కరోనా:ధనస్వామ్య జాడ్యం!

ABN , First Publish Date - 2020-06-18T05:54:47+05:30 IST

గత నాలుగు దశాబ్దాలుగా నయా ఉదారవాద విధానాలతో లబ్ధి పొందినవారే కరోనా విలయానికి చాల వరకు బాధ్యులు. ఈ ఆరోగ్య విపత్తు అడ్డూ అదుపులేని పెట్టుబడీదారీ విధాన ఆత్మ వినాశక ధోరణులను...

కరోనా:ధనస్వామ్య జాడ్యం!

నయా ఉదారవాదం, సామ్రాజ్యవాదంపై నిశిత విమర్శలకు సుప్రసిద్ధుడైన రాజకీయ క్రియాశీలి నోమ్ చామ్‌స్కీ. ఈ ప్రజా మేధావితో జిప్సన్ జాన్, పి.ఎమ్ జితీష్‌లు ‘ది వైర్ కోసం చేసిన ఇంటర్వ్యూలోని కొన్ని భాగాలివి.


గత నాలుగు దశాబ్దాలుగా నయా ఉదారవాద విధానాలతో లబ్ధి పొందినవారే కరోనా విలయానికి చాల వరకు బాధ్యులు. ఈ ఆరోగ్య విపత్తు అడ్డూ అదుపులేని పెట్టుబడీదారీ విధాన ఆత్మ వినాశక ధోరణులను బహిర్గతం చేసింది. 2003 సార్స్ అంటువ్యాధి సందర్భంలో, మరో మహమ్మారి ప్రబలనున్నదని, దాని నెదుర్కొనేందుకు మనం సంసిద్ధమవ్వాలని శాస్త్రవేత్తలు హెచ్చరించారు. విన్నదెవరు? విన్నా పట్టించుకున్నదెవరు? ఇప్పుడు మనలను అతలాకుతలం చేస్తోన్న సంక్షోభం నుంచి పాఠాలు నేర్చుకోకపోతే పర్యవసానాలు మరింత తీవ్రంగా ఉంటాయి.


కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టడంలో అమెరికా ఎందుకు విఫలమయింది? అది, రాజకీయ నాయకత్వ వైఫల్యమా లేక వ్యవస్థ వైఫల్యమా? కొవిడ్-19 సంక్షోభం విషమిస్తున్నప్పటికీ డోనాల్డ్ ట్రంప్‌కు (గత మార్చిలో) ప్రజాదరణ పెరిగింది! ఈ పరిణామం, అమెరికా అధ్యక్ష ఎన్నికలను ప్రభావితం చేయగలదని మీరు భావిస్తున్నారా? 

కరోనా ఆకస్మిక విపత్తేమీ కాదు. 2003లో సార్స్ ప్రబలినప్పుడు మరో మహమ్మారి సంభవించే అవకాశమున్నదని శాస్త్రవేత్తలు ఊహించారు. సంభావ్య సంక్షోభంపై అవగాహన ఉండడంతో సరిపోదు. దాని ఆధారంగా ఆ ముప్పును నివారించేందుకు ఎవరో ఒకరు ఏదో ఒకటి చేయాలి. ఔషధ ఉత్పత్తి సంస్థలకు ఇటువంటి విషయాలలో ఆసక్తి వుండదు. వాటికి కావాల్సిన లాభాలు వేరే చోట సమకూరతాయి. ప్రభుత్వమే ఈ బాధ్యతను చేపట్టాలి. అయితే అందుకు నయా ఉదారవాద సిద్ధాంతాలు అవరోధమయ్యాయి. ‘సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్’కు నిధులు నిలిపివేయడం, సంభావ్య మహమ్మారుల గురించి ముందస్తు హెచ్చరికలు చేసే ప్రభుత్వ కార్యక్రమాలకు మంగళం పాడడం ద్వారా డొనాల్డ్ ట్రంప్ పరిస్థితిని మరింతగా విషమింపచేశారు. ఈ కారణంగా కరోనా విలయాన్ని ఎదుర్కొనేందుకు అమెరికా సంసిద్ధంగా లేకపోయింది. చైనా శాస్త్రవేత్తలు వైరస్‌ను శీఘ్రగతిన గుర్తించి దాని జన్యుక్రమాన్ని తెలుసుకున్నారు. జనవరి 10 నాటికే తమ వద్దనున్న వైరస్ సమాచారాన్ని ప్రపంచానికి వెల్లడించారు. పలు దేశాలు వెన్వెంటనే ప్రతిస్పందించి కొవిడ్ -19ని కట్టడి చేసేందుకు పటిష్ఠ చర్యలు చేపట్టి చెప్పుకోదగ్గ ఫలితాలను సాధించాయి. గూఢచార వర్గాల, ఆరోగ్య శాఖ అధికారుల హెచ్చరికలను ట్రంప్ ఉపేక్షించారు. మార్చిలో ఆయన వాస్తవ పరిస్థితులను గుర్తించే నాటికి కాలం మించిపోయింది. వేలాది అమెరికన్లు కరోనా బారినపడి మరణించారు. అమెరికాకు వాటిల్లిన ఈ మహోపద్రవానికి మూడు కారణాలున్నాయి. అవి: పెట్టుబడిదారీ విధాన తర్కం, ఆటవిక నయా ఉదారవాద తరహా పెట్టుబడిదారీ వ్యవస్థ, ప్రజల శ్రేయస్సు పట్టని ప్రభుత్వం. బహుశా, అధ్యక్ష ఎన్నికలలో ఆయన విజయావకాశాలను ఇది దెబ్బ తీసే అవకాశమున్నది. అయితే నవంబర్‌లోగా ఏమైనా జరగవచ్చు. 


