అతడు

ABN , First Publish Date - 2020-03-02T08:14:44+05:30 IST

అతడు.. నిత్యం చీకటి నిండిన వీధుల్లోంచి నిశ్శబ్దంగా పారే కన్నీటి కాలువల ప్రక్కన అచేతనమైన గడ్డి పరకలకు చెమ్మను అద్దుతూనో విసిరి వేయబడ్డ ఎముకల గూళ్ళ శ్వాసనాలాల్లోకి...

అతడు

అతడు.. నిత్యం చీకటి నిండిన వీధుల్లోంచి

నిశ్శబ్దంగా పారే కన్నీటి కాలువల ప్రక్కన

అచేతనమైన గడ్డి పరకలకు చెమ్మను అద్దుతూనో

విసిరి వేయబడ్డ ఎముకల గూళ్ళ శ్వాసనాలాల్లోకి

ప్రాణవాయువు ఊదుతూనో

వెన్నెల కురిసే నదుల అలలపైనో

ఎర్రబారిన అడవి చెట్ల ఆకులపైనో

నీరెండిన విశాల ఎడారి తుఫానుల మధ్యనో

మనుషుల కోసం మనిషి గొంతై ప్రార్థించే వాడు

గాఢ నిశ్శబ్ద రాత్రుల్లో అతను మేలుకొని

మనచుట్టూ  పేరుకున్న మౌన సాంద్రత గురించి 

మాట్లాడేవాడు

అతడు మాట్లాడుతున్నాడని

మాటల్లో అస్తిత్వాల భాషను అల్లుతున్నాడని

ముడుచుకున్న మనిషి రెక్కలకు విచ్చుకోవడం 

నేర్పుతున్నాడని

చీకటి గదుల్లోకి విసిరివేయబడ్డ

మానవ సమూహాల్లోకి తలుపులు తెరుస్తున్నాడని

మాట్లాడుతున్నాడని మాటలను ప్రశ్నలు చేస్తున్నాడని

అతన్ని ఖైదు చేసారు

అతడూ ఖైదు గురించే మాట్లాడాడు

మనుషుల చుట్టూ మొలుస్తున్న జైలు ఊచల గురించి

ఉబికి వస్తున్న అడ్డు గోడల గురించి మాట్లాడాడు

అతడిని బంధిస్తే మాటను బంధించినట్టని

ప్రశ్నని బంధించినట్టని నువ్వనుకుంటావు

కానీ.. మట్టివాసనలను పులుముకున్న

గాలితరగల నిశ్శబ్ద సంగీత చలనం కదా మాట

గాలినెలా బంధిస్తావు?

ఈ నేలంతా పచ్చని చిగురుటాకులై మొలకెత్తే

ప్రశ్నని ఎలా బంధిస్తావు?

చెమన్‌

94403 85563


Updated Date - 2020-03-02T08:14:44+05:30 IST