కరోనాసుర చరితము
ABN , First Publish Date - 2020-07-19T07:58:47+05:30 IST
అనగనగనగా.... అంటే రాజులూ, రాక్షసులూ, మాయలూ, మంత్రాలు నిజంగా ఉన్న రోజుల్లో అన్నమాట! కరోనాసురుడు అనే రాక్షసుడు ఉండేవాడు. నాలుగు అంతస్తుల ఎత్తు...

అనగనగనగనగా కాలం నాటి ఆ కరోనాసురుడు... తనకు ముని ఇచ్చిన వరాన్ని ఎట్టకేలకు 2019 చివరాఖరిలో ఉపయోగించుకోవాలని నిర్ణయించుకున్నాడు. మనుషులను ‘కనిపించ కుండా’ కొట్టాలనే లక్ష్యంతో చైనాలో వైరస్‌లా అవతరించాడు. అప్పుడు తలపై రెండే కొమ్ములు. ఇప్పుడు ఒళ్లంతా కొమ్ములు. అప్పుడు...భారీ ఆకారంతో మందగమనం! ఇప్పుడు...సూక్ష్మ రూపంలో స్వైర విహారం.
అనగనగనగా.... అంటే రాజులూ, రాక్షసులూ, మాయలూ, మంత్రాలు నిజంగా ఉన్న రోజుల్లో అన్నమాట! కరోనాసురుడు అనే రాక్షసుడు ఉండేవాడు. నాలుగు అంతస్తుల ఎత్తు! ఏనుగులను కూడా గుట్టుక్కుమనిపించేత గుహలాంటి నోరు! తలమీద రెండు కొమ్ములు! అమ్మో... చూడటానికే భయంకరం! రాక్షసుడున్నాడు కాబట్టి... పొరపాటున కూడా మనుషులు ఆ అడవిలోకి వెళ్లేవాళ్లే కాదు. అయితే... అడవిలో జంతువులను తినీ తినీ విసుగొచ్చినప్పుడు... కొత్త రుచికోసం మనుషులను తిందామని రాక్షసుడే పక్క రాజ్యంలోకి వెళ్లేవాడు! రాక్షసుడు వస్తున్న విషయం తెలియగానే రాజుగారు ‘లాక్‌డౌన్’ ప్రకటించేవారు. అప్పుడు... ప్రజలు రోజంతా ఇళ్లలోనే ఉండేవారు. అయినా... కొందరు పాల కోసమని, పండ్ల కోసమని, సరుకులనీ, సరదాకని బయటికి వచ్చి కరోనాసురుడికి ఆహారమయ్యేవాళ్లు. మళ్లీ కొన్నాళ్లకు రాక్షసుడు తిరిగి అడవిలోకి వెళ్లడం... ‘వెరైటీ ఫుడ్’ తినాలనిపించినప్పుడు రాజ్యంలోకి రావడం... అప్పుడు లాక్‌డౌన్ ప్రకటించడం... ఇదో అంతులేని కథలా మారింది. ఒకానొక రోజున రాక్షసుడు మధ్యాహ్నం సుష్ఠుగా తిని ఆవలిస్తున్నప్పుడు... అదే దారిలో ఓ ముని కనిపించాడు. ఆకలిగా లేకపోవడం, పైగా ముని ఎముకల గూడులా మరీ బక్కపలుచగా ఉండటంతో రాక్షసుడికి ఆయనను తినాలనిపించలేదు.
