వైరస్‌లా మతవిద్వేషం

ABN , First Publish Date - 2020-09-25T06:25:20+05:30 IST

కరోనా విలయం ముగిసేదెన్నడు? మనలను సతాయిస్తున్న, హైరానా పెడుతున్న, భీతావహులను చేస్తున్న వైరస్ కరోనా ఒక్కటేనా? కానే కాదు. విద్వేషం అనే విషక్రిమి...

వైరస్‌లా మతవిద్వేషం

భిన్న మతాలవారి మధ్య విద్వేషాన్ని రెచ్చగొట్టడం ద్వారా లబ్ధి పొందేందుకు ప్రయత్నించే ‘వార్తా వర్తకుల’పై సత్వరమే కఠినచర్యలు తీసుకోవాలి. ప్రభుత్వం అలా వ్యవహరించినప్పుడు మాత్రమే మన జాతి జీవనంలో శాంతి సామరస్యాలకు ముప్పుగా పరిణమిస్తున్న వైరస్‌ను నిర్మూలించడానికి ఒక వ్యాక్సిన్‌ను మనం కనుక్కోవడం సాధ్యమవుతుంది.


కరోనా విలయం ముగిసేదెన్నడు? మనలను సతాయిస్తున్న, హైరానా పెడుతున్న, భీతావహులను చేస్తున్న వైరస్ కరోనా ఒక్కటేనా? కానే కాదు. విద్వేషం అనే విషక్రిమి మన మనస్సులకు సోకుతోంది. మన ఆలోచనలను కలుషితం చేస్తోంది. సామాజిక మాధ్యమాలు కాంతి వేగంతో ఆ విషక్రిమిని వ్యాపింపచేస్తున్నాయి. విద్వేషాన్ని మనం శ్వాసిస్తున్నాం, చూస్తున్నాం, వింటున్నాం! కాదంటారా? నిష్కళంక సంఘ సేవకుడు, నిర్మల ఆధ్యాత్మికశీలి స్వామి అగ్నివేశ్ కొద్దిరోజుల క్రితం మరణించిన వేళ ఆయన గురించి విశ్రాంత ఐపీఎస్ అధికారి ఎన్. నాగేశ్వరరావు ఏమన్నారో గుర్తు చేయనా? ‘పీడ వదిలిపోయింది సుమా... నువ్వు కాషాయ వస్త్రాలు ధరించిన హిందూ వ్యతిరేకివి. హిందూ మతప్రతిష్ఠకు అపరిమిత నష్టం కలిగించావు. నువ్వు ఒక తెలుగు బ్రాహ్మిణ్‌గా పుట్టినందుకు నేను సిగ్గు పడుతున్నాను. నీకు యమపాశం విసరడానికి యమధర్మరాజు ఇంతకాలం ఎందుకు వేచిఉన్నాడో?! ఆయన చేసిన జాప్యం అనుచితమైంది. అది నన్ను ఎంతో బాధించింది. ఎట్టకేలకు మృత్యుదేవర నిన్ను తీసుకువెళ్ళాడు. చాలా సంతోషం’. సంతోషమా? తోటి వ్యక్తి చనిపోతే సంతోషపడడమా? మన సంఘంలో మానవతా సంస్కారం ఇంకా వర్థిల్లుతోంది. కనుకనే నాగేశ్వరరావు ట్వీట్ పట్ల నిరసనలు వెల్లువెత్తాయి. అంతిమంగా ఆ ప్రమాదకర వ్యాఖ్యలను ట్విటర్ ఉపసంహరించుకోక తప్పలేదు. 


