సీమ ప్రాజెక్టుల ఊసే లేదు!

ABN , First Publish Date - 2020-09-24T06:30:47+05:30 IST

వైకాపా అధికారానికి వచ్చి ఒకటిన్నర సంవత్సరం గడుస్తున్నా రాయలసీమలో ఏళ్ల తరబడి నిర్మాణపరంగా పెండింగులో వున్న ప్రాజెక్టులతో పాటు, తాజాగా ప్రతిపాదించిన...

సీమ ప్రాజెక్టుల ఊసే లేదు!

రాష్ట్ర ప్రభుత్వం ఒకవైపు పలు ఎత్తిపోతల పథకాలు, మధ్యతరహా రిజర్వాయర్ల నిర్మాణానికి తామరతంపరగా పరిపాలనా అనుమతులు ఇస్తోంది. వీటికి బడ్జెట్‍లో కేటాయింపులు లేవు. రాయలసీమలో, బడ్జెట్ కేటాయింపులు ఉండి నిర్మాణంలో ఉన్న భారీ పథకాల్లో కూడా పురోగతి లేదు. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి పదవి చేపట్టగానే రాయలసీమ కోనసీమ అయిపోతుందని భావించిన కొందరు ప్రస్తుతం మౌనమే భూషణమన్నట్టు ఉండగా, యువత మాత్రం పోరాటాలు తప్పవనే ధోరణిలో ఉన్నారు.


వైకాపా అధికారానికి వచ్చి ఒకటిన్నర సంవత్సరం గడుస్తున్నా రాయలసీమలో ఏళ్ల తరబడి నిర్మాణపరంగా పెండింగులో వున్న ప్రాజెక్టులతో పాటు, తాజాగా ప్రతిపాదించిన పథకాల్లో కూడా పురోగతి లేదు. రూ.6828కోట్ల వ్యయంతో ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రకటించిన పోతురెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ విస్తరణకు చెందిన రెండు పథకాలు అంతర్ రాష్ట్ర వివాదంలో చిక్కుకున్నాయి. ఏ వివాదాలు లేకుండా శ్రీశైలంలో 800 అడుగుల నీటి మట్టం వున్నా నీళ్లు తీసుకొనే హంద్రీనీవా పథకం విస్తరణ గురించి ఎందుకు పట్టించుకోలేదో సమాధానం లేదు. ఆరు వేల క్యూసెక్కులు విడుదల సామర్థ్యంతో ప్రధాన కాలువ విస్తరించాలనే ప్రతిపాదనను 2019 అక్టోబరు నెలలో జలవనరుల శాఖ సమర్పించినా మూలకు నెట్టబడింది. రాయలసీమ ప్రాజెక్టులకు సంబంధించి రెండు మూడు అవరోధాలున్నాయి. ఒకటి, నిర్మాణంలో వున్న పథకాలకు లేదా ప్రతిపాదిత ప్రాజెక్టులకు నీటి కేటాయింపులు లేకపోవడం. రెండు, ట్రిబ్యునల్ అవార్డుల మేరకు కేటాయింపులు వున్న నికర జలాలు పూర్తిగా లభ్యంకాకపోవడం. మూడు, సాధ్యమైనంత వరకు పథకాలకు వివాదాలు లేకుండా చూచుకోవడంలో వైఫల్యం.


వాస్తవంలో కృష్ణానది (శ్రీశైలం జలాశయం) నుండి రాయలసీమకు నికర జలాల కేటాయింపులు లేవు. ఉమ్మడి రాష్ట్రంలో శ్రీశైలం కుడి కాలువకు ఇచ్చిన 19టియంసిలు తప్ప చుక్క నీరు లేదు. అది కూడా సీమకు చెందిన కెసి కెనాల్ ఆధునీకరణ ద్వారా లభ్యమైన 8 టియంసిలు, రీజనరేషన్‌తో లభ్యమైన 11 టియంసిలు కలిపి ఉమ్మడి రాష్ట్రంలో ఈ 19 టియంసిలు కేటాయించారు. తమ ముంగిట కృష్ణ నదికి వరద ముంచెత్తుతున్నా కళ్లప్పగించి చూడాల్సిన పరిస్థితి అనీ, చిరకాలంగా తాము మోసపోయామనీ సీమవాసులు ఆందోళన చేస్తున్నారు. సీమకు వున్న కేటాయింపులు అన్నీ కూడా తుంగభద్ర దాని ఉపనదులు వేదవతి హంద్రీ నుండే. తుంగభద్ర ఎగువ దిగువ కాలువల్లో మార్గమధ్యంలో కర్నాటక రైతుల జలచౌర్యానికితోడు, విడుదల చేసిన నీరు ఆంధ్ర సరిహద్దుల వద్దకు వచ్చేసరికి 50 శాతం కూడా ఉండటం లేదు. కొన్నాళ్ల నుండి తుంగభద్ర జలాశయం పూడికతో నిండిందని కేటాయింపులు చేసిన నీటిలోనూ కోత పెడుతున్నారు. భైరవాణి తిప్పకు ఎగువ భాగంలో కర్ణాటక వాణి విలాస్ జలాశయం నిర్మాణంతో భైరవాణి తిప్ప వట్టిపోయింది. ఈ దుర్మార్గాన్ని రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలోనికి వచ్చినా అరికట్టేందుకు కృషి చేయలేదు. ఇప్పుడు తాజాగా కర్ణాటక ప్రభుత్వం తుంగభద్ర జలాశయం పూడిక పేరు చెప్పి ఎగువ భాగంలో 30 టియంసిల నీటి నిల్వ సామర్థ్యంతో మరొక రిజర్వాయరును నిర్మించే సన్నాహాల్లో వుంది. ఇదే జరిగితే తుంగభద్ర నుండి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి వుండే నికర జలాల కేటాయింపులకు ఎసరు పెట్టినట్లే. ఈ రిజర్వాయర్ నిర్మాణం గురించి మీడియాలో వార్తలు వస్తున్నా రాష్ట్ర ప్రభుత్వం నుంచి స్పందన లేదు. 