అయితే, తనను చూసి భయపడని మునిని చూసి ఆశ్చర్యపోయాడు. ఆయనతో మాట కలిపాడు. ముని మహా తపశ్శక్తిమంతుడు. కరోనాసురుడికి మంచి చెప్పాడు. చెడు చేయొద్దన్నాడు. మంత్రమేసినట్లుగా రాక్షసుడు మారిపోయాడు. ఇకపై తాను వనం దాటనని, జంతువులను మాత్రమే తింటానని మాట ఇచ్చాడు. పాపం... రాక్షసుడు కదా! మనిషిలా మాట తప్పడు! అలా రోజులు గడుస్తూ ఉన్నాయి. పక్కరాజ్యం మనుషులు హాయిగా జీవించసాగారు. కానీ... మనుషులు కదా, తమ పని తాము చేసుకోరు. కరోనాసురుడు కనిపించడం లేదు ఎందుకో? అనే సందేహంకొద్దీ... కొందరు తామే అడవిలోకి వెళ్లారు. వారికి నాలుగంతస్తుల ఎత్తున కరోనా రాక్షసుడు కనిపించాడు కానీ, వారిని ఏమీ చేయలేదు. దీంతో అలుసైపోయాడు. కరోనాసురుడిపైకి మనుషులు రాళ్లేసి, కర్రలు విసిరి... అల్లరి చేశారు. రోజుకో గుంపు రావడం... కరోనాసురుడితో పరాచికాలాడటం చేయసాగారు. చిన్న పిల్లలు కూడా మీసాలు పట్టుకుని లాగడం, చెవిలో పుల్లలు పెట్టడం చేస్తూ ఆట బొమ్మలా ఆడుకునేవారు. అయినా, మునికి ఇచ్చిన మాట మేరకు రాక్షసుడు సహనంతో ఉన్నాడు. కొన్నాళ్లకు... కరోనాసురుడు మళ్లీ ‘రాక్షసుడి’గా మారి మన మీద పడితే ఎలా? అనే సందేహం మనుషులకు వచ్చింది. అంతే... అదే రోజు రాత్రి ఈటెలు, కత్తులతో అడవిలోకి వెళ్లి కరోనాసురుడిపై రాక్షసుల్లా దాడి చేశారు. రాక్షసుడి శరీరమంతా రక్తసిక్తమైంది. ఇక బతకడు అని నిర్ధారించుకుని... మనుషులు తిరిగి వెళ్లిపోయారు. రాక్షసుడికి అప్పుడు... తనను ‘మనిషి’లా మార్చిన ముని గుర్తుకొచ్చాడు. అలా తలచుకోగానే... ఇలా ముని ప్రత్యక్షమయ్యాడు. కరోనాసురుడి పరిస్థితి చూసి కంటతడి పెట్టాడు. ‘స్వామీ... రాక్షసంగా, దర్జాగా బతికేవాడిని! నన్ను ఇలా మార్చేశారు! మంచికి ఇదేనా ప్రతిఫలం’ అని రాక్షసుడు వాపోయాడు. మునికి... మనుషుల మీద కోపమొచ్చింది. ‘‘కరోనాసురా... ఈ మనుషులపై ప్రతీకారం తీర్చుకునే అవకాశం ఇస్తున్నాను. అది ఎప్పుడు, ఎలా, ఏ రూపంలో తీర్చుకుంటావో నీ ఇష్టం’’ అంటూ ఒక వరం ఇచ్చాడు!
