చరిత్రకారుని వక్రభాష్యాలు

ABN , First Publish Date - 2020-12-26T06:53:09+05:30 IST

చ‌రిత్ర‌కారుడు రామ‌చంద్ర‌ గుహ రాసిన వ్యాసం (‘మెజారిటీవాదం: అప్పుడూ ఇప్పుడూ’–డిసెంబర్ 19, ‘ఆంధ్రజ్యోతి’) నిండా రాష్ట్రీయ స్వయం సేవక్‌సంఘ్‌పై...

చరిత్రకారుని వక్రభాష్యాలు

రాష్ట్రీయ స్వయం సేవక్‌సంఘ్‌ని ఒక మ‌తసంస్థ‌గా చిత్రీక‌రించేందుకు రామచంద్ర గుహ చేయ‌ని ప్ర‌య‌త్నం లేదు. ముస్లింల‌ను దేశంలో లేకుండా చేసేందుకు ఆరెస్సెస్ సంకల్పించిందని దీర్ఘాలు తీస్తూనే మధ్యయుగాల ఇస్లాం నుంచి ఆ ఎజెండాను సంఘ్ స్వీకరించిందంటూ ఆయన వ‌క్ర‌భాష్యాలు చెప్పాడు. భార‌త‌దేశ విధాన‌మైన ‘భిన్న‌త్వంలో ఏక‌త్వం’ నే ఆరెస్సెస్ స‌మ‌ర్థిస్తోంది.


