రాజకీయాలు చేయాలి

ABN , First Publish Date - 2020-10-03T05:53:18+05:30 IST

ప్రభుత్వ వైఫల్యాన్ని చూపించే ఒక సంఘటన జరిగితే, అక్కడికి ప్రతిపక్షాల వారు వెళ్లి, బాధితులను పరామర్శిస్తారు. అదే పని అధికారపక్షం కూడా చేయవచ్చు...

రాజకీయాలు చేయాలి

ప్రభుత్వ వైఫల్యాన్ని చూపించే ఒక సంఘటన జరిగితే, అక్కడికి ప్రతిపక్షాల వారు వెళ్లి, బాధితులను పరామర్శిస్తారు. అదే పని అధికారపక్షం కూడా చేయవచ్చు. కానీ, ఎదుటి పక్షం నుంచి ఆరోపణలు రాగానే, బిగుసుకుపోయి, మరింతగా వైఫల్యాన్ని, ప్రజావ్యతిరేకతను ప్రదర్శించాలనే బలహీనతలోకి అధికారపక్షం పడిపోతుంది. అధికారంలో ఉన్న సమస్యే అది. ప్రజల మద్దతుతో అధికారంలోకి వచ్చి, ప్రజలు ఏదన్నా గట్టిగా అడిగితే దాన్ని నెరవేర్చడం అవమానకరమని ప్రభుత్వం అనుకుంటుంది. అధికారం కోల్పోయి, ప్రజల సమ్మతి మళ్లీ పొందాలనుకునే పక్షాలు, సహజంగానే ప్రజలను, ముఖ్యంగా ప్రభుత్వంపై కోపం ఉన్న ప్రజలను ఆశ్రయిస్తారు. అట్లా ఆశ్రయించడం తప్పట. అది రాజకీయం చేయడమట. స్త్రీలపై జరిగిన ఘాతుకాన్ని రాజకీయం చేస్తారా, దళితుల సమస్యలను రాజకీయం చేస్తారా? అంటూ ప్రభుత్వ పెద్దలు విమర్శిస్తూ ఉంటారు. వారికి వంతపాడేవారు తయారయ్యారు కదా, రిపబ్లిక్‌ టీవీ, టైమ్స్‌ నౌ వంటి చానెళ్లు కూడా బాధితుల పరామర్శను నీచరాజకీయం అంటూ ఊదరగొడతాయి. బాధితుల దగ్గరికి వెళ్లి, కష్టం సుఖం తెలుసుకుని, వారికి న్యాయం కోసం ప్రయత్నించడం నీచరాజకీయం ఎట్లా అవుతుంది? రాజకీయ పార్టీలు, నాయకులు చేయవలసింది అదే కదా?


రాజకీయం అన్న మాటను కూడా తప్పుడు అర్థంలో తీసుకోవడం మరో సమస్య. సమస్యల మీద ప్రజలను కూడగట్టి, ఆందోళనలు, ఉద్యమాలు చేయడం రాజకీయ నాయకుల బాధ్యత. ఇతరుల పక్షాన ప్రాతినిధ్యం వహించడమే రాజకీయం. అది డిమాండ్ల సాధనకు ప్రయత్నిస్తుంది. ఆ క్రమంలో తన అనుయాయుల సంఖ్య పెంచుకుని అధికారం కోసం కూడా ప్రయత్నిస్తుంది. రాజకీయం అన్నది ప్రజాస్వామ్య వ్యవస్థలో ఒక సానుకూల అంశం. దాన్నొక తిట్టులాగా వాడడం తప్పు. ఫలానా వాడు రాజకీయం చేస్తున్నాడు అంటే, అది ప్రజాసమస్యపై చేసే ప్రయత్నం అయితే, మంచిదే. అంశాల మంచి చెడ్డలను కేవలం రాజకీయ అనుబంధాల రీత్యా మాత్రమే చూసి, అడ్డదారిన తమ రాజకీయాలను నెగ్గించాలని చూడడం తప్పుడు రాజకీయం. ఎవరన్నా అటువంటివి చేస్తుంటే వారిని తప్పుడు రాజకీయాలు చేస్తున్నారని నిందించవచ్చు, రాజకీయాలు చేస్తున్నారని కాదు.


