అంతా ప్రధానమంత్రే!

ABN , First Publish Date - 2020-08-20T06:11:32+05:30 IST

ఒకే దేశం, ఒకే పాలన, ఒకే పార్టీ, ఒకే నాయకుడు: నరేంద్ర మోదీ.... ఇలా ఉండాలని ఎక్కడైనా ఎవరైనాకోరుకుంటున్నారో లేదో తెలియదు కానీ ప్రస్తుత పరిస్థితి మాత్రం అలాగే ఉన్నది...

అంతా ప్రధానమంత్రే!

ప్రధానమంత్రి పదవి ప్రాధాన్యతను ప్రతి పల్లెకు, ప్రతి పౌరునికి పరిచయం చేయడంలో నరేంద్ర మోదీ సఫలీకృతులయ్యారు. రాష్ట్ర ప్రభుత్వాల ఉనికే లేనంతగా కేంద్రం ఏకఛత్రాధిపత్యంగా పరిపాలనా గుర్తింపును కేంద్రీకరిస్తూ పోతున్నది. అసలు చెప్పాలంటే కేంద్రంలోనూ పరిపాలిస్తున్నది మంత్రిమండలి కాదు కేవలం ప్రధానమంత్రి మాత్రమే, ఇంకా చెప్పాలంటే మోదీ మాత్రమే. ఒక్కరు మాత్రమే పరిపాలన కార్యక్రమాలు చేస్తున్నట్టుగా ప్రజలు జాలి పడేంతగా తెలుపుతున్నారు.


ఒకే దేశం, ఒకే పాలన, ఒకే పార్టీ, ఒకే నాయకుడు: నరేంద్ర మోదీ.... ఇలా ఉండాలని ఎక్కడైనా ఎవరైనాకోరుకుంటున్నారో లేదో తెలియదు కానీ ప్రస్తుత పరిస్థితి మాత్రం అలాగే ఉన్నది, దీనిని రాజ్యాంగబద్ధం చేయడమే తరువాయిగా కనిపిస్తుంది. ప్రధాని పంద్రాగస్టు ఉపన్యాసం విన్న తర్వాత, పాపం కేంద్ర ప్రభుత్వం ఇన్ని పనులు చేస్తూ ఉండగా రాష్ట్రాలు చేయడానికి ఏమైనా పనులు మిగిలి ఉన్నాయా, అసలు రాష్ట్ర ప్రభుత్వాలు హాయిగా ఊపిరి పీల్చుకోవచ్చుగా, అనిపించింది. ఊరికి రోడ్లు వేసింది, ఇంటింటికి కరెంటు సప్లై చేసింది, మరుగుదొడ్లు నిర్మించింది, రైతులకు డబ్బు సమకూర్చింది, పర్యావరణాన్ని పరిరక్షిస్తుంది, కంపెనీలను నెలకొల్పడానికి ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ పేరుమీద తొందరగా లైసెన్సులు ఇస్తుంది, కరోనా టెస్టులను మూడు వందల నుంచి ఏడు లక్షల వరకు పెంచింది, వలస కార్మికులు అందరికీ భోజనాలు పెట్టి ఆదుకున్నది, ఇంకా దేశ రక్షణ వంటి కీలక అంశాలను భుజాన వేసుకుని మోస్తున్నది.... మొత్తం కేంద్రమే అని ప్రధాని ఇంత చక్కగా వివరించాక ఇక రాష్ట్రాలకు పనుందంటే ఎవరైనా నమ్ముతారా?! పైన తెలిపిన పనులు జరగడంలో రాష్ట్రాల పాత్ర లేదని ప్రధాని ఒక్క మాటైనా అనలేదు సుమా! పైగా రాష్ట్రాలతో భుజం భుజం కలిపి నడుస్తాం అని చెప్పారు. కానీ రాష్ట్రాల ద్వారా ఈ పనులన్నీ జరుగుతున్నాయన్న మాట మాత్రం నిగూఢంగా ఉండిపోయింది. 


