ఆదివాసులు కోరుతున్న ‘ఉపాధి హామీ’

ABN , First Publish Date - 2020-12-11T06:04:12+05:30 IST

గ్రామీణ పేదలకు ఒక ఆర్థిక సంవత్సరం (ఏప్రిల్ 1 నుంచి మార్చి 31 వరకు)లో 100 పని దినాలు కల్పించేందుకు ‘మహాత్మాగాంధీ...

ఆదివాసులు కోరుతున్న ‘ఉపాధి హామీ’

మైదాన ప్రాంతాలకు ‘డిజైన్’ చేసిన ఉపాధిహామీ పథకం అమలు ప్రక్రియను ఆదివాసీ ప్రాంతాలకు యథాతథంగా అన్వయించడం తప్పు. ఏ చట్టాన్ని అయినా ఆదివాసీ ప్రాంతాలకు వర్తింపజేసే ముందు యథాతథంగా వర్తింపజేయవచ్చా అన్నది తర్కించి, సంబంధిత ప్రాంత అవసరాలకు వీలుగా ఎలాంటి మార్పులు చేయాలో చూసుకోవాలని భారత రాజ్యాంగం స్పష్టంగా నిర్దేశించింది.


గ్రామీణ పేదలకు ఒక ఆర్థిక సంవత్సరం (ఏప్రిల్ 1 నుంచి మార్చి 31 వరకు)లో 100 పని దినాలు కల్పించేందుకు ‘మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం’ను ఉద్దేశించారు. కొవిడ్ వైరస్ కష్టకాలంలో ఈ ఉపాధి పథకమే దేశవ్యాప్తంగా గ్రామీణ పేదలను ఆదుకుందని ఇప్పుడు అందరూ గుర్తించారు. ‘గోతులు తవ్వి గోతులు పూడ్చే’ పనిగా ‘ఉపాధి హామీ’ని ఎద్దేవా చేసినవారు సహితం ఇప్పుడు తామే ఆ పథకానికి ఎక్కవ నిధులు కేటాయించామని గొప్పగా చెప్పుకుంటున్నారు. 


గ్రామీణ ఉపాధి హామీ పథకం మిగిలినవారికంటే కూడా ఆదివాసీలకే ఎక్కువ అవసరం. ఎందుకంటే అడవి, వ్యవసాయం తప్ప వేరే ఉపాధి అవకాశాలు వారి ఆవాసాలలో ఉండవు. అంతేగాక ఆదివాసీల వ్యవసాయం, మౌలిక వసతులపై ప్రభుత్వం అసలు ఖర్చు చేయటం లేదనే చెప్పాలి. అందువల్ల గ్రామీణ ఉపాధిహామీ నిధులతో చేపట్టే పనులు ఈ లోటును ఎంతో కొంత తీరుస్తున్నాయి. ఉదాహరణకు విశాఖ జిల్లా కొండప్రాంతాలలో రైతులు తమ పొలాల్లో ఉన్న రాళ్ళను తీసి ఆ పొలాలు కోతకు గురికాకుండా అవే రాళ్ళతో గట్లు, కందకాల పనులను ఇప్పుడు చేసుకుంటున్నారు. ఉపాధిహామీ పథకం లేకపోతే ఈ పనులను ఊహించగలమా? తమ పొలాల్లో తాము ఈ పనులు చేసుకుంటే తమకు, తమ కుటుంబానికి అవి ఆదాయం ఇచ్చే పనులుగా మారడంతో పాటు ఆ పొలాలు బాగుపడి దిగుబడి పెరగడం దానికదే ఒక విప్లవాత్మక చర్య కాదా? ఈ ఉపాధి పథకం లేకపోతే  ఇది సాధ్యమై ఉండేది కాదు. అంతమాత్రాన ఆ పథకం అమలులో లోపాలు లేవని, దాని పద్ధతుల్లో మార్చుకోవలసింది ఏమి లేదన్నట్టుగా అర్థం చేసుకోకూడదు. ఉపాధి హామీ పథకానికి సంబంధించి కొన్ని ముఖ్యమైన అంశాలను చర్చించడమే ఈ వ్యాసం ఉద్దేశం. 