మరో దురదృష్టం ఏమంటే దశాబ్దాలు గడచిపోతున్నా కెసి కెనాలుకు కేటాయించిన 39.90 టియంసిల నీటిని నిల్వ చేసుకొనేందుకు ఒక్క రిజర్వాయర్ కూడా నిర్మించకపోవటమే. తుంగభద్ర నదిపై సుంకేసుల వద్ద 1.20టియంసిల నీటి నిల్వ సామర్థ్యంతో బ్యారేజీ, 2.96 టియంసిల సామర్థ్యంతో అలగనూరు జలాశయం మాత్రం వున్నాయి. ప్రతి సంవత్సరమూ సుంకేసుల బ్యారేజీ నుండి 200 టియంసిలకు పైగా నీరు కృష్ణలో కలుస్తోంది. వాస్తవంలో బచావత్ ట్రిబ్యునలుగాని తుదకు బ్రిజేశ్ కుమార్ ట్రిబ్యునలుగాని తుంగభద్ర నుండి కృష్ణ నదికి 31.45 టియంసిల నీరు మాత్రమే రావాలని పేర్కొనగా, మిగిలిన నీరంతా రాయలసీమ వాసులు ఉపయోగించు కోవలసినదే. తుంగభద్ర దాని ఉపనదులు నుండి వచ్చే వందల టియంసిల వరద కృష్ణ బ్యారేజిని చేరి సముద్రం పాలవుతున్నది. మిగులు వరద జలాలు అటుంచగా కనీసం తుంగభద్ర నుండి సీమకు కేటాయింపులు వున్న నికర జలాలు కూడా అందుబాటులో లేకుండా పోవడం సీమ దుస్థితికి దర్పణంగా వుంది. ఈ అవరోధాలు తప్పించుకొనేందుకు తుంగభద్ర ఎగువ కాలువకు ప్రత్యామ్నాయంగా మరో కాలువ నిర్మించాలని సీమలో చిరకాలంగా ఒక డిమాండ్ వుంది. ఎన్ని ప్రభుత్వాలు మారినా ఈ డిమాండును పట్టించుకున్న ప్రభుత్వం లేదు. 


డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డి హయాం నుంచీ కెసి కెనాల్ ఆయకట్టు కోసం తుంగభద్ర నదిపై సుంకేసుల ఎగువభాగంలో గుండ్రేవుల రిజర్వాయరు నిర్మాణం (20 టియంసిల సామర్థ్యంతో) ప్రతిపాదన వున్నా అది ఇప్పటివరకు ముందుకు సాగలేదు. చంద్రబాబు నాయుడు అధికారం నుండి దిగిపోయే సమయంలో రూ.2900 కోట్ల ఖర్చుతో గుండ్రేవుల రిజర్వాయర్ నిర్మాణానికి, దానితోపాటు వేదవతిపై ఎత్తిపోతల పథకానికి పాలన ఆమోదం ఇచ్చారు. ప్రస్తుతం గుండ్రేవులతో పాటు వేదవతి పక్కకునెట్టబడింది. పైగా కృష్ణ యాజమాన్య బోర్డుకు ఏపీ ఇంజనీరింగ్ చీఫ్ లేఖ రాస్తూ గుండ్రేవుల రిజర్వాయర్ కొత్త పథకమని పేర్కొంటూ లేని తలనొప్పులు సృష్టించారు. బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ ఆర్డీయస్ కుడి కాలువకు నాలుగు టీఎంసీల నీటి కేటాయింపులు చేసి వుంది. ఈ పథకం జాడ కన్పించడం లేదు. పైగా సీమ వాసుల చిరకాల వాంఛ సిద్దేశ్వరం అలుగు ఈ పరిస్థితుల్లో కనుచూపు మేరలో లేదు. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కాగానే ఇవన్నీ వెంటనే కార్య రూపం దాల్చుతాయని సీమలో నమ్మినవారు ఎంతోమంది ఉన్నారు. గాని వారి ఆశలు ఆవిరి అవుతున్నాయి.


