ఉద్యమ స్నేహానుబంధం కెవిఆర్‌తో

ABN , First Publish Date - 2020-03-23T09:19:11+05:30 IST

ఆధునిక తెలుగు సాహిత్యంలో మార్క్సిస్టు సాహిత్య విమర్శకుడిగా కవిగా కె.వి.రమణారెడ్డి గారికి ఒక ప్రత్యేక స్థానం ఉంది. ఆయన నిరంతర రచనా వ్యాసంగం, ఆధ్యయనం, ముక్కుసూటిదనం, ఉద్యమశీలతను మరిచిపోలేం. కెవిఆర్‌ గాంభీర్యం వ్యక్తిత్వంలో స్నేహం...

ఉద్యమ స్నేహానుబంధం  కెవిఆర్‌తో

‘‘దేశం పేరుతో శివమెత్తిపోయేందుకు, ఆవేశంతో సత్యాసత్యాలను తారుమారు చేసేందుకు, వన్నెలను బట్టి జాతులను ద్వేషించమనేందుకు నేను సిద్ధంగా లేను... న్యాయం ఎవరికైనా ఒక్కటే, తప్పో ఒప్పో నా దేశమే ఆరాధ్యమన్న ఉన్మాదాన్ని నేను దూరంగా పెట్టుకున్నాను.’’

                                                                    కె.వి. రమణారెడ్డి


ఆధునిక తెలుగు సాహిత్యంలో మార్క్సిస్టు సాహిత్య విమర్శకుడిగా కవిగా కె.వి.రమణారెడ్డి గారికి ఒక ప్రత్యేక స్థానం ఉంది. ఆయన నిరంతర రచనా వ్యాసంగం, ఆధ్యయనం, ముక్కుసూటిదనం, ఉద్యమశీలతను మరిచిపోలేం. కెవిఆర్‌ గాంభీర్యం, వ్యక్తిత్వంలో స్నేహం, హాస్యప్రియత్వం దాగి ఉండేవి. ఉద్యమపరంగా, సాహిత్యరీత్యా రెండు దశాబ్దాలపాటు (1960-1980) మా స్నేహానుబంధం కొనసాగింది. 


నేను మొదటి దశలో కె.యాదవరెడ్డిగా రచనలు చేస్తూ, ఆనాటి ‘విశాలాంధ్ర’ ఆదివారం సాహిత్యానుబంధంలోని రచనలను ఆసక్తిగా చదివేవాణ్ణి. ఆంధ్ర ప్రభ, ఆంధ్ర పత్రికల ద్వారా కూడా ఆనాటి సాహిత్యలోకం పోకడలను తెలుసుకునే అవకాశం ఉండేది. ‘విశాలాంధ్ర’లో తరచుగా నా రచనలు వచ్చేవి. 


ముఖ్యంగా 1961-62 మధ్య విశాలాంధ్ర ఆదివారం సంచికలో ‘అక్షర తూణీరం’ శీర్షికన కెవిఆర్‌ ఒక కాలమ్‌ నిర్వహిస్తూ తమ విమర్శనా వ్యాసాలను సంధించేవారు. ఆరుద్ర ‘త్వమేవాహం’, ‘సినీవాలి’ కావ్యాలను  విశ్లేషణాత్మకంగా వివరిస్తూ, వాటిలోని అసంగతాలను, కవి చాపల్యాన్ని ఎండగట్టేవారు. అలానే నారప రెడ్డి ‘నగరం’ కావ్యాన్ని ఇతరత్రా వచ్చిన ఆనాటి రచనలను నిర్మొగమాటంగా విమర్శించేవారు. ఆ సందర్భంగా ఆరుద్ర రామ లక్ష్మి, దాశరథి మొదలైనవారు ఆ విమర్శలకు తట్టుకోలేక తీవ్ర పదజాలంతో కెవిఆర్‌కు ఉత్తరాలు రాసేవారు. చిత్తశుద్ధిగల సాహిత్య విమర్శకుడిగా, ఆనాటి ఞౌజ్ఛూఝజీఛిటని వాదోపవాదాలను ఎదుర్కొంటూ సవివరంగా సమాధానాలు ఇచ్చేవారు. తన కాలమ్‌లో ఒకసారి ప్రసిద్ధ ఉర్దూ కవి గురించి ‘షకీల్‌ బదాయుని - గజల్‌ సుధావాహిని’ అనే వాక్యం ఈనాటికీ గుర్తుండిపోయింది. 


