ప్రజా వ్యవస్థలతోనే కరోనా కట్టడి

ABN , First Publish Date - 2020-05-09T06:20:17+05:30 IST

కరోనా కట్టడి కావాలంటే ఆరోగ్య వ్యవస్థ, ఆహార పంపిణీ వ్యవస్థ, ఈ రెండు రంగాలకు సరిపడా నిధులు సమకూర్చే ఆర్థిక వ్యవస్థలు కీలకం. ఈ మూడింటిని కార్పొరేట్‌ దృష్టితో కాకుండా సామాన్య ప్రజల....

ప్రజా వ్యవస్థలతోనే కరోనా కట్టడి

కరోనా కట్టడి కావాలంటే ఆరోగ్య వ్యవస్థ, ఆహార పంపిణీ వ్యవస్థ, ఈ రెండు రంగాలకు సరిపడా నిధులు సమకూర్చే ఆర్థిక వ్యవస్థలు కీలకం. ఈ మూడింటిని కార్పొరేట్‌ దృష్టితో కాకుండా సామాన్య ప్రజల దృష్టితో అమలు జరపగలిగే ప్రభుత్వాలుండాలి. ఈ కృషి ఎక్కడైతే జరగలేదో అక్కడల్లా కరోనా కట్టుదప్పింది. ఎక్కడైతే ఈ చర్యలు సమర్థంగా అమలు చేయగలిగారో అక్కడ కరోనా అదుపులో వున్నది. ఉదాహరణకు ప్రపంచ నంబర్‌ 1 ఆర్థిక వ్యవస్థ అయి ఉండీ, టెక్నాలజీ, ఆరోగ్య పరికరాలూ, విజ్ఞానమూ పుష్కలంగా ఉన్న అమెరికాలో కరోనా అదుపులోకి రాలేదు. ఎందుకంటే అక్కడ ఆర్థిక, వైద్య వ్యవస్థలు మొత్తం ప్రైవేటు పెట్టుబడిదారుల చేతుల్లో ఉండటం, ఆర్థిక కేటాయింపులన్నీ ప్రజల కోసం కాక ఆధిపత్యాలకోసం, రాజకీయ లబ్ధి కోసం జరగటమే కారణం.


కరోనా వైరస్‌ ప్రపంచాన్ని కల్లోలపరుస్తోంది. ఈ సమయంలోనే కరోనా గురించి రకరకాల ప్రచారాలతో ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నాలూ జరుగుతున్నాయి. ఈ గందరగోళ పరిస్థితుల్లో శాస్త్రీయంగా రుజువైన విషయాలను, ఆధారాలున్న కథనాలను మాత్రమే విశ్వసించాలి తప్ప పత్రికల్లో అచ్చయిన, సోషల్‌మీడియాలో చోటుచేసుకున్న ప్రతి విషయాన్నీ నమ్మకూడదు.

‘భయపడాల్సిందేమీలేదు.. ఇదీ మామూలు జ్వరం లాంటిదే..’ అనే వ్యాఖ్యలు చాలా తప్పు. స్వల్పకాలంలో లక్షల మందికి వ్యాపించటం, పెద్ద సంఖ్యలో ప్రజలు మరణించటం కళ్లముందున్న వాస్తవం. ఇప్పటి వరకూ దీని చికిత్సకు మందుగానీ, నివారణకు వ్యాక్సిన్‌గానీ లేదనేది వాస్తవం. అందువల్ల ఈ నెలాఖరు నాటికి మామూలు పరిస్థితుల్లోకి వస్తామనుకుంటే అంతకంటే పొరపాటు మరోటి ఉండదు. కరోనాకు ముందున్న పరిస్థితులుగానీ, మనుషుల మామూలు కదిలికలకు గానీ దీర్ఘకాలమే పట్టవచ్చు.


