దళిత పక్షపాతి- ఎవరు, ద్రోహి ఎవరు?
ABN , First Publish Date - 2020-09-03T08:17:41+05:30 IST
ఆంధ్రప్రదేశ్‌లో వై.ఎస్.ఆర్.సి.పి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఈ 15 నెలల కాలంలో వివిధ జిల్లాల్లో దళితులు, గిరిజనులపై 60కి పైగా దాడులు జరిగాయి...

జగన్ మోహన్ రెడ్డి అధికారంలోకి రావడానికి ప్రధాన కారకులైన దళితులకు, గిరిజనులకు ఆయన ఇచ్చిన బహుమానం వారానికి ఒక దాడి, ఒక అత్యాచారం, కుల వివక్షా ఘటన. తన పదిహేను నెలల పాలనలో 2 శిరోముండనాలు, 60 దాడులతో జగన్ రెడ్డి దళితులపై దమనకాండ కొనసాగిస్తున్నారు. దళితులకు ప్రభుత్వమే శిరోముండనం చేయించి, కొట్టి చంపేస్తుంటే బయట రక్షణ ఏముంటుంది? దళిత యువకుడు శ్రీకాంత్‌కి శిరోముండనం ఘటనకి సంబంధించి పోలీసులు వెంటనే స్పందించి ఆధారాలు సేకరించడంతో పాటు, నిందితులను అరెస్ట్ చేశారు. కానీ వై.ఎస్.ఆర్.సి.పి నాయకుల ప్రోద్బలంతో దళితులపై జరిగిన దాడుల్లో అదే వేగంతో విచారణ, అరెస్టులు, ఆధారాల సేకరణ ఎందుకు జరగడం లేదనే ప్రశ్న ఇప్పుడు చర్చనీయాంశం.
ఆంధ్రప్రదేశ్‌లో వై.ఎస్.ఆర్.సి.పి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఈ 15 నెలల కాలంలో వివిధ జిల్లాల్లో దళితులు, గిరిజనులపై 60కి పైగా దాడులు జరిగాయి. అంటే వారానికి ఒక్క దాడి చొప్పున జరిగింది. ఇవిగాక మీడియా, ప్రజాసంఘాలు, రాజ కీయ పార్టీల దృష్టికిరాని సంఘటనలు ఇంకా చాలా ఉన్నాయి. వై.ఎస్. ఆర్.సి.పి ప్రభుత్వం 2019 మే 30న అధికారం చేపట్టిన వెంటనే పల్నాడు ప్రాంతంలో ఆత్మకూరు తదితర గ్రామాల నుంచి వేలాదిమంది దళితులపై దాడులు చేసి వారిని వారి స్వగ్రామాల నుంచి తరిమివేసి నిలువనీడ లేకుండా చేయడంతో ప్రారంభమైన దమనకాండ ఇప్పటిదాకా కొనసాగుతూనే ఉంది. దేశంలో ఎక్కడైనా పోలీస్ స్టేషన్లో దళితులకు శిరోముండనం జరిగిందా? ఆ బాధితుడు రాష్ట్ర ప్రభుత్వం తనకు న్యాయం చేయడం లేదని, నక్సలైట్లలో కలవడానికి అనుమతి ఇవ్వాలని రాష్ట్రపతిని కోరిన ఘటన లాంటిది ఇంతకుముందెన్నడయినా జరిగిందా? ఈ ఘనత జగన్మోహన్ రెడ్డి గారి పాలనకే దక్కుతుంది. జగన్ మోహన్ రెడ్డి అధికారంలోకి రావడానికి ప్రధాన కారకులైన దళితులకు, గిరిజనులకు ఆయన ఇచ్చిన బహుమానం వారానికి ఒక దాడి, ఒక అత్యాచారం, కుల వివక్షా ఘటన.
రాష్ట్ర కేబినెట్ మంత్రి పెద్దిరెడ్డి రాంచంద్రారెడ్డి దళిత డాక్టర్‌ను, న్యాయ మూర్తిని వాడో పిచ్చోడు, వీడో పిచ్చోడు అంటూ మాట్లాడి అవమానపరిస్తే ఆయనపై ఫిర్యాదు చేసినా ప్రభుత్వం స్పందించడం లేదు. ఒక దళిత న్యాయమూర్తికి చెందిన భూమిని కూడా కబ్జా చేసేందుకు మంత్రి అండతో దౌర్జన్యం సాగిస్తున్న సంఘటనలు చిత్తూరు జిల్లాలో జరుగుతున్నాయి. ఆంధ్రా యూనివర్సిటీలో కుల వివక్షకు వ్యతిరేకంగా పోరాటం చేసినందుకు, దళిత విద్యార్థి, రీసెర్చ్ స్కాలర్ ఆరేటి మహేష్‌పై ఉపకులపతి కక్ష సాధింపు చర్యలకు దిగడం ఈ ప్రభుత్వ దళిత వ్యతిరేక విధానాలకు నిదర్శనం.