కెవిఆర్‌ ‘భువనఘోష’, ‘అడవి’ కవితా సంపుటాలు చదివిన తర్వాత, నా స్పందనగా ఆయనకు లేఖ రాయగా ప్రతిస్పందిం చారు. ఆ తర్వాత 1962లో నేను ‘కోపోద్రిక్త యువతరం’ శీర్షికన కొన్ని వ్యాసాలు, కవితలు (గోలకొండ పత్రికలో ప్రచురితం) రచించిన దశ. ఒక విధంగా ఆ ఆలోచన- యువ ఆగ్రహం ‘దిగంబర కవుల’ పూర్వరంగం. ఆ రచనలు వారికి పంపించాను. 


ఇక కెవిఆర్‌ రచనా శైలి, భాష (నెల్లూరు మాండలిక పదాల తోపాటు), వాక్యనిర్మాణం కొంత క్లిష్టంగా వుండేవి. ‘మహోదయం’, ‘కవికోకిల’ గ్రంథాలు చదివితే ఆయన విమర్శనా పటిమ, లోతైన అవగాహన, పరిశోధన ఆశ్చర్యపరుస్తాయి. అలానే రచనా శైలి కొన్ని చోట్ల తికమక పెడతాడు. 


ముఖ్యంగా 1962లో భారత చైనా యుద్ధం జరిగిన సందర్భం! నేను మిగతా కవి మిత్రులం చైనాను విమర్శిస్తూ రాసిన కర పత్రంలో భారత సైనికులను కీర్తిస్తూ కవితలు ప్రచురించాము. వాటిని కెవిఆర్‌కు పంపించగా, 19-11-1962లో ఆయన సమాధానం (లేఖలోంచి) ‘‘దేశం పేరుతో శివమెత్తిపోయేందుకు, ఆవేశంతో సత్యాసత్యాలను తారుమారు చేసేందుకు, వన్నెలనుబట్టి జాతు లను ద్వేషించమనేందుకు నేను సిద్ధంగా లేను... న్యాయం ఎవరికైనా ఒక్కటే, తప్పో ఒప్పో నా దేశమే ఆరాధ్యమన్న ఉన్మాదాన్ని నేను దూరంగా పెట్టుకున్నాను.’’ ఒక చరిత్ర- రాజనీతి శాస్త్ర ఉపాధ్యాయుడిగా వెల్లడించిన అభిప్రాయమిది! ఈనాటికీ వర్తించే నిజం! 


కెవిఆర్‌ మొదటి దశలో దిగంబర కవులను ఆమోదించలేకపోయారు. అరాచక ధోరణిగా ఉందని విమర్శించారు. విచిత్రమేమిటంటే 1970 జనవరిలో జరిగిన శ్రీశ్రీ షష్టిపూర్తి ఉత్సవాల్లో మాత్రమే మొదటిసారి వారిని నేనూ, జ్వాల వ్యక్తి గతంగా కలుసుకోగలిగాము. అంతవరకు లేఖల ద్వారానే మా సాహిత్యానుబంధం సాగింది. ఆ తర్వాత విరసం ఆవిర్భావానికి ముందు, నేను మార్చి 1970లో ఒక లేఖ రాశాను. శ్రీకాకుళ గిరిజన పోరాటం నేపథ్యంలో రచ యితలంతా విప్లవ మార్గాన సమీకరించ బడాలని, ఒక సీనియర్‌ అభ్యుదయ రచయతగా వారిని కలిసిరమ్మని కోరగా, ఆయన స్పందన (అప్పుడే నన్ను ‘‘నిఖిలేశ్వర్‌’’ అని సంబోధిస్తూ రాయడం ప్రారంభించారు): ‘‘...మీ మార్గం సవ్యమైనది, ఈ మహాప్రజలకు నిజంగా మేలు చేయగలిగేది అనే నమ్మకం నాకు కలిగినప్పుడు, మీలో ఒకడ్ని అవుతాను. ఈ లోపల మీకు కుడిఎడమలుగా నా దారిన నన్ను పోనివ్వండి.’’ (కెవిఆర్‌ లేఖ- 12-3-70) 