కాంగ్రెస్‌ నేతలు రాహుల్‌, ప్రియాంక గాంధీ గడప దాటకుండా ట్విట్టర్‌ రాజకీయాలు చేస్తున్నారని విమర్శించినవారే, ఇప్పుడు వారు వీధుల్లోకి వచ్చి పోరాడితే రాజకీయం చేస్తున్నారని అంటున్నారు. ఈ చొరవ ఎంత కాలం ఉంటుందో తెలియదు కానీ, హత్రాస్‌ సంఘటన విషయంలో ఆ అక్కాతమ్ముళ్లు గొప్ప స్పందన కనబరిచారు. తమ అనుయాయులకు, మొత్తంగా పార్టీకి ఉత్సాహాన్ని ఇచ్చారు. దేశంలో ఎక్కడేమి జరిగినా అడిగేవాడు లేని దుస్థితిలో, బాధితులందరికీ ఒక చిన్న ఆశ కల్పించారు. గొలుసుకట్టు స్పందనలకు కారణమయ్యారు. శుక్రవారం నాడు, హత్రాస్‌లో బాధితురాలి కుటుంబాన్ని కలవడానికి ప్రయత్నించిన ఎబిపి చానెల్‌ మహిళా విలేఖరి, ఉత్తరప్రదేశ్‌ ప్రభుత్వ యంత్రాంగం నైతిక శుష్కత్వాన్ని బట్ట బయలు చేసింది. సుమారు గంటసేపు, అలుపు లేకుండా, ఆ విలేఖరి, కెమరామన్‌, పోలీసుల అడ్డగింతను ఎదిరిస్తూ, వాదిస్తూ, నిలదీశారు. వెంటనే సామాజిక మాధ్యమంలోకి వెళ్లిన ఆ విడియోకు కొన్ని గంటలలోనే 20 లక్షలకు పైగా సందర్శనలు వచ్చాయి. ఎందుకు బాధితులను కలవగూడదో అధికారుల దగ్గర వివరణే లేదు.


బాధితురాలికి స్వగ్రామంలో అర్ధరాత్రి జరిపిన అంత్యక్రియలకు తాను ప్రత్యక్ష సాక్షినని ఎన్‌డిటివి విలేఖరి ఒకరు, నాటి వివరాలను పూసగుచ్చారు. ఊరి బయట పొదల్లో పేర్చిన చితి చుట్టూ పోలీసులు వలయంగా ఏర్పడి, అంత్యక్రియలకు కాపలా ఉన్నారు. బాధితురాలి తల్లి, తండ్రి, కుటుంబసభ్యులు అందరూ ఇంట్లో బంధితులుగా ఉన్నారు. ఏ సత్యాన్ని కాల్చేయడానికి ఆ రహస్య దహనం జరిగింది? అలహాబాద్‌ హైకోర్టు ప్రభుత్వానికి నోటీసులు ఇచ్చింది. నిలదీసేవారు పెరుగుతున్నారు. ప్రశ్నలూ పెరుగుతున్నాయి. అత్యంత అమానుషమైన హింసకు లోనై, కన్నుమూసిన ఆ దళిత మహిళ, అణగారిపోయిన స్పందనలను పునరుజ్జీవింపజేస్తున్నది. కాకపోతే, ప్రశ్నార్థకమైన పాలనను సహజంగానే వ్యతిరేకించి కూలదోయవలసిన ప్రజాస్వామ్యంలో, విషాదాలు జరిగితే తప్ప చలనం రావడం లేదు.


స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి ఉత్తరప్రదేశ్‌ కాంగ్రెస్‌కు కంచుకోటగా ఉండి, అనేక మంది ప్రధానమంత్రులను ఇచ్చింది. మతతత్వ రాజకీయాలు, సామాజిక న్యాయ రాజకీయాల ఘర్షణలో కాంగ్రెస్‌కు 1990 నుంచి బలమైన ఉనికి లేకుండా పోయింది. దేశంలో మూడు నాలుగు రాష్ట్రాలలో తప్ప ఇప్పుడు కాంగ్రెస్‌ ప్రధానపక్షంగా లేకుండా పోయింది. ఈ దుస్థితి నుంచి బయటపడడం కాంగ్రెస్‌కు అసాధ్యంగా ఉన్నది. బిజెపి దూకుడు కాంగ్రెస్‌ ముక్త్‌ భారత్‌ను గురిపెడుతుండగా, పార్టీలో అంతర్గత విమర్శ కూడా బలపడసాగింది. అగమ్యగోచర స్థితిలో పార్టీయే కాదు, అగ్రనేతలు కూడా కొట్టుమిట్టాడుతున్నారు. ఆ స్థితిలో హత్రాస్‌ సంఘటనకు కాంగ్రెస్‌ స్పందించిన తీరు అనేక వ్యాఖ్యానాలకు తావిస్తున్నది. ఒకటి, గురువారం నాటి సంఘటన– రాష్ట్రంలో బిజెపికి ప్రత్యర్థి స్థానంలో కాంగ్రెస్‌ను నిలిపింది. దీన్ని ఎన్నికల దృష్టితో అర్థం చేసుకోగూడదు. సమాజ్‌వాదీ పార్టీ, బహుజన్‌ సమాజ్‌ పార్టీ క్రియాశీలంగా లేని స్థితిలో, పెద్ద పార్టీలలో కాంగ్రెస్‌ ఒక్కటే రాష్ట్రప్రభుత్వాన్ని ఎదుర్కొనే ప్రయత్నం చేసింది. ఆ పరిణామానికి దేశవ్యాప్తంగా సానుకూల స్పందన లభించింది. కాంగ్రెస్‌ భవితవ్యానికి కావలసిందేమిటో కూడా ఈ ఉదంతం గట్టి సూచన చేసింది.


ప్రజల భద్రత కోసం, సమస్యల పరిష్కారం కోసం ప్రతిపక్షాలు రాజకీయాలు చేయాలి. అందుకు కష్టపడాలి, రోడ్డెక్కాలి, పోలీసు దౌర్జన్యం రుచిచూడాలి. అధికారాలు ఊరికే రావు.

Updated Date - 2020-10-03T05:53:18+05:30 IST