మహిళా మూర్తి.. రాజ్యాంగ స్ఫూర్తి

ABN , First Publish Date - 2020-03-08T06:42:02+05:30 IST

ఏడు దశాబ్దాలు పూర్తి చేసుకున్న భారత రాజ్యాంగానికి, మహిళా హక్కుల పరిరక్షణ దిశగా జరుగుతున్న నేటి మహిళా దినోత్సవానికి అవినాభావ సంబంధం ఉంది. స్వాతంత్ర్య సాధనతో పాటుగా సాగిన స్త్రీల స్వతంత్ర జీవన సమాలోచనలు రాజ్యాంగ నిర్మాణానికి సోపానాలు...

మహిళా మూర్తి.. రాజ్యాంగ స్ఫూర్తి

రాజ్యాంగం 70 ఏండ్లుగా అమలులో ఉన్నా, స్త్రీలు పురుషులతో సమానంగా జీవించలేని దశలో ఉండటానికి కారణాలు విశ్లేషించుకుంటూ స్త్రీలు తమ హక్కుల పరిరక్షణకై మరింతగా కృషిచేసే దిశగా సాగాలి. అందుకు, స్వాతంత్రోద్యమం నాటి స్త్రీల సాహిత్య పఠనం అవసరం. వివిధ సాహిత్య ప్రక్రియల రూపంలో పాత తెలుగు పత్రికలలో నిక్షిప్తమై విస్మృతంగా ఉన్న నాటి స్త్రీ సాహిత్య చైతన్యం నేటికీ స్ఫూర్తిదాయకం. ఆనాటి స్త్రీల సాహిత్యంలో ప్రతిఫలించిన స్వతంత్ర జీవన చైతన్యం, స్వరాజ్య హక్కుల పోరాటం కలిసివెరసి భారతదేశ ప్రజాస్వామిక రాజ్యాంగ నిర్మాణానికి దారిదీపాలుగా ఉపకరించాయని అర్థం చేసుకోవాలి.


ఏడు దశాబ్దాలు పూర్తి చేసుకున్న భారత రాజ్యాంగానికి, మహిళా హక్కుల పరిరక్షణ దిశగా జరుగుతున్న నేటి మహిళా దినోత్సవానికి అవినాభావ సంబంధం ఉంది. స్వాతంత్ర్య సాధనతో పాటుగా సాగిన  స్త్రీల స్వతంత్ర జీవన సమాలోచనలు రాజ్యాంగ నిర్మాణానికి సోపానాలు వేశాయి. తెలుగునాట 1896నుండి స్త్రీ జనం చేసిన ప్రాథమిక హక్కుల పోరాటం మన రాజ్యాంగానికి రహదారులు పరిచింది. స్వాతంత్ర్యోద్యమం నాటి స్త్రీల వాఙ్మయం/సాహిత్యం ఈ సత్యావిష్కరణకు భూమిక. స్త్రీల స్వతంత్రత పట్ల పెరిగిన ఆలోచనలకు 1896 నుండి 1947 వరకు తెలుగు పత్రికలలో వచ్చిన స్త్రీల సాహిత్యమే నిదర్శనం.


