‘వలస భారతం’లో విభిన్న కోణాలు

ABN , First Publish Date - 2020-06-18T05:58:46+05:30 IST

బిహార్, తూర్పు ఉత్తరప్రదేశ్, బెంగాల్, ఝార్ఖండ్, ఒడిశా, కొంతవరకు ఈశాన్య రాష్ట్రాలు కూడా వలస కార్మికులను సరఫరా చేసే కేంద్రాలుగా మిగిలిపోయాయి. ఈ వలస కూలీలను ఎక్కువగా ఆకర్షిస్తున్నవి మహారాష్ట్ర, గుజరాత్, తెలంగాణ, కర్ణాటక, కేరళ రాష్ట్రాలతోపాటు...

‘వలస భారతం’లో విభిన్న కోణాలు

బిహార్, తూర్పు ఉత్తరప్రదేశ్, బెంగాల్, ఝార్ఖండ్, ఒడిశా, కొంతవరకు ఈశాన్య రాష్ట్రాలు కూడా వలస కార్మికులను సరఫరా చేసే కేంద్రాలుగా మిగిలిపోయాయి. ఈ వలస కూలీలను ఎక్కువగా ఆకర్షిస్తున్నవి మహారాష్ట్ర, గుజరాత్, తెలంగాణ, కర్ణాటక, కేరళ రాష్ట్రాలతోపాటు రాజధాని ఢిల్లీ మహాపాలిత ప్రాంతం కూడా. ముంబయి మహానగరంలోనే వలస కార్మికులలో కనిపించే ట్రెండ్ ఏమిటంటే, వలసపోయిన బెంగాలీలు/బంగ్లాదేశీయులు ధనిక కాలనీల్లో తమ పేర్లు మార్చుకుని పనిమనుషులుగా, తోటమాలీలుగా పని చేస్తూంటారు. గుజరాతీయులు, రాజస్థానీయులు ఎక్కువగా వెజిటేరియన్ అవడం వలన వారి ఇండ్లలో వీరు తమ అసలైన పేర్లు చెబితే ముస్లింలు కాబట్టి ఉపాధి దొరకదు. అందువలన హిందూ పేర్లను చెప్పుకుంటారు. 


దేశంలో వున్న అందరు వలస కార్మికులను వారి వారి స్వరాష్ట్రాలకు 15 రోజుల్లోగా చేర్చాలని సుప్రీం కోర్టు ఆదేశించడంతో వలస కార్మికుల పై చర్చ మరోమారు మొదలైంది. భారత దేశ ముఖచిత్రాన్ని గమనించినట్లయితే ఆర్థికపరంగా దాన్ని మూడు భాగాలుగా విభజించవచ్చు. 1. పశ్చిమ–-ఉత్తర భారత దేశం 2. దక్షిణ భారత దేశం, 3. తూర్పు-–ఈశాన్య భారత దేశం. వలస కార్మికులు ఎక్కువమంది తూర్పు-–ఈశాన్య రాష్ట్రాల నుండే వివిధ రాష్ట్రాలకు ముఖ్యంగా పశ్చిమ, దక్షిణ భారత భాగాల వైపుకు చేరుకుంటున్నారు. మరీ ముఖ్యంగా బిహార్, తూర్పు ఉత్తర ప్రదేశ్, బెంగాల్, ఝార్ఖండ్, ఒడిశా, ఇంకా కొంతవరకు ఈశాన్య రాష్ట్రాలు కూడా (ముఖ్యంగా అసోం రాష్ట్రాలు) వలస కార్మికులను సరఫరా చేసే కేంద్రాలుగా మిగిలిపోయాయి. భాషా సారూప్యం, ముఖకవళికల సారూప్యం ఉండడం వలన బంగ్లాదేశ్ పౌరులు కూడా సరిహద్దులు దాటి భారత్‌లోకి ప్రవేశించి దేశంలోని వివిధ ప్రదేశాలకు వలస కూలీలుగా చేరగలుగుతున్నారు.

