తావన ఉందని ఆయన వివరించారు. రామాయణం, అయోధ్య కాండ 71వ సర్గలో కళింగ ప్రస్తావన ఉందన్నారు. దుర్యోధనుని భార్య భానుమతి కళింగ యువరాణి అనీ, చిత్రాంగదుని కుమార్తె అని చెపుతూ... మహాభారతంలోనూ మమ్ముల్ని తొక్కేసారంటూ ఆప్రాంతవాసుల లోలోపలి పొరల్లో ఉన్న అసంతృప్తిని నవ్వుతూనే బయటపెట్టేశారు.  


‘‘చరిత్ర మెదడుని బరువెక్కించాలి. చారిత్రక సాహిత్యం మనస్సును తేలిక చేయాలి’’ అంటూ తెలంగాణవాసి కట్టా శ్రీనివాస్‌ తన మాటలను ప్రారంభించారు. తెలంగాణ పల్లెల్లో తనకు దొరికిన ఆధారాలు, వాటి ఆధారంగా చరిత్రను తవ్వుతూ వెళ్లిన సందర్భాలను పరిచయం చేశారు. తమ తవ్వకాల్లో వెలుగులోకి వచ్చిన చరిత్రను యథాతథంగా దినపత్రికలో ప్రముఖంగా ప్రచురితమైనప్పుడు రాని స్పందన, దానికి సాహిత్య విలువలను జోడిస్తూ ప్రచురించి నపుడు వచ్చిన విషయాన్ని సందర్భోచితంగా వివరించారు. రాయలసీమ నుంచి వచ్చిన వేంపల్లి గంగాధర్‌ తాను రాస్తున్నప్పటికీ అవి చాలవని, ఇంకా రాయాల్సింది ఎంతో ఉందని నిజాయితీగా ఒప్పుకొన్నట్లే కనిపించింది. సీమలో చరిత్రను చాటిచెప్పే చారిత్రక స్థలాలు ఎలా ధ్వంసమవుతున్నాయో, అసాంఘిక కార్యకలాపాలకు ఎలా నిలయా లవుతున్నాయో చెపుతూ దీని గురించి కూడా రాయాలేమో? అంటూ ధర్మాగ్రహాన్ని ప్రదర్శించాడు. కాలగమనంలో దేవుళ్లను మనిషి ఎలా మారుస్తాడో కళ్లకు కట్టాడు. కడప జిల్లా దానవులపాడులోని పార్శ్వనాథుని విగ్రహం, బిత్తల సామిగా మారిన ఉదంతం ఒక్కటి చాలు... మన దేశంలోని అనేకానేక చారిత్రక ప్రార్థనాలయాల్లో ఏం జరిగి ఉంటుందో ఊహించుకోవడానికి. 


చర్చోపచర్చల అనంతరం తలెత్తిన సందేహాలకు, అనుమానాలకు సాయి పాపినేని సమాధానమిచ్చారు. చరిత్ర వక్రీకరణకు గురవుతుం దన్న భయంతో ఎక్కడా సాహితీ సృజన ఆగలేదని వివరించారు. విషయసేకరణ కష్టమూ, కొంత ఖర్చుతో కూడినదేనని అంగీకరిస్తూ అందుకు మనం సంసిద్ధులం కావల్సిందేనని స్పష్టం చేశారు. అయితే కార్యశాల ప్రధానోద్దేశం... చారిత్రక నవలలు, కథలు రాయడానికి ముందుకు వచ్చిన రచయితలకు తగిన సూచనలు, సమాచారం అందించడమేనంటూ హామీ ఇచ్చారు.


ఆదిత్య కొర్రపాటి... 28 సంవత్సరాల యువకుడు దక్షిణ భారత దేశ భాషలన్నింటిలోనూ ప్రవేశాన్ని కలిగి ఉండడం, ఆయా భాషల్లో ప్రముఖుల పుస్తకాలను తడిమి ఉండడం... అప్పుడే చూసిన వాళ్లందరికీ అబ్బురమే. మలిరోజు తొలి మాటలు తనవే. రాత్రంతా, మెలుకువ నిండిన నిద్రతో పడిన తాపత్రయం కనిపించింది. ‘కాలం నిరవధికం... పృఽథ్వీ విపులం’ అన్న స్లైడ్‌తో మాటలను ఆరంభించాడు. చారిత్రక నవలను ప్రత్యేకంగా నిర్వచించుకోవాల్సిన అవసరాన్ని చెపుతూనే చరిత్ర కథగా మారిన తీరును, అదే సమయంలో కథ చరిత్రగా రూపుతీసుకోవడాన్ని వివరించాడు. 


