ఆండాళ్‌ మధురభక్తిలో స్త్రీవాద జ్ఞానం

ABN , First Publish Date - 2020-12-07T06:25:19+05:30 IST

తమిళ ప్రాంతంలో విష్ణుభక్తులైన పన్నెండు మంది మునివర్లు, ఆళ్వార్లుగా ప్రసిద్ధి చెందారు. ఆళ్వారు అంటే విష్ణు మగ్నుడు అని. ఈ దైవారాధకుల్లో...

ఆండాళ్‌ మధురభక్తిలో స్త్రీవాద జ్ఞానం

ఆండాళ్‌ది వియోగంలో ప్రేమ. నాట్యం నుండి నర్తకిని వేరు చేయలేనట్టే, ఆండాళ్‌ తన భక్తి నుండి తన భగవంతుడిని వేరు చేయలేకపోయింది. భూమి మీదకు రాక పోకలు రెండూ ఆండాళ్‌వి అదృశ్యాలు, అద్భుతాలే. అవి ఆమెను దేవతగా నిలబెడితే, ఆమె రచనలు ఆమెను మరింత బలంగా అందరికీ దగ్గర చేసాయి. 


తమిళ ప్రాంతంలో విష్ణుభక్తులైన పన్నెండు మంది మునివర్లు, ఆళ్వార్లుగా ప్రసిద్ధి చెందారు. ఆళ్వారు అంటే విష్ణు మగ్నుడు అని. ఈ దైవారాధకుల్లో, విష్ణువు అంశగా గుర్తించిన వారినే ఆళ్వార్లుగా పేర్కొన్నారు. ఆళ్వార్లలో ఒక్క స్త్రీ మాత్రమే ఉంది: గోదాదేవిగా అందరికీ తెలిసిన తొమ్మిదవ శతాబ్దపు ఆండాళ్‌.


మధురై దగ్గర్లో ఉన్న శ్రీవిల్లిపుత్తూర్‌లో, వటపత్ర శాయి మందిరం ఉంది. పూజారి విష్ణుచిత్తుడు. గొప్ప కృష్ణ భక్తుడు. అపురూపంగా చూసుకుంటున్న తులసి మొక్కలతో నిండిన పూలతోట అతనికి ఉంది. వేకువనే పూలను, తులసి పత్రిని ఆ తోట నుండి తెంపి, మాలలుగా చేసి, సాయంత్రం అయేసరికి మందిరంలో విశ్రమిస్తున్న దేవునికి భక్తి శ్రద్ధలతో సమర్పించడం, అతని దినచర్య. ఆ తోటలో తులసి మొక్కల్లో కలుపు తీస్తున్నపుడు, జనకునికి సీత దొరికినట్టు, ఆ మొక్కల దగ్గర ఒకరోజు నేలమీద కేరింతలు కొడుతూ ఒక పాప అతని కంటపడింది. పిల్లలు లేని అతని ఆనందానికి అవధులు లేకపోయాయి. కృష్ణుడే ఆ రూపంలో దగ్గర కొచ్చాడని సంబరపడిపోయాడు. ఆ పాపకు కోదై అని పేరు పెట్టాడు. తులసిమాలను తమిళంలో కోదై అంటారు. అంటే భూమి నుండి వచ్చిన, లేదా భాషను వాడుకున్న అని అర్థాలు వస్తాయి. భూమిమీద దొరికింది కావున ఆమెను భూమాత అని కూడా అన్నారు. విష్ణుచిత్తుడు ఆమెకు అలా పెంపుడు తండ్రి అయాడు. దైవాన్ని పూజిస్తూ, వేదాలు పురాణేతిహాసాలు, కీర్తనలు, పవిత్ర ప్రవచ నాలు, తండ్రి భక్తిపూరిత కవితలను రోజూ వింటూ పెరిగింది కోదై. తండ్రితోబాటు ఆమె కూడా గుడికి వెళ్లి భక్తిపారవశ్యంలో ఉండేది. తండ్రి సాంగత్యంలో పెరుగుతున్న పాప, రానురాను ఆ దేవుని ధ్యానం లోనే గడిపేది. బాల్యంలో అందరు పిల్లల్లానే పెండ్లి కూతురు దుస్తులు ధరించడానికి ఇష్టపడేది. పెండ్లి కుమారుడు ఎప్పుడూ విష్ణువే.


