శాంతి దౌత్యాలు ఫలించేనా?

ABN , First Publish Date - 2020-07-18T05:46:02+05:30 IST

దౌత్యవ్యవహారాలలో పారదర్శకత ఉండదు. చైనా దౌత్యనీతిలో అటువంటి గుణాన్ని ఆశించడమంటే వెర్రి బాగుల తనమే అవుతుంది. గల్వాన్ మనకొక సరికొత్త చేదు అనుభవం...

శాంతి దౌత్యాలు ఫలించేనా?

వాస్తవాధీన రేఖ వెంబడి వివాదాస్పద ప్రదేశాల నుంచి భారత్, చైనాలు తమ సైనిక దళాలను ఉపసంహరించుకుంటున్నాయి. ఎక్కడ నుంచి ఎక్కడకు వెనక్కుమళ్ళుతున్నాయన్నదే అసలు ప్రశ్న. ఎల్ఏసీ పై తమ తమ దృక్కోణాల ప్రకారం చైనా, భారత్‌లు తమ సొంత ప్రాంతం నుంచి తమ ప్రాంతానికే దళాలను ఉపసంహరించుకుంటున్నాయి! మరి 2020 మే 5నాటి యథాపూర్వస్థితిని పునరుద్ధరించడమనే భారత్ ప్రకటిత లక్ష్యం నెరవేరుతుందా?


దౌత్యవ్యవహారాలలో పారదర్శకత ఉండదు. చైనా దౌత్యనీతిలో అటువంటి గుణాన్ని ఆశించడమంటే వెర్రి బాగుల తనమే అవుతుంది. గల్వాన్ మనకొక సరికొత్త చేదు అనుభవం. దాన్ని అర్థం చేసుకోవడంలో ఉన్న చిక్కులన్నీ ఇప్పుడు విడిపోతున్నాయి. 2019 అక్టోబర్ 12న మహాబలిపురం శిఖరాగ్ర సదస్సు గురించి గత శనివారం ఇదే కాలమ్ (కూలిపోతున్న ‘శిఖరాగ్రాలు’)లో నేనిలా వ్యాఖ్యానించాను: ‘వేగంగా క్షీణించిపోతున్న ఆర్థిక వ్యవస్థతో భారత్ పరిస్థితి బాగా బలహీనపడిందనే అంచనాకు చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ వచ్చినట్టు కన్పిస్తున్నది. చైనా అధ్యక్షుని ఉద్దేశాలను అర్థం చేసుకోవడంలో నరేంద్రమోదీ పూర్తిగా విఫలమయ్యారు’. అయినప్పటికీ 2020 సంవత్సరాన్ని ‘భారత్-చైనా సాంస్కృతిక, ప్రజల స్థాయిలో సుహృద్భావ సంబంధాల’ సంవత్సరంగా పాటించాలనే ప్రతిపాదనను ఉభయదేశాలు ఆమోదించాయి. ఆ తరువాత 2019 డిసెంబర్ 21న ఇరు దేశాల ప్రత్యేక ప్రతినిధుల సమావేశంలో కూడా ఆ ఉల్లాసకర వాతావరణం కొనసాగింది. 


అయితే హిమాలయాలకు ఆవల వాస్తవాలు భిన్నంగా ఉన్నాయి. 2020 జనవరిలో చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ ఒక కొత్త ‘ట్రైనింగ్ మోబిలైజేషన్ ఆర్డర్’ (టిఎమ్ఓ) పై సంతకం చేసినట్టు కొద్ది రోజుల క్రితమే మన జాతీయ దినపత్రిక ఒకటి వెల్లడించింది. ఆ ఉత్తర్వు మేరకు పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ (పి ఎల్ ఏ) భారత్-చైనా వాస్తవాధీనరేఖ (ఎల్ ఏసీ) కి తమ వైపున సైనిక దళాల సమీకరణకు పూనుకున్నది. సరిహద్దు సమీపంలో దళాలను చురుగ్గా మొహరించడాన్ని ప్రారంభించింది. చైనా సైనిక దళాల కదలికలపై గూఢచార నివేదికలు 2020 ఏప్రిల్ మధ్యనాళ్ళ నుంచి లభ్యమవుతున్నట్టు ఇంటెలిజెన్స్ అధికారి ఒకరు చెప్పినట్టు మరో ప్రముఖ దినపత్రిక వెల్లడించింది.