ప్రధానమంత్రి పదవి ప్రాధాన్యతను ప్రతి పల్లెకు, ప్రతి పౌరునికి పరిచయం చేయడంలో నరేంద్ర మోదీ సఫలీకృతులయ్యారు. రాష్ట్ర ప్రభుత్వాల ఉనికే లేనంతగా కేంద్రం ఏకఛత్రాధిపత్యంగా పరిపాలనా గుర్తింపును కేంద్రీకరిస్తూ పోతున్నది. అసలు చెప్పాలంటే కేంద్రంలోనూ పరిపాలిస్తున్నది మంత్రిమండలి కాదు కేవలం ప్రధానమంత్రి మాత్రమే, ఇంకా చెప్పాలంటే మోదీ మాత్రమే. ఒక్కరు మాత్రమే పరిపాలన కార్యక్రమాలు చేస్తున్నట్టుగా ప్రజలు జాలి పడేంతగా తెలుపుతున్నారు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ ప్రకటించవలసిన నోట్ల రద్దును ప్రధానమంత్రి ప్రకటిస్తారు. కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ప్రకటించాల్సిన జీఎస్టీ విధి విధానాలను ప్రధానమంత్రే ప్రకటిస్తారు. వ్యవసాయ మంత్రిత్వ శాఖ ప్రకటించాల్సిన సంస్కరణలను ప్రధానమంత్రే ప్రకటిస్తారు. బొగ్గు గనుల శాఖ ప్రకటించవలసిన నూతన బొగ్గు తవ్వకాల విధానాన్ని ప్రధానమంత్రి ప్రకటించడమే కాకుండా స్వయంగా వేలంపాట కూడా నిర్వహిస్తున్నారు. స్త్రీలు వాడే శానిటరీ నాప్కిన్లను కేంద్రమే సప్లై చేస్తున్నట్టుగా కూడా ప్రధానమంత్రే పంద్రాగస్టు సాక్షిగా ప్రకటించారు. ఇలా ప్రకటించడం తప్పా? అంటే, అస్సలు తప్పు కాదు.


విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను రప్పించడం, అంతర్జాతీయ ఒప్పందాలు, కేంద్రం ఆధీనంలో పరిశ్రమలను ఏర్పాటు.. వంటివన్నీ ప్రకటించి ఉంటే సరే కానీ రాష్ట్ర యంత్రాంగంతో పూర్తయ్యే పథకాలు కూడా (ఉదాహరణకు శౌచాలయ నిర్మాణాలు, రైతులను ఆదుకునే రైతుబంధు వంటి పథకాలు) ప్రధానమంత్రి తాను స్వయంగా పూర్తి చేసినట్లుగా ప్రకటించుకోవడం జరుగుతున్నది. ఈ దేశంలో మారుమూల ప్రాంతాల్లోనూ జరిగిన ప్రతి పనికి ప్రధాన మంత్రికి బాధ్యత ఉన్నది, కానీ అందులో రాష్ట్రాల పాత్ర అతి ప్రధానమైనది కదా. కేంద్రం పాత్ర కేవలం విధానాల రూపకల్పన, దిశానిర్దేశాల వరకే పరిమితం. అలాంటిది మొత్తం కేంద్రమే చేస్తున్నట్లు ప్రకటించుకోవడం ఫెడరల్ వ్యవస్థలో రాష్ట్రాల రాజకీయ భవిష్యత్తును ప్రశ్నార్థకంలో వేస్తుంది. కేంద్రం నియమించిన రాష్ట్ర గవర్నర్ల వ్యవస్థ ద్వారా కేంద్ర ప్రభుత్వ విధానాలను ప్రజల్లోకి ప్రచారం చేయడం మరో పక్క జరుగుతూనే ఉన్నది. తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ కేంద్రం నూతన విద్యా విధానం చాలా మంచిదని ఉపన్యాసాలు ఇస్తూనే ఉన్నారు. వారు ఇలా చెప్పకూడదా... అంటే, చెప్పే అధికారం హక్కు వారికి ఉన్నాయి. కానీ గవర్నర్ ప్రకటించిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వాలు నూతన విద్యా విధానం సాధ్యాసాధ్యాలపై మంచిచెడులపై ఏ విధంగా చర్చించాలి? ప్రజలు ఏవిధంగా దానిపై స్పందించాలి? రాజ్యాంగబద్ధ హోదాలో ఉన్న గవర్నర్ అభిప్రాయాన్ని వ్యతిరేకిస్తే ధిక్కారం కేసు కూడా కావచ్చు? బిజెపి పాలిత రాష్ట్రాలు అయితే ఎలాగూ తల ఊపుతూనే ముందుకు వెళ్తాయి. ఈ దూకుడు పరిస్థితి చూస్తుంటే సమాఖ్య (ఫెడరల్) పద్ధతి అవసరమా? కేవలం గవర్నర్ ద్వారా రాష్ట్రాలను పరిపాలిస్తే సరిపోదా? ఒకే దేశం, ఒకే కేంద్రం, ఒకే పార్టీ, ఓకే నాయకుడు.... అంటే అదే... అంతా మోదీ అనే విధంగా రోజులు మారనున్నాయా అనిపిస్తున్నది. రాష్ట్రాలు కిక్కురుమనకుండా తమ పని తాము చేసుకుంటూపోతే సరే సరి, లేదా కేంద్రాన్ని ఎక్కువ తక్కువగా విమర్శిస్తే పరిగెత్తుకు రావడానికి ఎన్‍ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ఎలాగూ ఉన్నది. అందుకే బిజెపి యేతర రాష్ట్రాలు తమకు తోచిన విధంగా పరిపాలన సాగిస్తూ భవిష్యత్తు ఎన్నికల కోసం నాలుగు రాళ్లు వెనకేసుకుని మమ అనిపించడమే సన్మార్గంగా ఎంచుకుంటున్నాయి. 


73 సంవత్సరాల స్వతంత్ర భారత్‍లో చాలా సాధించాము కానీ ఎక్కడెక్కడ వెనకబడి ఉన్నామో వాటిని ఎలా అధిగమించాలో ఒక రోడ్ మ్యాప్ వేసి రాష్ట్రాలకు, పౌరులకూ దిశా నిర్దేశం చేసేలా ఉపన్యసించుంటే బాగుండేది. డెబ్బై ఏళ్ళా స్వతంత్ర భారత్‍ని పట్టి పీడిస్తున్నవి మూడు ప్రధాన సమస్యలు; ఒకటి- నిరక్షరాస్యత, రెండు- నిరుద్యోగము (ఉపాధి లేమి), మూడు- ఆర్థిక అసమానతలు. ఇన్ని గొప్పలు చెప్పిన అధినాయకులకు ఈ సమస్యల గురించి తెలియదని కాదు. ఎందుకు వీటిపై స్పందించటం లేదో పౌరులకు తెలియట్లేదు. అంబానీ ద్వారా ప్రతి పల్లెకూ ఫైబర్ కేబుల్ వేసి గ్రామాల్లో ఉండే లోకల్ కేబుల్ టీవీ ఆపరేటర్లను ఒక్క తన్ను తన్ని ఆత్మనిర్భర భారత్ అంటే అంబానీరా, ప్రపంచ కుబేరుల్లో నాలుగవ స్థానంలో పడి ఉన్న ఆయన్ని మొదటి స్థానానికి తేవడమేరా సెల్ఫ్ రిలయన్స్ అంటే అంటూ అందరూ కంకణబద్ధులు కావడమే డెబ్బై నాలుగవ స్వతంత్ర దినోత్సవ సందేశం!

జి. తిరుపతయ్యRead more