వన సంరక్షణే నిలువెత్తు బంగారం

ABN , First Publish Date - 2020-02-08T06:38:58+05:30 IST

ఇసుక వేస్తే రాలనంత జనం, సామూహిక భక్తితో పూనకాలు, టన్నల కొద్దీ బంగారం (బెల్లం), కల్యాణ కట్టలో లక్షలమంది తలనీలాలు, ధనికబీద తేడా లేదు, సాధికార చైతన్యం.. మొత్తంగా దళిత బహుజనులకు రెండు రోజుల మరో ప్రపంచం..

వన సంరక్షణే నిలువెత్తు బంగారం

ఇసుక వేస్తే రాలనంత జనం, సామూహిక భక్తితో పూనకాలు, టన్నల కొద్దీ బంగారం (బెల్లం), కల్యాణ కట్టలో లక్షలమంది తలనీలాలు, ధనికబీద తేడా లేదు, సాధికార చైతన్యం.. మొత్తంగా దళిత బహుజనులకు రెండు రోజుల మరో ప్రపంచం.. అదే సమ్మక్క సారలమ్మ జాతర. ఇదో సాంస్కృతిక విప్లవం.

మేడారం జాతర భక్తిప్రపత్తుల గురించి అందరికి తెలుసు. కానీ చారిత్రక వీరత్వం, వీర వనితలు దేవతలుగా మారిన క్రమం చాలామందికి తెలియదు. తెలుసుకోవాల్సిన అవసరం ప్రతి ఒక్కరికీ ఉంది. సంపూర్ణ చరిత్రపై జానపద కళాకారులు వంద యేళ్లుగా ప్రచారం చేస్తున్నారు. నేటికీ వివిధ రకాల జానపద పాటలలో వినిపిస్తూనే వున్నారు. 

సమ్మక్క సారలమ్మకు ఇష్టమైన బెల్లాన్ని ప్రజలు బంగారంగా అమ్మకు నిలువెత్తు ఇవ్వడం ఆదివాసీ సాంస్కృతిక వైభవానికి నిదర్శనం. ప్రకృతిపై ఆధిపత్యం కోసం, రాజ్యాధికార కాంక్షతో అడవిని నమ్ముకొని, అడవిలోని చెట్టు చేమ జీవజాతుతో పెనవేసుకున్న బంధంపై దాడిచేస్తే, అడవి మా జన్మ హక్కు అడవిపై మీ పెత్తనం సాగదని అతిపెద్ద కాకతీయ సైన్యాన్ని ఎదురించి ఆదివాసీ హక్కుల కోసం చివరి వరకు పోరాడి, చనిపోయిన యుద్ధ వీరులను ప్రకృతికి సజీవ సాక్షిగా మేడారంలోని జనపనార చెట్టు కింద గద్దెలు నిర్మించి వారిస్మృతి పథంగా పండుగ జరపడం ఆదివాసీ పద్ధతుల్లో నేటికి కొనసాగుతున్నది.

స్చేచ్ఛా, స్వాతంత్య్రం, స్వయంపాలనకు ప్రతీక మేడారం జాతర. మేడారం ప్రజలు ఏ అడవి కోసం ఉద్యమించారో, ఏ అడవిలోని చెట్లను, జీవజాతులను ప్రేమించారో ఆ పరిస్థితి నేడు మేడారంలో రోజురోజుకి అంతరిస్తోంది. సబ్బండ కులాల ఆరాధ్యంగా గావించే వనం జాతర వెయ్యేండ్లు వర్థిల్లాలంటే మేడారం పరిసరాల అటవీ ప్రాంతాన్ని, ప్రకృతిని కాపాడాలి. అది మన అందరి బాధ్యత. అదే సమ్మక్క సారమ్మలకు మనమిచ్చే నిలువెత్తు బంగారపు మొక్కు.

అంబా నారాయణ గౌడ్‌

Updated Date - 2020-02-08T06:38:58+05:30 IST