ఈ విషయాలు పలు ప్రశ్నలను లేవనెత్తుతున్నాయి. అవి: చైనా అధ్యక్షుడు జారీ చేసిన కొత్త టిఎమ్ఓ గురించి సౌత్ బ్లాక్కు (మన విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ నెలవు), సైనిక దళాల ప్రధాన కార్యాలయానికి తెలియదా?; ఎల్ ఏ సీకి చైనా వైపున సైనిక దళాల సమీకరణను మన సైనిక గూఢచార వర్గాలు, రీసెర్చ్ అండ్ ఎనాల్సిస్ వింగ్ (రా) కనిపెట్ట లేదా?; గల్వాన్‌లోయ, ప్యాంగాంగ్ సరస్సు మధ్య 200 కి.మీ. పరిధిలో పలు ప్రదేశాల వద్ద ఎల్ఏసీ దిశగా వస్తున్న చైనీస్ వాహనాల, సైనికుల కదలికలను మన ఉపగ్రహాలు గుర్తించలేదా?; 2020 ఏప్రిల్ మధ్యనాళ్ళలో అందిన సైనిక గూఢచార వర్గాల నివేదికలను విశ్లేషించి, సమాచారాన్ని సంబంధిత ఉన్నత స్థాయి బాధ్యులతో పంచుకుని నిర్దిష్ట నిర్ణయాలకు రాలేదా? ప్రభుత్వం ఈ ప్రశ్నలకు ఇప్పుడు కాకపోయినా సరైన సమయంలో సమాధానాలు ఇచ్చి తీరాలి. 


భారత్, చైనాలు ఇప్పుడు గల్వాన్ ప్రాంతంలో మోహరించిన తమ సైనిక దళాలను ఉపసంహరించుకుంటున్నాయి. ఉద్రిక్త పరిస్థితులను ఉపశమింప చేసేందుకు చురుగ్గా చర్యలు చేపడుతున్నాయి. మంచిపని. నేను ఈ చర్యలను సమర్థిస్తున్నాను. సరిహద్దు వివాదాలను యుద్ధాలు పరిష్కరించవు, పరిష్కరించలేవు. టీవీ యాంకర్ -జనరల్స్ ఎంతగా ప్రేరేపిస్తున్నప్పటికీ భారత్, చైనాల మధ్య యుద్ధం ఎంత మాత్రం అభిలషణీయంకాదు. యుద్ధం సరైన పరిష్కారం కాబోదు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఈ సత్యాన్ని గుర్తించినందుకు చాలా సంతోషం. మరి జిన్ పింగ్ కూడా యుద్ధం మంచిది కాదని విశ్వసిస్తున్నారా లేదా అనేది స్పష్టంగా తెలియదు. పరిమిత యుద్ధం-తో భారత్ భూభాగాల్లోకి చొచ్చుకు పోయి ఆక్రమించుకోవడం; రెండు అడుగుల ముందుకు, ఒక అడుగు వెనక్కు అనే విధానం - అనేది ఆచరణీయ ప్రత్యామ్నాయమని జిన్ పింగ్‌ను పి ఎల్ ఏ జనరల్స్ ఒప్పించి వుండవచ్చు. 


ఇటీవలి గతంలో రెండు ఉదాహరణలు ఉన్నాయి. అవి డెప్సాంగ్ (2013), డోక్లాం (2017). డెప్సాంగ్‌లో చొరబడి ఆక్రమించుకున్న ప్రదేశాలన్నిటినుంచి చైనా పూర్తిగా ఉపసంహరించుకున్నది. ఇప్పుడు డెప్సాంగ్ ‌లో ఒక్క చైనా సైనికుడు కూడా లేదు. అయితే డోక్లాంలో ఇటువంటి పరిస్థితి లేదు. మాజీ జాతీయ భద్రతా సలహాదారు శివశంకర్ మీనన్ ఇలా అన్నారు: ‘2017లో డోక్లాంలో ప్రతిష్టంభన నెలకొన్నప్పుడు సంప్రదింపుల ద్వారా ఉపసంహరించుకోవడం జరిగింది. ప్రతిష్టంభన నెలకొన్న ప్రదేశం నుంచి వెనక్కు వెళ్ళిన చైనా సైన్యం డోక్లాం పీఠభూమిలో శాశ్వత స్థావరాలనేర్పాటు చేసుకోవడం ద్వారా అక్కడ తమ ఉనికిని సుస్థిరం చేసుకున్నది’. ఆయన ఇంకా ఇలా అన్నారు: ‘భారత ప్రభుత్వం డోక్లాంపై ప్రచార సమరంలో విజయం సాధించింది. అయితే క్షేత్రస్థాయిలో పరిస్థితులను తనకు అనుకూలం చేసుకోవడంలో చైనా సఫలమయింది’. 


శివశంకర్ మీనన్ ఈ వ్యాఖ్యలను ఈ నెల 13వ తేదీన చేశారు. ప్రభుత్వం వాటిపై ఇంతవరకూ ప్రతిస్పందించలేదు. డోక్లాంలో నెలకొనివున్న వాస్తవ పరిస్థితుల గురించి ఎటువంటి వివరణ ఇవ్వలేదు. శివశంకర్ మీనన్ అన్నట్టు డోక్లాం పీఠభూమిపై చైనా శాశ్వత స్థావరాల నేర్పాటు చేసుకున్నదా?తన ఉనికిని సుస్థిరం చేసుకున్నదా? తన చెంతనే చైనా ఉనికి గురించి భూటాన్ మౌనంగా ఉండిపోయింది. ఎందుకంటే ఆ దేశం నిస్సహాయ. భూటాన్ తరఫున భారత్ మాట్లాడకూడదా? ఈ ప్రశ్నలకు సమాధానాలు లేవు. లేకపోగా డోక్లాంలో చైనా చొరబాటుదారులను భారత సైన్యం వెనక్కి తరిమివేసిందని, ఇది మోదీ నాయకత్వానికి ఒక ఘన విజయమనే తప్పుడు కథనాలను ప్రచారం చేస్తున్నారు. 


