హామీలు అమలు చేయాలి

ABN , First Publish Date - 2020-03-13T06:44:35+05:30 IST

తెలంగాణ సాధనోద్యమంలో ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్లు టీఆర్‌ఎస్‌తో భుజం, భుజం కలిపి పోరాడిన విషయం అందరికీ తెలిసిందే. పోరాటాలు, త్యాగాల ఫలితంగా ఏర్పడ్డ తెలంగాణ రాష్ట్రంలో ఉద్యోగులు...

హామీలు అమలు చేయాలి

తెలంగాణ సాధనోద్యమంలో ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్లు టీఆర్‌ఎస్‌తో భుజం, భుజం కలిపి పోరాడిన విషయం అందరికీ తెలిసిందే. పోరాటాలు, త్యాగాల ఫలితంగా ఏర్పడ్డ తెలంగాణ రాష్ట్రంలో ఉద్యోగులు తమ సమస్యలన్నీ పరిష్కారం అవుతాయని ఆశించారు. టీఆర్‌ఎస్‌ పార్టీ ప్రభుత్వం కూడా తమది ఎంప్లాయ్‌ ఫ్రెండ్లీ ప్రభుత్వంగా ప్రకటించుకుని ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి పలు సందర్భాలలో హామీ ఇచ్చింది. అయితే, ఆరేళ్లలో ఏ ఒక్క సమస్య పరిష్కరం కాలేదు. ముఖ్యమంత్రి అపాయింట్‌మెంట్‌ లేక ఉద్యోగుల సమస్యల నివేదనకు అవకాశం లేదు. ఫలితంగా ప్రభుత్వం పట్ల, ఉద్యోగ సంఘాల పట్ల ఉద్యోగులు అసహనం, ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో కొన్ని ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్ల, కాంట్రాక్టు సంఘాలు ఐక్య వేదికగా ఏర్పడి 2018 లో సీఎం ఇచ్చిన హామీల అమలు కోసం, నేడు ‘చలో అసెంబ్లీ’ కార్యక్రమం తలపెట్టాయి. రాష్ట్రంలో 3.5 లక్షల మంది ఉద్యోగ, ఉపాధ్యాయులు, 2.5లక్షల మంది పెన్షనర్లు, 1.5 లక్షల మంది కాంట్రాక్టు ఉద్యోగులు పనిచేస్తున్నారు. వీరిలో 1.26 లక్షల మంది సీపీఎస్‌ ఉద్యోగులున్నారు. రాష్ట్ర ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ పథకాలు, కార్యక్రమాలను ప్రజలకు చేరువచేయడంలో వీరిదే ముఖ్యభూమిక. ఈ ఉద్యోగులు గౌరవప్రదంగా జీవించడానికి అవకాశం కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వానిది. ఏదేళ్లకోసారి వేతన సవరణ చేయాలి. పాలకుల దయాదాక్షిణ్యాల మీద ఆధారపడి కాకుండా హేతుబద్ధంగా, శాస్త్రీయ విధానంలో జరిగే కార్యక్రమం ఇది. తెలంగాణ ప్రభుత్వం 10వ పీఆర్‌సీ 1.7.2013 నుండి అమలు చేస్తూ 2.6.2014 నుండి ఆర్ధిక ప్రయోజనాలను కల్పించింది. దాని గడువు 2018 జూన్‌ 30తో ముగిసింది. 1.7.2018 నుండి తిరిగి వేతనాలు సవరించాల్సి ఉంది. ఈ నేపథ్యంలో 2018మే 16న ప్రగతిభవన్‌లో ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలతో ముఖ్యమంత్రి సుదీర్ఘ సమావేశం నిర్వహించారు. ముగ్గురు సభ్యులతో రాష్ట్రంలో తొలి పీఆర్‌సీ ఏర్పాటు చేస్తున్నామని, అది మూడు మాసాలలో రిపోర్టు ఇస్తుందని ప్రకటించారు. ఈలోగా 2018 జూన్‌ 2 నుండి ఐ.ఆర్‌.(మధ్యంతర భృతి), పంద్రాగస్టు నుండి కొత్త వేతనాలు అమలు చేసుకుందామని ప్రకటించారు. అయితే, ఆనాటి నుండి దఫదఫాలుగా అది వాయిదా పడుతూనే ఉంది. వివిధ సందర్భాల్లో పీఆర్‌సీ ప్రకటిస్తారని ఉద్యోగులు ఎంతో ఆశగా ఎదురు చూశారు. కానీ, వారి ఆశల్ని అడియాసలు చేస్తూ ప్రభుత్వం అకస్మాత్తుగా పీఆర్‌సీ గడువును 2020 డిసెంబర్‌ 31వరకు పొడిగించింది. దీంతో లక్షల మంది ఉద్యోగులు నిరాశోపహతులయ్యారు. అంతేకాదు, తెలంగాణ ఉద్యోగుల వేతనాలు దేశంలోనే అత్యధికంగా ఉన్నాయని ప్రభుత్వం అసత్య ప్రచారాలు చేస్తున్నది. చాలా రాష్ట్రాలు తెలంగాణ కంటే ఎక్కువ వేతనాలు చెల్లిస్తున్నాయి. మున్సిపల్‌ ఎన్నికల తరువాత విలేకరుల సమావేశంలో మాట్లాడిన ముఖ్యమంత్రి ఉద్యోగులు ఆశపడతారు, వారికి తృణమో పణమో ఇస్తాంలే అంటూ అవమానకరంగా మాట్లాడడం ఉద్యోగులను బాధించింది. ఈ పరిస్థితిలో ప్రభుత్వం తమకు ఇచ్చిన హామీల మేరకు తక్షణమే సమస్యలు పరిష్కరించాలనే డిమాండ్‌తో 57 ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్ల, కాంట్రాక్టు ఉద్యోగ సంఘాల సంయుక్త అధ్వర్యంలో నేడు ‘చలో అసెంబ్లీ’ జరుగుతున్నది. 

ముస్కుల రఘు శంకర్‌ రెడ్డి, డీటీఎఫ్‌ రాష్ట్ర అధ్యక్షులు

(నేడు ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్ల ‘చలో అసెంబ్లీ’)

Updated Date - 2020-03-13T06:44:35+05:30 IST