చ‌రిత్ర‌కారుడు రామ‌చంద్ర‌ గుహ రాసిన వ్యాసం (‘మెజారిటీవాదం: అప్పుడూ ఇప్పుడూ’–డిసెంబర్ 19, ‘ఆంధ్రజ్యోతి’) నిండా రాష్ట్రీయ స్వయం సేవక్‌సంఘ్‌పై విద్వేషం మినహా విష‌యం లేదు. గాంధీ చివ‌రి కార్య‌ద‌ర్శి ప్యారేలాల్ రాసుకున్న ఆత్మ‌క‌థ ‘మహాత్మా గాంధీ: ది లాస్ట్ ఫేజ్’లో కొన్ని వాక్యాల‌ను గుహ ఉద‌హరించారు. ‘సంఘ్ ఒక మతతత్వ, ఫాసిస్టు సంస్థ. హిందూరాజ్‌ను ఏర్పాటు చేయడమే దాని ప్రకటిత లక్ష్యం. ముస్లింలందరినీ భారత్ నుంచి పంపించివేయాలి అనేది దాని నినాదం’ అని ప్యారేలాల్ రాసుకుంటే, దాన్ని గాంధీ అభిప్రాయంగా వ్యాస‌క‌ర్త ఆపాదిస్తూ సంఘ్‌పై త‌న‌ మనసులో ఉన్న విషాన్నంతా వెళ్లగ‌క్కారు. అప్పుడూ-–ఇప్పుడూ మెజారిటీవాదం అంటూ త‌న పురోగామి ముసుగులోంచి గుస‌గుస‌లు వినిపించిన రామ‌చంద్ర గుహ చ‌రిత్ర‌కారుడు కానే కాదు. చరిత్ర‌హీనుడు. రాష్ట్రీయ స్వ‌యంసేవక్‌ సంఘ్‌కు విద్రోహం త‌ల‌పెట్టేందుకు గ‌తం త‌వ్వాడు. దానిని ఒక మ‌తసంస్థ‌గా చిత్రీక‌రించేందుకు గుహ చేయ‌ని ప్ర‌య‌త్నం లేదు. ముస్లింల‌ను దేశంలో లేకుండా చేసేందుకు ఆరెస్సెస్ సంకల్పించిందని దీర్ఘాలు తీస్తూనే మధ్యయుగాల ఇస్లాం నుంచి ఆ ఎజెండాను సంఘ్ స్వీకరించిందంటూ వ్యాసకర్త వక్ర‌భాష్యాలు చెప్పాడు. దీన్నిబట్టి ఈ చరిత్రకారుడు అయోమయంలో పడి తన ఎజెండాను అమ‌లు చేయ‌లేక‌పోయాడ‌ని అర్థమవుతోంది. ఆరెస్సెస్ సేవా కార్య‌క్ర‌మాల‌ను గాంధీ బృందం మెచ్చుకుంద‌ని రాసిన గుహ వెనువెంటనే గాంధీ వ్యాఖ్య అంటూ ప్యారేలాల్ పుస్త‌కం నుంచి ఉటంకించడం పూర్తిగా సంఘ్‌కు విద్రోహం త‌ల‌పెట్టే ప‌నిలా క‌నిపిస్తోంది. ఆయ‌న వ్యాఖ్యానించిన‌ట్టు రాష్ట్రీయ స్వ‌యంసేవక్‌ సంఘ్ మ‌త ‌సంస్థ కాదు, దానిది మెజారిటీవాదం అంత‌క‌న్నా కాదు. భార‌త‌దేశ విధాన‌మైన ‘భిన్న‌త్వంలో ఏక‌త్వం’నే ఆరెస్సెస్ స‌మ‌ర్థిస్తోంది. అన్ని మ‌తాల‌ వారితోనూ సుహృద్భావపూర్వకంగా వ్యవహరిస్తూ స‌మ‌త‌, మ‌మ‌త పెంచేలా మ‌త‌సామ‌ర‌స్యానికి పాటుప‌డ‌టం సంస్థ ల‌క్ష్యం. అన్య‌మ‌తాల‌ను కించ‌ప‌ర‌చడాన్ని త‌ప్పుగా భావిస్తుంది. అన్య‌మ‌త‌ప్ర‌చారం చేయకూడ‌ద‌నే లక్ష్యానికి సంఘ్ నాటికీ నేటికీ కట్టుబ‌డి ఉంది. జిహాదీల‌ను ప్రోత్స‌హించ‌రాద‌నేది ఆరెస్సెస్ బ‌ల‌మైన‌ వాద‌న‌. మేధావుల ముసుగు వేసుకుని హిందూమ‌తాన్ని కాల‌గ‌ర్భంలో క‌లిపేయాలనే కుట్ర‌ల్ని ఎదిరించే పోరాడేది మ‌త‌సంస్థ అయితే సంఘ్‌ ముమ్మాటికీ మ‌తసంస్థే. రాజ‌కీయ సంస్థ‌ల ప్రోద్బ‌లంతో చాప‌ కింద‌ నీరులాగ విస్త‌రించిన హిందూ వ్య‌తిరేక‌శ‌క్తులపై అది నిత్యం సైద్ధాంతిక పోరాటం చేస్తూనే ఉంటుంది. 


మహాత్మాగాంధీ తన నివాసానికి దగ్గరగా ఉన్న ఆరెస్సెస్ శాఖను 1947లో సంద‌ర్శించారు. అక్కడున్న సంఘ్ కార్యకర్తలతో మమేకమై వారి క్ర‌మ‌శిక్ష‌ణ‌, సేవ‌ల గురించి చాలా గొప్పగా మాట్లాడారు. ఆరెస్సెస్ ఏకతా స్తోత్రాన్ని తన జీవితానికి అన్వ‌యించు కున్నారు. అది చాలా గొప్పదైన, విలువలతో కూడిన స్తోత్రంగా మ‌హాత్ముడు అభివ‌ర్ణించారు. సంఘ్ శాఖ సంద‌ర్శ‌న‌, అక్క‌డ మ‌హాత్ముడి సంభాష‌ణ‌ల సారాంశాన్ని ‘హరిజన్’ పత్రిక 1947 సెప్టెంబర్ 27 సంచికలో ప్రచురించారు. 1947లో సంఘ్‌పై గాంధీ అభిప్రాయాల‌ను స్ప‌ష్టంగా హ‌రిజ‌న్‌ ప‌త్రిక ప్ర‌క‌టిస్తే, అదే ఏడాది గాంధీ చేసిన వ్యాఖ్య‌లంటూ, వాటిని తాను విన్నానంటూ ఆయన చివ‌రి కార్య‌ద‌ర్శి ప్యారేలాల్ ఆత్మ‌క‌థ‌లో రాసుకున్న వాటిని ఉటంకించడం ముమ్మాటికీ సందేహించ‌ద‌గ్గవి. 