కరోనాపై పోరాటం చేస్తున్న డాక్టర్లకు మాస్కులు, పీపీఈ కిట్లు ఇవ్వాలని కోరిన డాక్టర్ సుధాకర్‌ను సస్పెండ్ చేసి, కేసు కూడా నమోదు చేయడమే కాకుండా విశాఖపట్టణంలో నడిరోడ్డు పైన ట్రాఫిక్‌కు అంతరాయం కలిగిస్తున్నాడనే నెపంతో పోలీసులు చితకబాది, పిచ్చివాడిగా ముద్రవేసి పిచ్చాసుపత్రిలో చేర్చారు. చిత్తూరు జిల్లా వెలమలూరు ప్రాంతీయ ప్రభుత్వ వైద్యురాలు అనితారాణి బాత్రూంకు వెళ్లి బట్టలు మార్చుకుంటుంటే వీడియోలు తీసి వై.ఎస్.ఆర్.సి.పి నేతలు ఆమెను వేధింపులకు గురిచేశారు. మాస్కు పెట్టుకోలేదనే కారణంతో చీరాల పట్టణంలో థామస్ పేటకు చెందిన దళిత యువకుడు కిరణ్‌ను పోలీసులు చితకబాది, ఆయనను పొట్టన పెట్టుకున్నారు. చంపడమే కాకుండా ఈ అంశాన్ని వివాదం చేయొద్దని వైఎస్ఆర్సిపి కి చెందిన కొంతమంది నాయకులు ఆ కుటుంబానికి డబ్బు ఆశ చూపడం అత్యంత హేయమైన చర్య. నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గంలోని వరికుంటపాడు తహసీల్దారు శ్రీనివాసులు తమకు అనుకూలంగా రికార్డులు మార్చలేదని వై.ఎస్.ఆర్.సి.పి నాయకులు ఆయనపై కార్యాలయంలోనే దాడి చేశారు. కులం పేరుతో దూషించి ఫైళ్ళు లాక్కుని చించేశారు. గురజాలలో దళిత యువకుడు విక్రమ్‌ను వైసీపీ నాయకులు హత్య చేస్తే స్థానిక పోలీసులు ఇప్పటి వరకు నేరస్థులపై కేసులు నమోదు చేయకుండా వారికి అండగా నిలబడుతున్నారు. వైసీపీకి చెందిన ఎంపీ చేసిన మోసానికి ఆ పార్టీ మాలమహానాడు అధ్యక్షురాలు శ్రీమతి జోనికుమారి ఆత్మహత్య చేసుకునే పరిస్థితి కల్పించారు. పదేళ్ళు ఎంపీగా ఉండి అనేక దళితోద్యమాలు నిర్వహించిన జీ.వీ. హర్షకుమార్‌పై తప్పుడు కేసులు నమోదు చేసి 48 రోజుల పాటు జైల్లో బంధించారు.
వైఎస్ఆర్సీపీ నేతల భూదాహానికి దళితులు, గిరిజనులు బలైపోతున్నారు. ఎస్సీ, ఎస్టీల అసైన్డ్ భూములను పేదలకు ఇళ్ళపట్టాల పంపిణీ పేరిట ప్రభుత్వం బలవంతంగా లాక్కుంటోంది. 1989 ఎస్సీ, ఎస్టీ అత్యాచారాల నిరోధక చట్టం (2015 సవరణ ప్రకారం) ప్రకారం ఎస్సీ, ఎస్టీలకు చెందిన భూములను బలవంతంగా కానీ ప్రలోభాలతో కానీ లాక్కోవడం చట్టరీత్యా నేరం, శిక్షార్హం. అయినా రాష్ట్ర ప్రభుత్వం ఈ నేరం చేయడానికి వెనుకాడటంలేదు. ఇలా అసైన్డ్ భూములు లాక్కోవద్దన్న మహాసేన రాజేశ్‌పై అక్రమ కేసులు బనాయించారు.