ఒకరోజు తాము అల్లి ఉంచిన మాలతో కోదై ఆడుకోవడం ధరించడం విష్ణుచిత్తుని కంటపడింది. వాడిన మాలను దేవునికి వేయకూడదని, అంచాత వాటిని ధరించకూడదని, కోదైని వారించాడు. ఆ అపరాధ భావనతో ఆ మాలను దైవానికి అర్పించడం కూడా మానుకున్నాడు. ఆ రాత్రి, విష్ణువు అతని కలలో కనపడి, కోదై ధరించిన మాల తనకు ప్రీతిపాత్ర మని, అదనపు సుగంధం అందులో ఉంటుందని, కోదైని కట్టడి చేయక ఆమె ధరించిన మాలనే సమ ర్పించమని తెలియజేసాడు. కోదై, స్వామికి ఎంత ప్రత్యేకమో విష్ణుచిత్తునికి పూర్తిగా అర్థమయింది. దేవుడినే అలా పాలిస్తున్న కోదైని, అప్పటి నుండే అతను ఆండాళ్‌గా పిలవడం మొదలు పెట్టాడు. ఆ పేరే ఆమెకు పూర్తిగా స్థిరపడిపొయింది. 


ఆండాళ్‌కి పదమూడేళ్ల వయసొచ్చేసరికి, అద్భుత మైన కవితలను గానం చేయడం మొదలెట్టింది. ఆ పాటలు వింటూ విష్ణుచిత్తుడు మురిసిపోయేవాడు. అలా ఆమె గానం చేసిన ముప్పయి పాటలు (పాశు రాలు) ‘తిరుప్పావై’ పేర ప్రసిద్ధి చెందాయి. శ్రీకృష్ణుని పతిగా పొందగోరిన గోపికలు కాత్యాయని వ్రతం చేస్తారు. అటువంటి వ్రతాన్ని చేసే సంకల్పం తోనే తిరుప్పావై వచ్చింది. ఐతే ద్వాపరయుగం, శ్రీకృష్ణుడు, గోపికలు, యమునానది అవేవీ ఆండాళ్‌కి లేవు. అయితేనేమి భావనా ప్రపంచంలో శ్రీవిల్లీ పుత్తూరే నందనవ్రజం, చెలికత్తెలే గోపికలు, అక్కడి గుడిలోని దేవుడే కృష్ణుడుగా, తన కవితల పాశురాల్లో సృష్టిం చుకుని అద్భుతంగా ఆ వాతావరణాన్ని దృశ్యమానం చేసింది. తాను నమ్మిన దైవపు సర్వజ్ఞత, సర్వశక్తి మత్వం మీద అత్యంత నమ్మకంతో స్థల కాలాల మధ్య ఊగిసలాడేది. అందరినీ వ్రతానికి పిలవడం, వేకువనే మేల్కొల్పడం, ఆ వ్రత విధానాన్ని సూచించడం.. అందరినీ కలుపుకు పోయే ఆండాళ్‌ సామాజిక దృష్టిని తిరుప్పావై తెలియ జేస్తుంది. ఆమెది ఏకాగ్ర దృష్టి. గర్భగుడిలో స్వామిని చేరేసరికి చెక్కుచెదరని ఆ కోరికలన్నీ తీరుతాయన్న ఆశని వ్యక్తం చేస్తుంది. 