వైరస్ విజృంభణ వల్ల ఆరోగ్య సంక్షోభం మాత్రమే కాదు. ఆర్ధిక, సామాజిక, సాంస్కృతిక, రాజకీయ రంగాలలో కూడా సంక్షోభాలూ, పెనుమార్పులూ చోటుచేసుకుంటాయి. కొన్ని దేశాల్లో అది విజృంభిస్తుంటే, మరికొన్ని దేశాల్లో అదుపులోకి వస్తోంది. జాగ్రత్తగా పరిశీలిస్తే ఇందుకు కారణాలేమిటో గమనించొచ్చు. కరోనా కట్టడి కావాలంటే ఆరోగ్య వ్యవస్థ, ఆహార పంపిణీ వ్యవస్థ, ఈ రెండు రంగాలకు సరిపడా నిధులు సమకూర్చే ఆర్ధిక వ్యవస్థలు కీలకం. ఈ మూడింటిని కార్పొరేట్‌ దృష్టితో కాకుండా సామాన్య ప్రజల దృష్టితో అమలు జరపగలిగే ప్రభుత్వాలుండాలి. ఈ కృషి ఎక్కడైతే జరగలేదో అక్కడల్లా కరోనా కట్టుదప్పింది. ఎక్కడైతే ఈ చర్యలు సమర్ధంగా అమలు చేయగలిగారో అక్కడ కరోనా అదుపులో వున్నది. ఉదాహరణకు ప్రపంచ నంబర్‌ 1 ఆర్ధికవ్యవస్థ అయి ఉండీ, టెక్నాలజీ, ఆరోగ్యపరికరాలూ, విజ్ఞానమూ పుష్కలంగా ఉన్న అమెరికాలో కరోనా అదుపులోకి రాలేదు ఎందుకంటే అక్కడ ఆర్ధిక, వైద్యవ్యవస్థలు మొత్తం పెట్టుబడిదారుల చేతుల్లో ఉండటం, ఆర్ధిక కేటాయింపులన్నీ ప్రజల కోసం కాక ఆధిపత్యాలకోసం, రాజకీయ లబ్ధి కోసం జరగటమే కారణాలు. అమెరికాలో వైద్యం చాలా ఖరీదైనది. 12శాతం ప్రజలకు మెడికల్‌ ఇన్సూరెన్స్‌లేదు. 23 శాతం మందికి పాక్షిక ఇన్సూరెన్స్‌ ఉంది. అంటే, కొన్ని జబ్బులకు మాత్రమే అది వర్తిస్తుంది. లక్షల డాలర్లు ఖర్చుపెట్టగలిగే వాళ్లే ఆసుపత్రులకు వెళ్లగలుగుతారు. లాక్‌డౌన్‌ కూడా అర్దమనస్కంగానే అమలు జరిపారు. లక్షల సంఖ్యలో కేసులు పెరుగుతున్నప్పటికీ దేశ అధ్యక్షుడే లాక్‌డౌన్‌ ఎత్తేయాలనే వాదనలకు, ప్రదర్శనలకు మద్దతు ఇస్తున్నాడనేది బహిరంగ విషయమే. ‘కరోనాతో పోరాడుతున్న రాష్ట్ర ప్రభుత్వాలు వెంటిలేటర్లు, నిధులు కావాలని అడిగితే అమెరికా అధ్యక్షుడు ‘మా దగ్గర నిధులు లేవు. మీ ఏర్పాట్లు మీరు చేసుకోవాలి. మీ చావు మీరు చావండి’ అని సమాధానం చెప్తున్నాడు. మరోవైపు బిలియన్లకొద్దీ డాలర్లు మెక్సికో గోడ కట్టటానికి కేటాయిస్తున్నారు. ఇక కరోనా ఎందుకు కట్టడి అవుతుంది?’ అని అన్నాడు ప్రముఖ మేధావి నోమ్ చోమ్ స్కీ.