ఆ తర్వాత కొన్ని ముఖ్య మైన పరిణామాల మధ్య 1970 జులైలో హైదరాబాద్‌లో విరసం స్థాపన- కెవిఆర్‌తోపాటు కొకు, శ్రీశ్రీ, రావిశాస్త్రి, కాళీపట్నం లాంటి వారంతా కలిసి వచ్చారు. ఖమ్మంలో 1970 అక్టోబర్‌లో ‘విరసం’ చారిత్రాత్మక ఆవిర్భావ మహాసభ జరిగింది. కొత్తతరం-పాతతరం రచయితలు ఎందరో పాల్గొన్న ఆ ప్రారంభ మహాసభ సంస్థాపరంగా విప్లవ సాహిత్యానికి ఎంతో ఉత్సాహాన్ని, ఉత్తేజాన్ని సమకూర్చింది. దిగంబర కవులలో (మహాస్వప్న, భైరవయ్య మినహా) మిగతా నలుగురు సంస్థాపక కార్యవర్గ సభ్యులుగా వున్నారు. అప్పుడే వెలువడిన ‘ఝంఝ’ కవితా సంకలనం జనంలోకి వెళ్ళగానే చర్చనీయాంశంగా మారింది. వెంగళరావు హోమ్‌ మినిస్టర్‌గా వున్న ఆనాటి కాంగ్రెస్‌ ప్రభుత్వం ‘ఝంఝ’ రెండు మూడు ముద్రణలు పొందగానే, నిషేధించింది. తర్వాత ‘ఇప్పుడు వీస్తున్న గాలి’ (కథాసంకలనం)ని కూడా! తదుపరి ఈ నిషేధాల పరంపర కొనసాగింది. 1971లో పిడి చట్టం కింద మా అరెస్టు- తర్వాత ఆం.ప్ర. హైకోర్టు ఇచ్చిన చారిత్రా త్మక తీర్పు తర్వాత మా విడుదల! ఝంఝ, ఇ.వీ.గాలి పుస్తకా లను మద్రాస్‌లోని క్రాంతి ప్రింటర్స్‌లో కెవిఆర్‌, కొకులు స్వయంగా పూనుకొని, ప్రూఫులుదిద్ది అచ్చు వేయించి విరసంకు అందిం చారు. ఆనాడు ఆ ప్రెస్సు యజమాని ధనికొండ హనుమంతరావు. 


విరసం ప్రణాళికను రూపొందించి, చర్చకు పెట్టి, కెవిఆర్‌ ప్రత్యేకించి కృషి చేశారు. ప్రతి కార్యవర్గ సమావేశంలో, వారు వివరంగా సమస్యలను, సిద్ధాంతాలను విపులీకరించేవారు. విజయ వాడలోని ఆనాటి బృందావన్‌ లాడ్జిలో (గవర్నరుపేట) కెవిఆర్‌ విడిది చేసేవారు. కార్యవర్గ సభ్యులుగా మేమంతా అక్కడికి చేరే వాళ్ళం. రోజంతా గంభీరంగా జరిగే సమావేశం తర్వాత, సాయం త్రాలు సరదాగా కబుర్లు సాగిపోయేవి. ఆ సందర్భంగానే ఒకసారి కెవిఆర్‌ అందరి మధ్య నన్ను ‘‘నిఖిల్‌, మీరు ఒక్కసారి ఒక బూతుపదం వాడి ఎవరినైనా తిట్టండి,’’ అని అడిగారు. నేను ఎటూ తోచక, మాట్లాడలేదు. మిత్రులంతా కెవిఆర్‌ను సమర్థిం చారు. చివరికి ఒక బూతుపదాన్ని నాతో పలికించగలిగారు. నేను సౌమ్యంగా ఉంటానని, బూతులు మాట్లాడనని కెవిఆర్‌ నమ్మకం.