ఆండాళ్‌ తిరుప్పావై ఆధ్యాత్మికంగా వైష్ణవులకు అత్యున్నతమైనది. ధనుర్మాసంలో (డిసెంబరు మధ్య నుండి 30 రోజుల నిష్ఠ) ఆ పాటల్ని కన్యలు మంగళ ప్రదమైన వివాహం కోసం భక్తి శ్రద్ధలతో ఆ ముప్పై రోజులూ పాడుకుంటారు. తిరుపతిలో ఆ నెల సుప్ర భాతం బదులు తిరుప్పావై గానంతోనే మేల్కొలుపు మొదలవుతుంది. ఆనవాయితీగా ఈ మాసంలోనే గానం చేస్తున్నా, అందులోని ప్రబలమైన అంకిత భావం మాత్రం అనశ్వరం, కాలాతీతం. తాను కోరుకున్న విష్ణువుతో వివాహం జరగాలన్న పట్టుదల తప్ప, సామాజిక నియమాల్ని ఆమె ఉల్లంఘించలేదు. దానికి తగ్గ వెనకదన్ను పెంపుడు తండ్రి విష్ణుచిత్తుడు ఆమెకు సమకూర్చాడు. కేవలం స్వామితో సంబంధం కోసమే కొన్ని ఆచార వ్యవహారాల్ని తయారు చేసు కుంది. నైతిక ప్రవర్తన, పవిత్రతపరంగా కూడా పని కొచ్చేవే అవి: ‘‘మా దీక్షా నియమాల్ని/ ప్రపంచ ప్రజలు వింటారు/ పాల సముద్రం మీద /నిశ్శబ్దంగా విశ్ర మిస్తున్న/ సర్వోన్నతుని మేము కీర్తిస్తాం/ మేము నెయ్యి తినం, పాలు తాగం/ వేకువకు మందే స్నానం చేస్తాం/ కాటుక మా కళ్లను నలుపు చేయదు/ పూలు మా తలల్ని అలంకరించవు/ తప్పులనేవి ఏవీ చేయం/ చెడు అనేది ఏదీ మాటాడం/ అడిగే వారికి అణకువతో/ ఉదారంగా దానం చేస్తాం/ ఇవన్నీ మాకు ముక్తినిస్తాయన్న/ నమ్మకంతో ఆనందంగా బ్రతుకుతాం’’ - అంటుంది ఆండాళ్‌ రెండవ పాశురం తిరుప్పావైలో. 


ఆమెతోపాటు ఆమె భక్తి కూడా ఎదుగుతూ పోయింది. ఆలోచనలన్నీ రంగనాథుని చుట్టూ తిరిగేవి. అతనితో వివాహం జరుగుతున్నట్టు కలలు కనేది. పదిహేనేళ్ల ఆ సమయంలోనే 14 అధ్యా యాల (లేక పాటల) 143 పాశురాల ‘‘నాచ్చియార్‌ తిరుమొళి (నాయకి పావన గానాలు)’’, రెండో కావ్యానికి శ్రీకారం చుట్టింది. ఒక్కొక్క అధ్యా యంలో పది పాశురాలు, నాలుగు అయిదు ఆరవ అధ్యాయాల్లో పదకొండు పాశురాలు వెరసి మొత్తం 143 పాశురాలు. అందులో ఆమె రంగనాథునితో వైవాహిక ఆశలు, భ్రమలు, నిరాశలు, కోపతాపాలు, అతనికి నచ్చజెప్పమని కోరటాలు, అన్నీ ఆ వయ స్సులో సహజంగా వచ్చిన భావాలే అందులో ఉన్నాయి. ‘తిరుప్పావై’లో శ్రీరంగనాథునితో తన వివాహంతో ముగిస్తే, ‘నాచ్చియార్‌ తిరుమొళి’లో ఆమె ఆత్మ అతని కలయిక కోసం తపిస్తుంది. రెంటిలోనూ తాను పొందా లనుకున్న ప్రభువును చేరేందుకు చేసే అన్వేషణే. ఒక్కోమారు విసిగివేసారిపోయి తన కోపాన్ని కూడా ఇలా ప్రదర్శిస్తుంది. ‘‘నేను కరిగిపోతున్నాను, నేను పోట్లాడుతున్నాను/ నేను బతికినా చచ్చినా/ అతను పట్టించుకోవడం లేదు/ ఎవరికీ తెలియని దొంగ, ఆ మోసకారి గోవర్దనుడు/ నా వైపు కనీసం చూడడం లేదు/ నా ఈ పనికిరాని రొమ్ముల్ని/ వేర్లతో పీకి/ అతని గుండెల మీదికి విసిరేసి/ నన్ను దహిస్తున్న మంటల్ని ఆపేస్తాను’’ అని అనగలిగింది. ఇతర యోగినుల్లాగ శరీరం ఆమెకు అవరోధం కాలేదు, తన లక్ష్యసిద్ధికోసం శరీరాన్ని ఒక వాహికగా వాడుకొంది. అందులోని ఈ శృంగార భావాల మూలంగానే ‘నాచ్చియార్‌ తిరుమొళి’ని దేవా లయాల్లో గానం చేయరు. శృంగారపరంగా ఉన్నా అప్పట్లోనే అంత సున్నితంగా ధైర్యంగా చెప్పగలిగిన మొదటి కవయిత్రి కూడా బహుశా ఆండాళేనేమో. శ్రీవైష్ణవుల వివాహాల్లో ఆండాళ్‌ వివాహం విష్ణువునితో జరిగినట్టు కలగన్న, ఇందులోని 24 స్తోత్రాల్లోని ఆరవ స్తోత్రాన్ని తప్పకుండా పఠిస్తారు. 