రెండు రోజుల చర్చలను ఒక కొలిక్కి తీసుకు వచ్చే బాధ్యతను తీసుకొన్న చినవీరభద్రుడు... మన చరిత్ర ప్రధానంగా మౌఖికమేనని, చరిత్రను ప్రత్యేకించి రికార్డు చేయడం ఉండదనీ, రాస్తూ పోతే చరిత్ర అవుతుందని అన్నారు. చరిత్రకీ, సాహిత్యానికి మధ్య ఉన్న సున్నిత మైన తేడాను ఆయన చిన్న ఉదాహరణతో హత్తుకొనేలా చెప్పారు. ‘‘తెలుగు వాళ్లు చాలా బద్దకస్తులు. వంట వండుకొనే తీరిక కూడా ఉండదు కాబట్టి ఆవకాయ పెట్టుకుంటారన్న మాట. వారికి నవల రాసేటంత శక్తి లేదు. ఈ తెలుగు వాళ్ళు మహాభారతాన్ని ఎలా అనువదించారో అస్సలు అర్థం కావడం లేదు. వందల పేజీల చారిత్రక నవలను తెలుగువాడు రాయడమనేది బహుశా ఓ వందేళ్ల తరువాత సాధ్యమేమో?’’ అంటూ వాడ్రేవు చినవీరభద్రుడు ఒకింత రెచ్చగొట్టేందుకు నవ్వుతూనే ప్రయత్నించినా... అది నిజంగా తెలుగు సాహితీలోకం అవలోకనం చేసుకోవాల్సిన విషయమేనేమో?


కొండవీడు మ్యూజియం, కోట చూడడానికి బయలుదేరే ముందు సాయి చేసిన ప్రకటన అందరిలోనూ చిన్న కదలికను తెచ్చింది. ఏప్రిల్‌ 25 నాటికి హాజరైన వారంతా తలా ఒక కథ రాయాలని, జూలై నాటికి పుస్తకంగా తీసుకు వస్తామని చెప్పారు. రాయాల్సిందే అనుకుంటూ బయలుదేరిన సాహితీ బృందంలో సభ్యులు... పాపినేని శివశంకర్‌, వాడ్రేవు చినవీరభద్రుడు, ఈమని శివనాగిరెడ్డి, దీర్ఘాసి విజయభాస్కర్‌, బండి నారాయణ స్వామి, మహి బెజవాడ, కుమార్‌ కూనపరాజు, బీఏ శివప్రసాద్‌, అనురాధ, ఖదీర్‌ బాబు, అన్వర్‌, ఝాన్సీ పాపుదేశి, వేంపల్లి గంగాధర్‌, బీ సరోజినీ దేవి, బొడ్డేడ బలరామస్వామి, జీవీ శ్రీనివాస్‌, ముని సురేశ్‌పిళ్ళై, బొల్లోజు బాబా, వెంకట్‌ శిద్ధారెడ్డి, మత్తి భాను మూర్తి, ఉమ నూతక్కి, దేవదానం రాజు, పూడూరి రాజిరెడ్డి, అనిల్‌ డ్యానీ, బీ ప్రసూన, చిత్తర్వు మధు, సూరాడ, వరప్రసాద్‌, హనీఫ్‌, పూర్ణిమా తమ్మిరెడ్డి, ఆదిత్య కొర్రపాటి, రాణి శివశంకర శర్మ, కట్టా శ్రీనివాస్‌, ఆకునూరు హసన్‌, అరవింద్‌ ఆర్య, దగ్గుమాటి పద్మాకర్‌, మనోహర్‌...

చిగురుపాటి సతీష్‌ బాబు


Updated Date - 2020-03-23T09:05:49+05:30 IST