అనేక క్యాపిటలిస్టు దేశాలు దాదాపు ఇదే వైఖరితో ఉన్నాయి. దక్షిణ కొరియా లాంటి కొన్ని దేశాలు మాత్రం ప్రజా పద్ధతులు అమలు చేసి ఫలితాలు సాధించాయి. స్పెయిన్‌ పెట్టుబడిదారీ దేశం. అమెరికా తర్వాత అత్యధిక కేసులు అక్కడే ఉన్నాయి. ఇటీవల ఆ దేశం ప్రైవేటు హాస్పిటళ్లన్నింటినీ ప్రభుత్వపరం (నేషనలైజ్‌) చేసేసింది. రాత్రికి రాత్రే ఆసుపత్రులను జాతీయం చేసినంత మాత్రాన జరిగే మేలేమిటి? అంటే, హాస్పిటల్‌ ప్రైవేటు రంగంలో ఉంటే డబ్బిస్తే తప్ప వైద్యం ఉండదు. కానీ ప్రభుత్వ యాజమాన్యంలో ఉంటే ప్రజల దృష్టితో వైద్యం జరుగుతుంది. అవసరమైనంత డబ్బు ప్రభుత్వం ఖర్చు పెడుతుంది. కరోనా కట్టడి జరగాలంటే ప్రజావైద్యవ్యవస్థ ద్వారానే సాధ్యమనేది ఇపుడు అందరూ గుర్తించిన వాస్తవం.

సోషలిస్టు దేశాలైన చైనా, వియత్నాం, క్యూబా, ఉత్తర కొరియా లాంటి దేశాల్లో కూడా అంతా ప్రభుత్వం చేతుల్లో ఉంది. మన దేశంలో కేరళ రాష్ట్రం కూడా అధికారాల్లో అనేక పరిమితులు, నిధులకొరత ఉన్నా కరోనా విషయంలో అద్భుత విజయం సాధించటానికి సరిగ్గా అవే కారణాలు పనిజేసాయి. అక్కడ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు అన్ని వసతులు, సిబ్బంది, పరికరాలతో ఆధునికంగా అభివృద్ధి చేయబడ్డాయి. 17రకాల సరుకులను చౌకగా ఇంటింటికి సరఫరా చేసే చౌకదుకాణాలు పటిష్ఠంగా పని చేస్తున్నాయి. కరోనా కట్టడికోసం కమ్యూనిస్టు కార్యకర్తలు లక్షల మంది స్వచ్ఛందంగా అహోరాత్రులూ శ్రమించారు.


చైనాలో మొదట వైరస్‌ విషయంలో నిర్దారణకు రావటానికి 3వారాల సమయం తీసుకున్నా గుర్తించిన వెంటనే యుద్ధప్రాతిపదికన నివారణ చర్యలు చేబట్టారు. లక్షల సంఖ్యలో కరోనా పరీక్షలు జరిపారు. ఇతర వస్తువుల తయారీ ఫ్యాక్టరీలన్నింటినీ తాత్కాలికంగా మాస్క్‌లు, శానిటైజర్లు, టెస్ట్‌ కిట్లు, ఆరోగ్య పరికరాలు తయారు చేసే ఫ్యాక్టరీలుగా మార్చివేశారు. అవసరమైన ఆరోగ్య సరంజామానంతటినీ భారీఎత్తున ఉత్పత్తి చేసారు. 2500 పడకల రెండు హాస్పిటల్స్‌ను 18రోజుల్లోనే నిర్మించారు. మొత్తం ప్రభుత్వ యంత్రాంగం, సైన్యంతో సహా రంగంలోకి దిగింది. దేశవ్యాప్తంగా డాక్టర్లు, నర్సులు ఆరోగ్య సిబ్బంది ఇతర ప్రాం తాల నుండి కరోనా ప్రాంతాలకు తరలివెళ్లారు. లాక్‌డౌన్‌ సమయంలో ఇళ్ల వద్దకే సకల సరుకులూ నిరంతరాయంగా సప్లై చేసారు. ఇలా 3మాసాల్లోనే కరోనానుకట్టడి చేసి ఏప్రిల్‌ 8కల్లా లాక్‌డౌన్‌ ఎత్తివేశారు.