రాజకీయ స్వాతంత్ర్యానికై దేశమంతా పోరాటం చేస్తూంటే, తమ వ్యక్తి స్వాతంత్ర్యానికై స్ర్తీలు పోరాడారు. తమ అస్వతంత్ర జీవనానికి అవిద్యకు ఉన్న లంకెను గుర్తించి తమ హక్కుల సాధన కోసం విద్యావంతులు కావల్సిన అవసరాన్ని గుర్తించారు. స్త్రీకి స్వతంత్రం ఉంటేనే దేశ స్వాతంత్ర్యానికి ప్రయోజనమని భావించిన కందుకూరి వీరేశలింగం స్త్రీ విద్యకు పునాదులు వేసారు. వేమూరి శారదాంబ 1896 లోనే తన ‘మాధవశతకం’లో మహిళల అక్షరాస్యతకు నిరోధకంగా ఉన్న సామాజిక, కుటుంబ అసమాన సంస్కృతిని ప్రశ్నకు పెట్టి స్త్రీవిద్య పట్ల ఆలోచనలను రేకెత్తింపజేసింది. ప్రజాస్వామిక, రాజ్యాంగ సమాన హక్కులకు, లింగవివక్షలేని విద్యాహక్కుకు దీనితోనే పునాదులు పడ్డాయని చెప్పుకోవచ్చు. 1902లో విద్యావంతులైన స్త్రీలు, విదేశీ స్త్రీల జీవితాలు, వారి రాజకీయ హక్కులను తెలుసుకుంటూ తమ కుటుంబంలో తమ అస్తిత్వాలను గురించిన ఆలోచనలను పెంచుకున్నారు. అందుకే భండారు అచ్చమాంబ స్త్రీవిద్య అభివృద్ధి చెందటానికి స్త్రీల సమాజాలను ఏర్పాటు చేశారు. 1902-–03 నాటికే విద్య ద్వారా జ్ఞానాన్ని పొందిన స్త్రీలు తమ బానిసత్వాన్ని తొలగించుకునే స్వతంత్ర ఆలోచనలను కొనసాగించినట్లు ఆమె రచనలలో కనపడుతుంది. స్త్రీలు పత్రికా రంగంలో ప్రవేశించారు. విద్య స్త్రీలలో ధైర్యస్థైర్యాలను పెంచుతుందని, అప్పుడే తమ భావాలను స్వేచ్ఛగా వ్యక్తీకరించగలం అనుకోవటం మన రాజ్యాంగం నిర్వచించిన ఆలోచనల స్వేచ్ఛ, భావవ్యక్తీకరణ స్వేచ్ఛకు ప్రతీకలు. స్త్రీలకు ఉన్నత విద్యావకాశాలు పెరగాలనీ, వారి సామూహిక స్వేచ్ఛ స్త్రీ స్వతంత్రానికి ప్రేరకమవుతుందనీ భావించారు. మహిళలు చదువుకోవడానికి వివాహ సంస్కృతి ఆటంకంగా ఉన్నదని గుర్తించి, బాల్య వివాహాలను నిరసించారు, స్ర్తీ పునర్వివాహ హక్కునూ, గౌరవప్రదమైన జీవన హక్కులను గుర్తించారు.


