పాదాలు.. పాదాలు మాత్రమే...
ABN , First Publish Date - 2020-05-18T08:21:33+05:30 IST
పాదాలు.. పాదాలు.. కన్ను మూసినా తెరిచినా కళ్లల్లో మెదుల్తున్న పాదాలు.. కలల్లో కదలాడుతున్న పాదాలు.. కిక్కిరిసిన పాదాలు.. ఉప్పిరిసిన పాదాలు.. పగిలి రాటు దేలిన పాదాలు.. కాళ్ల కింద నేల కదిలిపోతే గూడు చెదిరిన పాదాలు...

పాదాలు.. పాదాలు.. కన్ను మూసినా తెరిచినా కళ్లల్లో మెదుల్తున్న పాదాలు.. కలల్లో కదలాడుతున్న పాదాలు.. కిక్కిరిసిన పాదాలు.. ఉప్పిరిసిన పాదాలు.. పగిలి రాటు దేలిన పాదాలు.. కాళ్ల కింద నేల కదిలిపోతే గూడు చెదిరిన పాదాలు.. కడుపుల నీళ్లు కదిలిపోయిన పాదాలు.. దేబిరించినా దయ పొందని పాదాలు.. పాలుపోని పాదాలు.. నీడలేని పాదాలు.. రోడ్డున పడిన పాదాలు.. పాదాలు.. గుట్టలగుట్టల పాదాలు.. గుబులు గుబులు పాదాలు.. కనిపించని రోగం భయం లేని పాదాలు.. ఆకలి రోగం భగభగల మంటలకి కమురుకుపోయిన పాదాలు.. పాదాలు.. దిక్కులేని దీనమైన పాదాలు.. పట్నం పొదువు కోని పాదాలు.. కన్న ఊరు వేర్లు మనసులో ఊడలు దిగిన పాదాలు.. పిల్లాపాపలు పాశమైన పాదాలు.. దూరా భారాలు మతించని పాదాలు.. ఎల్లెడలా దారితీసిన పాదాలు.. నలుదిక్కులా నడుస్తున్న పాదాలు.. పాదాలు.. ఆశలు మూటలు కట్టిన పాదాలు.. పిల్లాజెల్లా భుజాని కెత్తిన పాదాలు.. పసిపిల్లల పాదాలు.. గర్భిణీ పిల్లల పాదాలు.. నడుం వంగిన ముసలి పాదాలు.. పాదాలు.. గాజుకళ్లల్లో బతుకు భయం చీకటి పాదాలు.. బోసికాలి కింద బొబ్బలముళ్లు మొలిచిన పాదాలు.. చెమటస్నానాల తడిసిన పాదాలు.. పాదాలు.. నడిచి నడిచి నడిచి నలుగుతున్న పాదాలు.. ప్రాణం పగులుతున్న పాదాలు.. దూరాల్ని గెలవలేక నిలవలేక నీరవుతున్న పాదాలు.. ఊర్లు చేరకముందే వేర్లు తెంపుకు రాలుతున్న పాదాలు.. రక్తాలు చిందుతున్న పాదాలు.. కళ్లల్లోంచి ఉసురు జారు తున్న పాదాలు.. పాదాలు.. బస్సులు సర్కారు రైల్లు అసింటన్న పాదాలు.. అందరున్నా అనాథలయిన పాదాలు.. భద్రజీవనగీతలకావలగా జరిపేసిన పాదాలు.. వదిలేసిన పాదాలు.. పథకం ప్రకారం పొమ్మని పొగపెడితే.. పొలమారిన పాదాలు.. రాతమారిన పాదాలు.. పాదాలు.. రైలుపట్టాల మధ్య చిధ్రమైన పాదాలు.. చెల్లాచెదురైన వలసపాటల పాదాలు.. పాదాలు..
అరే.. పాదాలు కడగడం కాదు.. పడికట్టు పూజలు కాదు.. మాయా కన్నీళ్ల ఉట్టి ఇస్తరాకు మంచినీళ్లు కాదు..
పగిలిన ఆకలి పాదాలకు ఇంత అన్నంపూత పుయ్..
దాహపుపెదాలెండిన పాదాలకు గుక్కెడు నీళ్లలేపనం రాయ్..
అరే.. ఎట్టాంటి పాదాలు.. దేశాన్ని స్వచ్ఛభారతం చేసిన సఫాయి పాదాలు.. రాళ్లెత్తి మూటలెత్తి పలుగూపారలెత్తి వ్యాపార సూచీలెత్తిన అపర పాదాలు.. గానుగెద్దు శ్రమ కోర్చి దేశాన్ని అభివృద్ధి అందలాలెక్కించిన అపురూప పాదాలు.. ఇటుకా ఇటుకా పేర్చి పారిశ్రామిక సౌందర్య సౌధాలెన్నో ఆకాశాన నిలిపిన పావనపాదాలు.. ఎట్టాంటి పాదాలు.. పాదాల్లేకపోతే నీకు సుఖాల్లేవు.. సంతోషాల్లేవు.. నీ డాంబికాల్లేవు.. దర్పాల్లేవు.. పాదాల్లేకపోతే.. పాదాల చెమటచుక్కల్లేకపోతే ఏ పరిశ్రమల్లేవు.. ఏ భవంతుల్లేవు.. సెన్సెక్స్ ఎత్తుపల్లాల ఆటలసలే లేవు..
పాదాల పాదాలు కడిగి నెత్తిన జల్లుకోవాల్సింది పోయి
అలగా పాదాలని అదిలిస్తన్నావా.. మొండిచేయి విదిలిస్తన్నావా..
పాదాలకు నోళ్లున్నాయ్...
పాదాలకు గొంతులున్నాయ్..
పాదాలకు పదాలున్నాయ్..
పాదాలకు పాదాలున్నాయ్..
పాదాలకు కణకణ మోగే జానపదాలున్నాయ్..
పాదాలకు గాయపడిన గుండెలున్నాయ్..
పాదాలకు ఆయుధాలున్న చేతులున్నాయ్..
పాదాలకు అడుగడుగున అనుభవాలున్నాయ్..
పాదాలు.. పాదాలు.. పాదాలు..
ఎర్రెర్రటి పాదాల ఎల్లువ.. కుంభవృష్టి..
కళ్లెర్రటి పాదాల ఉరవళ్ల తీవ్ర కోపోద్రిక్త తాకిళ్లలో
కొట్టుకుపోతయ్..
పాదాల పొట్టలు కొట్టే
సింహాసనాలు కొట్టుకుపోతయ్..
మట్టికొట్టుకుపోతయ్...
పి. శ్రీనివాస్ గౌడ్
99494 29449