జగన్ రెడ్డి సర్కార్ ఓటేసిన వారినే కాటేస్తోంది. అందుకు తాజా ఉదాహరణ చిత్తూరు జిల్లా, పుంగనూరు నియోజకవర్గం, సోమాల మండలం, కందూరు గ్రామానికి చెందిన దళిత యువకుడు ఓం ప్రతాప్ హత్య. మద్యపాన నిషేధం పేరుతో జరుగుతున్న నిషా దందా విలువ 25 వేల కోట్లు. ఆ విషయాన్ని బయటపెట్టి సామాజిక మాధ్యమాల్లో లిక్కర్ మాఫియా గురించి మాట్లాడాడనే అక్కసుతో వెంటాడి, వేధించి, బెదిరించి ఓం ప్రతాప్‌ని చంపేశారు. స్వయంగా జిల్లా మంత్రి, ఎంపీ ఈ ఘటనలో భాగస్వాములయ్యారంటే వైకాపా ప్రభుత్వానికి దళితులపై కక్ష ఏ స్థాయిలో ఉందో అర్థం అవుతోంది.
దళితులకు ప్రభుత్వమే శిరోముండనం చేయించి, కొట్టి చంపేస్తుంటే బయట రక్షణ ఏముంటుంది? అలాంటి ఘటనే తాజగా విశాఖ జిల్లా పెందుర్తిలో జరిగింది. దళిత యువకుడు శ్రీకాంత్‌కి శిరోముండనం చేసి ఘోరంగా అవమానించారు. ఈ ఘటనకి సంబంధించి పోలీసులు వెంటనే స్పందించి ఆధారాలు సేకరించడంతో పాటు, నిందితులను అరెస్ట్ చేశారు. వారిని అభినందించాలి. కానీ వై.ఎస్.ఆర్.సి.పి నాయకుల ప్రోద్బలంతో దళితులపై జరిగిన దాడుల్లో అదే వేగంతో విచారణ, అరెస్టులు, ఆధారాల సేకరణ ఎందుకు జరగడం లేదనే ప్రశ్న ఇప్పుడు చర్చనీయాంశం. దళిత యువకుడు వరప్రసాద్‌కి శిరోముండనం జరిగితే ఇప్పటివరకూ అతనికి న్యాయం జరగలేదు. కిరణ్ ను పోలీస్ స్టేషనులోనే హత్య చేశారు. కిరణ్ కుటుంబం న్యాయంకోసం ఎదురుచూస్తూనే ఉంది. వై.ఎస్.ఆర్.సి.పి దళితులపై దాడి చేస్తే అది వీధి గొడవ అని, దానికి ప్రతిపక్షాలు అనవసర రాద్ధాంతం చేస్తున్నాయి అని అనడం ఆ పార్టీ నేతల అహంకార ధోరణికి అద్దం పడుతోంది. గతంలో జరిగిన దాడుల విషయంలో ప్రభుత్వం వేగంగా స్పందించి నిందితులను శిక్షించి ఉంటే తాజాగా దళిత యువకుడు శ్రీకాంత్ శిరోముండనం ఘటన జరిగి ఉండేది కాదు. 15 నెలల పాలనలో 2 శిరోముండనాలు, 60 దాడులతో జగన్ రెడ్డి దళితులపై దమనకాండ కొనసాగిస్తున్నారు.
2014 నుంచి 2019 వరకు చంద్రబాబు నాయుడు సారథ్యంలోని తెలుగుదేశం పార్టీ హయాంలో దళితులకు ఏయే సంక్షేమ కార్యక్రమాలు చేపట్టారో, 2019 నుంచి ఈ 14 నెలల కాలంలో వైఎస్ జగ న్మోహన్రెడ్డి ఏయే సంక్షేమ కార్యక్రమాలు చేపట్టారో అన్నది పరిశీలిస్తే ఎవరు దళితపక్షమో నిగ్గు తేలుతుంది.