నాగేశ్వరరావు ఒక సాధారణ పోలీసు అధికారి కాదు. 2018లో ఆయన సిబిఐ యాక్టింగ్ డైరెక్టర్‌గా నియమితులయ్యారు. గత జూలైలో విశ్రాంత జీవితంలోకి ప్రవేశించే ముందు ఫైర్ సర్వీసెస్, హోంగార్డ్స్ విభాగానికి డైరెక్టర్ జనరల్‌గా నియమితులయ్యారు. వివిధ బాధ్యతాయుతమైన పదవులను నిర్వహించిన వ్యక్తి అటువంటి ద్వేషపూరిత వ్యాఖ్యచేయడం, బహుశా, మన కాలం ధోరణులను ప్రతిబింబిస్తుందని చెప్పక తప్పదు. రాజ్యాంగానికి నిబద్ధమై ఉంటామని ప్రమాణం చేసినవారూ, శాంతిభద్రతలను సమతుల్యంగా కాపాడేందుకు సాధికారత పొందినవారూ తమ విధ్యుక్తధర్మ నిర్వహణలో విద్వేష భావజాలంతో వ్యవహరించడం సబబేనా? స్వామి అగ్నివేశ్ లాంటి ఉదాత్తవ్యక్తులను తూలనాడడం తగునా? మరింత ఘోరమైన విషయమేమిటంటే అగ్నివేశ్ గురించిన వ్యాఖ్యల విషయమై నాగేశ్వరరావులో పశ్చాత్తాపం ఏ కోశానా లేకపోవడం. పైగా తన విద్వేష వ్యాఖ్యలను ఆయన పూర్తిగా సమర్థించుకున్నారు. 


నాగేశ్వరరావు ట్వీట్, అటువంటి ట్వీట్ మరొక దాన్ని గుర్తుకు తెచ్చింది. 2017లో పాత్రికేయురాలు గౌరీలంకేశ్‌ను గుర్తు తెలియని దుండగులు హతమార్చిన సందర్భంలో వైరల్ అయిన ట్వీట్ అది. సూరత్‌కు చెందిన వ్యాపారి నిఖిల్ దధీచ్  చేసిన ట్వీట్ అది. ‘ఒక దుష్టురాలు కుక్క చావు చచ్చింది, ఆమె మరణం పట్ల ఇప్పుడు అందరూ ఒకే రాగంలో రోదిస్తున్నారు’. అనేది ఆయన ట్వీట్‌ ఇదొక ఆమోదరహిత, అసహ్యకర వ్యాఖ్య అనడంలో  సందేహం లేదు. సాధారణంగా అయితే ఈ ట్వీట్ ఎవరి దృష్టికి వచ్చి ఉండేది కాదు. కానీ ఒక ఇబ్బందికరమైన సత్యం ఆ ట్వీట్‌ను విశాల ప్రపంచం దృష్టికి తీసుకువెళ్ళింది. నిఖిల్ ట్వీట్‌లను ప్రధానమంత్రి నరేంద్రమోదీ సదా అనుసరిస్తూ ఉంటారట! నిఖిల్ సైతం తన వ్యాఖ్యలకు ఎటువంటి పశ్చాత్తాపం వ్యక్తం చేయలేదు. క్షమాపణలు చెప్పలేదు. ప్రధానమంత్రి అంతటి వ్యక్తి తన ట్వీట్‌లను అనుసరిస్తుండడం తనకెంతో ‘గర్వకారణ’మని నిఖిల్ చెప్పుకొచ్చాడు. 