వాస్తవాధీనరేఖ వెంబడి పలు ప్రదేశాలలో ఇప్పుడు నెలకొని వున్న ప్రతిష్టంభన డెప్సాంగ్‌లో వలే సమసిపోనున్నాయా? లేక డోక్లాంలో వలే సంక్లిష్టమవనున్నాయా? ఈ ప్రశ్నకు సమాధానం కావాలంటే ఎల్ఏసీ పట్ల ఉన్న రెండు దృక్కోణాలు- ఒకటి చైనాది, రెండోది భారత్‌ది తెలుసుకోవలసివున్నది. ఈ రెండు దృక్కోణాల మధ్య ఉన్న తేడాను దృష్టిలో ఉంచుకుని వాస్తవాలను నిశితంగా పరిశీలించాలి. ఎల్ఏసీ వెంబడి వివాదాస్పద ప్రదేశాల నుంచి భారత్, చైనాలు తమ సైనిక దళాలను ఉపసంహరించుకుంటున్నాయనడంలో సందేహం లేదు. అయితే ఎక్కడ నుంచి ఎక్కడకు ఉపసంహరించుకుంటున్నాయనేదే అసలు ప్రశ్న. 


తొలుత చైనా దృక్కోణాన్ని చూద్దాం. చైనీస్ సైనిక దళాలు తమ దృక్కోణం ప్రకారం ఎల్ఏసీని అతిక్రమించివుండకపోతే అవి తమ భూభాగాల నుంచి తమ భూభాగాలకు ఉపసంహరించుకుంటున్నాయి. అప్పుడు చైనా ఒక అంగుళం భూమిని కూడా కోల్పోలేదు. అలా కాకుండా చైనా దళాలు ఎల్ఏసీని అతిక్రమించివుంటే అవి నిజానికి అక్రమంగా ఆక్రమించుకున్న భారత్ భూభాగాల నుంచి వెనక్కి వెళ్ళిపోతున్నాయి. భారత్ దృక్కోణం ప్రకారం భారత సైనికదళాలు ఎల్ఏసీని ఎప్పుడూ, చివరకు జూన్ 15–-16 తేదీల్లో కూడా అతిక్రమించ లేదు. భారతభూభాగంలో చైనాసైన్యం ఏర్పాటు చేసుకున్న స్థావరాలను తొలగించేందుకు జూన్ 5న జరిగిన ఉభయ దేశాల కమాండర్ల స్థాయి సమావేశంలో అంగీకరించడం జరిగింది. అయినప్పటికీ అవి అక్కడే కొనసాగడం పట్ల అభ్యంతరం తెలుపుతూ కల్నల్ సంతోష్ బాబు, ఆయన బృందం చేపట్టిన చర్యలను భారత్ పూర్తిగా సమర్థించింది. దీన్ని బట్టి భారత్ తన సొంత భూభాగాల నుంచి ఉపసంహరించుకుంటుందని స్పష్టమవుతున్నది. 


ఇప్పుడు ఉభయ దేశాల సైనిక దళాలు వెనక్కి వెళ్ళిన ప్రదేశాల మధ్య ఉన్న ప్రాంతాన్ని ‘నిస్సైనిక ప్రాంతం’ (నో ట్రూప్స్ లాండ్)గా పరిగణించడం జరుగుతుంది. ఈ నిస్సైనిక ప్రాంతంలోనే చైనా దృక్కోణం నుంచి చూసినా లేక భారత్ దృక్కోణం నుంచి చూసినా ఎల్ ఏ సీ ఉన్నది. ఇది సరిహద్దుల్లో శాంతి స్థాపనకు దారితీస్తుంది. అయితే సరిహద్దు సమస్యను పరిష్కరించదు. ఏదో ఒక విధమైన తటస్థ మండలాన్ని సృష్టించవలసివుంటుంది. మరి తటస్థ ప్రాంతాన్ని సృష్టించడమనేది భారత్ లక్ష్యం కాదు. 2020 మే 5నాటి యథాపూర్వస్థితిని పునరుద్ధరించడమే భారత్ ప్రకటిత లక్ష్యం. అయితే ఈ లక్ష్య సాధన ప్రస్తుతానికి సాధ్యం కాదు. అది చాలా దూరంలో ఉన్న గమ్యం. చైనా డిమాండ్లకు భారత్ మరీ ఎక్కువగా సమ్మతిస్తే తన ప్రకటిత లక్ష్యాన్ని ఎప్పటికీ సాధించలేదు. శాంతి స్థాపన ప్రక్రియలో పురోగతిని నిశితంగా గమనిస్తూ వుండండి.


పి. చిదంబరం

(వ్యాసకర్త కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకులు)

Updated Date - 2020-07-18T05:46:02+05:30 IST