నా మొదటి ఫిర్యాదు ఏమిటంటే, మైదాన ప్రాంతాలకు ‘డిజైన్’ చేసిన ఈ పథకం అమలు ప్రక్రియను ఆదివాసీ ప్రాంతాలకు యథాతథంగా అన్వయించడం తప్పు. ఈ రెండు ప్రాంతాలు భిన్నమైనవని 185ఏళ్ళ క్రితమే నాటి పాలకులు గుర్తించారు. వలస పాలకుల హయాంలో 1919, 1935 సంవత్సరాలలో ప్రవేశపెట్టిన రాజ్యాంగాలలోను, స్వతంత్ర భారతదేశం 1950 నుంచి అమలుపరచుకుంటున్న రాజ్యాంగంలోనూ ఈ తేడాను గుర్తించి ప్రత్యేక ఏర్పాట్లు ఉన్నాయి. ఏ చట్టాన్ని అయినా, నియమాన్ని అయినా ఆదివాసీ ప్రాంతాలకు వర్తింపజేసే ముందు యథాతథంగా వర్తింపజేయవచ్చా అన్నది తర్కించి, సంబంధిత ప్రాంత అవసరాలకు వీలుగా ఎలాంటి మార్పులు చేయాలో చూసుకోవాలని వలస పాలకుల, స్వతంత్ర భారత రాజ్యాంగాలు స్పష్టంగా నిర్దేశించాయి. మైదానప్రాంత ఆదివాసేతరుల కోసం రూపొందించిన కార్యక్రమాన్ని యథాతథంగా ఆదివాసీ ప్రాంతాలకు వర్తింపజేశారు. 


ఆదివాసీ ప్రాంతాల అభివృద్ధి బాధ్యత గిరిజన సంక్షేమ శాఖది. గ్రామీణ ఉపాధిహామీ పథకం అమలు బాధ్యత గ్రామీణ సంక్షేమ మంత్రిత్వశాఖది. ఆదివాసీ ప్రాంతాలలో ఉపాధి హామీ అమలు బాధ్యతను గిరిజన సంక్షేమశాఖకు ఇచ్చి ఉండవలసింది. పాలకులు అలా ఇవ్వలేదు. ఆదివాసీలు అడగలేదు. ఆదివాసీ ప్రాంతాలలో అన్ని ప్రభుత్వ శాఖలు ‘ఐటిడిఏ’ (ఇంటెగ్రేటెడ్ ట్రైబల్ డెవెలప్ మెంట్ అథారిటీ-సమగ్ర గిరిజనాభివృద్ధి సంస్థ) పరిధిలో పని చేస్తాయి. అయితే గ్రామీణ ఉపాధి హామీ అమలు ‘డిడబ్ల్యుఎమ్ఏ’ (డిస్ర్టిక్ట్ వాటర్ మేనేజ్మెంట్ అథారిటీ-/జిల్లా నీటి యాజమాన్య సంస్థ) ఆధ్వర్యంలో నడుస్తూ ఉంటుంది. దీనివల్ల తమ స్థానిక అవసరాలకు అనుగుణంగా ఉపాధి హామీ కార్యక్రమాన్ని మార్చుకోవడం, సిబ్బంది నియామకం, సమీక్ష, చర్యలు మొదలైనవన్నీ ఐటిడిఏ పరిధిలో ఉండవు. ఇది రాజ్యాంగస్ఫూర్తికి విరుద్ధం. అయినా ఉపాధి హామీ అమలు వ్యవహారాలు అలా నడిచిపోతూ ఉన్నాయి. 


జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం వెబ్‌సైట్ ప్రకారం, ఐదు జిల్లాలలోని ఐటిడిఏల పరిధిలో నమోదైన జాబ్ కార్డులు 3,86,210. ఇందులో గత ఏడాది పని పొందిన కుటుంబాలు 3,22,986. కాగా శ్రామికుల సంఖ్య 5,85,044. వీరిలో 1,25,409మంది గిరిజనేతరులు కాగా మిగిలినవారు ఆదివాసీలు. పని పొందిన కుటుంబాలకు లభించిన సగటు పని దినాలు 62 రోజులు. ఇది రాష్ట్ర సగటు కంటే ఎక్కువ. 100 రోజులు పూర్తిగా పని పొందిన కుటుంబాలు మాత్రం 79,786. అంటే పని చేసిన కుటుంబాలలో నూటికి 25మంది మాత్రమే వందరో  జులు పూర్తిగా పని పొందగలిగారు. గ్రామీణ ఉపాధి హామీ పథకం వెబ్‌సైట్ ప్రకారం గత ఏడాది (2019–-20) పాలనా వ్యయం, మొత్తం వ్యయంలో 0.22 శాతంగా ఉంది. 