ఈ చర్యలు తీసుకుంటున్నపుడు కూడా చైనాను ఆడిపోసుకున్న పశ్చిమ దేశాలు, ఆ తరువాత అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ సహా, అనేక దేశాధినేతలూ డబ్ల్యూహెచ్ఓ ‘చైనా ప్రభుత్వ కృషి అద్భుతమనీ, చరిత్రలో ఇంతకు ముందెప్పుడూ ఇంతటి విజయం లేదనీ’ ప్రశంసించారు.


కరోనా కట్టడిలో చైనాను మెచ్చుకున్న వాళ్లే ఇపుడు అబద్దపు ప్రచారాలు చేస్తున్నారు. అమెరికా అధ్యక్షుడు డోనాల్ట్‌ ట్రంప్‌ ఈ గోబెల్స్‌ ప్రచారానికి నాయకత్వం వహిస్తున్నాడు. దీనికి కారణాలు చాలానే ఉన్నాయి. వాటిలో ఒకటి; కరోనా కట్టడిలో అమెరికా తన వైఫల్యాన్ని కప్పిపుచ్చుకోవటానికి చైనాను దోషిగా నిలబెట్టటం అవసరమని భావిస్తోంది. రెండు; నవంబర్‌లో జరిగే అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో చైనాను బూచిగా చూపి జాతీయవాదాన్ని రెచ్చగొట్టి లబ్ధి పొందటం ట్రంప్‌ ఎత్తుగడ. మూడు; కొవిడ్‌ అనంతర ప్రపంచంలో చైనా ఆర్ధికంగా అగ్రదేశంగా ఎదిగితే తన ఆధిపత్యం దెబ్బతింటుంది గాబట్టి ప్రపంచదేశాలను వీలైనంతగా చైనాకు వ్యతిరేకంగా రెచ్చగొట్టటం అమెరికా వ్యూహంగా ఉంది.


అదే సమయంలో అమెరికా మిత్రులు.. ఈ వైరస్‌ చైనా ప్రయోగశాలలో సృష్టించబడిందని ఆరోపిస్తున్నారు. వూహాన్‌లో వైరాలజీ ప్రయోగశాల ఉంది. ఈ ప్రయోగశాల చైనా, ప్రపంచ ఆరోగ్య సంస్థ సంయుక్త ఆధ్వర్యంలో నడుస్తున్నది. వైరస్‌ జన్యుక్రమాన్ని విశ్లేషించిన శాస్త్రవేత్తలు అది ల్యాబ్‌లో పుట్టిందో లేక లీక్‌ అయిందో కాదని ప్రకృతి నుండే వచ్చిందని తేల్చారు.