ఈ వలస కూలీలను ఎక్కువగా ఆకర్షిస్తున్న రాష్ట్రాలు: మహరాష్ట్ర, గుజరాత్, తెలంగాణ, కర్ణాటక, కేరళ రాష్ట్రాలు. ఇక రాజధాని ఢిల్లీ మహాపాలిత ప్రాంతాన్ని గూర్చి చెప్పనవసరం లేదు. దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి రాష్ట్రాల నుంచి వచ్చినవారు ఢిల్లీ, ఇంకా ముఖ్యంగా చుట్టుప్రక్కల మెట్రో పాలిటన్ ప్రాంతాల్లో వలసలుగా వచ్చి చేరుతున్నారు. షాదారా జిల్లాలో బిహార్ కాలనీ, ఈస్ట్ యూపీ కాలనీలు ఉండడం విశేషం. న్యూఢిల్లీ మహానగరంలో కూడా ఆయా హోటళ్ళలోనూ, రెస్టారెంట్లలోనూ, మెస్సులలోనూ, రిక్షా కార్మికులుగానూ తూర్పు యూపీ వాసులు, బిహార్ వాసులు ఉండటం గమనార్హం. కానీ దురదృష్టవశాత్తూ, ఢిల్లీ రాజధాని నగరమే కానీ, ఉపాధి అవకాశాలు మెండుగా లేవు. ఏదో ఒక పని చేసుకుని పొట్టగడుపు కోవడానికి మాత్రమే ఢిల్లీ ఉపయోగపడ్తోంది. అందువల్లనే ఢిల్లీ కేవలం పక్కా నిరక్షరాస్యులు, స్వంత గ్రామాలకు దగ్గరగా ఉండాలనుకునే వలస కార్మికులకు కేంద్రంగా ఉంటోంది. 

హిందీ భాషే కాకుండా ఎంతోకొంత వేరే భాషలు కూడా మాట్లాడగలిగి ఇతర ప్రాంతీయులతో సర్దుబాటు స్వభావం కలిగి ఉన్నవారు, కొంత దూరమైనా స్వగ్రామాల్ని విడిచి ఉండగలమన్న ధైర్యం గలిగినవారు, ఎంతోకొంత ఫైనాన్షియల్ ఏంబిషన్ ఉన్న తూర్పు యూపీయులు, బిహారీలు ఆర్థిక రాజధాని అయిన ముంబయి బాట పట్టారు. వీరు ఇక్కడ ఎక్కువగా ఆటో రిక్షాలు, టాక్సీలు నడుపుతూ ఉంటారు. అపార్ట్‌మెంట్ సెక్యూరిటీ గార్డులుగానూ, అనార్గనైజ్డ్ సెక్టర్‌లో కార్మికులుగానూ ఉంటారు. 
స్వతంత్ర్యోద్యమ కాలం నాటి నుంచి పంజాబీయులు విదేశాలకు వెళ్ళే స్వభావం కల్గియున్నారు. పంజాబ్ ప్రాంతం వారు దేశ విదేశాలకు వలస వెళ్ళడం వలన గ్రీన్ రివల్యూషన్ తర్వాత ఏర్పడిన హెక్టార్లకు హెక్టార్లకు మించిన కమతాలు ఖాళీగా పడిఉంటున్నాయి. దీనిని ఛేదించడానికి ముఖ్యంగా బిహారీ కార్మికులను ఆకర్షిస్తున్నారు. ఇప్పుడు పంజాబ్‍లో పొలాల యజమానులు పంజాబీలేగానీ అక్కడ వ్యవసాయ కార్మికులుగా, మేస్త్రీలుగా, సూపర్‌వైజర్లుగా, డ్రైవర్లుగా నిజమైన సాగును చేస్తున్నవారు బిహారీలు. వీరికీ వారికీ వివాహ సంబంధాలు కూడా కలుస్తున్నట్లు వినికిడి. కానీ ఇక్కడ ఆశ్చర్యం గొలిపే విషయమేమిటంటే దేశ విభజన జరిగిన పిదప పాకిస్థాన్ ప్రాంతంలోని పంజాబ్ నుండి వచ్చి ఢిల్లీలో క్యాంప్‌లలో ఉంటున్న నిరుపేద సిక్కులు మాత్రం నేటికీ ఢిల్లీ నగరంలో టాక్సీ, ఆటో డ్రైవర్లుగా చిన్నచిన్న పనుల్లోనే కాలాన్ని వెళ్ళదీస్తున్నారు. 

ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు సరియైన పనితీరు కనబరచకపోవడం, రాష్ట్రాల మౌలిక స్వభావం, సరియైన ఉపాధి అవకాశాలు లేకపోవడమే ఈ రాష్ట్రాల ప్రజలు వలస కార్మికులుగా మారేందుకు దోహదం చేస్తున్నాయి. తూర్పు యూపీ, బిహార్ నుండి వలస కార్మికులుగా వచ్చేవారు అన్ని సామాజిక వర్గాలకు చెందినవారై ఉంటారు. అందువలన ముఖ్యంగా వలస కార్మికులయినప్పటికీ అగ్రవర్ణాల వారు బేరసారాలు చేయగలిగి తమ ఆర్థిక హక్కులను ఎంతోకొంత కాపాడుకోగలిగే స్థితిలోనే ఉండేవారు. అంతేగాక వారు ఏ రాష్ట్రానికి వలస వెళ్ళినా పైసామాజిక స్థాయి వలన వచ్చే మానసిక స్వావలంబన (psychological self-confidence)కు తోడు ఆయా రాష్ట్రాలలో ఉండే ఐఎఎస్, ఐపిఎస్/ ఇతర ఉన్నత అధికారుల ఇండైరెక్ట్/ ఇన్ఫార్మల్ తోడ్పాటు వారికి ఎంతోకొంత సాంత్వన కలిగిస్తూ ఉంటాయి. 

ఇదిలా ఉండగా బెంగాల్ (బంగ్లాదేశ్‌తో సహా), ఒడిషా, ఝార్ఖండ్, చత్తీస్‌గడ్‌ల నుండి వస్తున్న కార్మికుల వలసల స్వభావం తీరుతెన్నులు విభిన్నంగా ఉన్నాయి. 1911 తర్వాత దేశ రాజధాని కలకత్తా నుండి ఢిల్లీకి మార్చడం జరిగింది. అప్పటివరకూ మొత్తం తూర్పు రాష్ట్రాలకు విద్య, ఉద్యోగ, ఉపాధి, వ్యాపార విషయాల్లో కేంద్ర బిందువుగా వున్న కలకత్తా నగరం క్రమేణా ప్రాభవాన్ని కొల్పోతూ వచ్చింది. వామపక్ష భావజాలం ఊపందుకోవడం, స్వతంత్ర ఉద్యమ కాలంలో రివల్యూషనరీ టెర్రరిస్టులకు కేంద్రంగా ఉండటం వల్లనూ, ఆ తర్వాత కాలంలో 1967లో నక్సలైట్ ఉద్యమం బలపడటం వల్లనూ.. అక్కడి మిల్లులు, ఫ్యాక్టరీలు క్రమంగా బొంబాయి నగరానికి తరలింపబడ్డాయి. నిరసనలు, ధర్నాలు, లాకౌట్లు, ఘొరావ్‍లతో పారిశ్రామిక లక్షణాలు కోల్పోయిన కలకత్తా కేవలం కొన్ని జనపనార మిల్లులు, టీ గార్డెన్‌లకే పరిమితమైంది. ఉపాధి అవకాశాలు కోల్పోయిన బెంగాలీయులు, ఒడిషా ప్రజలు, ఝార్ఖండ్ రాష్ట్రీయులు (ముక్తసరిగా చెప్పాలంటే ఒకప్పటి బ్రిటిష్ బెంగాల్ రాష్ట్రం) కోల్‌కత్తా నగరాన్ని వదిలి మహారాష్ట్ర, గుజరాత్, కేరళ, కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాలకు వలస కార్మికులుగా వెళ్ళారు. వీరి పరిస్థితి కేవలం కేరళ రాష్ట్రంలో మాత్రమే మెరుగ్గా కనిపిస్తోంది. 

