టీకాతో రక్షణ ఎంత?

ABN , First Publish Date - 2020-11-21T05:48:04+05:30 IST

కరోనాకు టీకా (వాక్సిన్)తో ముగింపు పలుకవచ్చని మానవాళి ఎదురు చూస్తున్నది. ప్రస్తుత పరిస్థితిని బట్టి రెండు, మూడు నెలల్లో టీకా ప్రజలకు అందుబాటులోకి రావొచ్చని అంచనా. వాక్సిన్ తయారీలోని నాలుగు దశల్లో చివరిదైన ఫేజ్...

టీకాతో రక్షణ ఎంత?

కరోనాకు టీకా (వాక్సిన్)తో ముగింపు పలుకవచ్చని మానవాళి ఎదురు చూస్తున్నది. ప్రస్తుత పరిస్థితిని బట్టి రెండు, మూడు నెలల్లో టీకా ప్రజలకు అందుబాటులోకి రావొచ్చని అంచనా. వాక్సిన్ తయారీలోని నాలుగు దశల్లో చివరిదైన ఫేజ్ 3 క్లినికల్ ట్రయల్స్‌ (కొన్ని వేలమంది మీద వాక్సిన్ ప్రయోగించి పరిశీలించే) దశలో ఇప్పుడు అన్ని పరిశోధనలూ ఉన్నాయి గనక త్వరలోనే వాక్సిన్ అందుబాటులోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి. అయితే  ఇలా రాబోతున్న వాక్సిన్లు ఎంతవరకు రక్షణనివ్వగలవు, ఒకసారి టీకా తీసుకుంటే ఎంతకాలం పాటు ఇన్ఫెక్షన్ సోకకుండా నివారించవచ్చు అనే సందేహాలు మాత్రం సర్వత్రా నెలకొని ఉన్నాయి. ఉదాహరణకు మీజిల్స్ వాక్సిన్ జీవితాంతం మీజిల్స్ వైరస్ సోకకుండా రక్షణనిస్తుంది. ఫ్లూ వాక్సిన్ కొన్ని వారాల పాటు మాత్రమే రక్షణనిస్తుంది. వాక్సిన్ రక్షణ అనేది మనలో ఉన్న రోగ నిరోధక శక్తి యొక్క మెమరీపై ఆధారపడి ఉంటుంది.


ఒకసారి వాక్సిన్ తీసుకుంటే మన ఇమ్యూనిటీ ఉద్దీపనం పొంది శరీరంలో ఆ వైరస్‌ను ఎదుర్కొనే యాంటీ బాడీస్ తయారవుతాయి. ఆ తర్వాత కూడా మన ఇమ్యూన్‌సిస్టమ్‌కి ఉన్న మెమరీ వల్ల యాంటీ బాడీస్ ఉత్పన్నమవుతూ మళ్లీ ఇన్ఫెక్షన్ సోకకుండా కాపాడుతాయి. కొన్ని వాక్సిన్ లకు సుదీర్ఘ కాలం పాటు ఈ మెమరీ ఉంటే, మరికొన్ని వాక్సిన్ లకు మెమరీ కొద్దికాలం పాటే ఉంటుంది. ఏదైనా వైరస్‌ మానవ శరీరంలోకి ప్రవేశించినపుడు ఒక్కొక్కసారి దాని జన్యు ఫార్ములాలో మార్పులు (మ్యుటేషన్స్) జరుగుతూంటాయి. కానీ, కరోనా వైరస్ మాత్రం నిరంతరం వేగంగా తన జన్యు ఫార్ములాలో మార్పులు చేసుకుంటూ పోతోంది.


ఇప్పటికే 40 స్ట్రయిన్స్ పైగా గుర్తించినట్టుగా చెప్తున్నారు. త్వరితగతిన తన జెనెటిక్ ఫార్ములాను మార్చుకుంటూ, వివిధ రకాల స్ట్రయిన్స్‌లో దర్శనమిస్తున్న కరోనా వైరస్‌కు వాక్సిన్ తయారు చేయడం నిజంగా కత్తిమీద సామే. కనుకనే, ఇప్పుడు తయారవుతున్న వాక్సిన్లు మేరకు కరోనా వైరస్ ఇన్ఫెక్షన్ నుంచి రక్షణనివ్వగలవు అన్న ప్రశ్న ఉదయిస్తోంది. నిజానికి, ఒకసారి వైరస్ సోకిన వారి శరీరంలో ఆంటీబాడీస్ వృద్ధి చెంది మళ్లీ ఇన్ఫెక్షన్ రాకుండా ఉండాలి. కానీ, మళ్లీ ఇన్ఫెక్షన్ సోకిన ఘటనలు కూడా ఉన్నాయి. అంటే, ఇన్ఫెక్షన్‌ను ఎదుర్కోవడానికి సరిపోయే మెమరీ సరిగా లేనందున యాంటీ బాడీస్ వృద్ధి చెందడం లేదని అర్థం. యాంటీబాడీస్ శరీరంలో ఆర్నెల్లు కూడా లేనప్పుడు, రాబోయే వాక్సిన్ తీసుకుంటే మాత్రం ఎంత కాలం ప్రయోజనం ఉంటుందన్నది ప్రశ్న. ఏది


ఏమైనా వాక్సిన్ తయారీ పూర్తయి, వాడుకలోకి వచ్చి దాని భద్రత, సామర్థ్యం, కచ్చితత్వం పూర్తిగా నిర్ధారణ అయ్యేదాకా మాస్క్, శానిటైజర్, భౌతిక దూరాలే అసలు సిసలు వాక్సిన్.


డాక్టర్‌ రవిశంకర్‌ ప్రజాపతి

గవర్నమెంట్‌ ఈఎన్‌టి ఆసుపత్రి, 

హైదరాబాద్‌

Read more