టీడీపీ సర్కారు హయాంలో 2018–-19లో ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ కింద దళితుల సంక్షేమం కోసం దాదాపు 9000 కోట్ల రూపాయలు ఖర్చు చేసి అనేక కార్యక్రమాలు చేపట్టింది. 2019–-20లో ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్‌కు 15000 కోట్ల రూపాయలు కేటాయించిన వై.ఎస్.ఆర్.సి.పి ప్రభుత్వం అందులో కేవలం రూ.4700 కోట్లను మాత్రమే ఖర్చు చేసింది. వృద్ధాప్య పింఛన్లు, అమ్మ ఒడి, రైతు భరోసా లాంటి పథకాలకు చేసిన ఖర్చును ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ కింద ఖర్చు చేసినట్లుగా చూపి దళితులను నిట్టనిలువునా మోసగిస్తోంది. చట్టం ప్రకారం ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ నిధులను ఇతర కార్యక్రమాలకు వినియోగించకూడదు. అయితే, ఇదేమీ పట్టకుండా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఈ నిధులను దారి మళ్లిస్తూ చట్టవ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడుతోంది.
టీడీపీ హయాంలో ఎస్సీ కార్పొరేషన్ ద్వారా 60 శాతం సబ్సిడీతో స్వయం ఉపాధి పథకం కింద ఏటా 400 కోట్ల రూపాయలు దళితుల సంక్షేమానికి కేటాయించింది. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఆ పథకాన్ని రద్దు చేసింది. ఎస్సీ, ఎస్టీ విద్యార్థుల విదేశీ చదువులకు ప్రోత్సాహం అందించే పథకాన్ని నిలిపివేసింది. దళితుల పొలాల్లో బోర్లు, పంపుసెట్ల సరఫరాకు నిధుల కేటాయింపులు లేవు. ఉద్యోగావకాశాల కోసం ఏర్పాటు చేసిన శిక్షణా కేంద్రాలు మూతపడ్డాయి. ఎస్సీ, ఎస్టీల అభివృద్ధికి నిర్దేశించిన సబ్ ప్లాన్ నిధులకు కోత పెట్టింది. ఇలా పథకాలన్నీ రద్దు చేస్తూ, నిధులు తగ్గిస్తూ ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి తాను ఇచ్చే కానుకలపైన ఆధారపడే విధంగా చేసి దళితులకు తీరని ద్రోహం చేస్తున్నారు.
దళితులను అడుగడుగునా దగా చేస్తున్నారనడానికి మరో ప్రత్యక్ష ఉదాహరణ నూతన పారిశ్రామిక విధానం. టీడీపీ ప్రభుత్వ హయాంలో ఎస్సీ, ఎస్టీ పురుషులకు పెట్టుబడి సబ్సిడీ 35శాతం, మహిళలకు 45శాతం ఉండేది. జగన్ ప్రభుత్వం కొత్త పారిశ్రామిక విధానం దీన్ని భారీగా తగ్గించేసింది. ఎస్సీ, ఎస్టీ మహిళలకు పెట్టుబడి సబ్సిడీ 10 శాతం తగ్గించి 35శాతంగాను, పురుషులకు 20 శాతం తగ్గించి 15 శాతంగాను ప్రభుత్వం నిర్ణయించింది. కక్ష కట్టినట్టుగా వ్యవహరిస్తూ దళిత పారిశ్రామికవేత్తలు ఉండకూడదనే లక్ష్యంతో నూతన పారిశ్రామిక విధానం రూపొందించింది.
టీడీపీ హయాంలో దళితులకు భూమి కొనుగోలు పథకం కింద 5000 ఎకరాలు కొని పంపిణీ చేస్తే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఇళ్ల స్థలాల పేరిట దళితులకు చెందిన 4000 ఎకరాల అసైన్డ్ భూములను నిర్దాక్షిణ్యంగా లాక్కుంది. దళితులపై దాడులు, అత్యాచారాలు, భూములు బలవంతంగా లాక్కోవడం వంటి ఈ పాలకుల గతి తప్పిన, మతిమాలిన చర్యలను దళిత సమాజం నిలదీయాల్సి సమయం ఆసన్నమైంది. పేద దళితులపై, దళిత ఉద్యోగులపై, మహిళలపై దాడులు దళితుల ఆత్మగౌరవ పోరాటాల అవసరాన్ని, అనివార్యతను గుర్తు చేస్తున్నాయి. రాష్ట్రంలోని అన్ని దళిత సంఘాలు, రాజకీయ పార్టీలు దళితులకు జరుగుతున్న అన్యాయాలపై ఒక్క తాటిపైకి వచ్చి గొంతెత్తి నినదించాలి. రాష్ట్రంలోని దళిత సామాజిక వర్గం ‘‘దళిత పక్షపాతి ఎవరు, ద్రోహి ఎవరు’’ తేల్చుకోవాల్సిన సమయం వచ్చింది.
నారా లోకేష్
తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి
