పోలీసు నేరాలకు డిపార్టుమెంటల్ ఎంక్వయిరీ చాలదు

ABN , First Publish Date - 2020-07-28T06:05:06+05:30 IST

ప్రతి నేరానికి ఇండియన్ పీనల్ కోడ్‌లో ఒక సెక్షన్ ఉంది. వాటిని ఎట్లా విచారించాలన్నది క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ చెప్తుంది. ‘‘చట్టం ముందు అందరూ సమానులే’’ అని భారత...

పోలీసు నేరాలకు డిపార్టుమెంటల్ ఎంక్వయిరీ చాలదు

ప్రతి నేరానికి ఇండియన్ పీనల్ కోడ్‌లో ఒక సెక్షన్ ఉంది. వాటిని ఎట్లా విచారించాలన్నది క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ చెప్తుంది. ‘‘చట్టం ముందు అందరూ సమానులే’’ అని భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 14 చెబుతుంది. కానీ, పోలీసులు సివిలియన్స్ మీద జరిపే నేరాలకు మాత్రం శిక్షలు పడకుండా తప్పించుకుంటున్నారు. వారిని దగ్గరలోని ఎస్పీ ఆఫీసుకో, కమిషనరేట్‌కో అటాచ్ చేసి వొదిలేస్తున్నారు. ప్రజాగ్రహం వస్తే సస్పెండ్ చేసి చేతులు దులుపుకుంటున్నారు. ఇప్పుడు తాజాగా చీరాల పోలీసుల దెబ్బలకు దళిత యువకుడు మృతిచెందాడు. ఆ ఎస్సైని విఆర్‌‍కి పిలిచామని ప్రకాశం ఎస్పీ చెప్పారు. అంతేగాక ఆ ఘటనపై విచారణ జరుపుతున్నామని, దానికి విచారణ అధికారులుగా గుంటూరు ఏఎస్పీ, డీఎస్పీలను నియమించామని చెప్పారు. ఇదేగాక తూర్పుగోదావరి జిల్లా సీతారాంపురంలో స్థానిక వైసిపి నేత ఫిర్యాదు మేరకు దళితుడిని అరెస్టు చేసి, కస్టడీలో చిత్రహింసలు పెట్టి, శిరోముండనం చేశారు. ఈ కేసులో ఎస్సైని సస్పెండ్ చేశారు.


కేవలం సస్పెండ్ చేయడం, లేదా బదిలీ చేయడం శిక్ష అవ్వదు. అదే శిక్ష అని పోలీసు వ్యవస్థ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నమ్మితే వాటికో ప్రశ్న ‘‘ఎవరైనా సివిలియన్ పోలీసులను చంపితే వారికి వేయాల్సింది నగర బహిష్కరణ తప్ప, క్రిమినల్ కేసు ప్రకారం ఎఫ్ఐఆర్ కాదు’’ అని ఎవరైనా అంటే ఏం చెప్తారు. మావోయిస్టు పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడు ఆజాద్ ఎన్కౌంటర్ కేసు విచారణలో ఉండగా, పోలీసుల తరఫు న్యాయవాది వాదిస్తూ ‘‘సీబీఐ ఈ ఎన్కౌంటర్ విషయంలో క్లీన్ చిట్ ఇచ్చింది’’ అని అన్నాడు. ‘‘విచారణ జరిపి తీర్పు ఇవ్వాల్సింది కోర్టు కానీ, సీబీఐ కాదు’’ అని చెప్పి ఆ ఎన్కౌంటర్‌లో పాల్గొన్న పోలీసుల మీద హత్యానేరం కింద కేసు నమోదు చేయాలని ఆదిలాబాద్ అదనపు సెషన్స్ కోర్టు చెప్పింది. ఈ విషయం మీద అందరికన్నా ఎక్కువ క్లారిటీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికే ఉండాలి. ఎందుకంటే సీబీఐ రిపోర్ట్ అంతిమం అనుకున్నట్లయితే అతను ఇప్పటికీ జైల్లోనే ఉండేవాడు. ఈ సీబీఐ ప్రస్తావన ఎందుకంటే ఎవరికైనా వారికి అర్థమయ్యే భాషలోనే చెప్పాలి కాబట్టి. చీరాల ఎస్సై బదిలీ వ్యవహారం కూడా అట్లాగే ఉంది కాబట్టి. ఇప్పటికైనా వారిమీద కేసులు నమోదు చేసి కోర్టులో కేసు నడపాలి. ఆ పోలీసులు దోషులు అవుతారా కాదా, అన్నది తేల్చాల్సింది కోర్టులే తప్ప పోలీసు వ్యవస్థ కాదు. డిపార్టుమెంటల్ ఎంక్వయిరీ అంతిమ తీర్పు కాదు. 

అరుణాంక్ లత

Updated Date - 2020-07-28T06:05:06+05:30 IST