కరోనా ప్రబలిపోతున్న తీరుతెన్నులను నిశితంగా గమనిస్తూ, దానిని కట్టడి చేయడంలో చాలా దేశాలకు డిజిటల్ సాంకేతికతలు, రాజ్య నియంత్రణ తోడ్పడుతున్నాయి. అయితే పెరిగిన నిరంకుశ నియంత్రణ, రాజ్యవ్యవస్థ నిఘాపై నిపుణులు తీవ్ర భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు. వారితో మీరు ఏకీభవిస్తారా? 

వాణిజ్య ప్రపంచం, యథాతథ పరిస్థితులు కొనసాగాలనే ప్రగతి నిరోధకులు కుమ్మక్కై మరింత నిరంకుశాధికార నియంత్రణలతో యథాపూర్వ పరిస్థితిని పునరుద్ధరించాలని ఆరాటపడుతున్నారు. మరింత న్యాయబద్ధమైన, స్వేచ్ఛా సమాజం దిశగా ప్రపంచ ప్రస్థానం సాగాలని ప్రజాహిత శక్తులు కోరుతున్నాయి. అంతిమంగా ఏమి జరుగుతుందనేది ఈ శక్తుల పరస్పర ప్రభావాలపై ఆధారపడివున్నది.


కరోనా ఉపద్రవ దురవస్థ నుంచి పేదలకు ఉపశమనం కలిగించడానికి అవసరమైన ఆర్థిక చర్యలు ఏమిటి? ఆ దుర్దశకు ఒక కొత్త సామాజిక-ప్రజాస్వామిక దృక్పథమే పరిష్కారమా? లేక మితవ్యయం, ఆర్థిక సహకారాన్ని అందివ్వడం ద్వారా ప్రభుత్వాలు ఆ దుస్థితిని తొలగించడం సాధ్యమవుతుందా? 

గత నాలుగు దశాబ్దాలుగా నయా ఉదారవాద విధానాలతో లబ్ధి పొందినవారే ప్రస్తుత మహమ్మారి విలయానికి చాలా వరకు బాధ్యులు. గమనార్హమైన విషయమేమిటంటే తమ సొంత ప్రయోజనాలకు నిర్మించుకున్న వ్యవస్థను పోలిన మరింత కఠినమైన వ్యవస్థే, కరోనా సంక్షోభం నుంచి ఆవిర్భవించాలని వారు ఆకాంక్షిస్తున్నారు. అందుకు దయాదాక్షిణ్యాలు లేకుండా కృషి చేస్తున్నారు. శక్తిమంతమైన ప్రతికూల శక్తులు లేనిపక్షంలో విజయం వారిదే అవుతుంది. భిన్నమైన, మరింత మెరుగైన ప్రపంచాన్ని సృష్టించేందుకు ప్రజాహిత శక్తులు ప్రభవిస్తున్నాయి. అమెరికాలో బెర్నీ శాండర్స్, ఐరోపాలో యానిస్ వెరౌఫాకిస్ చొరవ ఫలితంగా ప్రోగ్రెసివ్ ఇంటర్నేషనల్ ఏర్పాటయింది. మనం మరో విషయాన్ని కూడా దృష్టిలో ఉంచుకోవాలి. ప్రస్తుత సంక్షోభం ఎంత తీవ్రమైనదో అంతకంటే తీవ్రమైన సంక్షోభం రానున్నది. కరోనా విపత్తు నుంచి మనం భారీ మూల్యం చెల్లించి తప్పకుండా కోలుకుంటాం. అయితే ధ్రువ ప్రాంతాలలో మంచు పలకలు కరిగిపోవడం, హిమనదాలు కుంచించుకుపోవడం లేదా భూతాపం పర్యవసానాల నుంచి మనం కోలుకునే అవకాశమే లేదు. హిమనదాలు తగ్గిపోవడం వల్ల దక్షిణాసియా ఆవాసయోగ్యం కాకుండాపోయే ప్రమాదమెంతైనా వున్నది. ఈ విపత్కర పరిస్థితులు సమీప భవిష్యత్తులోనే ఏర్పడనున్నాయనేది కఠోర వాస్తవం. ప్రపంచం ప్రస్తుతం మాదిరిగానే కొనసాగితే యాభై సంవత్సరాలలోనే మానవాళికి మనుగడకు ముప్పు కలిగించే విషమ పరిస్థితులు నెలకొననున్నాయి.