నాచ్చియార్‌ తిరుమొళిలో ప్రతీ కవితా ఎవరినో ఒకరిని ఏదో ఒక దానిని సంబోధిస్తు న్నవే. ప్రకృతీ సంభాషణా రెంటినీ అద్భుతంగా వాడుకుని, వాటికొక కొత్త రూపాన్నిచ్చింది ఆండాళ్‌. అవి ఐహిక మోహంతో ఉన్న ప్రబలమైన ప్రేమ కవితలు. అందులో అంతా మాధుర్య భావంతో నిండిన వైవాహిక మార్మికత, తాను కోరుకున్న దేవుని పట్ల ప్రబలమైన ప్రగాఢమైన కోరిక అందులో ఎక్కువ. భక్తిభావంలో వైరాగ్యం, కోరిక, మోహం అన్నీ కలిసి కట్టుగా పయనిస్తాయి. అందులో వైరాగ్యం భౌతిక ప్రపంచంతోను, కోరికా-మోహం కోరుకున్న దేవుని తోను కొనసాగుతాయి. అయితే ఈ వైరాగ్యం, గాఢ మూన కోరిక రెండూ సంబంధసామ్యాలు, అందులో ఏ ఒకటి ఎక్కువైనా రెండవది తక్కువ అవుతుంది. విష్ణువుని కృష్ణుడుగా భావించుకొని తాను గోపికగా మారినపుడు ఆమె సమస్త సమాజానికి చెందినదిగా కృష్ణుని కరుణను కోరుకుంటుంది, కానీ వధువుగా అతని మీద తనదే సర్వహక్కులంటుంది. ప్రేమైక దేవునికి (మన్మధునికి) ఒక విన్నపంగా, స్వామికి పక్షుల దూతల్ని పంపడం, స్వామి శంఖాన్ని అను భవించడం, దూతగా మేఘం లాంటి వాటితోపాటు చివరి కోరికలుగా, అతని పవిత్ర స్థలాలకు నన్ను తీసుకుపోండని, ప్రపంచాన్ని వేడుకొంటుంది. తిరు ప్పావై కలిప్ప ఛందస్సులో ఉంటే, ఈ కావ్యం అయిదు వివిధ ఛందస్సుల్లో ఉంది.


ఆమె మాటల ద్వారా కవితల ద్వారా రంగనాథు నితో వివాహం అన్న ఆమె ఆలోచన విష్ణుచిత్తునికి స్పష్టంగా అర్థం కావడం మొదలయింది. అది జరిగే పని కాదని, యుక్త వయస్సు వచ్చేసరికి ఆమెకు వివాహం చేయాలని అతను నిశ్చయించుకున్నాడు. తాను విష్ణువును తప్ప మానవ మాత్రుడ్ని వివాహమాడలేనని ఆండాళ్‌ నిష్కర్షగా చెప్పింది. ఏ విష్ణువుని అని అడిగిన ప్రశ్నకి, శ్రీరంగంలో ఆది శేషుని మీద పవ్వళించిన రంగనాథుడుగా ఉన్న శ్రీవిష్ణువుని అని సమాధానమిచ్చింది. భక్తి ప్రపంచం లోకి ఆమెను అంతగా తీసుకురావటం వల్లే ఇదంతా అనిపించి, దీనికి తానే బాధ్యుడినేమో అన్న బాధ విష్ణుచిత్తునికి ఎక్కువ కావడం మొదలయింది. రాను రాను రంగనాథునితో వివాహ కోరికా ఆండాళ్‌కి పెరుగుతూపోయింది. 


