ధన్యవాదాలు

ABN , First Publish Date - 2020-12-07T06:09:58+05:30 IST

అక్షరాల్లాటి మిత్రులకు అంకెల్లాటి శత్రువులకు ఆమని సొగసుల ఆత్మీయులకు...

ధన్యవాదాలు

అక్షరాల్లాటి మిత్రులకు

అంకెల్లాటి శత్రువులకు

ఆమని సొగసుల ఆత్మీయులకు

దుష్టసమాసాల బంధువులకు

అందరికీ ధన్యవాదాలు

పంచదారపూతల తీయని తేనెల పలుకుల వెనక

ప్రయోజనాల బంగారు జింకల ఉనికిని

తేటతెల్లం చేసినందుకు వేలవేల కృతజ్ఞతల మందారాలు

కటిక చీకటి రంగొక్కటే నిండినపుడు

చూపించిన రంగుల చిత్రాల వెనక

అసలు సిసలు వంచనాశిల్పం బండారం బయటపడినా

ఏమీ ఫరవాలేదు

ఎండిన అంతరంగం మొద్దు

ఎంత రంపపు కోతకు గురైనా

గట్టితనాన్ని సంతరించుకొన్నందుకు

దిగులు బురదలోనే

తిన్నగా నిలచి పైకి చూచే ఆత్మగౌరవం 

    తామర పువ్వైనందుకు

చిత్తరువులో అతికించిన ఆకులా

చిరునవ్వు చిగురాకు ఎడద కొమ్మ నుంచి రాలనందుకు

గాయాల కవ్వం మథిస్తున్న కొద్దీ

కవిత్వం చెలికానికి ఇంకా ఇంకా దగ్గర చేస్తున్నందుకు

బహుత్‌ షుక్రియా!

మందరపు హైమవతి


Updated Date - 2020-12-07T06:09:58+05:30 IST