అనగనగనగనగా కాలం నాటి ఆ కరోనాసురుడు... తనకు ముని ఇచ్చిన వరాన్ని ఎట్టకేలకు 2019 చివరాఖరిలో ఉపయోగించుకోవాలని నిర్ణయించుకున్నాడు. మనుషులను.... ‘కనిపించకుండా’ కొట్టాలనే లక్ష్యంతో... చైనాలో వైరస్‌లా అవతరించాడు. అప్పుడు తలపై రెండే కొమ్ములు. ఇప్పుడు ఒళ్లంతా కొమ్ములు. అప్పుడు... భారీ ఆకారంతో మందగమనం! ఇప్పుడు... సూక్ష్మ రూపంలో స్వైర విహారం. అప్పుడు ఒక్కడే! ఇప్పుడు... కోటానుకోట్లకోట్లుగా విస్తరించాడు. అంతుచిక్కకుండా ఆధునిక మానవుడిని ఇక్కట్లు పెట్టాలని నిర్ణయించుకున్నాడు. అందుకే... కరోనా విషయంలో ఇంత అనిశ్చితి, గందరగోళం. కరోనా... జంతువుల నుంచి మనుషులకు వస్తుందని తొలుత అన్నారు. కానీ... మనిషి నుంచి మనిషికి సోకడం మొదలుపెట్టింది. తొలుత 14 రోజులు క్వారంటైన్ చాలన్నారు. తర్వాత 28 రోజులకు పెంచారు. మొదట... జలుబూ జ్వరమే లక్షణాలన్నారు. తర్వాత... ఏ లక్షణాలూ లేకున్నా కరోనా అంటున్నారు. ఎండాకాలంలో కరోనా పోతుందన్నారు. 80 డిగ్రీల్లోనూ కరోనాకు చావులేదని తేల్చారు. మనిషి తుమ్మితే, దగ్గితే వచ్చే తుంపర్లలోనే కరోనా ఉంటుందన్నారు. ఇప్పుడు... గాలి ద్వారా కూడా వ్యాపిస్తుందని చెబుతున్నారు. వేడి నీళ్లు తాగితే పోతుందన్నారు. అబ్బే... ఎంత వేడినీళ్లు తాగినా లాభం లేదని మరొకరు అన్నారు. పారాసెట్మాల్ వేస్తే పోతుందన్నారు. బ్లీచింగ్ పౌడర్ చల్లితే చస్తుందన్నారు. హైడ్రాక్సీ క్లోరోక్లిన్ పని చేస్తుందని ఒకరు... అబ్బే, అది వేస్ట్ అని ఇంకొకరు అంటున్నారు. ఆయుర్వేదమే పరిష్కారమని ఒకరు... హోమియోపతి భేష్ అని ఇంకొకరు... ఇవన్నీ ట్రాష్, ఇంగ్లీషు మెడిసినే బెస్ట్ అని మరొకరు అన్నారు. వ్యాక్సిన్ ఒక్కటే బ్రహ్మాస్త్రం అని ఏకగ్రీవంగా తేల్చారు. ప్రపంచంలోని శాస్త్రవేత్తలంతా అదే పనిలో ఉన్నారు. వ్యాక్సిన్ ఏడాదిన్నరలో అన్నారు. ఏడాది అన్నారు. ఇప్పుడు... ఆగస్టు 15కే వస్తుందంటున్నారు. అబ్బే... అంత తొందరగా రాదని ఇంకొకరన్నారు. వ్యాక్సిన్ వచ్చినా లాభంలేదని... కరోనా మాటికీ మాటికీ తన రూపం మార్చుకుంటోందని మరొకరు అన్నారు. మొత్తంగా మందగా వైరస్ సోకించుకుంటే (హెర్డ్ ఇమ్యూనిటీ) మంచిదని ఒకరు... అలాగైతే అసలుకే మోసమొస్తుందని మరొకరు అంటున్నారు. మృతదేహాల నుంచి వైరస్ వస్తుందని ఒకరు... రానే రాదని ఇంకొకరు అన్నారు. అసలు కరోనా అనేదే లేదు, అంతా ‘హంబక్కు’ అని ఇంకొకరు అన్నారు. అసలు విషయం ఏమిటంటే... ఈ వైరస్ కరోనాసురుడి అవతారమని, మనుషులపై కసితీరా పగ తీర్చుకోవడానికే వచ్చిందని వీళ్లెవరికీ తెలియదు. ఇలా తెలిసిన వాళ్లు ఏమంటున్నారంటే... ‘‘కరోనా దానంతటదే పోతుంది’’ అని! అంటే... కరోనాసురుడికే విసుగొచ్చి, ‘ఇక చాల్లే! బతుకుపోండి’ అని మనుషులను వదిలేస్తాడన్న మాట! ఈలోపు ఎవరికీ ఏమీ కాకూడదనుకుంటే... ‘అనగనగనగా’ రోజుల్లో కరోనాసురుడికి భయపడి ఇళ్లలో ఉన్నట్లుగా... ఇప్పుడూ ఉండిపోవడమే! కథ కంచికి! కరోనా ఎక్కడికో! పోయేదెప్పటికో!
తొమ్మండ్రు సురేష్ కుమార్