దేశ స్వతంత్రం కోసం స్త్రీ, పురుషులు ఐక్యంగా పోరాడాల్సిన అవసరాన్ని గుర్తిస్తూనే, తమ స్వతంత్రం కోసం స్త్రీలే ఐకమత్యంతో పోరాటం చేసుకోవాల్సిన కర్తవ్యాన్నీ గుర్తించారు. 1905 లో బెర్లిన్ ప్రపంచ స్త్రీల సభలో పాల్గొన్న భారతీయ స్త్రీలు తమ దేశ అస్తిత్వాన్ని చాటడానికి తమ చీర చెంగులను చించి జెండాను తయారు చేయడం వారి స్వతంత్ర నిర్ణయాలకు నిదర్శనం. 1906లో లండన్ నుంచి వచ్చిన దాదాభాయ్‌ నౌరోజి కోసం ఏర్పాటు చేసిన సభలో ఒక పారసీక స్త్రీ పతాక ఆవిష్కరణ చేశారు. 1910 నాటికే స్త్రీల సాహిత్యంలో స్త్రీ పురుషుల స్వతంత్ర జీవనంలోని తేడాలను గుర్తించే భావనలకు పెద్దపీట వేశారు. అవిద్య, ఆస్తిహక్కు లేమి స్త్రీ పురుషుల అసమానత్వానికి కారణమనీ, స్త్రీలు అదనంగా సాంఘిక, ఆర్థిక స్వాతంత్ర్యాలకోసం పోరాడాలని చర్చలు సాగేవి. స్త్రీలు భౌతిక, బౌద్ధిక, మానసిక స్వేచ్ఛను అనుభవించగలిగినప్పుడే దేశ స్వాతంత్ర్య సాధన సులభతరం అవుతుందని భావించారు. ఆ దిశగా స్త్రీలలో ఆలోచనలు పంచటానికి పత్రికా స్వాతంత్ర్యాన్ని పొందారు. ఆర్థిక స్వావలంబన కోసం గృహపరిశ్రమలతో ఆదాయాన్ని పొందాలనుకున్నారు. తిలక్ ప్రస్తావించిన స్వదేశీ వస్తు తయారీలో భాగంగా స్త్రీలు నూలు వడకటం, సబ్బుల తయారీ వంటివి నేర్చుకున్నారు. విద్య సాధించిన స్త్రీలు పాశ్చాత్య ప్రపంచాన్ని అధ్యయనం చేయగలిగారు. ఓటు హక్కు విలువను గుర్తించి రాజకీయ చైతన్యాన్ని పెంచుకున్నారు. స్త్రీలు రజస్వలానంతరమే వివాహం చేసుకొనే స్వతంత్రతను పొందాలనుకున్నారు. 1911 నాటికి ఆరోగ్య భద్రత గురించి ఆలోచించారు. బహభార్యాత్వపు సంస్కృతిని నిరసిస్తూ కుటుంబంలో సమాన సంస్కృతిగల లైంగిక హక్కు ఉండాలని భావించారు. పుట్టుకతో సమానమే కానీ, ఇటు తండ్రి ఆస్తిలో గానీ, అటు భర్త ఆస్తిలో గానీ హక్కులేని తనాన్ని గుర్తించి వారసత్వపు ఆర్థిక హక్కుల దిశగా ఆలోచనలు పెంచుకున్నారు. 1914 నాటికి ‘విడాకుల’ ప్రస్తావన తెచ్చారు. హిందూ వివాహ చట్టం గురించి ఆలోచనలు చేశారు. 1916 లో స్త్రీలకు సమాన ఆర్జనావకాశాల అవశ్యకతను గుర్తించారు. ఆ తరువాత, రాజకీయ స్వాతంత్రానికి తామూ అర్హులమనే భావనలు పెరిగి, లింగవివక్ష కారణంగా తాము రాజకీయాల్లోకి వెళ్లలేకపోతున్నామని గ్రహించారు. ఉద్యోగాలలోనూ సమాన అవకాశాలు ఉండాలనుకున్నారు. నియోజకవర్గ స్వాతంత్ర్యం గురించి ఆలోచించారు. ఆ కారణంగానే స్త్రీలు 1920లో గాంధీజీ పిలుపుతో సత్యాగ్రహోద్యమంలో భాగస్వాములై సహాయ నిరాకరణోద్యమాన్ని ముందుండి నడపగలిగారు. స్త్రీలు ఎదుర్కొనే కుటుంబ హింసను చట్టానికి పట్టించేస్థితికి వారి ఆలోచనలు పెరిగాయి. 1925 నాటికి స్వరాజ్య సాధన స్త్రీల విధ్యుక్త ధర్మమని భావించారు. 1929లో స్త్రీని నిర్వచిస్తూ ఆమెకు శరీరముంది, మెదడుంది, హృదయముందనీ స్త్రీ, పురుషుని సొత్తుకాదనీ, స్త్రీల స్వతంత్ర జీవనహక్కు మానవహక్కు అనీ ప్రకటించారు. 1929నాటికి విద్యావంతులైన స్త్రీలకు ఓటుహక్కు లభించింది. మున్సిపాలిటీలు, బోర్డులు ఏర్పడ్డ నేపథ్యంలో స్త్రీలు పరిపాలనా రంగంలోకి అడుగువేయటం, క్రమంగా నామనిర్దేశంగా పదవిని పొందటంకాక, ఎన్నుకోబడి స్వతంత్ర జీవనానికి బాటలు వేయాలనుకున్నారు. ఆ రకంగా తమకు రాజ్యధికారంలోని పాలనాహక్కులను పొందాలనుకున్నారు. 1930లో చట్ట ప్రయోజనాలను తెలుసుకుంటూ స్త్రీల హక్కులను సద్వినియోగం చేసుకోవాలనుకున్నారు. రాజకీయ స్వాతంత్రం కోసం ఉప్పు సత్యాగ్రహంలో పోరాడుతూనే, తమ భావస్వేచ్ఛకు సంబంధించి చట్టపరమైనహక్కులను విశ్లేషించుకున్నారు. గ్రామస్వరాజ్యంలో స్త్రీల భాగస్వామ్యం ఉండాలనుకున్నారు. 1932 శాసనోల్లంఘన ఉద్యమంలో పాల్గొని బాధలు పడటంతో పాటు, తాము ఎదగగలిగి తోటివారికి సహాయపడగల స్థితికి చేరుకోవాలనీ, వ్యాపారపు మెలకువలు గ్రహిస్తూ ఆర్థికశక్తిగా ఎదిగితేనే దేశ స్వాతంత్ర్యానికి పాటుపడగల సమర్థత స్త్రీలకు ఉంటుందని భావించారు.  