వైరస్‌ సమాచారాన్ని చైనా ప్రపంచ దేశాలకు ఇవ్వలేదని దానివల్ల నష్టం జరిగిందన్నది మరో ఆరోపణ. కానీ, అంతర్జాతీయ మీడియా వెల్లడించిన వివరాలన్నీ ఈ ఆరోపణను నిరాకరిస్తున్నాయి. చైనాలో వైరస్‌ను కనిపెట్టింది 2019 డిసెంబర్ 31న. అదేరోజు చైనాలోని డబ్ల్యూహెచ్‌ఓ ఆఫీసుకూ, అమెరికా రాయబారికీ తెలియపర్చారు. జనవరి 12న చైనా కరోనా జన్యుక్రమాన్ని చేధించి ప్రపంచ దేశాలన్నింటికీ షేర్‌ చేసింది. జనవరి 21 వూహాన్‌లో డబ్ల్యూహెచ్‌ఓ క్షేత్రస్థాయి పర్యటన. 23 వూహాన్‌ పట్టణం లాక్‌డౌన్‌. జనవరి 25 ఇంగ్లీష్‌, ఫ్రెంచ్‌, స్పానిష్‌, చీనీ భాషల్లో కరోనా నివారణా చర్యలపై ఆన్‌లైన్‌ క్లాసులు. జనవరి 28న చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌తో డబ్ల్యూహెచ్‌ఓ చీఫ్‌ సమావేశం. జనవరి 30న ప్రపంచ వ్యాప్త హెల్త్‌ ఎమర్జెన్సీ ప్రకటన. ఫిబ్రవరి 12న క్రైసిస్‌ మేనేజ్‌మెంట్‌ టీమ్ ఆధ్వర్యంలో ఐక్యరాజ్యసమితిలోని అనేక విభాగాలు, ప్రపంచబ్యాంక్‌ సహా అనేక ప్రపంచ సంస్థల సంయుక్త సమావేశం. పిబ్రవరి 24 ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి డబ్ల్యుహెచ్‌ఓ సందర్శన, చర్చ. 25, 28, మార్చి 3 ప్రెస్‌ మీట్లు, అనేక దేశాలకు ఆరోగ్య పరికరాల సప్లై. మార్చి 11న కోవిడ్‌ 19ను ప్రపంచ మహమ్మారిగా డబ్ల్యూహెచ్‌ఓ ప్రకటించింది.


ఇన్ని రకాలుగా చర్చలు, సమాచారం ఇచ్చిపుచ్చుకోవడాలూ, హెచ్చరికలూ నడిచాయి కదా? సమాచారం లేనిదెప్పుడు? ఇంత జరిగినా మార్చి 11 నాటికి ప్రపంచ వ్యాప్తంగా కేసులు 1.26లక్షలు అయితే, చైనాలోనే 81వేలు. అప్పటికి అమెరికాలో 1300కేసులు మాత్రమే. మొదటి సమాచారం ఇచ్చిన డిసెంబర్ 31 నుంచి మార్చి 11వరకు మూడు మాసాలపాటు కరోనా కట్టడికి అమెరికా తీసుకున్న చర్యలేమిటి? కేసులు 11లక్షలు దాటిపోవటానికి సమాచారం లేకపోవటం కారణమంటే ఎలా? ట్రంప్‌ కరోనా పట్ల చాలా నిర్లక్ష్యంగా వ్యవహరించాడని అమెరికన్లే బాహాటంగా విమర్శిస్తున్నారు.? కరోనా తమనేమీ చేయలేదని, లాక్‌డౌన్‌ అనవసరమని అమెరికాలో నిజమైన పౌరులు భావిస్తున్నారని, ఆర్ధిక వ్యవస్థను వెంటనే తెరవటం అవసరమనీ అనేకసార్లు మీడియా ముందు అధ్యక్షుడు చెప్పారు. నిపుణులైన డాక్టర్ల ఎదుటే పత్రికా సమావేశంలో ‘శానిటైజర్‌తో నిమిషంలోనే వైరస్‌ చనిపోతున్నపుడు ఆ శానిటైజర్‌ను శరీరంలోకి పంపి ఊపిరితిత్తులు, ఇతర శరీరభాగాలను శుభ్రం చేయొచ్చు గదా ఆలోచించండి’ అని ట్రంప్‌ చెప్పటం వాస్తవం కాదా? ఇలా వ్యవహరించే మూర్ఖత్వం ఆయనలో, ఆయన యంత్రాంగంలో ఉన్నపుడు తమ దేశ దుస్థితికి ఇతరులను ఆడిపోసుకోవటం ట్రంప్‌కు తగిన పనేనా?



తమ్మినేని వీరభద్రం

సిపిఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి

Updated Date - 2020-05-09T06:20:17+05:30 IST