నాగేశ్వరరావు, నిఖిల్ లాంటి వారు ఇంకా చాలా మంది ఉన్నారు. అజ్ఞాత ట్విటర్ హాండెల్స్, ఫేస్‌బుక్ పోస్ట్‌లు, వాట్సాప్ గ్రూపులు వేల సంఖ్యలో ఉన్నాయి. ఇవన్నీ వ్యక్తుల మధ్య, విభిన్న మతవర్గాల మధ్య తీవ్ర పగ, ప్రతీకారాగ్నులు రెచ్చగొట్టడమే లక్ష్యంగా పనిచేస్తున్నవే కావడం గమనార్హం. బహిరంగ వేదికల ముసుగులో సామాజిక మాధ్యమాల జగత్తు సొంత ప్రవర్తనా నియమావళిని సృష్టించుకుంది. ఆ నియమావళిలో వాక్ స్వాతంత్ర్యానికి, విద్వేష ప్రసంగాలకు మధ్య రేఖలు అస్పష్టమైపోయాయి. ఈ సామాజిక మాధ్యమాల వేదికలు మన కాలం ‘డిజిటల్ ఫ్రాంకెన్ స్టెయిన్స్ ’అని నెట్‌ఫ్లిక్స్ డాక్యుమెంటరీ ‘ది సోషల్ డైలమా’ వ్యాఖ్యానించింది. ఈ నీతిబాహ్య మృగాలు సామాజిక మాధ్యమాల చిట్టడవిలో ఉన్మాదంతో వ్యవహరిస్తూ విద్వేషాన్ని, విభజనలను రెచ్చగొట్టేందుకు సకల నిబంధనలను కాలరాచివేస్తున్నాయని కూడా ఆ డాక్యుమెంటరీ ఫిల్మ్ వ్యాఖ్యానించింది. 


సామాజిక మాధ్యమాలలో అవధులు లేకుండా వ్యక్తమవుతున్న విద్వేషం నిరంతరాయంగా వార్తాప్రపంచానికి సంక్రమిస్తోంది. కనుక విద్వేషాగ్నులను రెచ్చగొడుతున్న పాపం సామాజిక మాధ్యమాలది మాత్రమే అని భావించడం సరికాదు. అలా భావించడమంటే విద్వేష వైరస్ స్వభావాన్ని అర్థం చేసుకోకపోవడమే. విద్వేషం ఒక భయంకర సాంక్రమిక వ్యాధి. ఇటీవలి సంవత్సరాలలో సంభవించిన పరిణామాలు ఈ విషయాన్ని నిరూపించాయి. మైనారిటీ వర్గాల, ముఖ్యంగా మత మైనారీటీల వ్యతిరేక రాజకీయ సందేశాలు సామాజిక మాధ్యమాల ద్వారా సర్వత్రా వ్యాపిస్తున్నాయి. ఇదొక నిత్య వ్యవహారమైపోయింది. భారతీయ ముస్లింలు జాతి-వ్యతిరేకులు అనే కథనాన్ని అధికార శ్రేణులలోని ఒక వర్గం ఉద్దేశపూర్వకంగా,, పదే పదే ప్రచారంలో పెడుతోంది. సదరు ప్రచారం ద్వారా ఆ కథనం ఒక విశ్వసనీయతను సంతరించుకోగలదని ఆ పాలక కులీనులు భావిస్తున్నారు. తరచు వివాదాస్పద వ్యాఖ్యలు చేసే కేంద్రమంత్రి ఒకరు ఒక ఎన్నికల సభలో ‘దేశ్ కె గద్దరోన్ కో’ అని బిగ్గరగా అన్నప్పుడు ‘గోలీ మారో సాలోం కో’ అని జనం మహోద్రేకంతో ప్రతిస్పందించారు. అయినప్పటికీ అధికార పార్టీ పెద్దలు, అటువంటి ఉద్రిక్తతలను సృష్టించకుండా ఆ మంత్రిని నిరోధించేందుకు శ్రద్ధ చూపనే లేదు. అలాగే పౌరసత్వ సవరణ చట్ట వ్యతిరేక నిరసనకారులను, వారు ధరించిన వస్త్రాల ఆధారంగా గుర్తించడమూ, అక్రమ వలసకారులను ‘చెద పురుగులు’గా, తబ్లీఘీలను ‘కరోనా వాహకులు’గా ప్రస్తావించడమూ మత దురభిమానాలను నిస్సిగ్గుగా రెచ్చగొట్టే ప్రయత్నాలలో భాగమేనని నిస్సందేహంగా చెప్పవచ్చు. 