కేరళలో ప్రతీ ఇంట్లో ఒక్కరు ఏదో ఒక విదేశాల్లో ఉంటారు. ఆర్థిక స్వావలంబన ఎక్కువ. పైగా సోషల్ ఇండికేటర్స్‌లో హెచ్చుస్థాయిలో ఉండడం వలన తమ పొలాల్లో తోటల్లో కూలీలుగా పని చేయడానికి ఇష్టపడరు. ముఖ్యంగా అభివృద్ధి చెందిన కొట్టాయం, ఇడుక్కి లాంటి జిల్లాల్లో ఇఎంఎఫ్ నంబూద్రిపాద్ నాయకత్వంలోని కమ్యూనిస్టు పాలనలో ప్రతి కుటుంబానికి రెండు మూడు ఎకరాల భూమి ఇవ్వడం జరిగింది. రబ్బరు బోర్డు, కామర్ బోర్డు ఏర్పాటు వలన వారి పంటలకు కనీస మద్దతు ధర ఎప్పటికీ గ్యారంటీ. అందువలన వారు తమ కమతాల్లో స్వయంగా పని చేయకుండా బెంగాలీ, ఒడిషా, తమిళ కూలీల చేత పని చేయిస్తూ అజమాయిషీ చేస్తుంటారు. కూలీలు యజమానులు కేటాయించిన గదుల్లో లేదా దగ్గరలోని పట్టణంలోని గదిలో గానీ అద్దెకు దిగుతారు. విశాలంగా ఉన్న కాల్వల్లో సాయంత్రం పని వేళలు అయిపోయిన తర్వాత చేపలు పట్టుకొని చక్కని ఆహారం భుజిస్తారు. ఇక్కడ కార్మికులుగా వలస వచ్చిన బెంగాలీయులు వ్యక్తిగతంగా కాకుండా ఏదో ఒక కాంట్రాక్టర్ ఆధ్వర్యంలో వస్తారు. కాంట్రాక్టర్ అజమాయిషీ, కమీషన్‌లు వారి మీద షరా మామూలే. 

కేరళ మినహాయించి మిగతా రాష్ట్రాలలోకి వస్తున్న ఒడిషా, ఝార్ఖండ్, ఛత్తీస్‌గఢ్ కార్మికులను వెట్టి పనివారుగా మాత్రమే పరిగణింపవచ్చు. కరువు పీడిత ప్రాంతాలు, అటవీ ప్రాంతాలు, కొండ ప్రాంతాల నుంచి ఎక్కువగా ఆదివాసీలు ఈ రాష్ట్రాల నుంచి కార్మికులుగా పశ్చిమ, దక్షిణ భారత దేశం వైపు వలసలుగా వస్తుంటారు. ఒడిషాలోని దుర్భిక్ష ప్రాంతాల్లో MGNREGA పనులు అయిపోయిన తర్వాత కుటుంబాలు కుటుంబాలుగా ఇళ్లకు తాళం వేసి వలసగా వెళ్తారు. కొన్ని చోట్ల గ్రామాలు గ్రామాలే ఈ విధంగా ఖాళీ అవుతాయి. సంవత్సరం మొత్తానికి ఒక కుటుంబాన్ని కేవలం 50వేల రూపాయలకే కాంట్రాక్టర్లు మాట్లాడుకొని తీసుకుని వెళ్తారు. ఎక్కువగా ఒడిషా, ఝార్ఖండ్ ఆదివాసీలు ఇటుక బట్టీలలో వెట్టి కార్మికులుగా, తారు తోడ్లు వేసే పనుల్లో కూలీలుగా, కేబుల్ వైర్లు వేసే రోడ్డు తవ్వే పనుల్లో కార్మికులుగా, భవన నిర్మాణ పనుల్లో కార్మికులుగా ఉంటున్నారు. ఈ పనుల కోసం వీరిని నియమించిన యజమానులు, కాంట్రాక్టర్లు వీరి మీద ఏ మాత్రం కనికరం చూపరు. మానవ మాత్రులుగా చూడరు. లెట్రిన్లు, బాత్రూంలు ఉండవు. వీరి పిల్లలకు బడులకు వెళ్ళే అవకాశం ఉండదు. పాలు తాగే పిల్లలను దగ్గర్లో పడుకోబెట్టుకొని తల్లులు పనులు కొనసాగిస్తూ ఉంటారు. స్త్రీలు బహిరంగ ప్రదేశాల్లోనే బహిర్భూమికి వెళ్ళాలి. స్నానానికి పేరుకు నాలుగు రేకులు అడ్డంగా ఉండే బాత్రూం ఉంటుంది.

కేవలం ఒడిషా, ఝార్ఖండ్ ఆదివాసీ స్త్రీలు మాత్రమే వలస వచ్చి ఇండ్లలో 24 గంటల పనిమనుషులుగా ఉండే వలస విధానం ముంబయి, ఢిల్లీ మహానగరాల్లో మనం గమనించవచ్చు. వీరిని బెంగాల్‌కు చెందిన ఆయా కాంట్రాక్టర్లు తీసుకువచ్చి నగరంలోని ఆయా ఇళ్ళలో నియమిస్తూ ఉంటారు. సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే యజమానులు వీరిని స్వగ్రామాలకు అనుమతిస్తారు. యజమానులు తమతోపాటు వీరిని షాపింగ్ మాల్స్, హోటల్స్‌కు కూడా తీసుకువెళ్తారు. ఇటుకబట్టీలు, రోడ్ల మీద భవన నిర్మాణాల దగ్గర పని చేసే వారికన్నా వీరు మెరుగైన జీతాలతో సౌకర్యవంతంగానే నివసిస్తారు. వచ్చిన చిక్కల్లా ఏంటంటే వీరు తమ తల్లిదండ్రులను, పిల్లలను వదిలి కేవలం ఒంటరిగా మాత్రమే యజమానులతో కలిసి నివసించాలి. ఈ అన్ని రకాలైన వలస కార్మికులకు ఎక్కడా కూడా మినిమమ్ వేజెస్ ఏక్ట్ అన్న స్పృహ ఉండదు. 

ముంబయి మహానగరంలోనే వలస కార్మికులలో కనిపించే మరో ట్రెండ్ ఏమిటంటే, బెంగాలీలు/బంగ్లాదేశీయులు ధనిక కాలనీల్లో పేర్లు మార్చుకుని పనిమనుషులుగా, తోటమాలీలుగా పని చేస్తూంటారు. గుజరాతీయులు, రాజస్థానీయులు ఎక్కువగా వెజిటేరియన్ అవడం వలన వారి ఇండ్లలో వీరు తమ అసలైన పేర్లు బహిరంగం చేస్తే ముస్లింలు కాబట్టి వీరికి ఉపాధి దొరకదు. అందువలన హిందూ పేర్లను బయటకు తమ పేర్లుగా చెప్పుకుంటారు. 

ఆవిధంగా బెంగాల్, ఒడిషా, ఝార్ఖండ్ ప్రాంతాల నుంచి వచ్చిన వలస కార్మికులు సామాజికంగా అట్టడుగు స్థాయి వారు అయి వుండడం వలన ఆర్థికంగా సామాజికంగా శారీరకంగా యజమానుల చేత, ఏజెంట్ల చేతిలో దోపిడీకి గురి అవుతూ ఉంటారు. 
నేలపట్ల అశోక్ బాబు

Updated Date - 2020-06-18T05:58:46+05:30 IST