ఉపాధి హమీ అమలులో ప్రధాన ఖర్చు పనివాళ్ళ వేతనాలే. పాలనావ్యయం ఆరుశాతంగా ఉండవచ్చు. అంటే అర్థం ఏమిటి? 100 రూపాయలు వేతనాల మీద ఖర్చు పెడితే 6 రూపాయలు పాలనా వ్యయం కింద లభిస్తుంది. ఏమిటి ఈ పాలనా వ్యయం అంటే, ఈ పథకంలో పనిచేసే సిబ్బంది జీతభత్యాలు, కార్యాలయ నిర్వహణ ఖర్చులు, ప్రయాణ రవాణా ఖర్చులు ఇందులోకి వస్తాయి. ఐటిడిఏ లలో ఉపాధి హామీ పథకం అధికార యంత్రాంగంలో దిగువ, మధ్యస్థాయి అధికారులు అందరూ ఆదివాసీలే ఉంటారు. నిజానికి ఆదివాసీ ప్రాంతాలలో ఆవాస గ్రామాలు ఎక్కువ ఉంటాయి. వాటి మధ్య దూరం తక్కువేమీ కాదు. డిడబ్ల్యుఎమ్ఏఏం చేస్తుందంటే, అవసరమైన సిబ్బందిని ఆ గ్రామాలకు పంపకుండా ఆదివాసీ యువతీ యువకులతో పని చేయిస్తుంది. చాలా క్లిష్టమైన వాతావరణం, మౌలిక వసతులు లేని చోట పనిచేసే ఈ ఆదివాసీ సిబ్బందికి, మైదానప్రాంతంలో పనిచేసేవారికి వేతనాలలో తేడా ఉండదు. అధికార సౌధంలోని పై స్థాయి అధికారులు మాత్రం ప్రత్యేక అలవెన్సులు పొందుతుంటారు. 


విశాఖ జిల్లాలోని 11 ఆదివాసీ మండలాలు తూర్పు కనుమలపై ఉన్నాయి. వాటి డివిజనల్ కేంద్రం పాడేరు. ఐటిడిఏ ప్రాజెక్ట్ ఆఫీసర్ ఉండే ఈ పాడేరు మండలంలో 2019–-2020 ఆర్థిక సంవత్సరానికి పాలనావ్యయం 2.18శాతం. పాడేరు పొరుగు మండలం అయిన జి. మాడుగులలో అదే ఏడాదికి అయిన పాలనావ్యయం 3.21శాతం. జి.మాడుగుల మండలంలోని సొలభం అనే పంచాయతీ ఉంది. ఆ పంచాయతీలో ఉన్న ఆవాస గ్రామాలు మొత్తం 58. అందులో మల్లిపాడు అనే ఆవాస గ్రామం వెళ్ళాలి అంటే రెండు మండలాలు దాటుకొని వెళ్ళాలి. అయితే సొలభం పంచాయతీలో ఉన్న ఫీల్డ్‌ అసిస్టెంట్స్ ఇద్దరు మాత్రమే. ఇది ఎలా సాధ్యం? అంటే గ్రామీణాభివృద్ధి శాఖ జిఓ ప్రకారం 5 కంటే ఎక్కువ ఉన్న ఆవాస గ్రామాలు గల పంచాయతీకి ఇద్దరు ఫీల్డ్ అసిస్టెంట్లు ఉండాలి. అదే సూత్రాన్ని గుడ్డిగా ఆదివాసీ ప్రాంతాలకు అన్వయించారు. విశాఖ జిల్లా మైదాన ప్రాంతానికి చెందిన రావికమతం మండలం టి. అర్జపురం గ్రామ పంచాయతీలో 7 ఆవాస గ్రామాలు ఉన్నాయి. అక్కడా ఇద్దరు ఫీల్డ్‌ అసిస్టెంట్లు. 58 ఆవాస గ్రామాలు ఉన్న జి.మాడుగుల మండలం, సొలభం పంచాయతీలోను ఇద్దరే పోనీటి. అర్జాపురం, సొలభం ఫీల్డ్‌ అసిస్టేంట్లు జీతాల నిర్ణయంలో ఏమైనా తేడా ఉందా?