ఇక విరసం కార్యకలాపాల్లో మేమంతా తలమునకలైవున్న ఆ రోజుల్లో, కెవిఆర్‌ ఉత్తరాలు మార్గదర్శకంగా వుండేవి. విరసంలో సాహిత్య సృజనను బయటి విప్లవ గ్రూపులు శాసించడం ప్రారంభించాయి. ప్రధానంగా చారుమజుందార్‌ పంథాను సమర్థించే సభ్యుల మెజార్టీ పెరిగింది. తీర్మానాలు తదితర అంశాల్లో ఆ గ్రూపు మాట నెగ్గుతూ వచ్చింది. 1972లో గుంటూరు విరసం మహాసభల తర్వాత నన్ను కార్యదర్శిగా ఎన్నుకున్నారు. ఆ సభల ప్రత్యేక సంచిక సంపాదక బాధ్యతలు నేనే నిర్వహించాను. 


ఆ తర్వాత తెనాలిలో విరసం కార్యవర్గ సమావేశం (1973). విరసం రాజకీయ, సాహిత్య, సాంస్కృతిక అవగాహనలోని వైరుధ్యా లను ఈ కార్యవర్గ సమావేశం బహిర్గతం చేసింది. విప్లవ గ్రూపుల రాజకీయ పంథాలననుసరించి సభ్యులు ముఠాలుగా వ్యవహరిం చారు. ఎవరికి వారు తమ సాంస్కృతిక పంథా అని ప్రత్యేకించి పుస్తకాలు ప్రచురించి చర్చకు పెట్టారు. ఆ సమావేశంలోనే గుంటూరు మహాసభల ప్రత్యేక సంచికలోని రచనలు--ప్రత్యేకించి నా సం పాదకీయంపై తీవ్ర వాదోపవాదాలు జరిగాయి. చారు మజుందార్‌ గ్రూపు సభ్యుల మెజార్టీ మూలంగా ఒక తీర్మానాన్ని ఆమోదించి, ఆ సంచికలోని నా సంపాదకీయాన్ని తొలగించి విడుదల చేయ మన్నారు. నేను మనస్తాపానికి గురై వెంటనే అక్కడే నా కార్యదర్శి పదవికి రాజీనామా చేశాను. ఆ సంపాదకీయంలో నేను గ్రూపు లను, చారు మజుందార్‌ పంథాను విమర్శించాను. 


విరసం అంతర్గత గ్రూపు రాజకీయాలలో సీనియర్స్‌కు ఆసక్తి ఉండేది కాదు. శ్రీశ్రీ అసలు పట్టించుకునేవారు కాదు. కొకు మొదటి నుంచి తటస్థుడి స్థానంలో ఉండిపోయారు. కెవిఆర్‌ ఎటూ తేల్చుకోలేక సంస్థ బాగోగులు, నిర్వహణ గురించి బాధపడేవారు. గతంలో వారి లేఖలు, ఇతరత్రా వచ్చిన కొన్ని రచనలలో ఆయన అంతర్గత సంఘర్షణ, మానసిక క్షోభ, కోపం వ్యక్తమైన వాస్తవాన్ని మనం గమనించవచ్చు. క్రమంగా విరసంలో గ్రూపు రాజకీయాలు ముదిరిపోగా- 1975 అనంతపురం మహా సభలలో నేనూ జ్వాలాముఖి మిత్రులతోపాటు సంస్థకు రాజీనామా చేశాము. మా అవగాహనను విశదీకరిస్తూ విస్పష్టంగా సాహిత్య సంఘం ప్రజాసంఘంగా స్వతంత్రంగా ఎలా వుండాలో వివరిం చాము. చారు పంథాను ఎండగట్టాము. ఈ పరిణామాల తర్వాత కెవిఆర్‌ కొన్ని సంశయాలతోనైనా చివరిదాకా విరసంలో కొనసాగారు. 