వైకాపా అధికారంలోనికి వచ్చిన తర్వాత కర్నూలు జలవనరుల శాఖ చీఫ్ ఇంజనీర్ ముఖ్యమంత్రి ఆదేశాలపై కొన్ని ప్రతిపాదనలు పంపారు. అందులో గుండ్రేవుల వేదవతి ఎల్లెల్సీ బైపాస్ పైపు లైన్ కాలువతో పాటు హంద్రీనీవా ప్రధాన కాలువ విస్తరణ లైనింగ్ ప్రతిపాదనలు వున్నాయి. మల్యాల నుండి జీడిపల్లి రిజర్వాయర్ వరకు ఆరువేల క్యూసెక్కుల తరలించే విధంగా 214 కిలోమీటర్ల లైనింగ్ చేస్తే కర్నూలు అనంతపురం జిల్లాలతోపాటు చిత్తూరు జిల్లాకు, పాక్షికంగా కడప జిల్లాకు సాగునీరు బేషుగ్గా అందించే అవకాశం ఉంది. శ్రీశైలంలో నీటి మట్టం 830 అడుగుల వరకు వున్నా మల్యాల నుండి 800 నీటి మట్టం వున్నా ముచ్చుమర్రి నుండి హంద్రీనీవాకు కృష్ణ జలాలు తరలించవచ్చు. కాని ఈ ప్రతిపాదనను పక్కన పెట్టేశారు. చిత్తూరు జిల్లాకు మరో అడ్డదారిలో నీరు ఇచ్చేందుకు గాలేరు నగరి హంద్రీనీవా అనుసంధానం తెరపైకి తెచ్చారు. ఈ ప్రతిపాదన రెండు మూడు విధాలుగా చిత్తూరు జిల్లాకు అపకారం చేస్తుంది. ఒకటి, శ్రీశైలం జలాశయం నీటి మట్టం 850 అడుగులకు పడిపోతే పోతురెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ నుండి నీటి తరలింపు ఆగిపోతుంది. అరకొరగా వచ్చే నీరు మార్గ మధ్యంలో వాడుకుంటారు. ఆ సమయంలో గండికోట మీద ఆధారపడాలి. నీటి ఎద్దడి రోజుల్లో గండికోట నుండి వచ్చే నీటికి మార్గ మధ్యంలో సవాలక్ష అడ్డంకులు వుంటాయి. అదే హంద్రీనీవా అయితే శ్రీశైలం నీటి మట్టం 800 అడుగులకు పడిపోయినా ఎత్తిపోతలు సాగించవచ్చు. రెండు, గాలేరు నగరి రెండవ దశకు నీటి కేటాయింపులు తగ్గిపోయి చిత్తూరు జిల్లాలోనే తగాదాకు ఆజ్యం పోసినట్లవుతుంది. మూడు, గాలేరు నగరి హంద్రీనీవా అనుసంధానంతో చిత్తూరు జిల్లాలోని కుప్పం వరకు నీళ్లు తరలించాలంటే హంద్రీనీవా పథకం ద్వారా ఎదురైన సమస్యలే విధిగా పునరావృత్తం అవుతాయి. 


వైకాపా పాలన మొదలు కాగానే చిత్తూరు జిల్లాకు చెందిన గాలేరు నగరి రెండవ దశ పథకానికి చెందిన కాంట్రాక్టు ఒప్పందాలు అన్నీ రద్దు చేశారు. పది టిఎంసిల సామర్థ్యంతో వుండే తిరుపతికి తాగునీరు అందించే బాలాజీ రిజర్వాయరుతో సహా ఏడు రిజర్వాయర్ల నిర్మాణం ప్రస్తుతం స్తంభించిపోయింది. రాయలసీమ జిల్లాల్లో కడపలో 81 టియంసిలు, అనంతపురంలో28.61 టియంసిలు, కర్నూలులో43.35 టియంసిలు నిల్వ సామర్థ్యం గల రిజర్వాయర్లు వుంటే చిత్తూరు జిల్లాలో కేవలం 5.21 టియంసిల నీరు నిల్వ చేయగల రిజర్వాయర్లు వున్నాయి. ఈ అన్యాయం సరిదిద్దేందుకు ఎవరు అధికారంలో వున్నా ఎట్టి ప్రయత్నాలు జరగలేదు. రాష్ట్ర ప్రభుత్వం ఒకవైపు పలు ఎత్తిపోతల పథకాలు, మధ్యతరహా రిజర్వాయర్ల నిర్మాణానికి తామరతంపరగా పరిపాలన అనుమతులు ఇస్తోంది. వీటికి బడ్జెట్‍లో కేటాయింపులు లేవు. అదలా వుంచుదాం. రాయలసీమలో బడ్జెట్ కేటాయింపులు వుండి నిర్మాణంలో వున్న భారీ పథకాల్లో కూడా పురోగతి లేదు. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి పదవి చేపట్టగానే రాయలసీమ కోనసీమ అయిపోతుందని భావించిన కొందరు ప్రస్తుతం మౌనమే భూషణమన్నట్టు మిన్నకుండగా, యువత మాత్రం పోరాటాలు తప్పవనే ధోరణిలో వున్నారు. 

వి. శంకరయ్య

విశ్రాంత పాత్రికేయులు

Updated Date - 2020-09-24T06:30:47+05:30 IST