 మైనారిటీ వర్గాలకు వ్యతిరేకంగా విద్వేషపూరిత, మతోన్మాద కథనాలు ఎంతగా సాధారణ వ్యవహారాలు అయిపోయాయో ఇటీవలి సుదర్శన్ టీవీ కేసు ఉదంతం విశదం చేసింది. సివిల్‌సర్వీస్‌లలో అత్యధికంగా ప్రవేశించే లక్ష్యంతో జరిగిన ఒక ‘ముస్లిం కుట్ర’ గురించిన నిశిత దర్యాప్తుపై ఆ టీవీ ఛానెల్ రూపొందించిన కార్యక్రమాలకు సంబంధినదే ఆ కేసు. ఆ కార్యక్రమాల ప్రమోషనల్ వీడియోను ‘యుపి ఎస్ సి జిహాద్’అనే విద్వేషపూరిత నినాదంతో ప్రచారంలో పెట్టారు. ముస్లింలను అపఖ్యాతి పాలు చేసేందుకు ఉద్దేశించిన ఆ కార్యక్రమాలకు వ్యతిరేకంగా వెనువెంటనే చర్య తీసుకోకపోగా వాటి ప్రసారానికి సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ అనుమతి ఇచ్చింది. ఆ కార్యక్రమాలను ప్రీ-సెన్సార్ చేసే ఉద్దేశం తమకు లేదనే వాదనతో వాటి ప్రసారానికి సమ్మతించింది. అయితే భిన్న మతవర్గాల వారి మధ్య విద్వేషాన్ని, దుర్భావాలను పెంపొందించే కార్యక్రమాలను నిషేధించాలని టీవీ కార్యక్రమాల నిబంధనావళి నిర్దేశించింది. అయినప్పటికీ సమాచార ప్రసార మంత్రిత్వశాఖ ఈ నిబంధనను పూర్తిగా నిర్లక్ష్యం చేసింది. ఇదెంతవరకు సబబు? మతాలు, సామాజిక సమూహాలపై దాడుల దృశాలు, లేదా మతతత్వ వైఖరులను పెంపొందించే దృశ్యాలు, సంభాషణలు ఉన్న కార్యక్రమాలను నిషేధించాలని కూడా ఆ నిబంధనావళి స్పష్టంగా నిర్దేశించింది. నిబంధనలు ఇంత స్పష్టంగా ఉన్నప్పటికీ సుదర్శన్ టీవీ కార్యక్రమాలను నిషేధించడంపై సమాచార, ప్రసార మంత్రిత్వశాఖ ఒక కచ్చితమైన నిర్ణయం తీసుకో లేకపోయింది. ఫలితంగా ఆ కార్యక్రమాల ప్రసారంపై ఆంక్షలు విధించేందుకు తొలుత ఢిల్లీ హైకోర్టు, ఆ తరువాత సుప్రీం కోర్టు రంగ ప్రవేశం చేయవలసివచ్చింది.


ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా క్రమబద్ధీకరణకు తగిన విధానాలు ఉన్నాయని, ఒక సరికొత్త క్రమబద్ధీకరణ విధాన రూపకల్పనకు మార్గదర్శక సూత్రాలను నిర్దేశించదలుచుకుంటే డిజిటల్ మీడియా, న్యూస్‌పోర్టల్స్ విషయమై తొలుత శ్రద్ధచూపాలని సర్వోన్నత న్యాయస్థానానికి సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ నివేదించడం ఒక ఆసక్తికరమైన విషయం. టీవీ కార్యక్రమాల నిబంధనావళిని ఘోరంగా ఉల్లంఘించిన ఒక ఛానెల్‌పై తన అధికారాలను ఉపయోగించలేని సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ అసలైన సమస్య విశృంఖలమైన, అరాచక డిజిటల్ మీడియా ప్రపంచంలో ఉందని సుప్రీంకోర్టుకు చెప్పడం. బహుశా, ప్రభుత్వ వ్యతిరేక వెబ్‌సైట్‌లపై చర్య తీసుకునే లక్ష్యంతోనే సర్వోన్నత న్యాయస్థానానికి కేంద్రం ఆ నివేదన చేసి ఉంటుంది. సుదర్శన్ టీవీ ఎలాగూ అధికార పార్టీ భావజాలానికి అనుకూలంగా ఉన్నందున అది ఎంతగా నిబంధనలను అతిక్రమించినప్పటికీ దానిపట్ల ఉదారంగా వ్యవహరించాలన్న ఉద్దేశమూ సమాచార, ప్రసార మంత్రిత్వశాఖ వైఖరిలో స్పష్టంగా కన్పిస్తోంది. 


