పదవిలో రాణింపు

ABN , First Publish Date - 2020-11-06T05:54:26+05:30 IST

ఒకరైతు కుటుంబంలో పుట్టిన ట్రూమన్, కాలేజీ చదువులు చదువుకొనని ట్రూమన్, అంట్లు తోముకోవడం...

పదవిలో రాణింపు

ప్రపంచ చరిత్రలోనే క్లిష్ట ఘట్టంలో ద్వితీయ ప్రపంచ యుద్ధం కొనసాగుతున్న ఘట్టంలో - హ్యారీ ఎస్. ట్రూమన్ అమెరికా ప్రెసిడెంట్ పదవికి వచ్చాడు.పెద్ద చదువులు కాక, ఉపన్యాసాలలో దక్షత కాక, ‘లౌక్యం’గా చెల్లే కల్లకపటాలు కాక, నీతి నిజాయితీలే, నిష్కర్షగా వ్యవహరించడమే రాజకీయ పదవులలో రాణించడానికి ప్రథమావశ్యకాలని ట్రూమన్ జీవితం రుజువు చేస్తున్నది.


ఒకరైతు కుటుంబంలో పుట్టిన ట్రూమన్, కాలేజీ చదువులు చదువుకొనని ట్రూమన్, అంట్లు తోముకోవడం మొదలుకొని నాగలి దున్నడం వరకు అన్ని విధాల కాయకష్టాన్ని చేసిన ట్రూమన్, బ్యాంకులలో గుమాస్తాగా పని చేసిన ట్రూమన్, అంగడిపెట్టి అప్పుల పాలైన ట్రూమన్, కంట్రీ జడ్జిగా రాజకీయ జీవితాన్ని ప్రారంభించిన ట్రూమన్ అమెరికా ప్రెసిడెంట్ గా రాణించగలడని అనుకున్న వారు దాదాపు లేరు. అయినా, ఆ పదవిలో ఆయన రాణించారు. అమెరికా ప్రెసిడెంట్స్‌లో ఆయన ప్రథమ శ్రేణికి చెందిన వాడు కాదు గాని, త్రోసిపుచ్చదగువాడు సయితం కాదు. 


ప్రపంచ చరిత్రలోనే క్లిష్ట ఘట్టంలో ద్వితీయ ప్రపంచ యుద్ధం కొనసాగుతున్న ఘట్టంలో -ట్రూమన్ అమెరికా ప్రెసిడెంట్ పదవికి వచ్చాడు. అందువల్ల, ఆయన అనేక ముఖ్యమైన తీర్మానాలను, కీలకమైన నిర్ణయాలను, స్వయంగా చేయవలసివచ్చింది. జపాన్ పై యాటంబాంబు ప్రయోగం, యూరప్ పునరుద్ధరణకై మార్షల్ పథకం, కొరియా యుద్ధంలో ప్రవేశం, జనరల్ మెకార్థర్ బర్తరఫ్, అట్లాంటిక్ రక్షణ సంధి - ఇట్టి పెక్కు తీర్మానాలు, నిర్ణయాలు ఆయన చేసినట్టివే. 


తన పదవిని తన కోసం, తన వారి కోసం, మూట కట్టడం కోసం ట్రూమన్ దుర్వినియోగం చేయలేదు. అనామకుడుగా ఉన్న రోజులలో అంగడి పెట్టి నష్ట పడినప్పుడు పేరుకున్న అప్పులను పదిహేనేళ్ళు కష్టపడి, చివరి సెంటు వరకు ఆయన తీర్చేశాడు. అటు తర్వాత కూడా ఆయన డబ్బు విషయంలో ఇంత నీతిని, ఇంత నిజాయితీని చూపుతూ వచ్చాడు. ప్రెసిడెంట్ పదవికి వచ్చినప్పుడు ఆయన నిల్వలో కాక, అప్పులలోనే ఉన్నాడు. ప్రెసిడెంట్‌గా తన జీవితంలో నుంచి మిగల్చ గలిగిన మొత్తంతో ఆయన తన అప్పులను తిరిగి తీర్మానం చేశాడు. 


పెద్ద చదువులు కాక, ఉపన్యాసాలలో దక్షత కాక, ‘లౌక్యం’గా గాచెల్లే కల్లకపటాలు కాక, నీతి నిజాయితీలే, నిష్కర్షగా వ్యవహరించడమే రాజకీయ పదవులలో రాణించడానికి ప్రథమావశ్యకాలని ట్రూమన్ జీవితం రుజువు చేస్తున్నది. ఆయన సామాన్యులలో అసామాన్యుడు, సార్థక జీవి.

1972 డిసెంబర్ 12 ‘ఆంధ్రజ్యోతి’ సంపాదకీయం ‘ట్రూమన్’ నుంచి

Updated Date - 2020-11-06T05:54:26+05:30 IST