1935లోనే స్త్రీలు తమ సామాజిక అస్తిత్వాలకు సంబంధించి ఆలోచనలు పెంచుకొని సామాజిక సంస్కృతిని నిరసించే విధంగా స్వతంత్ర నిర్ణయాలు చేసుకోవాలని భావించారు. 1935 నాటికి ఎన్నికల ద్వారా శాసనసభ్యత్వానికై సమాన ప్రాతినిథ్యం ఉండాలనే చైతన్యం అభివృద్ధి చేసుకున్నారు. ఉన్నత విద్యావంతులైన స్త్రీలకే కాక సంతకం చేయగలిగిన స్త్రీలకు ఓటుహక్కును, ఎన్నికల హక్కును విస్తరింపజేయాలనుకున్నారు. స్త్రీల హక్కులకై శాసనసభలో బిల్లును పెట్టాలనుకున్నారు, సంపూర్ణస్వేచ్ఛ కోరుకున్నారు. 1936లో సాంఘిక, రాజకీయ, ఆర్థిక రంగాలలో స్త్రీ, పురుష సమానత్వపు ఆవశ్యకతను గుర్తించి, ఎన్నికకాబడే హక్కు స్త్రీ ఆత్మ హక్కని భావించారు. తాము చేసే ఇంటి చాకిరికి వేతనాలు కావాలన్నారు. 1937లో ఉద్యమంలో పాల్గొనటానికి గర్భధారణ ఆటంకంగా ఉన్నదని భావించిన సందర్భంలో,  స్త్రీలు సంతానాన్ని కనే యంత్రాలు కాదనీ, తల్లికావడం, గర్భస్రావం వంటి విషయాలలో నిర్ణయాధికార హక్కు ఉండాలని గుర్తించారు. స్త్రీలు సైన్యంలో చేరాలనే ఆలోచనలూ పెరిగాయి. స్త్రీ వ్యక్తిత్వాన్ని అగౌరవపరిచే పత్రికా ప్రకటనలను, చిత్రాలను నిరసించారు. 1937నాటికి స్త్రీలు శాసనసభ్యులుగా ఎన్నికై రాజకీయ హక్కులను పొందారు. పెళ్ళిళ్ళు రిజిష్టర్ చేయాలని కోరుకున్నారు. 1938 నాటికి స్త్రీలు చట్టాల్లో ఉన్న లింగవివక్షను గుర్తించడంతో సాంఘిక, ఆర్థిక, న్యాయాలను ప్రశ్నకు పెట్టారు. స్త్రీలు పురుషునితో సమానంగా జీవించే హక్కు కలిగి ఉంటేనే స్త్రీ స్వతంత్ర జీవనహక్కుకు రక్షణ ఉంటుందని భావించారు. ఆర్థిక విధానం మారాలని స్త్రీలకు ఆర్థిక, సాంఘిక, రాజకీయ హక్కులు కావాలనీ భావించారు. 


1947 ఆగష్టు 15వ తేదీన ఎగురవేయబోయే భారతదేశ స్వాతంత్ర్య జెండాను తెలుగింటి కోడలైన సరోజనీ నాయుడు నెహ్రూకు అందించింది. తెలుగు వనిత దుర్గాబాయి దేశముఖ్ డా.అంబేద్కర్ రూపొందించిన రాజ్యాంగ నిర్మాణ సంఘ సభ్యురాలిగా ఉన్నది. ఇవన్నీ స్త్రీలకు సమాన హక్కులు, సమానన్యాయం ఉండాలన్న సూచనలే. దేశస్వాతంత్రానికీ, స్త్రీ హక్కుల చైతన్యానికీ, దేశరాజ్యాంగ నిర్మాణానికీ గల అవినాభావ సంబంధం నుంచి స్ఫూర్తిపొందటం నేటి అంతర్జాతీయ మహిళా దినోత్సవం లక్ష్యం కావాలి. భారత రాజ్యాంగం 70 ఏండ్లుగా అమలులో ఉన్నా, స్త్రీలు పురుషులతో సమానంగా జీవించలేని దశలో ఉండటానికి కారణాలు విశ్లేషించుకుంటూ స్త్రీలు తమ హక్కుల పరిరక్షణకై మరింతగా కృషిచేసే దిశగా సాగటానికి స్వాతంత్రోద్యమం నాటి స్త్రీల సాహిత్య పఠనం అవసరం. వివిధ సాహిత్య ప్రక్రియల రూపంలో పాత తెలుగు పత్రికలలో నిక్షిప్తమై విస్మృతంగా ఉన్న నాటి స్త్రీ సాహిత్య చైతన్యం నేటికీ స్ఫూర్తిదాయకం. ఆనాటి స్త్రీల సాహిత్యంలో ప్రతిఫలించిన స్వతంత్ర జీవన చైతన్యం, స్వరాజ్య హక్కుల పోరాటం కలిసివెరసి భారతదేశ ప్రజాస్వామిక రాజ్యాంగ నిర్ మాణానికి దారిదీపాలుగా ఉపకరించాయని అర్థం చేసుకోవాలి.

డా. జె.కనక దుర్గ

(నేడు అంతర్జాతీయ మహిళా దినోత్సవం)

Updated Date - 2020-03-08T06:42:02+05:30 IST