సుదర్శన్ టీవీ లాంటివి సమరశీల హిందూత్వ ప్రపంచ దృక్పథాన్ని ప్రచారం చేస్తున్న విషయం నిజమే. మరి ప్రధానస్రవంతి టీవీ చానెల్స్ విషయమేమిటి? ప్రతిరోజూ ఒక నిర్దిష్ట మతవర్గాన్ని లక్ష్యంగా చేసుకుని వీక్షకుల మనస్సుల్లోకి మతోన్మాద విషాన్ని ఎక్కించడం లేదూ? నకిలీ వార్తలతో ఆ మతవర్గాన్ని అపనిందల పాలుచేయడానికి ప్రయత్నించడం లేదూ? ఉదాహరణకు మహారాష్ట్రలోని పాల్ఘర్‌లో కొద్దినెలల క్రితం ఇద్దరు సాధువుల ఊచకోత ఉదంతాన్నే తీసుకోండి. యథార్థమేమిటో తెలుసుకోవడానికి ఏ మాత్రం ప్రయత్నించకుండానే కొన్ని టీవీ చానెల్స్ ఆ ఊచకోతలను హిందూ, -ముస్లిం ఘర్షణలుగా చిత్రీకరించాయి. తమ వైఖరికి మద్దతుగా ఇరుమతాలకు చెందిన వాగాడంబరులైన వ్యక్తులతో ప్రైమ్‌టైమ్ చర్చలు నిర్వహించాయి. అయితే ఆ ఊచకోతల వెనుక మతపరమైన కారణాలు ఏవీ లేవని నిర్ధారణ అయింది. ఒక వాట్సాప్ వదంతి కారణంగా ఆ సాధువులు తమ బిడ్డలను కిడ్నాప్ చేయడానికి వచ్చినవారుగా స్థానిక గిరిజనులు పొరపడడం జరిగింది. మరి ఆ నిజం నిగ్గు తేలిన తరువాత కూడా ఏ న్యూస్‌ఛానెల్ అయినా తమ వీక్షకులకు క్షమాపణలు చెప్పిందా? లేదు. ఎందుకని? టెలివిజన్ రేటింగ్ పాయింట్స్ పెంచుకోవడానికి ఉద్దేశపూర్వకంగా వీక్షకులను తప్పుదోవ పట్టించిన ఆ ఛానెల్స్ వాస్తవాలు వెల్లడయిన తరువాత కూడా తమ తీరు తెన్నులను ఎందుకు మార్చుకోవడం లేదు? భిన్న మతాల వారి మధ్య విద్వేషాన్ని రెచ్చగొట్టడం ద్వారా లబ్ధి పొందేందుకు ప్రయత్నించే వార్తా వర్తకులపై సత్వరమే కఠినచర్యలు తీసుకోవాలి. ప్రభుత్వం అలా వ్యవహరించినప్పుడు మాత్రమే మన జాతి జీవనంలో శాంతి సామరస్యాలకు ముప్పుగా పరిణమిస్తున్న వైరస్ నిర్మూలనకు ఒక వ్యాక్సిన్‌ను మనం కనుక్కోవడం సాధ్యమవుతుంది.


రాజ్‌దీప్‌ సర్దేశాయి

(వ్యాసకర్త సీనియర్‌ జర్నలిస్‌్ట)


Updated Date - 2020-09-25T06:25:20+05:30 IST