రంగనాథుడే ఒక అడుగు ముందేసి కలలో విష్ణుచిత్తునికి తన అంగీకారం తెలిపి, శ్రీరంగంలో తమ వివాహం జరిపించమని చెప్పాడు. అంతే కాదు ఆ వివాహం జరిపించే బాధ్యతను చూసుకోమని రాజు వల్లభ పాండ్యన్‌కి చెప్పడంతో, రాచమర్యాదలతో, మేళ తాళాలతో, పెళ్లికూతురులా తయారైన ఆండాళ్‌ని పల్లకీలో శ్రీరంగం తీసుకు వెళ్లారు. అప్పటికి ఆమె వయస్సు పదహారేళ్లు. పల్లకీ దిగి శ్రీరంగనాథుని దరిచేరిన ఆండాళ్‌ అందరూ చూస్తుండ గానే అదృశ్యమైపోయింది. ప్రాణప్రదంగా పెంచిన కూతురు కంటిముందే అలా అదృశ్యమవడం విష్ణుచిత్తుడు తట్టుకో లేకపోయాడు. నాకు ఒక్కర్తే కూతురు. దేవుని ప్రేమలో ప్రఖ్యాతి పొందింది. అతని దగ్గరకు తీసుకొచ్చి ఆమెను పోగొట్టుకు న్నాను. ఆ రక్తవర్ణ కమలనయనుడు నా నుండి ఆండాళ్‌ని ఒక్క ఉదుటున లాక్కుపోయాడని ఏడ్చాడు. అంతలోనే తాను వృద్ధుడై పోయాడ నుకున్నాడు. జీవితాంతం ఆమెను పోగొట్టుకున్న బాధ అతనిని వదలలేదు. తిరుప్పావై అన్ని వేదాల సారాంశమని అందరికీ చెప్పుకుంటూ బతికాడు. 


ఆండాళ్‌ యవ్వనం, అమాయకత్వం, ఆమె నియమాల బలం, శక్తివంతమైన ఆమె విశిష్టతలు. రంగనాథుని విగ్రహంలో విలీనమైపోయాక ఆమె ఒక పౌరాణిక దేవతగా అందరికీ మారిపోయింది. ఆమె లక్ష్యం మోక్షం కాదు, కావలసింది చేరాల్సింది వైకుంఠమే. ఆమె తిరుప్పావై పాటలు, వివాహం కావలసిన యువతులకు మంచి జరుగుతాయన్న నమ్మకాన్ని కలిగించాయి. 


ఆండాళ్‌ విగ్రహంలేని వైష్ణవ ఆలయాలు తమిళ ప్రాంతంలో ఉండవు. ఇప్పటికీ శ్రీవిల్లిపుత్తూర్‌లో మొదటి పూజ ఆమె విగ్రహానికే చేస్తారు. అక్కడి ఆండాళ్‌ గుడి తరువాత తెలంగాణా ఘటకేశ్వర్‌ మండలం ఎదులాబాద్‌లో 13వ శతాబ్దపు మరొక ఆండాళ్‌ గుడి ఉంది. ఫ్రెంచ్‌, జర్మనీ, ఇటలీ, ఆంగ్లం లాంటి విదేశీ భాషలతో కలిపి మొత్తం 16 భాషల్లో తిరుప్పావై అనువాదమయింది. థాయిలాండ్‌, కంబోడియా లాంటి దేశాల్లో 15వ శతాబ్దం నుండీ ఈ కావ్యాన్ని పఠిస్తున్నారు. ఆమూక్తమాల్యదగా శ్రీకృష్ణదేవరాయలు ఆండాళ్‌ కథని రాయకుండా ఉండలేకపోయారు. చలనచిత్రాలు, సంగీత నాట్యాలతో పాటు, ఆమె మీద ఆధునిక కవిత్వం సైతం వచ్చింది. 


ఆండాళ్‌ది వియోగంలో ప్రేమ. నాట్యం నుండి నర్తకిని వేరు చేయలేనట్టే, ఆండాళ్‌ తన భక్తి నుండి తన భగవంతుడిని వేరు చేయలేకపోయింది. భూమి మీదకు రాక పోకలు రెండూ ఆండాళ్‌వి అదృశ్యాలు, అద్భుతాలే. అవి ఆమెను దేవతగా నిలబెడితే, ఆమె రచనలు ఆమెను మరింత బలంగా అందరికీ దగ్గర చేసాయి. పదహారేళ్లే బ్రతికినా, పదమూడు వందల సంవత్సరాల తరువాత కూడా ఆమె రచనలను మంత్రాల్లా పఠిస్తున్నారు.

ముకుంద రామారావు 

99093 47273


Updated Date - 2020-12-07T06:25:19+05:30 IST