వ్యక్తిగతంగా కెవిఆర్‌కు మా పట్ల ఎంతో స్నేహభావం వుండేది. కావలిలోని వారి ఇంటికి నేనూ జ్వాల వెళ్ళినపుడు ఎంతో ప్రేమగా ఆతిథ్యం ఇచ్చారు. కెవిఆర్‌ దంపతులు ఒకసారి హైదరాబాద్‌ వచ్చి జ్వాల, చెర, మా కుటుంబ సభ్యులను ప్రేమతో పలకరిం చారు. మేము కావలికి వెళ్ళినప్పుడు, ఆ సాయంత్రం కెవిఆర్‌ స్వయంగా నన్ను జ్వాలను వెంటబెట్టుకుని జవహర్‌ భారతి విద్యార్థుల హాస్టల్‌కు తీసుకువెళ్ళారు. ఆ తర్వాత కావలిలోనే వున్న పండిత కవులు ఇంద్రగంటి హనుమచ్ఛాస్త్రి గారి ఇంటికి తీసుకువెళ్ళి పరిచయం చేశారు. 1975లో మేము విరసంతో విడిపోయినా, కెవిఆర్‌తో మరికొంతకాలం నా ఉత్తరప్రత్యుత్తరాలు కొనసాగాయి. 

(నేడు కెవిఆర్‌ జయంతి)

నిఖిలేశ్వర్‌

91778 81201ధనికొండతో ఆనాటి పరిచయం

ప్రసిద్ధ రచయిత ధనికొండ హన్మంతరావుగారి శతజయంతి సంవత్సరమిది. ఆయన రచనలన్నీ సంపుటాలుగా వెలువడుతున్న ఈ సమయాన, ఈ తరంలో ఆయన జ్ఞాపకాన్ని పంచుకుంటు న్నాను. ధనికొండ వారితో 1970 తర్వాత అనుకోకుండా పరిచయం ఏర్పడింది. మద్రాస్‌లో వున్న క్రాంతి ప్రింటర్స్‌ యజమానిగా ఆయన తెలుగు పుస్తకాలు కూడా అచ్చు వేసేవారు. విరసం ప్రచురణలు ‘ఝంఝ’, ‘ఇప్పుడు వీస్తున్న గాలి’ ఆ ప్రెస్సులోనే ముద్రించారు. కెవిఆర్‌ గారు, కొకు గారు స్వయంగా క్రాంతి ప్రింటర్స్‌కు వెళ్ళి ప్రూఫులు చూసివచ్చారు. ఈ రెండు పుస్తకాలను ఆంధ్ర ప్రదేశ్‌ ప్రభుత్వం నిషేధించిన సమయంలో ప్రెస్సు యజమాని ధనికొండ వారికి కూడా నోటీసులు వెళ్ళాయి (ప్రింటర్‌ కాబట్టి). అరెస్టు చేస్తారేమోననే అనుమానంతో ఆయన నాకు ఉత్తరాలు రాశారు. స్వయంగా ఏదో పని మీద సికింద్రాబాదుకు వచ్చినపుడు, ఒక లాడ్జి నుండి కబురు పెట్టారు. బొద్దుగా, లావుగా, ఫ్రెంచి మీసకట్టుతో వున్న హన్మంత రావుగారు నాతో ‘‘మీరంతా ఉద్యమాల్లో ఉన్నారు, నిర్బంధా లను ఎదుర్కొంటున్నారు. నన్ను విరసం పుస్తకాలు అచ్చువేసి నందుకు అరెస్టు చేస్తారేమోననే భయంవుంది. ఈ వయస్సులో జైలుకెళ్ళి ఆ అవస్థలు పడలేను. ఆ పరిణామం వస్తే ఆ లీగల్‌ వ్యవహారాలేమిటో మీరే చూడాలి,’’ అని అన్నారు. నేను ‘‘తమిళనాడు ప్రభుత్వం మిమ్మల్ని అరెస్టు చేయదు, నిశ్చింతగా వుండండి,’’ అని ధైర్యం చెప్పాను. 

Updated Date - 2020-03-23T09:19:11+05:30 IST