అత్యాచార దేశం
ABN , First Publish Date - 2020-10-03T06:11:42+05:30 IST
హాత్రస్‌లో అత్యాచారానికి గురైన యువతి ఇంటిని పోలీసులు దిగ్బంధనం చేస్తారు ఆమె మృతదేహాన్ని ఎత్తుకుపోతారు, ఒకానొక హంతక రాత్రి దాన్ని తగులపెడతారు....

హాత్రస్‌లో అత్యాచారానికి గురైన యువతి ఇంటిని పోలీసులు దిగ్బంధనం చేస్తారు
ఆమె మృతదేహాన్ని ఎత్తుకుపోతారు, ఒకానొక హంతక రాత్రి దాన్ని తగులపెడతారు
ఆమె తల్లి గుండెలు పగిలే విలాపాన్ని చెవిన పెట్టరు, దళితులు పాలించడానికి వీలులేని భూమిలో, వాళ్లు ఆగ్రహించడానికీ వీలు లేదు, ఏడ్వడానికీ వీలు లేదు
ఇది తరతరాలుగా జరుగుతున్న కథే, మళ్లీ మళ్లీ ఆగకుండా జరగనున్న గాథే
ఆ చితిమంటలు గుర్తు చేసేదేమిటి? భర్తల చితుల మీదికి వధువులను లాగి సజీవంగా తగులబెడుతున్నప్పుడు మంటల మధ్య ఎగసిన సతి
కేకలుకులాల హద్దులు దాటిన ప్రేయసీ ప్రియులను వధిస్తున్నప్పటి గగ్గోలు
అత్యాచారానికి గురై నాలుక తెగగోయబడిన యువతుల మొత్తుకోళ్లు
ఇది తరతరాలుగా జరుగుతున్న కథే, మళ్లీ మళ్లీ ఆగకుండా జరగనున్న గాథే
గతించిన కాలపు మనువు మాట, వాడి మూర్ఖ వారసుల పాట
స్త్రీలందరూ వ్యభిచారులేనట, స్త్రీలందరూ నీచులేనట
స్త్రీ లైంగిక వాంఛల ప్రతిరూపమట, వారికి కావలసింది బలాత్కారమేనట
మనువు మగవాళ్లందరికీ లైసెన్స్ బిళ్లలిచ్చాడు, అత్యాచార ఆదేశమిచ్చాడు
ఇది తరతరాలుగా జరుగుతున్న కథే, మళ్లీ మళ్లీ ఆగకుండా జరగనున్న గాథే
ఇది తరతరాలుగా జరుగుతున్న కథే, మళ్లీ మళ్లీ ఆగకుండా జరగనున్న గాథే
ఈ నేల మీద అమలయ్యే చట్టం ఒకే ఒకటి, అదే సనాతన శిక్షాస్మృతి
సనాతన ధర్మం చెల్లేచోట ఏదీ ఎప్పటికీ మారదు మారగూడదు
ఎల్లప్పుడూ బాధితుల మీదనే బండ విసురు, లంజలని తిట్టు
అత్యాచార నేరస్తుల అండ పోలీసు రాజ్యం, కులం లేదని నమ్మే నాలుగో స్తంభం
ఇది తరతరాలుగా జరుగుతున్న కథే, మళ్లీ మళ్లీ ఆగకుండా జరగనున్న గాథే
మీనా కందసామి (ఇంగ్లిష్ నుంచి: ఎన్ వేణుగోపాల్)