ఆరెస్సెస్ శాఖ సంద‌ర్శ‌న సంద‌ర్భంగా మహాత్మాగాంధీ మాట్లాడుతూ క్ర‌మ‌శిక్షణ‌తో, కులం, మతం వంటి భేదభావాలు చూడ‌కుండా స్వ‌యంసేవ‌కులు నిర్భీతిగా సేవ‌లు అందిస్తార‌ని కొనియాడారు. 1936 లోనూ వార్ధాలోని ఆరెస్సెస్ కార్యాలయానికి వెళ్లిన గాంధీజీ, ‘స్వదేశీ అనేది ఓ మ‌హ‌త్త‌ర ఆలోచ‌న’ అని ప్రస్తుతించారు. గాంధీజీ గ్రామస్వ‌రాజ్యం, స్వ‌దేశీ ఆలోచ‌న‌ల‌కు ద‌గ్గరగా నేడు ఆరెస్సెస్ చేప‌డుతున్న స్వ‌దేశీ మంచ్ ఉంది. సంఘ్ ప్రార్థ‌న‌లు భార‌త‌మాత గొప్ప‌త‌నం, హిందూ సంస్కృతి సంప్రదాయాల ప‌ట్ల మ‌రింత గౌర‌వం పెంచేలా ఉన్నాయ‌ని మ‌హాత్ముడు మెచ్చుకున్నారు. సంఘ్ సేవాభావం, దేశం కోసం చేస్తున్న త్యాగాల‌ను బాపూజీ కొనియాడారు. క్ర‌మ‌శిక్ష‌ణ‌, నిబ‌ద్ధ‌త క‌లిగిన ఇటువంటి సంస్థ‌లు మాత్ర‌మే దేశ సంక్షేమానికి పాటుప‌డే బ‌ల‌మైన శ‌క్తులుగా ఎదుగుతాయ‌ని అభిప్రాయ‌ప‌డ్డారు. మ‌హాత్ముడి ఆత్మ‌లా సంఘ్ కార్య‌క‌లాపాలు కొన‌సాగేవి. ఆయన చివ‌రివ‌ర‌కూ సంఘ్‌తో సుహృద్భావ స్నేహాన్ని కొన‌సాగించారు. ఆరెస్సెస్‌ ఆరంభ‌మైన నాటి నుంచి నిరాఘాటంగా సాగిన కార్య‌క్ర‌మాలు 1948లో మహాత్మాగాంధీ మరణించిన తరువాత వారం రోజులు నిలిపివేశారంటే ఆయ‌న‌కు ఎంత విలువ‌నిచ్చేవారో అర్థం అవుతోంది. మహాత్మాగాంధీ మరణించిన తరువాత సంఘ్‌ను కొన్ని నెలల పాటు నిషేధించారు. ఆయన హత్య కేసు విచారణ సందర్భంగా గాడ్సేకి ఆరెస్సెస్ భావజాలానికి ఎటువంటి సంబంధం లేదని న్యాయ‌స్థానం వ్యాఖ్యానించింది. వాదోప‌వాదాలు విన్న త‌రువాత‌ గాంధీపై గాడ్సే పెంచుకున్న ద్వేషం పూర్తిగా ఆయ‌న‌ వ్యక్తిగతం అనే అభిప్రాయానికి వచ్చిన న్యాయస్థానం సంఘ్‌పై నిషేధాన్ని ఎత్తివేసింది. మ‌హాత్ముడి ఆశ‌యాల మాదిరిగానే సంఘ్ భార‌త‌దేశ ఆత్మగా ద‌శాబ్దాలుగా కొన‌సాగుతూనే ఉంటుంది.

వి. జయప్రకాష్ నారాయణ

(చైర్మన్, సెంట్రల్ లేబర్ వెల్ఫేర్ బోర్డ్)

Updated Date - 2020-12-26T06:53:09+05:30 IST