లాభార్జనే ధ్యేయమైన పెట్టుబడిదారీ విధానం వన్యప్రాణుల పర్యావరణ వ్యవస్థను ఆక్రమించిందని; మానవులు-వన్యప్రాణుల మధ్య ఘర్షణలు మరింత తరచుగా సంభవిస్తున్న కారణంగానే వైరస్‌లు మానవులకు సోకుతున్నాయని అంటువ్యాధుల నిపుణులు అంటున్నారు. పెట్టుబడిదారీ విధాన సంక్షోభం ఒక ఆరోగ్య విపత్తు రూపేణా బహిర్గతమయినందున మానవాళి పూర్వపు ‘సాధారణ’ పరిస్థితులకు వెళ్ళలేదు. ఈ విషయమై మీ ఆలోచనలేమిటి? 

నివాస స్థలాల విధ్వంసం, భూ వినియోగంలో అనుసరిస్తున్న అశాస్త్రీయ పద్ధతులే వైరస్‌లు మానవులకు సోకడానికి దారితీస్తున్నాయి. ప్రస్తుత కరోనా విపత్తు అడ్డూ అదుపులేని పెట్టుబడీదారీ విధాన ఆత్మ వినాశక ధోరణులను బహిర్గతం చేసింది. 2003 సార్స్ అంటువ్యాధి సందర్భంలో, మరో కరోనావైరస్ మహమ్మారి ప్రబలనున్నదని శాస్త్రవేత్తలు హెచ్చరించారు. ఆ మహమ్మారి నెదుర్కొనేందుకు మనం సంసిద్ధమవ్వాలని కూడా వారు విజ్ఞప్తి చేశారు. అయితే ఆ హెచ్చరిక విన్నదెవరు? పట్టించుకున్నదెవరు? అపరిమిత సంపద్వంతమైన ఔషధ కంపెనీలు అందుకు పూనుకోవాలి. అయితే పెట్టుబడిదారీ విధాన తర్కం అందుకు అవరోధమయింది. లాభాలు ఉండవు గనుక అవి ఆ కర్తవ్యంపై దృష్టి పెట్టలేదు, పెట్టవు కూడా. ఆ బాధ్యతను నిర్వర్తించాల్సిన ప్రభుత్వాలు నయా ఉదారవాద ప్రభావంలో ఉన్నాయి. ప్రైవేట్ శక్తుల నియంత్రణలో ఉన్న ప్రపంచంలో ప్రభుత్వ జోక్యం చేసుకోకూడదని నయా ఉదార వాదం ప్రవచిస్తుంది. అంతేకాదు, తాను సృష్టించిన సంక్షోభాల నుంచి సంపన్నులు, కార్పొరేట్ సంస్థలను రక్షించేందుకు మాత్రమే ప్రభుత్వం జోక్యం చేసుకోవాలని నిర్దేశిస్తుంది. ఇదే ఇప్పుడు జరుగుతోంది. మరో మహమ్మారి, మరింత భయానకమైనది మానవాళిపై విరుచుకుపడే ప్రమాదమెంతైనా వున్నది. భూతాపం ప్రభావం దాన్ని మరింత తీవ్రం చేస్తుంది. దానిని ఎలా ఎదుర్కోవాలో శాస్త్రవేత్తలకు బాగా తెలుసు. అయితే, ఎవరో ఒకరు దానిని నివారించే ముందస్తు కార్యాచరణకు ఉపక్రమించాలి. ఇప్పుడు మనలను అతలాకుతలం చేస్తోన్న సంక్షోభం నుంచి పాఠాలు నేర్చుకోకపోతే పర్యవసానాలు మరింత తీవ్రంగా ఉంటాయి. ఇందులో ఎలాంటి సందేహం లేదు.        

Updated Date - 2020-06-18T05:54:47+05:30 IST