గత ఆర్థిక సంవత్సరం (2019-–2020) విశాఖ ఆదివాసీ ప్రాంతంలో అయిన వేతన వ్యయం (లేబర్ బడ్జెట్) 174 కోట్ల 5 లక్షలు. కానీ పాలనా వ్యయం అందులో 1.43 శాతం(2.48 లక్షలు). 6 శాతం (10కోట్లు) వరకు ఖర్చు పెట్టుకొనే అవకాశం ఉన్నా ఎందుకని 1.43శాతం వద్దనే పాలనా వ్యయం వుండిపోయింది? జవాబు తేలికగా చెప్పవచ్చు, ఆదివాసీ ప్రాంతాలలో ఉపాధి హామీ పథకం యంత్రాంగం మీద ఖర్చు పెట్టవలసినంతగా పెట్టడం లేదు. ఆదివాసీ ప్రాంతంలోని లేబర్ బడ్జెట్ నుంచి వస్తున్న పాలనా వ్యయం అక్కడ ఖర్చు చేయకుండా మైదాన ప్రాంతాలకు తరలిస్తున్నారని మనకు అర్థమవుతోంది. ఇది రాజ్యాంగస్ఫూర్తికి పూర్తిగా విరుద్ధం. అయినా గిరిజన సంక్షేమశాఖ తన రాజ్యాంగ బాధ్యతను నిర్వహించకపోవడం విచారకరం. దీని అర్థం ఏమిటి? 6 శాతం వరకు పాలనావ్యయం కింద ఖర్చు పెట్టుకునే అవకాశం ఉంది. ఆ ప్రకారం చూస్తే ఇంతకుముందు నేను చెప్పిన పాడేరు, జి. మాడుగులలో సిబ్బందిని పెంచుకోవచ్చును. మౌలిక వసతులు పెంచుకోవచ్చును. డిడబ్ల్యుఎమ్‌ఏ తన పరిధిలోని ఆదివాసీ ప్రాంతాలలో తక్కువ సిబ్బందితో ఎక్కువ పని చేయిస్తున్నది. దీనివల్ల వారు విపరీతమైన పని భారానికి, ఒత్తిడికి గురవుతున్నారు. ప్రయాణ ఖర్చులకే వారి జీతంలో అధికభాగం ఖర్చు అవుతున్నది. ఇది అవినీతికి దారి తీస్తున్నది కూడా. నిజానికి ఆదివాసీ ప్రాంతంలో పూర్తిస్థాయిలో పాలనావ్యయాన్ని అక్కడే ఖర్చు చేస్తే అనేకమంది నిరుద్యోగులకు ఉపాధి లభిస్తుంది. అంతేగాక ఉపాధి పథకం పనులలో నాణ్యత పెరుగుతుంది. విశాఖ జిల్లా ఆదివాసీ ప్రాంతంలో 3,22,986 కుటుంబాలు పనిలోకి వస్తే 79,786 కుటుంబాలకు మాత్రమే 100 పనిదినాలు లభ్యమయ్యాయి. అదే పూర్తిస్థాయి పాలనా  వ్యయం అక్కడే ఖర్చు చేస్తే ఈ పనిదినాల సంఖ్య బాగా పెరుగుతుంది. ఇది ఆదివాసీల హక్కు కూడా. 


పనులు కల్పించడం ఎంత ముఖ్యమో చేసిన పనికి సకాలంలో వేతనాలు చెల్లించడం అంతే ముఖ్యం. నిజానికి దీనిని సులువుగా చేయవచ్చును. పనుల కల్పనకు ఒక ఫీల్డ్ అసిస్టెంట్, వేతనాలు చెల్లించడానికి ఒక ఫీల్డ్ అసిస్టెంట్ అనే సూత్రాన్ని ఆదివాసీ ప్రాంతాలలో పాటించాలని మేము కోరుతూ వస్తున్నాం. నిజానికి పాలనావ్యయం మొత్తం వాడుకునే అవకాశం ఐటిడిఏల చేతికి ఇస్తే ఇది సులువు అవుతుంది. ఒక్క మాటలో చెప్పాలంటే ఆదివాసీ ప్రాంతాలలో గ్రామీణ ఉపాధి హామీ పథకం అమలు బాధ్యత గిరిజన సంక్షేమశాఖే చేపట్టి తీరాలి. 

పి ఎస్ అజయ్ కుమార్

అఖల భారత వ్యవసాయ, గ్రామీణ కార్మిక సంఘం

Updated Date - 2020-12-11T06:04:12+05:30 IST